• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పోటీ ప‌రీక్ష‌ల ప్రిప‌రేష‌న్‌ ప్రారంభం ఎలా?

మెల‌కువ‌లు పాటిస్తే స‌ర్కారు కొలువు సులువే!

కొవిడ్‌ కారణంగా గత సంవత్సర కాలంలో విదేశీ విద్యావకాశాలు మందగించడం, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలూ తగ్గటంతో నవతరం ప్రభుత్వోద్యోగాల వైపు దృష్టి సారించింది. బ్యాంకింగ్, రైల్వే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ శ్రమ సరైన గాడిలో పడి కొనసాగితే అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. అవరోధాలను అధిగమిస్తూ తాము కలలుగన్న ఉద్యోగాలను పొందగలుగుతారు! 

కొత్తగా పోటీ పరీక్షల రంగంలో అడుగుపెట్టే యువతలో ప్రధాన సందేహం- ఈ పరీక్షల సన్నద్ధతను ఎలా ప్రారంభించాలనేది. పోటీ పరీక్షల్లో ప్రశ్నలనేవి ప్రాథమిక స్థాయి నుంచి అత్యంత క్లిష్ట స్థాయి వరకూ ఉంటాయి. అందువల్ల ఏ పోటీ పరీక్ష నైనా ప్రారంభం లో మౌలిక అంశాల దగ్గర్నుంచి తయారవటం ఆరంభించాలి. పరీక్ష రూపాన్ని బట్టి మౌలిక అంశాలు వేర్వేరుగా ఉంటాయి. యూపీఎస్‌సీ, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాయాలనుకునేవారు పాఠశాల స్థాయి పుస్తకాలు అంటే.. ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ ప్రచురించే పుస్తకాలు మొదట చదవాలి. అలా చదివేటప్పుడు గత ప్రశ్నపత్రాలను చూసి వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు. అదే విధంగా నియామక సంస్థ విడుదల చేసిన సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠాలను ఎంపిక చేసుకుని చదవాల్సి ఉంటుంది.

బ్యాంకింగ్, రైల్వే లాంటి ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తున్నవారు జనరల్‌ ఇంగ్లిష్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ మొదలైనవాటిని ప్రాథమిక స్థాయిలో ముందుగా అధ్యయనం చేయాలి. అప్పుడే అనంతర స్థాయికి కావలసిన పునాదులు ఏర్పడతాయి.  

ఆ తర్వాత? 

మౌలిక అంశాల అధ్యయనం పూర్తి అయిన తర్వాత ప్రిపేర్‌ అవుతున్న పరీక్ష స్థాయిని దృష్టిలో పెట్టుకుని విషయ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలి, లోతైన అధ్యయనం చేయాలి. అలా చేసేందుకు అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ మొదట చదవాలి. అయితే ఏదో ఒక పుస్తకం నుంచే ప్రశ్నలు అడగరని మాత్రం అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం అంటే దానిలో భావనలు అభ్యర్థులకు కొంత సులభంగా అర్థం అవుతున్నాయని అర్థం. ప్రశ్నలన్నీ అందులోనుంచే వస్తాయని  మాత్రం భావించవద్దు. ఉన్నత స్థాయిలో తయారయ్యేందుకు పాఠాలన్నీ విశ్వవిద్యాలయ పుస్తకాల నుంచి అధ్యయనం చేయడం అవసరం.  

అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ లాంటి పుస్తకాలు యూనివర్సిటీల నుంచి లభ్యం కావు కాబట్టి ప్రముఖ ప్రైవేటు ప్రచురణలపై ఆధారపడవచ్చు. లోతైన అధ్యయనం కోసం గూగుల్‌ సమాచారం చాలావరకూ ఉపయోగపడుతుంది. ప్రాంతీయ భాషల్లో రాసేవారికి కొంతవరకు ఈ విధంగా సమాచారం పొందటంలో ఇబ్బందులు ఉన్నాయి.  

అనిశ్చితిని ఎదుర్కొనేలా..

అకడమిక్‌  పరీక్షల స్వభావం నుంచి బయటపడి పోటీ పరీక్షల తత్వానికి అలవాటుపడినప్పుడే విజయం వైపు అభ్యర్థులు పయనిస్తారు. అకడమిక్‌ పరీక్షలకు సిద్ధపడేటప్పుడు నిర్దిష్ట పుస్తకాలు, నిర్దిష్ట సిలబసు, నిర్దిష్టమైన ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌ మొదలైన  నిర్దేశకాలు స్పష్టంగా ఉంటాయి. అయితే పోటీ పరీక్షలకు అలాంటి నిర్దేశకాల స్పష్టత చాలా పరిమితం. పరిధి స్పష్టత ఉండదు. ఫలితంగా ఎంత చదివినా కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే గ్యారెంటీ ఏమీ ఉండదు. సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ముందుగా నిర్దేశించిన ప్రశ్న రూపాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొనే మనస్తత్వం ఉన్నప్పుడే యువత పోటీ పరీక్షల్లో రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి మానసిక పరిస్థితి లేకుండా ఎవరో ఏదో చెప్పారని ఒకట్రెండు పుస్తకాలు చదివి సమయమంతా దానిమీద వెచ్చించి తీరా ఫలితాలు వచ్చాక నిరాశకు గురి అయ్యే పరిస్థితి ఉండకూడదు.  

దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం 

మనదేశంలో జనాభా అందులో ప్రధానంగా ఉన్న యువతను పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగావకాశాలు చాలా స్వల్పం. అందువల్ల విజయావకాశాలు చాలా కొద్దిమందికే లభిస్తాయి. అందుకే ముందుగా అభ్యర్థులు తమ సామర్ధ్యాలను అంచనా వేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సరిపోతామా లేదా అని నిర్ణయించుకోవడంతో పాటు, ఆ ఉద్యోగాలకు కావలసిన అన్ని సామర్ధ్యాలూ తమలో ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. ఆపై మాత్రమే ఈ పోటీ రంగంలోకి దిగాలి. అలా దిగాక మూడు లేదా ఆరు నెలల్లో ఫలితాలు వచ్చేయాలని ఆశించటం వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా సరైన ఆలోచన కాదు.

సర్వీస్‌ కమిషన్ల పరీక్షలకు తయారయ్యేవారు కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల సమయం వెచ్చించేవిధంగా సిద్ధపడాలి. సర్వీస్‌ కమిషన్‌లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనేక సందర్భాల్లో కోర్టు కేసులు, ఇతరత్రా సమస్యల వల్ల ఏళ్లతరబడి పరీక్షలు రాయటం కోసం నిరీక్షించాలి; రాబోయే ఫలితాల కోసం ఎదురు చూడాలి.

యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన కాలపట్టిక అనుసరించినప్పటికీ దేశవ్యాప్త పోటీ అవ్వటం వల్ల విజయం సాధించడానికి సంవత్సరాల తరబడి శ్రమించాల్సి ఉంటుంది.  రైల్వే, బ్యాంకింగ్‌ రంగాల్లో కూడా కాలపట్టిక ప్రకారం పరీక్షలు జరిగినా అంత సులభంగా ఉద్యోగం సాధించడం జరగదు. అందుకని ముందస్తుగా కనీసం ఏడాది, గరిష్ఠంగా రెండు సంవత్సరాలైనా ప్రణాళిక చేసుకుని దిగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.  

భాషాపరమైన అవరోధాలు

వీటిని అధిగమించటం మరో ముఖ్యమైన విషయం. ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులు ఇంగ్లిష్‌ భాషపై పట్టు లేకపోవడం వల్ల అనేక ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. పోటీపరీక్షలకు దిగేముందు ఆంగ్లంపై పట్టు కోసం ఒక మంచి ప్రయత్నం చేస్తే  బ్యాంకింగ్, రైల్వే, యూపీఎస్‌సీ పరీక్షల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసే ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులకు కొన్ని అంశాల్లో సమాచారం లభ్యత చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో స్థానిక భాషలో చదివేందుకు అవసరమైన నైపుణ్యం తప్పనిసరిగా అవసరం   

ఈ మెలకువలు పాటించండి! 

1. పూర్తి శక్తియుక్తులు ఉపయోగించి పోటీ పరీక్షలకి ప్రిపేరవ్వాలి. తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అటు అకడమిక్‌ పరీక్షలకు సిద్ధమవుతూ పోటీ పరీక్షలకూ తయారవటం వల్ల దేనికీ న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడం అనేది ఎప్పుడూ ఛాయిస్‌గా ఉండకూడదు. అదే పూర్తి లక్ష్యంగా ఉన్నప్పుడే విజయావకాశాలు మెరుగుపడతాయి. అనేక కారణాలవల్ల కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ప్రిపేర్‌ అవుతామనే ఆలోచనతో ఉంటారు. సామర్ధ్యాలు పూర్తిగా ఉన్న వ్యక్తుల్లో మాత్రమే ఈ ఆలోచన సరైన ఫలితాలు ఇస్తుంది. అత్యధిక అభ్యర్థుల విషయంలో 100% శక్తియుక్తులను ఉపయోగించకపోతే  ఫలితం రాదు.  

2. ఆర్థిక వనరుల అంచనా, లభ్యమయ్యే వనరులను బట్టి ప్రణాళిక- ఇలాంటి దీర్ఘ ప్రిపరేషన్లో మరో ప్రధానాంశం. సరైన ఆర్థిక వనరులు లేనప్పుడు సన్నద్ధత కొనసాగించలేక, కోచింగ్‌ పొందలేక, పుస్తకాలు కొనలేక, ఇతర ఆర్థిక ఒత్తిళ్ల వల్ల మధ్యలోనే ఎక్కువమంది విరమించే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే సరైన ప్రణాళికలో భాగంగా ఆర్థిక వనరులను గురించీ స్పష్టత అవసరం. ముఖ్యంగా యూపీఎస్‌సీ, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ల పరీక్షలకు సిద్ధపడేవారు ఈ ఆర్థిక వనరులను గురించి సరైన అంచనా వేసుకున్నాకే పోటీలోకి దిగితే మంచిది.  

3. నవ యువత పోటీపరీక్షలకు దిగగానే ఇప్పుడు అందివస్తున్న అవకాశం- సోషల్‌ మీడియా, సైబర్‌ ప్రపంచం. సోషల్‌ మీడియాలో రకరకాల సలహాలు, గైడెన్స్, విషయ పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సమాచారాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేదానిపై యువత సరైన దృక్కోణంతో లేకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ. సోషల్‌ మీడియాలో అందుతున్న రకరకాల సమాచారాల విశ్వసనీయతను ముందుగా నిర్థారించుకోవాలి. లభిస్తున్న సమాచారం వెనుక ఉన్న అనుభవం పరిగణనలోకి తీసుకున్నాక దాన్ని వినియోగించుకోవటం మేలు. 
కొవిడ్‌ కారణంగా తరగతిగది బోధన తగ్గి, ఆన్‌లైన్‌ తరగతుల బోధన పెరిగింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కోచింగ్‌ను ఉపయోగించుకునేందుకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకోవాలి. బోధిస్తున్న ఉపాధ్యాయుల అనుభవం, చిత్తశుద్ధి, కంటెంట్‌ అప్‌డేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అభ్యర్థుల్లో తరచూ వచ్చే సందేహాలను పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం మొదలైనవి గమనించుకోవాలి.    

4. వార్తా పత్రికలు చదవటం చాలా ముఖ్యమైన విషయం. యూపీఎస్‌సీ, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌ మొదలైన అనేక విషయాల్లో  దినపత్రికలు సరికొత్త సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి. ప్రతిరోజూ దినపత్రికల్లోని సంపాదకీయాలు (ఎడిటోరియల్స్‌) చదవటం ద్వారా లోతైన విశ్లేషణతో పాటు అప్లికేషన్‌ కోణం పెరుగుతుంది. ఏదో ఒక పుస్తకంపై కాకుండా ఇలా వార్తా పత్రికల మీద ఆధారపడినవారికి గతంలోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 

5. ప్రభుత్వ ప్రచురణల అధ్యయనం కూడా తప్పనిసరి సాధన అంశంగా అభ్యర్థులు గుర్తించాలి. యోజన, కురుక్షేత్ర, న్యూ ఇండియా సమాచారం, ఇండియా ఇయర్‌ బుక్, తెలంగాణ మొదలైనవి ప్రభుత్వ విధానాలు, పంథా, వ్యూహాలూ, కార్యక్రమాలపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తాయి. బడ్జెట్, ఎకనామిక్‌ సర్వేలపై తప్పనిసరిగా పట్టు తెచ్చుకోవాలి. అందుకోసం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇస్తున్న సమాచారం విశ్వసనీయంగా ఉంది. దాన్ని కూడా వినియోగించుకోవచ్చు. వీటిలో కొన్ని మ్యాగజీన్స్‌ తెలుగు,  ఇంగ్లిష్‌లలో ఈ-బుక్‌ రూపంలో ఉచితంగా అందుతున్నాయి. 

Posted Date : 21-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌