• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెట్‌ చేసుకోండి!

జాతీయ స్థాయి అర్హత పరీక్ష 

సబ్జెక్టులపై ముందస్తుగా పట్టు

కేంద్రప్రభుత్వ విభాగాల్లో, ఇతరత్రా కొలువుల నియామకం కోసం ఉమ్మడి పరీక్ష త్వరలో రాబోతోంది. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష అభ్యర్థుల ఉద్యోగార్హతను నిర్థారిస్తుంది. వారు రకరకాల పరీక్షలు రాయాల్సిన స్థితిని తప్పిస్తుంది. ఆరకంగా వ్యయ ప్రయాసలను తగ్గించి, సమయం ఆదా చేసి, సన్నద్ధతను సులభం చేస్తుంది. ఈ ‘సెట్‌’ పరీక్ష ప్రకటన ఇంకా వెలువడాల్సివుంది. దీనికోసం వేచిచూడకుండా ముఖ్యమైన సబ్జెక్టులపై పట్టు సాధించే ప్రయత్నం చేయటం ఉద్యోగార్థుల కర్తవ్యం! 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ సంస్థలు ఆయా సంస్థల్లోని పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఈ  సంస్థల స్థానంలో ప్రత్యామ్నాయంగా నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ‘కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌’ (సెట్‌) నిర్వహించబోతోంది. 

2022 ప్రథమార్థంలో ఎన్‌ఆర్‌ఏ-సెట్‌ మొదలుకాబోతోంది. సంవత్సరానికి రెండుసార్లు, మూడు కేటగిరీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతి, 10+2, 10+2+3 (గ్రాడ్యుయేట్‌)- ఇలా మూడు కేటగిరీలుగా విభజించారు. ఎన్‌ఆర్‌ఏ-సెట్‌ పరీక్ష మిగిలిన రిక్రూట్‌మెంట్లలో ప్రిలిమినరీ పరీక్షకు ప్రత్యామ్నాయంగా వ్యవహరించబోతోంది. 

ఎన్‌ఆర్‌ఏ-సెట్‌లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగం, అంగీకారం తెలిపిన కొన్ని ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా మెయిన్స్‌ పరీక్ష రాసే వీలుంటుంది. ఎన్‌ఆర్‌ఏ-సెట్‌లో అర్హత పొందిన పొందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలను చెల్లుబాటుగా పరిగణిస్తారు. అంటే.. ఒకసారి ఎన్‌ఆర్‌ఏ-సెట్‌లో అర్హత మార్కులు సాధిస్తే, 3 సంవత్సరాలపాటు వివిధ సంస్థల్లోని మెయిన్స్‌ పరీక్షకు అర్హత పొందినట్టే.

ఏ సబ్జెక్టులు ప్రధానం?

బ్యాంకు పరీక్షల్లో అరిథ్‌మెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, కరెంట్‌ అఫైర్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. స్టాఫ్‌ సెలక్షన్‌లో ఉండే సబ్జెక్టులు అరిథ్‌మెటిక్, జనరల్‌ ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్‌. రైల్వే పరీక్షలో అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్‌ ఉంటాయి. ఇక్కడ అన్ని పరీక్షల్లో కామన్‌గా ఉన్న సబ్జెక్టులు అరిథ్‌మెటిక్‌ (క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌),  జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్,  కరెంట్‌ అఫైర్స్‌ (జనరల్‌ అవేర్‌నెస్‌). ఇక ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం ఈ రోజుల్లో ఉద్యోగార్థులందరికీ అవసరమే కదా!

అరిథ్‌మెటిక్‌: ఈ విభాగంలో శాతాలు అనేది చాలా కీలకమైన చాప్టర్‌. శాతాలకు అనుసంధానంగా నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ ప్రశ్నలుంటాయి. ఈ అంశాలన్నీ ఒకే లాజిక్‌ ఆధారంగా ఉంటాయి. వీటి నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి.  గసాభా/ కసాగు చాప్టర్‌కు అనుసంధానంగా కాలం-పని, పైపులు-తొట్టెలు చాప్టర్‌లు ఉంటాయి. కాలం-పని చాప్టర్‌ నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. వీటితోపాటు కాలం-దూరం, రైలు మీద ప్రశ్నలు, పడవలు- ప్రవాహాలు ముఖ్యమైన చాప్టర్‌లు. ఇంకా డేటా-అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ల నుంచీ ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా వీటి నుంచి గ్రూప్‌ ప్రశ్నలు (3 నుంచి 5)గా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అశ్రద్ధ చేయకూడదు.

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో వెర్బల్, నాన్‌-వెర్బల్, క్రిటికల్, ఎనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నంబర్లు, లెటర్లు, పదాలు, చిత్రాల మీద ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. సిరీస్, అనాలజీ, ఆడ్‌మన్‌ అవుట్, చిత్రాన్ని పూర్తి చేయడం, మిర్రర్‌ ఇమేజ్, వాటర్‌ ఇమేజ్‌ల నుంచి ప్రశ్నలు రావచ్చు. నంబర్, సింబల్‌ ఆపరేషన్స్, పేపర్‌ ఫోల్డ్, కట్టింగ్‌ల నుంచీ ప్రశ్నలు అడగవచ్చు. పజిల్స్, రక్త సంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్‌-అపుట్‌పుట్‌ గ్రూప్‌గా వచ్చే ప్రశ్నలు. సిలాజిజం, స్టేట్‌మెంట్‌-కంక్లూజన్, స్టేట్‌మెంట్‌-అజమ్షన్‌ల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. 

ఇంగ్లిష్‌: ఇంగ్లిష్‌ భాషలో వ్యాకరణ సూత్రాలు, వాక్యనిర్మాణ మెలకువలు, పదజాలం శ్రద్ధగా నేర్చుకోవాలి. భాషపై పట్టు సాధించాలనే దృష్టి ఉండి, తగిన కృషి చేయాలనుకునేవారికి మార్కెట్లో కొల్లలుగా పుస్తకాలు, అంతర్జాలంలో యాప్స్, వీడియోలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది.

కరెంట్‌ అఫైర్స్‌: నిత్యం వార్తాపత్రికలు శ్రద్ధగా చదవటం ద్వారా కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు తెచ్చుకోవచ్చు. పోటీ పరీక్షల కోణంలో వార్తాపత్రికలను చదవటం అలవాటు చేసుకోవాలి. ఇందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, ఇతర పరీక్షల పూర్వ ప్రశ్నపత్రాలు చూసి, ఏ తరహా ప్రశ్నలు అడుగుతున్నారో గమనించాలి. 

తొలి ప్రయత్నంలోనే...

కొవిడ్‌-19 కారణంగా నియామకాల జోరు తగ్గి ఉద్యోగార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2022 ప్రథమార్ధంలో ఎన్‌ఆర్‌ఏ-సెట్‌ మొదలుకాబోతోంది. ఆ పరీక్ష కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ కొనసాగించినట్లయితే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించే అవకాశం ఉంది. 

పరీక్ష ఏదైనా సబ్జెక్టులు ఏమేమి ఉండే అవకాశం ఉందో తెలుసు కాబట్టి, నోటిఫికేషన్‌ వచ్చేవరకూ సమయాన్ని వృథా చేయటం సరికాదు. పోటీ పరీక్షల్లో ఇతర అభ్యర్థులకు వచ్చే మార్కులకన్నా మీకు వచ్చే మార్కులు ఎక్కువగా ఉంటే క్వాలిఫై అవ్వబోయే అభ్యర్థుల జాబితాలో మీ పేరు ఉంటుంది. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ఉండే ప్రతీ అంశం నుంచి 200 ప్రశ్నలు సాధన చేస్తూ, ఒక్కొక్క చాప్టర్‌ ప్రాక్ట్టీస్‌ చేయాలి. ఆయా చాప్టర్లలోని ఫార్ములాలను నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. నాన్‌ మ్యాథ్స్‌ విద్యార్థులు లేనిపోని భయాలను వదిలేసి ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ సమయం అధ్యయనం, పునశ్చరణలపై దృష్టి పెట్టాలి. 

రీజనింగ్‌ విభాగంలో లాజిక్‌ చాలా ముఖ్యమైంది. ప్రతీ చాప్టర్‌లోని లాజిక్స్‌ అన్నీ ఒకే దగ్గర రాసుకుని నోట్స్‌ తయారుచేసుకోండి. ఒక ప్రశ్నను ఎన్ని విధాలుగా చేయవచ్చో ఆలోచిస్తూ, కనీసం రెండు లాజిక్స్‌ అయినా వచ్చే విధంగా నోట్స్‌ రాసుకోండి. 

జ్ఞాపకశక్తి వృద్ధి చెందేలా పునశ్చరణతో పాటు యోగా చేయడం మంచిది. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి చదువుకుంటే, అధైర్యపడకుండా ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు. నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడకుండా, వస్తుందనే నమ్మకంతో ఇప్పటి నుంచే సబ్జెక్టుల పరిజ్ఞానం సంపాదించటం కోసం ప్రయత్నాలు ఆరంభించాలి. సబ్జెక్టు మీద పట్టు కోసం ప్రయత్నిస్తూ, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేస్తే విజయం మీ సొంతం అవుతుంది!

ప్రయోజనాలెన్నో...

ఈ పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు 2019లో మొత్తం 56 ప్రభుత్వ రంగ నోటిఫికేషన్లు వచ్చాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థి 56 పరీక్షలకూ దరఖాస్తు చేసి, వాటన్నిటకీ ప్రిలిమినరీ పరీక్షలు రాయాలి. అందులో ప్రిలిమినరీ పరీక్షల్లో నెగ్గిన నోటిఫికేషన్లకు తిరిగి మెయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో మొదటిగా 56 పరీక్షలకు (అన్నీ కాకపోయినా ఎక్కువ పరీక్షలకు) ఫీజు చెల్లించాలి. సమాంతరంగా అన్ని ప్రిలిమినరీ పరీక్షలకూ సిద్ధమవ్వాలి. వేర్వేరు ప్రదేశాల్లో ప్రిలిమినరీ పరీక్షలు రాయాలి. ఇదంతా సమయంతోపాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ తర్వాత ఇదే విధంగా మెయిన్స్‌ పరీక్షలూ రాయాల్సివుంటుంది.  

ఇప్పుడు ఎన్‌ఆర్‌ఏ-సెట్‌ వల్ల ఈ పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చి ఉద్యోగార్థుల సన్నద్ధత సులువు అవుతుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ అర్హత ఉన్న మూడు కేటగిరీ పరీక్షలకూ ఒకసారి దరఖాస్తు చేసి, కేవలం ఈ మూడు పరీక్షల ప్రిలిమినరీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యి, ఈ పరీక్షలను క్లియర్‌ చేస్తే చాలు. ఆ తర్వాత కేవలం మెయిన్స్‌ పరీక్షల మీద దృష్టి పెట్టవచ్చు. ప్రస్తుత పద్ధతిలో అయితే ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు సమాంతరంగా ప్రిపేర్‌ అవ్వడం వల్ల పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. అదే ఎన్‌ఆర్‌ఏ-సెట్‌ పద్ధతిలో అయితే పరీక్షలపై స్పష్టతతోపాటు, సమయం కూడా ఆదా అవుతుంది. 

ప్రస్తుతం జరుగుతున్న ఐబీపీఎస్, ఎస్‌బీఐ పరీక్షల్లో ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల మధ్య వ్యవధి 10 నుంచి 20 రోజులు మాత్రమే. దీనికి భిన్నంగా ఎన్‌ఆర్‌ఏ-సెట్‌లో క్వాలిఫై అయినట్లయితే కేవలం మెయిన్స్‌ పరీక్ష మీద దృష్టి పెడితే సరిపోతుంది.  

ప్రతి జిల్లా కేంద్రంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయంతోపాటు ఇతర ఖర్చులు కూడా తగ్గుతాయి. అభ్యర్థులు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ఒకసారి ఎన్‌ఆర్‌ఏ-సెట్‌లో అర్హత పొందితే 3 సంవత్సరాలపాటు మెయిన్స్‌ పరీక్షలు రాసి, ఏదో ఒక ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందవచ్చు. 

ఒకే పరీక్ష ఎక్కువ స్లాట్‌లలో రోజుల తరబడి నిర్వహిస్తారు. ఎన్‌ఆర్‌ఏ నిర్దేశిత సిలబస్‌ను ప్రకటించాల్సివుంది. నిర్ణయించిన సబ్జెక్టుల్లోని ప్రతి అంశం మీదా పట్టు సాధించగలితేనే పరీక్షలో అర్హత సాధించగలరు. సబ్జెక్టు మీద పట్టు సాధించగల అభ్యర్థులకు ఎన్‌ఆర్‌ఏ-సెట్‌ నిజంగా ఒక గొప్ప వరం. 

Posted Date : 12-07-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌