• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒత్తిడిని ఓడించండి!

నివారణకు నిపుణుల సూచనలు

పరీక్షలకు సరిగా తయారు కాలేదనే అపరాధ భావన... ఉద్యోగం సంపాదించడంలో జాప్యం జరుగుతోందనే నిస్పృహ.. విధినిర్వహణ సమర్థంగా చేయలేకపోతున్నాననే నిరాశ! విద్యార్థులూ, నిరుద్యోగులూ, ఉద్యోగులూ... ఇలా ఏదో ఒక కారణంతో  మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఒకస్థాయి వరకూ ఇది మంచిదే అయినా... మితిమీరితే? ఉజ్వలమైన భవిష్యత్తును ఊహించుకుంటూ యువత కంటోన్న బంగారు కలలను ఈ ఒత్తిడి క్షణాల్లోనే కల్లలు చేస్తోంది. తల్లిదండ్రుల ఆశల సౌధాలను చిటికెలో ఛిద్రం చేసి శూన్యాన్ని మిగులుస్తోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని నివారణకు ఇవిగో- నిపుణుల సూచనలు! 

చంద్రిక బీఫార్మసీ చదువుతోంది. స్కూలు రోజుల నుంచీ చదువులో ముందుండే ఆమె ఈమధ్య బాగా ఒత్తిడికి గురవుతోంది. ఫైనల్‌ పరీక్ష బాగా రాయలేనేమోనని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యంపాలైంది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోన్న పవన్‌ కూడా విపరీతమైన ఒత్తిడికి గురయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో బలవన్మరణం చెందాడు. ఉద్యోగం రావడంలేదని ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటోన్న నిరుద్యోగులూ ఉన్నారు. అయితే... ఈ పరిస్థితులు అధిగమించలేనివేమీ కావు.

కారణాలేమిటి?

ఆర్థిక వెనుకబాటుతనం

విద్యార్థులను ఎక్కువ ఒత్తిడికి గురిచేసే అంశాల్లో ఆర్థిక పరిస్థితులు ముందుంటాయి. చాలామంది గ్రామాల నుంచి వచ్చి పట్టణాలు, నగరాల్లోని కాలేజీల్లో చదువుతుంటారు. ఇలాంటప్పుడు ఇంటి నుంచి వచ్చే డబ్బు అవసరాలకు సరిపోక ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక పరిమితుల కారణంగా పెద్ద మొత్తం పంపమని అమ్మానాన్నలను అడగలేని పరిస్థితి వారిది. ఇలాంటప్పుడు ఉదయం, సాయంత్రం సమయాల్లో కొన్ని గంటపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరొచ్చు. కొంతమంది పిల్లలకు ట్యూషన్లు చెప్పొచ్చు. బాగా చదివి స్కాలర్‌షిప్‌లు పొందడానికి అర్హతను సంపాదించవచ్చు.  

అయినవాళ్లపై బెంగ

చదువు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి నగరాలకు వెళతారు విద్యార్థులు. జీవితంలో మొదటిసారిగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం వల్ల కుటుంబ సభ్యుల మీద విపరీతంగా బెంగ పెట్టుకుంటారు. ఒంటరితనంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాకాకుండా ఉండాలంటే తరచూ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతుండాలి. సెలవుల్లో ఊరికి వెళ్లి వస్తుండాలి. తమలాగే కుటుంబానికి దూరంగా ఉంటోన్న స్నేహితులతో తమ అనుభవాలను పంచుకోవాలి. దీంతో ఒత్తిడి దూరమై సాంత్వన పొందగలుగుతారు. 

బాధించే ఒంటరితనం

దూర ప్రాంతాల నుంచి క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థులను ఒంటరితనం బాగా బాధిస్తుంది. అంతకుముందు పరిచయంలేని వారితో గడపాల్సి వస్తుంది. కొంతమందికి విపరీతమైన మొహమాటం, బిడియం ఉంటాయి. దీంతో కొత్తవాళ్లతో తొందరగా స్నేహం చేయలేరు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లను భాషా సమస్యా వేధిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ భూతద్దంలో చూసి భయపడకూడదు. కాలం గడిచే కొద్దీ కొత్త పరిసరాలకు మెల్లగా అలవాటు పడతారు. కొత్త స్నేహాలూ చిగురిస్తాయి. వేరే రాష్ట్రాలకు వెళ్లినట్లయితే స్థానిక భాషను త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పరిచయాలు పెరిగి ఒంటరితనంతో బాధపడాల్సిన అవసరమూ ఉండదు. 

అర్థం కాని పాఠ్యాంశాలు

కొందరు విద్యార్థులు పది వరకూ మాతృభాషలో చదివి ఆ తర్వాత ఇంగ్లిష్‌ మాధ్యమంలో చేరతారు. దీంతో పాఠాలు అర్థంకాక విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. సమయానికి సిలబస్‌ మొత్తాన్ని చదవలేకపోతారు. ఈలోగా పరీక్షలు ముంచుకొచ్చి వాటిలో తక్కువ మార్కులు రావడమూ జరుగుతుంది. ఈ పరిస్థితులు విపరీతమైన ఒత్తిడికి కారణమవుతాయి. అలాంటప్పుడు భవిష్యత్తు మొత్తం ఇలాగే ఉంటుందని కంగారు పడిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కాస్త నిదానంగా ఆలోచించాలి. అర్థంకాని పాఠాలను ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. సందేహాలుంటే అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి. అవసరమైనప్పుడు తోటి విద్యార్థుల సహాయ, సహకారాలనూ తీసుకోవాలి. వాయిదా వేయకుండా ఏరోజు పాఠాలను ఆరోజే చదువుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. మీ మీద మీకు నమ్మకమూ పెరుగుతుంది. 

ఆత్మీయులు దూరమవటం

కుటుంబాలకు దూరంగా ఉండి పక్క రాష్ట్రాల్లో చదువుకుంటోన్న విద్యార్థులు ఎంతోమంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే అది వారిని విపరీతంగా కలిచివేస్తుంది. ఒకపక్క తరగతులు వదిలి ఇంటికి వెళ్లలేరు. మరోపక్క చనిపోయినవారి జ్ఞాపకాలతో సతమతం అవుతుంటారు. ఇలాంటప్పుడు కొందరు తీవ్ర నిరాశలో కూరుకుపోతారు. మరికొందరు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఆత్మీయుల మరణం విపరీతమైన బాధను కలిగిస్తుందనేది వాస్తవమే. కానీ కాలమే చేసిన గాయాలనూ మాన్పుతుంది. రోజువారీ పనులకు మెల్లగా అలవాటు పడితే ఆ బాధ నుంచి త్వరగా బయటపడొచ్చు. జరిగిన విషాదాన్ని పదేపదే తలచుకోవడం వల్ల బాధ మరింత పెరుగుతుందిగానీ తగ్గదు. కాబట్టి ఎప్పుడూ పనులతో బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. గది శుభ్రంగా సర్దుకోవడం, వ్యాయామాలకూ, చదవడానికీ సమయం కేటాయించడం చేయాలి. స్నేహితులతో బాధలను పంచుకోవడం వల్ల కూడా మనసు తేలిక పడుతుంది.

కొత్త పరిచయాలు

కొత్తగా కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. వీరిని కొత్త పరిచయాలు, స్నేహాలు, పార్టీలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి... లాంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు అవసరమైతే సీనియర్ల సలహాలు తీసుకోవచ్చు. వాళ్ల ప్రవర్తనను పరిశీలించడం ద్వారానూ కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మరీ చిక్కు సమస్యలు ఎదురైతే అధ్యాపకులకు తెలియజేయడానికి సందేహించకూడదు. ప్రతిచిన్న విషయాన్నీ భూతద్దంలో చూసి ఒత్తిడికి గురికాకుండా కాస్త నిదానంగా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. 

అనారోగ్య సమస్యలు

విపరీతమైన ఒత్తిడికి గురికావడం వల్ల యువత ఎన్నో అనారోగ్య సమస్యలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నిద్రలేమితో ఇబ్బందిపడతారు. దాంతో నిద్రపట్టడం కోసం ఆల్కహాల్, మత్తుపదార్థాలకు బానిసలయ్యే ప్రమాదమూ ఉంది. నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడితో కుంగుబాటుకు గురవుతారు. బయటకు ఆరోగ్యంగానే కనిపించినా మానసికంగా కుంగిపోతుంటారు. ఇంకా తల, మెడ, వెన్నెముక, కడుపునొప్పి, ఒళ్లు నొప్పులతో ఇబ్బందిపడతారు.  

అర్థంకాని పాఠాలను ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. సందేహాలుంటే అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి. అవసరమైనప్పుడు తోటి విద్యార్థుల సహాయ సహాకారాలనూ తీసుకోవాలి. వాయిదా వేయకుండా ఏరోజు పాఠాలను ఆరోజే చదువుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.

మరేం చేయాలి? 

కింది సూచనలను పాటించడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు. 

కారణాలు.. పరిష్కారాలు

ఏయే సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తున్నాయో ముందుగా గుర్తించాలి. వాటి గురించి పదేపదే ఆలోచించకుండా ఒకచోట రాసుకోవాలి. అలాగే పరిష్కార మార్గాలను రాయాలి. అందులో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని అనుసరించాలి. ఈ విషయంలో అవసరమైతే స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలూ తీసుకోవచ్చు. 

వాయిదా వేయొద్దు

విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో చదవాల్సిన అంశాలను వాయిదా వేస్తుంటారు కొందరు విద్యార్థులు. ఆ తర్వాత పరీక్షల సమయానికి విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. అలాకాకుండా ఎప్పటి పాఠాలు అప్పుడే చదవడం వల్ల కొంతవరకు ఒత్తిడిని నివారించవచ్చు. 

భారీ అంచనాలు

మన గురించి అతిగా ఊహంచుకోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. స్వీయ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాల మీద నమ్మకం ఉండటం మంచిదే. కానీ ప్రతిభా విశేషాలను అధికంగా అంచనా వేసుకోవడం వల్ల అవి నిజం కానప్పుడు ఒత్తిడికి గురవ్వాల్సివస్తుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.

లోపల దాచుకోకూడదు

ఒత్తిడితో ఎవరికి వారే కుంగిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చదువుకు సంబంధించిన సమస్యలను అధ్యాపకులకు తెలియజేయాలి. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకోవాలి. సమస్య ఎలాంటిదైనా దాన్ని బయటకు వ్యక్తం చేయగలిగే సామర్థ్యం మీకుండాలి. 

నిత్య వ్యాయామం

వ్యాయామం చేయడం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్ల వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ముక్కుతో దీర్ఘంగా శ్వాస తీసుకుని, కాసేపు దాన్ని నిలిపి ఉంచి నోటితో మెల్లగా గాలిని వదలినా ఒత్తిడి తగ్గుతుందంటారు. నడక, కొన్ని రకాల స్ట్రెచింగ్‌ వ్యాయామాలు, యోగా, ధ్యానం వల్ల శారీరంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. పోషకాహారం తీసుకోవడం ద్వారానూ కొంతవరకు ఒత్తిడిని నియంత్రించవచ్చు. గుడ్లు, గుమ్మడిగింజలు, డార్క్‌చాక్లెట్లు, పెరుగు, ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్లు ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.  విద్యాసంస్థల్లో యోగా, ధ్యానం తరగతుల్లో చేరి ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. కొన్ని సేవా సంస్థలు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటికి డయల్‌ చేసి నిపుణులు అందించే సలహాలు, సూచనలను పాటించొచ్చు. ఒత్తిడి గురించి పదేపదే ఆలోచించకుండా దాన్నుంచి ఎలా బయటపడాలనే విషయం మీదే దృష్టి నిలపాలి. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పట్టాతో పాటు పదిలమైన ఉద్యోగం

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు!

Posted Date : 03-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌