• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సులభంగా... సౌకర్యంగా చదవడం ఎలా?

ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్‌ మెలకువలు

పోటీ పరీక్షల అభ్యర్థులు పోటీకి కావలసిన లక్షణాలపై అవగాహన, సిలబస్, ప్రశ్నపత్రాల అధ్యయనం, సమయ నిర్వహణ ప్రణాళిక, శారీరక సన్నద్ధత మొదలైనవి పూర్తిచేశాక ‘విషయ ప్రణాళిక’ రచించుకోవాలి. అంటే సిలబస్‌కు సంబంధించిన వివిధ అంశాల్ని (కంటెంట్‌) ఏ విధంగా చదివితే మెరుగైన ఫలితాలు వస్తాయో  ప్లాన్‌ చేసుకోవాలి. దీనివల్ల అభ్యర్థి సమయం సద్వినియోగం అవటమే కాకుండా ముందుకుసాగే విషయంలో సమీక్షకు కూడా ఉపకరిస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిగణించడానికీ అవకాశం ఏర్పడుతుంది!

వీలైనంతవరకు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులను ఒక నిర్దిష్ట కాలంలో అధ్యయనం చేసేలా ప్రణాళిక ఉండాలి.

పోటీ పరీక్షల్లో చదవాల్సిన అంశాల (కంటెంట్‌) రకాలు చాలా ఎక్కువ. బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలక్షన్, రైల్వే పోటీ పరీక్షల్లో చదవాల్సిన అంశాల సంఖ్యతో పాటు స్థాయి కూడా తక్కువగానే ఉంటుంది. అయితే రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో సిలబస్‌ విస్తృతం. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్‌-1, 2 లాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకే కాదు, దిగువ స్థాయి సచివాలయ ఉద్యోగాలు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి లాంటి ఉద్యోగాల పరీక్షలు 10 రకాలకు పైగా విషయాలపై జ్ఞాన స్థాయిని పరిశీలించేలా ఉంటాయి. అంతేకాక గ్రూప్‌-1, 2, యూపీఎస్‌సీ, సివిల్స్‌ పరీక్షల్లో నిర్దేశిత సిలబస్‌ నుంచే కాకుండా ఇతరత్రా అనేక విషయాలపైనా ప్రశ్నలు అడగటం ఆనవాయితీ.. 

ఇటువంటి సందర్భాల్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక చాలా అవసరం. ఇది లేనట్లయితే విషయాన్ని అధ్యయనం చేసి జ్ఞాపకశక్తిగా మార్చుకునే క్రమంలో అభ్యర్థి చాలా ఇబ్బందులకు గురవుతాడు. అందువల్ల వివిధ అంశాలన్నిటినీ ఏ పద్ధతిలో చదివితే సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుందనే విషయానికి ప్రాధాన్యమిచ్చి విషయ ప్రణాళికా రచన జరగాలి.

ముందుగా డిగ్రీ సబ్జెక్టులు  

మొత్తం సిలబస్‌లో ఇచ్చిన విషయాలకూ అభ్యర్థి తన గ్రాడ్యుయేషన్‌లో చదివిన విషయాలకూ మధ్య సంబంధం ఉన్నట్లయితే ముందుగా వాటిని ఎంపిక చేసుకుని చదవడం ప్రారంభించాలి. ఫలితంగా అధ్యయనంలో ఉత్సాహం ఏర్పడుతుంది. పైగా విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రేరణ కూడా వస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో చదివిన అకడమిక్‌ విధానానికీ, పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల ధోరణికీ మధ్య ఉన్న పోలికలూ తేడాలూ గుర్తిస్తారు. అందువల్ల పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అభ్యర్థుల అవకాశాలను బట్టి ఈ విధంగా గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులను ముందుగా చదివేలా విషయ ప్రణాళిక రచన ఉండటం మంచిది.

ఇష్టమైనవాటికి ప్రాధాన్యం

అభ్యర్థుల తత్వాలను బట్టి వారికి వేర్వేరు సబ్జెక్టుల మీద వేర్వేరు అభిప్రాయాలుంటాయి. బాగా ఇష్టపడే సబ్జెక్టులకు విషయ ప్రణాళికలో మొదటి ప్రాధాన్యం ఇస్తే అభ్యర్థికి ఆసక్తితో పాటు త్వరగా అవగాహన ఏర్పడుతుంది. ప్రేరణాత్మకంగా చదవగలుగుతారు. గ్రాడ్యుయేషన్‌లో గణిత నేపథ్యం ఉన్న అభ్యర్థులు అంక గణితం, రీజనింగ్‌ విభాగాలను ఆసక్తిగా చేయగలుగుతారు. సైన్స్‌ నేపథ్యం ఉన్నవారు జనరల్‌ సైన్స్‌నూ, ఆర్ట్స్‌ నేపథ్యం ఉన్నవారు చరిత్ర, ఎకానమీ, భౌగోళికాంశాలనూ ఎంపిక చేసుకున్నట్లయితే తొలి అడుగులు సౌకర్యవంతంగా పడతాయి. ఆపై అనంతర ప్రయాణమూ ఉత్సాహభరితంగా సాగుతుంది.

రోజంతా ఒకే సబ్జెక్టా?

ఒకరోజు కాల వ్యవధిలో ఒక సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలా? బహుళ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలా.. అనేది ఒక రకంగా వ్యక్తిగత సామర్ధ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒక రోజు మొత్తంలో ఒకే సబ్జెక్టును చదవటం వల్ల ఏకాగ్రత నిలవటంతో పాటు ఒక విషయంపై పూర్తిగా అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ సబ్జెక్టుపైన సరైన పట్టు దొరకనప్పుడూ; దానిపై అవగాహన స్థాయి అభ్యర్థులకు తక్కువగా ఉన్నప్పుడూ ఏకాగ్రత లేకుండా చదివే పరిస్థితీ రావొచ్చు. అలాంటి సందర్భంలో నష్టమే ఎక్కువ ఉంటుంది. ఈ కాలవ్యవధిలో బహుళ సబ్జెక్టుల అధ్యయనం వల్ల వైవిధ్యమైన అధ్యయనానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ ఒక్క విషయం పైనా పూర్తి స్థాయి అవగాహన వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మరుసటిరోజు అంతకు ముందు రోజు చదివిన విషయాన్ని రీకాల్‌ చేసుకోవాల్సివుంటుంది. దీంతో జ్ఞాపకశక్తి బలంగా ఏర్పడుతుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల విషయ ప్రణాళికలో అభ్యర్థి తన వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలి. 

సొంత నోట్సు

గ్రూప్‌-1, సివిల్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులు సొంత నోట్స్‌ తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించేలా విషయ ప్రణాళిక ఉండాలి.

సాధనకు సమయం

బ్యాంకింగ్, రైల్వే మొదలైన పరీక్షల్లో ప్రధానంగా ప్రాక్టీస్‌ ముఖ్యమైనది. బేసిక్‌ స్థాయిలో అధ్యయనం చేశాక విభిన్న సమస్యలను ప్రాక్టీస్‌ చేసుకునేలా సమయం కేటాయించాలి. అంటే..  విషయ అవగాహనకు తక్కువ సమయం, సాధనకు ఎక్కువ అవకాశం ఉండేలాగా ప్రణాళిక చేయాలి.

జీకేపై పట్టు  

దిగువ స్థాయి ఉద్యోగాల పోటీ పరీక్షల్లో జనరల్‌ నాలెడ్జ్‌ (జీకే)కు కూడా ప్రాధాన్యం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని దీనిపై కూడా పట్టు సాధించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. జీకేపై పట్టు సాధించేందుకు బాగా గుర్తింపు పొందిన ఇయర్‌ బుక్‌ను చదివేలా ప్రణాళిక ఉండాలి.

స్థిమితంగా సాధన

అంకగణితం, డేటా ఇంటర్‌ప్రెటేషన్, రీజనింగ్‌ మొదలైనవాటికి కేటాయించే సమయంలో తప్పనిసరిగా వివిధ సమస్యలను పేపర్‌పై సాధించేలా ప్రణాళికలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆయా విభాగాలను సాధన చేసేటప్పుడు తప్పనిసరిగా కూర్చొని స్థిమితంగా ప్రాక్టీస్‌ చేసేలా ఏర్పాటు చేసుకోవాలి.

రోజూ వర్తమాన అంశాలు

కరెంట్‌ అఫైర్స్‌ను పైపైన ప్రతిరోజూ అనుసరిస్తూ ఉంటే సరిపోతుంది. లోతైన స్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రిపరేషన్‌ తొలిదశలో ఎక్కువ సమయం కేటాయించకపోవడం మేలైన నిర్ణయం. పరీక్ష తేదీకి మూడు నెలల ముందుగా వర్తమానాంశాలను లోతుగా అధ్యయనం చేయడం మెరుగైన ఫలితాలనిస్తుంది. వివిధ కంటెంట్లతో సంబంధం ఉన్న కరెంట్‌ అఫైర్స్‌ను రోజువారీ ప్రిపరేషన్‌లో ఉండే విధంగా విషయ ప్రణాళిక రచన జరగాలి. ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పాలిటీ మొదలైన సబ్జెక్టులకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్‌ ఆయా సబ్జెక్టులతో పాటు చదివేలా విషయ ప్రణాళికా రచన ఉండాలి.

బేసిక్స్‌కు ప్రాధాన్యం

సిలబస్‌లోని ఏ కంటెంటునైనా మొదట ప్రాథమిక స్థాయిలో పూర్తి చేసి, ఆపై తరువాతి స్థాయిలోకి ప్రవేశించటం సరైన నిర్ణయం. అందువల్ల ఎంపిక చేసుకున్న కంటెంట్‌ విషయంలో ప్రాథమికాంశాలకు (బేసిక్స్‌) ప్రాధాన్యం ఇచ్చేవిధంగా విషయ ప్రణాళికలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనంతర స్థాయుల్లో వరుస క్రమంలో అడ్వాన్స్‌ సబ్జెక్ట్, అప్లికేషన్‌ సబ్జెక్ట్‌ చదివేలా ఉండాలి. 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

మీకున్నాయా ఈ నైపుణ్యాలు?

ఆత్మస్థైర్యమే రక్ష!

‣ బైపీసీ బాట... భవితకు బావుటా!

‣ వర్గాలను వేగంగా కనుక్కుందాం!

Posted Date : 08-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌