• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సన్నద్ధత సాగడం లేదా?

చిక్కు సమస్యలకు చక్కని పరిష్కారాలు

ఎంతో ఆసక్తితో కొత్త కోర్సులో చేరినా.. కొంతకాలం తర్వాత దానిపై ఉత్సాహం తగ్గిపోవచ్చు. అనారోగ్య, కుటుంబ సమస్యలు చదువు మీద మనసును లగ్నం కాకుండా చేయొచ్చు. ఊహించని ఆర్థిక ఇబ్బందులు విద్యాభ్యాసాన్ని భారంగానూ మార్చేయొచ్చు. ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు ఉత్సాహంగా కోర్సును కొనసాగించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ చిక్కులను అధిగమించడానికి ఏమేం పాటించాలి? 

సమత ఎంతో ఇష్టంగా ఇంజినీరింగ్‌లో చేరింది. కానీ ఆ తర్వాత కొంతకాలానికే ఆమెకు కోర్సుపై ఆసక్తి లోపించింది. మధ్యలో మరో కోర్సులోకి మారే అవకాశం లేక అలాగే కొనసాగుతోంది. బాగా చదివే రాజేష్‌ లాక్‌డౌన్‌ సమయంలో వీడియో గేమ్స్‌ ఆడటానికి అలవాటుపడ్డాడు. ప్రస్తుతం పరిస్థితులు మారినా అలవాటు మార్చుకోలేక ఇబ్బందిపడుతున్నాడు. 

ఇలా వీరిద్దరూ మాత్రమేకాదు. వివిధ రకాల సమస్యలతో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు ప్రారంభంలో ఉన్న ప్రేరణ క్రమంగా లోపించడం, నేర్చుకోవాల్సినవి ఎక్కువగా ఉండి చదువు భారంగా మారిపోవడం, ఊహించని అవరోధాలు ఎదురుకావడం, ఏకాగ్రత లోపించడం, వాస్తవ ఘటనలు-గణాంకాలను గుర్తుపెట్టుకోలేకపోవడం... లాంటి చిక్కులు! వీటికి కారణాలు గ్రహించి పరిష్కారాల దిశగా అడుగులు వెయ్యాలి. 

తగ్గిపోయే ప్రేరణ 

కోర్సు ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం, ప్రేరణ కొంతమందికి చివరివరకూ ఉండటం లేదు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగత, అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఏవైనా ఉండొచ్చు. ఉదాహరణకు బాగా ఒత్తిడికి గురై, అలసిపోవచ్చు. చదువు కంటే ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరగొచ్చు. సబ్జెక్టులు బోరుగా అనిపించొచ్చు. అనారోగ్య సమస్యలు, నిద్రలేమి, భవిష్యత్తు మీద బెంగ... ఇలా రకరకాల కారణాలతో మొదట్లో ఉన్న ప్రేరణ తగ్గిపోచ్చు. అలాగే అందరికీ ఒకే లాంటి కారణాలు ఉండకపోవచ్చు. ముందుగా సమస్య వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించడానికి ప్రయత్నించాలి. స్ఫూర్తిదాయక వాక్యాలను రాసుకుని వాటిని కంటికి కనిపించేలా పెట్టుకోవడం వల్ల ప్రేరణను కోల్పోకుండా ఉండొచ్చు. ఫాస్ట్‌ఫుడ్, చక్కెర ఎక్కువగా పదార్థాలను తినడం  వల్ల అప్పటికప్పుడు ఉత్సాహంగా అనిపించొచ్చు. కానీ దీర్ఘకాలంలో కలిగే అనర్థాలే ఎక్కువ. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని పోషకాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను చాలావరకు పరిష్కరించుకోవచ్చు. 

కోర్సు మీద ఆసక్తి తగ్గటం

కొన్ని సబ్జెక్టులు చదవడానికి మొదట్లో ఆసక్తికరంగా ఉండొచ్చు. ఆ తర్వాత అవే విసుగ్గానూ అనిపించవచ్చు. ఆ సబ్జెక్టు చదవడం వల్ల దీర్ఘకాలంలో ఉపయోగం ఉండదనే అభిప్రాయం కలగొచ్చు. లేదా దాన్ని బోధించే అధ్యాపకుల మీద సదభిప్రాయం లేకపోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. భవిష్యత్తులో ఎదురుకాబోయే సంఘటనలను దృష్టిలో ఉంచుకుని దాని మీద ఆసక్తిని పెంచుకోవాలి. దాంట్లో తక్కువ మార్కులు రావడం వల్ల పీజీలో ఇష్టమైన యూనివర్సిటీలో సీటు సంపాదించలేకపోవచ్చు. వచ్చిన తక్కువ మార్కులను రెజ్యుమెలో రాసినా, ఇంటర్వ్యూలో ప్రస్తావించినా ఇబ్బందిగానే ఉంటుంది. గ్రేడ్‌ను నిర్ణయించడంలోనూ ఆ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఉండొచ్చు. కాబట్టి కోర్సు మధ్యలో దాని మీద మరింత అయిష్టాన్ని పెంచుకోకుండా పట్టు సాధించడానికే ప్రయత్నించాలి. అందుకోసం మరింత సమయాన్ని దాని మీద వెచ్చించాలి. సబ్జెక్టు పరంగా వచ్చే సందేహాలను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. తరగతిలో అందరి ముందూ అడగటానికి ఇబ్బందిగా అనిపిస్తే దాంట్లో ఆసక్తి ఉన్న స్నేహితుల సహాయ సహకారాలూ తీసుకోవచ్చు. స్నేహితులతోపాటుగా కలిసి సాధన చేసినా మీకు ఆ సబ్జెక్టు మీద ఆసక్తి పెరగొచ్చు. దాన్ని ఆస్వాదిస్తూ చదివే నేర్పూ అలవడొచ్చు. ఒకప్పుడు భయంకరంగా కనిపించినా సబ్జెక్టే తర్వాత మీకు ఆసక్తికరంగా మారిపోవచ్చు కూడా.

అంతరాయాలు ఎన్నో...

చదువుకు అంతరాయం కలిగించే విషయాలూ పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా, ఫోన్, టెలివిజన్, వీడియో గేమ్‌లు, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం.. ఇవన్నీ అంతరాయాలే. వీటన్నింటిలో వేటివల్ల ఎక్కువగా చదువుకు అంతరాయం కలుగుతుందో గుర్తించాలి. వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటూ చదవడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవాలి. తరచూ ఫేస్‌బుక్‌ చూడకుండా నియంత్రించుకోవాలి. కంప్యూటర్‌ మీద పనిచేయాల్సి వచ్చినప్పుడు ఇంటర్నెట్‌ అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన యాప్‌లను ఉపయోగించడం ద్వారా అంతరాయం లేకుండానూ కంప్యూటర్‌ను ఉపయోగించొచ్చు. ఇంట్లోని వాతావరణం చదవడానికి అనుకూలంగా లేకపోతే లైబ్రరీకి వెళ్లి కూడా ప్రశాంతంగా చదవొచ్చు.

కుదరని ఏకాగ్రత

అవరోధాలను అధిగమించి చదవడానికి కూర్చున్నా ఒక్కోసారి ఏకాగ్రత కుదరదు. మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు చదివినా అవి ఎక్కువకాలంపాటు గుర్తుండవు. అప్పుడు సమస్యలను పేపర్‌ మీద రాసుకోవాలి. లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో బాధలను పంచుకోవాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేరుకోలేమనే ఆందోళనకు గురైనా ఏకాగ్రత లోపిస్తుంది. ఒక పాఠం చదివిన తర్వాత దాని మీద నోట్స్‌ రాసుకోవాలి. వివిధ పద్ధతులు, సమయాల్లో చదవడానికి ప్రయత్నించాలి. వాటిలో నుంచి అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఇలాచేయడం వల్ల భారంగా కాకుండా ఆనందంగా చదవగలుగుతారు. దాంతో ఏకాగ్రతా పెరుగుతుంది. గంటలకొద్దీ కాకుండా మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకుంటూ చదివితే ఆసక్తీ పెరుగుతుంది. యోగా, ధ్యానంతోనూ ఏకాగ్రతను పెంచుకోవచ్చు. సమస్య మరీ పెద్దదయితే నిపుణులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవచ్చు.

వనరుల లేమి

చదవాలనే ఆసక్తి ఒక్కటీ ఉంటే  సరిపోదు. దానికి కావాల్సిన వనరులూ ఉండాలి. అవసరమైన పుస్తకాలు, సామగ్రి, శ్రద్ధగా బోధించే అధ్యాపకులూ అవసరమే. ఏయే పుస్తకాలు చదవాలనే విషయంలో అధ్యాపకుల సలహాలు తీసుకోవాలి. స్వయంగా నిర్ణయం తీసుకుని పుస్తకాలు కొనుక్కుంటే బోధన తప్పు మార్గం పట్టే అవకాశం లేకపోలేదు. ల్యాప్‌టాప్, ఇతర సామగ్రి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలూ తీసుకోవచ్చు. వారికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోతే స్నేహితులు, బంధువులను అడిగి తెలుసుకోవచ్చు. 

సరిపోని సమయం

విద్యార్థులు ఏం చదువుతున్నా, అది ఏ స్థాయిలో ఉన్నా సమయపాలన ఎంతో ముఖ్యం. పరీక్షలు సమీపిస్తోన్నా సిలబస్‌ పూర్తికాకపోయినా, అర్ధరాత్రి దాటి మేల్కొని చదివినా చదవాల్సినవి ఎన్నో ఉన్నా.. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు లేవనే అర్థం. చేయాల్సిన/ చదవాల్సిన అంశాలతో జాబితాను తయారుచేసుకోవాలి. దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా చదవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేచి ఆరోజు పూర్తిచేయాల్సిన పనులు ప్లాన్‌ చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలనేది రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమయం సరిపోదనే సమస్యే తలెత్తదు. అంతేకాదు కొంత సమయం మిగిలే అవకాశం కూడా లేకపోలేదు. 

గణాంకాలు గుర్తుండకపోవడం

పరీక్షల్లో అడిగే వివిధ ప్రశ్నలకు సమాధానం రాయడానికి విస్తృతమైన సమాచారాన్ని గుర్తుంచుకోవాలి. అదీ ఒక్క సబ్జెక్టుకు మాత్రమే పరిమితం కాదు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి సబ్జెక్టుకూ సంబంధించిన తాజా పరిణామాలు, గణాంకాలనూ తెలుసుకోవాలి. ఇదంత సులువైన పనేమీ కాదు. అందుకే విద్యా సంవత్సర ప్రారంభంలో సమయం వృథా చేయకుండా చదవడం వల్ల పరీక్షల సమయంలో పునశ్చరణ చేసుకునే అవకాశముంటుంది. దీంతో ఒత్తిడి లేకుండా గణాంకాలను గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాయగలుగుతారు. 

సానుకూల దృక్పథం

పైన చెప్పిన సమస్యలన్నింటికీ ఇదే పరిష్కారం చూపిస్తుంది. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూసి ఒత్తిడికి గురికాకూడదు. ఇబ్బందులన్నీ నాకు మాత్రమే ఎందుకొస్తున్నాయంటూ నిరాశపడకూడదు. సమస్యల గురించి కాకుండా వాటిని ఎలా పరిష్కరించాలనే దాని మీదే దృష్టిని కేంద్రీకరించాలి. అంతరాయాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలంటే కావాల్సింది సానుకూల దృక్పథమే. ఒక్క చదువు విషయంలోనేకాదు.. ఆ తర్వాత ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలన్నా ఈ దృక్పథం ఎంతో అవసరం.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఓ, పీఓలకు ఉమ్మడి ప్రిపరేషన్‌ ఎలా?

‣ సులభంగా... సౌకర్యంగా చదవడం ఎలా?

Posted Date : 10-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌