• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రతి విషయానికీ అతిగా ఆలోచనలా?

ఏ పనిచేసినా ముందుగా కాస్త ఆలోచించి చేయాలంటారు. అంతవరకూ బానే ఉందిగానీ మరి ఆలోచించడమే పనిగా పెట్టుకుంటేనో... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. పనులన్నీ ఆలోచనల దశలో ప్రారంభంలోనే ఆగిపోతాయి! 

ఉత్తమ విద్యార్థిగా చదువులో రాణించి చక్కని ఫలితాలు సాధించాలన్నా, భవిష్యత్తులో మంచి ఉద్యోగిగా ఎదగాలన్నా ఆత్మవిశ్వాసం, వేగంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు ఉండాలి. ఆలోచన, ప్రతిస్పందన, సమయానుకూలంగా ముందుకెళ్లడం... వీటన్నింటికీ వేగంగా ఆలోచించే నేర్పు ఎంతో అవసరం. ఇలాకాకుండా ఒకే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్లలేరు. అన్ని విషయాల్లోనూ ప్రగతి ఆలోచనల దగ్గరే ఆగిపోతుంది. 

అలాకాకుండా ఉండాలంటే... 

మళ్లీ మళ్లీ అదే: చదవాల్సిన కోర్సు, చేరాల్సిన కాలేజీ...ఇలాంటి విషయాల్లో సాధారణంగా కాస్త ఆలోచించి, తెలిసిన వారిని సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తుంటారు. అలా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ దాని గురించే ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయడం సరికాదు. ఈ విషయాల్లో కొత్తగా ఏదైనా అదనపు సమాచారం లభించినప్పుడు మాత్రమే పునరాలోచన చేయడం మంచిది. 

పరిష్కారం దొరకదు: అతిగా ఆలోచించడం, సమస్యను పరిష్కారించడం ఒకటే అనుకోవడం పొరపాటు. ఎక్కువగా ఆలోచించినంత మాత్రాన సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేరు. పదేపదే ఒకే విషయం గురించి ఆలోచించడం అంటే ఒక వృత్తంలో గుండ్రంగా తిరుగుతున్నట్టే. చుట్టు తిరిగి ఆలోచనలన్నీ మళ్లీ మొదటికే వస్తాయి. కాబట్టి ఆ వృత్తం నుంచి బయటపడి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. 

నిర్ణయం.. నిష్పత్తి: ఏదైనా ఒక విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకునే క్రమంలో 90:10 నిష్పత్తిని గుర్తుంచుకోవాలి. అంటే స్వీయ విశ్లేషణ 90 శాతం, ఇతరుల అభిప్రాయాలకు 10 శాతం విలువనివ్వాలి. విపరీతంగా ఆలోచించేవాళ్లు దీనికి విరుద్ధంగా చేస్తారు. ఇతరులు చెప్పిన దానికే ఎక్కువ విలువనిస్తారు. తమ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోరు. ఇలా చేయడం సరికాదంటారు నిపుణులు. మీ ఇష్టాలు, ఆలోచనలను మీరే పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఇబ్బందిపడేదీ మీరేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

సానుకూల దృష్టి: ఈ దృక్పథం లేనివాళ్లు సాధారణంగా విపరీతమైన ఆలోచనలతో బాధపడుతుంటారు. తమకు ఏదో చెడు జరగబోతోందనే ఆలోచనలు వీరిని స్థిమితంగా ఉండనీయవు. ఇలాంటప్పుడు అంతా మంచే జరుగుతుందనే సానుకూల దృక్పథాన్ని అలవరుచుకుంటే ఆలోచనల ఉద్ధృతి క్రమంగా తగ్గే అవకాశముంది. 

ఫెయిలవుతామేమో: కొంతమంది విద్యార్థులు పరీక్షల భయంతో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఫెయిల్‌ అయితే ఏంచేయాలి. ఇంట్లో, బయట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి...అనే విషయాల్లో అతిగా స్పందిస్తుంటారు. ఏం జరిగినా మీదే బాధ్యత కాబట్టి దాన్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చనే ధీమా మీకుంటే అతి ఆలోచనలు మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టవు. 

ఒంటరితనం వద్దు: తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలవకుండా ఒంటరిగా గడపడం వల్ల కూడా అతి ఆలోచనలు ఇబ్బందిపెడుతుంటాయి. అలాంటప్పుడు నలుగురితో కలవడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం వల్ల ఒంటరితనం ఇబ్బంది పెట్టదు. సంతోషంగా సమయాన్ని గడపగలుగుతారు. 

ఒత్తిడి మూలంగా: అర్థంకాని లేదా ఆసక్తిలేని సబ్జెక్టులు, తరగతులు, పరీక్షలు... ఇలా వేటి గురించైనా విపరీతమైన ఒత్తిడికి గురికావచ్చు. దీంతో అతిగా ఆలోచనలూ చుట్టుముడతాయి. సమస్యను గుర్తించినప్పుడు దాని కాకుండా పరిష్కారానికి ప్రయత్నిస్తే ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ఉదాహరణకు పరీక్షలు మిమ్మల్ని భయపెడితే పక్కా ప్రణాళిక వేసుకుని వాటికి సిద్ధం కావాలి. అంటే ఆలోచనలకు కార్యాచరణతో చెక్‌ పెట్టడానికి ప్రయత్నించాలి.

అనవసర సంగతులు

కొంతమంది భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. చేతిలో ఉన్న వర్తమానాన్ని వదిలేసి తెలియని భవిష్యత్తు గురించి ఇలా రకరకాలుగా ఊహించడం సరికాదు. ఎదుటివాళ్ల మనసును పూర్తిగా చదవాలనుకోవడం, అన్ని విషయాలూ తామే తెలుసుకోవాలని ఆరాటపడటం వల్ల ఎక్కువగా ఆలోచనలు వస్తుంటాయి. సంబంధంలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడమంటే తమ విలువైన సమయాన్ని వృథా చేయడమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఓ, పీఓలకు ఉమ్మడి ప్రిపరేషన్‌ ఎలా?

‣ సులభంగా... సౌకర్యంగా చదవడం ఎలా?

Posted Date : 24-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌