• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానసిక ఆరోగ్యం... మరవొద్దు!  

కాలేజీకీ, ఆ తర్వాత ట్యూషన్‌కూ వెళుతూ ఒకప్పుడు ఎంతో బిజీగా ఉండేది స్నిగ్ధ. వారాంతాల్లో స్నేహితులతో బయటకు వెళుతూ సంతోషంగా గడిపేది. ఆన్‌లైన్‌ క్లాసులతో ఇప్పుడు ఇంటికే పరిమితం కావాల్సివస్తోంది. దాంతో గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేకపోతోంది. తరచూ నీరసంగా, దిగులుగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం కొంతమంది విద్యార్థుల పరిస్థితీ ఇలాగే ఉంటోంది. స్వేచ్ఛగా ఎటూ వెళ్లలేని పరిస్థితులు వారి మానసికారోగ్యం మీదా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శారీరక అనారోగ్యానికి గురైతే ఆ ప్రభావం పైకి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే వైద్యులను కలిసి ఆరోగ్యం కోసం ఔషధాలు తీసుకుంటారు. కానీ మానసిక అనారోగ్యం పైకి కనిపించదు. దీన్ని గుర్తించకుండా అలా వదిలేస్తే తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యే ప్రమాదముంది. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవచ్చు. భవిష్యత్తు అంధకారంగా కనిపించి..ప్రతికూల ఆలోచనలూ వేధిస్తాయి. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే మానసికారోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.  

టైమ్‌టేబుల్‌: ఉదయాన్నే నిద్ర లేవడం, ఆన్‌లైన్‌ క్లాసులు, ఆ తర్వాత భోజనం అన్నీ సమయానికే జరిగేలా చూసుకోవాలి. అందుకోసం టైమ్‌టేబుల్‌ వేసుకుని దాన్ని అనుసరించాలి. ఎప్పుడైనా కాస్త ఆటంకం కలిగితే కంగారుపడిపోయి, విపరీతమైన ఒత్తిడికి గురికాకూడదు. అప్పుడప్పుడూ పొరపాట్లు జరగడం తప్పుకాదు. కానీ ఆలస్యాన్నే అలవాటుగా మార్చుకోకూడదు. బాగా అలసటగా ఉన్నప్పుడు సమయం అటూఇటూ కావచ్చు. అలాంటప్పుడు శరీరం మాట కూడా కాస్త విని విశ్రాంతి తీసుకోవాలి. దీంతో మానసికంగానూ సాంత్వన పొందుతారు. 

ఇంటిపనుల్లో సాయం: ఆన్‌లైన్‌ క్లాసులు అయిన తర్వాత ఏ కాస్త సమయం చిక్కినా ఇంటి పనుల్లో సాయం చేయొచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కలిసి పనిచేయడం వల్ల వారితో అనుబంధం మరింత బలపడుతుంది. అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల ఇంటికే పరిమితం అయ్యారనే ఆలోచనలు దరిచేరవు. స్నేహితులకు దూరంగా గడుపుతున్నారనే ఆలోచనలు ఎక్కువగా బాధించవు. కాలేజీలో స్నేహితులతో సంతోషంగా గడిపినట్లుగా కుటుంబ సభ్యులతోనూ రోజులను ఆనందంగా గడపొచ్చు. ఆప్తుల అండదండలతో మానసికానందం రెట్టింపవుతుంది. 

అభిరుచులు: ఆన్‌లైన్‌ క్లాసుల తర్వాత మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అభిరుచులను కొనసాగించాలి. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, పుస్తకపఠనం...లాంటి హాబీలుంటే వాటికి సమయాన్ని కేటాయించాలి. ఆసక్తి ఉంటే కొత్త భాషనూ నేర్చుకోవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఉదాసీనత, నిర్లిప్తత మీ దరిచేరవు. అభిరుచులను కొనసాగించడం వల్ల అంతులేని మానసికానందం సొంతమవుతుంది.

వ్యాయామాలు ఆపొద్దు: కొంతమంది విద్యార్థులు వ్యాయామాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఈరోజూ, రేపు అంటూ వాయిదాలు వేస్తుంటారు. అయితే మానసికారోగ్యానికి వ్యాయామాలు ఎంతగానో తోడ్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుంగుబాటును దూరం చేసే శక్తీ వీటికి ఉంటుంది. వ్యాయామాలు బోరనిపిస్తే ఇష్టమైన ఆటలు కొనసాగించవచ్చు. కొద్ది నిమిషాలపాటు ధ్యానం చేయగలిగినా రోజంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తోటపని చేసినా అటూఇటుగా వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది.  

భూతద్దంలో చూడొద్దు: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విసుగ్గా, కాస్త దిగులుగా అనిపించడం, త్వరగా అలసిపోవడం..లాంటివి జరగొచ్చు. వీటన్నింటినీ భూతద్దంలో చూసి భయపడకూడదు. అవసరమైతే పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలి. అంతేకానీ చిన్నపాటి అనారోగ్యాన్ని పెద్దగా ఊహించుకుని ఒత్తిడికి గురికాకూడదు. శారీరక ఇబ్బందులు, మానసిక సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!

‣ ఆసాంతం స్ఫూర్తితో అలాగే సాగాలంటే?

‣ 2022లో టాప్‌ ఉద్యోగాలు ఇవే!

‣ కార్పొరేట్‌ ఉద్యోగాలకు కొన్ని నైపుణ్యాలు

‣ మెరుగైన స్కోరుకు మేలైన వ్యూహం!

‣ నిరాశ పడొద్దు.. వెనకడుగు అసలేవద్దు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌