• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టైమ్‌ ఉందిగా.. చూద్దాంలే! 

వాయిదా అలవాటు.. బహు చేటు!  

ఇష్టం లేని పనులు మన ముందున్నపుడు వాటిని చేయకుండా తప్పించు కోవటమో, జాప్యం చేయటమో చేస్తుంటాం. ఆ రకంగా మన మూడ్‌ను సంతోషంగా ఉంచుకుంటాం! కానీ ఆ సంతోషం తాత్కాలికమే! వాయిదా వేసే అలవాటు పెరిగితే అది మన కెరియర్‌కే కాదు, ఆరోగ్యానికీ కూడా నష్టమే. కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చెపుతున్న వాస్తవమిది!  

తరగతిలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆరోజే చదివేయాలని మొదటిరోజే గట్టిగా నిర్ణయించుకుంది మానస. కానీ ‘ఈరోజు కాదు.. రేపు చూద్దాంలే..’ అనుకుంటూ వాయిదాలు వేస్తూనే ఉంది. చివరికి పరీక్షలు దగ్గర పడటంతో కష్టపడినప్పటికీ పరీక్షల్లో  అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. 

అభిజిత్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఉద్యోగ ప్రకటన రాగానే వెంటనే దరఖాస్తు చేయాలనుకుంటాడు. తర్వాత ‘చివరి తేదీ చాలా రోజులుందిగా.. తర్వాత చేద్దాంలే’ అనుకుంటాడు. ఆఖరి రోజున దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తే.. సైట్‌ మొరాయించడంతో చక్కని అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా ఫలితం లేకుండా పోయింది. 

ఇలాంటి జాగు మనస్తత్వం వల్ల మానస, అభిజిత్‌ల మాదిరిగానే ఎంతోమంది విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ఈ పద్ధతికి అలవాటుపడి దాన్నుంచి బయటపడలేక సతమతం అవుతుంటారు. 

ఇలా వాయిదాలు వేయడానికి కారణం బద్ధకమో.. సమయపాలన లేకపోవడమో అనుకుంటాం కదా... కానీ అసలు కారణం.. మూడ్‌ సరిగా లేకపోవడమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఆసక్తి లేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. దాంతో ఆ పని చేయడానికి ఇష్టంలేక వాయిదా వేస్తూ ఉంటారు. ఉదాహరణకు పరీక్షలకు చదవడం, స్టేజి మీద ప్రసంగించాల్సి రావడం.. లాంటివి చేయాల్సినపుడు ప్రతికూల ఆలోచనలు వచ్చి ఆ పని వెంటనే చేయాలని అనిపించదు. దాంతో ఆ ఇష్టంలేని పని చేయడాన్ని వాయిదాలు వేస్తూ వెళుతుంటారు.  

ఆత్మవిశ్వాస లోపం 

కొందరు చాలా అరుదుగా పనులను వాయిదా వేస్తుంటారు. మరికొందరేమో దీనికి భిన్నంగా వాయిదాలు వేసే పనిలోనే ఉంటారు. సాధారణంగా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువగా వాయిదాలు వేస్తుంటారు. ఎందుకంటే.. వీరికి తమ మీద తమకు విశ్వాసం తక్కువ. కాబట్టి ఆ పనిని సక్రమంగా చేయలేమని అనుకుంటారు. తాము చేసే పనులను చూసి ఇతరులు విమర్శిస్తారనే భయం వీరికి ఎక్కువగా ఉంటుంది. దాంతో దాన్ని మొదలుపెట్టడానికే సంశయిస్తుంటారు. దాంతో ఈరోజు, రేపు అనుకుంటూ వాయిదాలు వేస్తూనే ఉంటారు. అంటే.. ఆత్మవిశ్వాసం లోపించడమనేది కూడా పనుల వాయిదాకు కారణమవుతుంది.

ఇతర అంశాలపైనా ప్రభావం 

చదవాల్సిన పాఠాలను వాయిదా వేస్తూ వెళితే విద్యార్థులు చదువులో వెనకబడతారని మాత్రమే అనుకుంటాం. కానీ ఇతర అంశాల్లోనూ ప్రతికూల ప్రభావం ఉంటుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. మూడువేల మంది జర్మనీ విద్యార్థుల మీద ఆరు నెలలపాటు పరిశోధన చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దుష్ప్రవర్తన, మోసగించడం, ఇతరుల ఆలోచనలను కాపీ చేయడం, గడువు తేదీ పొడిగింపు కోసం అబద్ధాలు చెప్పడం... లాంటి చెడు లక్షణాలు వీళ్లలో బయటపడ్డాయి. వాయిదా వేయడం అనేది.. ఆరోగ్యం పైనా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఆందోళన, కుంగుబాటు లాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. తలనొప్పి, జ్వరం, అజీర్ణం, ఒత్తిడి, సరిగా నిద్రపట్టకపోవడం లాంటి ఇబ్బందులూ కలుగుతున్నాయి. 

ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకోవాలి

పనులు జాప్యం చేసే అలవాటుకు వీడ్కోలు పలకడం వల్ల ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరక్కపోవచ్చు. కానీ శరీరక, మానసికారోగ్యం మెరుగై నిర్దేశిత లక్ష్యాలను సాధించగలుగుతారు. దానికోసం ఇలా ప్రయత్నించొచ్చు...

వాయిదా పద్ధతిని మీరే కనిపెట్టలేదు. అలాగే ఇది మీతోనే ఆగిపోదు కూడా. కానీ మీరు కూడా ఎక్కువమంది వెళ్లే దారిలోనే ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాయిదాల వలయం నుంచి బయటపడటానికి శాయశక్తులా ప్రయత్నించాలి. 

చేయాల్సిన పనిని తక్కువగా అంచనా వేయకూడదు. దాని ప్రాధాన్యాన్ని పదేపదే గుర్తుచేసుకోవాలి. ఆ పనిని సకాలంలో పూర్తిచేయడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలూ కలగొచ్చు. ఇలా ఆ పని చేయడం వల్ల కలిగే సానుకూల ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే దాన్ని వెంటనే పూర్తిచేయడానికి ఉత్సాహం కలుగుతుంది. 

ఏ అసైన్‌మెంట్లను ఎప్పటిలోగా పూర్తిచేయాలనే దాన్ని పేపర్‌ మీద స్పష్టంగా రాసుకోవాలి. చదువుకునే చోట కనిపించేలా దాన్ని అతికించుకోవాలి. క్యాలెండర్‌లో ఆయా తేదీలకు ఎదురుగానూ పూర్తిచేయాల్సిన అసైన్‌మెంట్ల వివరాలను రాసుకోవచ్చు. లేదా స్మార్ట్‌ఫోన్‌లో క్యాలెండర్‌ యాప్‌నూ ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల లక్ష్యం నుంచి పక్కకు వెళ్లకుండా ఉండొచ్చు.

కొంతమంది విద్యార్థులు ఒకేసారి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటిని సాధించలేమనే భయంతో వాయిదా వేస్తూ వెళుతుంటారు. అలాకాకుండా చిన్న లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని వెంటనే సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ఈ రోజు ఫలానా సబ్జెక్టు మొత్తం చదవాలనుకోకుండా.. ఆ సబ్జెక్టులోని ఫలానా చాప్టర్లను చదవాలని నిర్ణయించుకోవాలి. ఈ చిన్న లక్ష్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా పూర్తిచేయాలి. 

ప్రణాళిక ఉన్నంతమాత్రాన చాలదు

‘ఎప్పుడైనా కాస్త ఖాళీ సమయం దొరికితే నోట్సు రాయడం పూర్తిచేయాలి’ లాంటి లక్ష్యాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీ సమయం అనేది ఎప్పటికీ రాకపోవచ్చు. కాబట్టి ఏ రోజు చేయాల్సిన పనిని ఆరోజే కచ్చితంగా పూర్తిచేయాలి. అందుకోసం టైమ్‌టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా పాటించాలి. అప్పుడు వాయిదాలకు అవకాశమే ఉండదు. కొంతమంది చక్కగా ప్రణాళిక వేసుకుంటారుగానీ దాన్ని అమలు చేయడానికి బద్ధకిస్తుంటారు. దీనివల్ల కష్టపడి ప్రణాళిక వేసుకున్నా ప్రయోజనం ఉండదు. 

చదువుకు అంతరాయం కలిగించే అంశాలను ముందుగానే గుర్తించి.. వాటి మీదకు మీ దృష్టి మళ్లకుండా జాగ్రత్తపడాలి. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌.. లాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. చదివేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్‌ చేయకపోతే చదవాల్సిన వాటిని వాయిదా వేసి.. దాన్ని చూస్తూనే ఎక్కువ సమయం గడిపేస్తారు. 

నిరాటంకంగా గంటసేపు చదివిన తర్వాత కనీసం పావుగంటైనా విరామం ఇవ్వాలి. దీంతో విసుగు రాకుండా ఉంటుంది. ఏమాత్రం చిరాగ్గా అనిపించినా చదవాల్సినదాన్ని రేపటికి వాయిదా వేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడు మధ్యలో విరామం ఇవ్వడం అవసరం. ఆ సమయంలో కూర్చునే ఉండకుండా అటూఇటూ నడవడం, నచ్చిన పాటలు వినడం... లాంటివి చేయాలి. ఇలా చేస్తే ఆ తర్వాత మరింత ఉత్సాహంగానూ చదవగలుగుతారు. 

పరీక్షలు దగ్గరపడే సమయంలో...

కాస్త క్లిష్టంగా ఉండి.. ఎంత చదివినా అర్థంకాని అంశాలను వెంటనే చదవడానికి చాలామంది విద్యార్థులు ఇష్టపడరు. ఏదో ఒక కారణంతో వాటిని ‘ఈరోజు కాదు రేపు’ అనుకుంటూ.. వారాలు, నెలలపాటు వాయిదా వేస్తూనే ఉంటారు. పరీక్షలు దగ్గరపడే సమయంలో చదవడానికి కూర్చుంటే అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఒకపక్క పరీక్షలు దగ్గరపడుతున్నాయనే ఆందోళన, మరో పక్క కొరుకుడు పడని అంశాలతో కుస్తీపడాల్సి వస్తుంది.  

కొన్నిసార్లు ముఖ్యమైన అసైన్‌మెంట్లను పూర్తిచేయాలనే విషయాన్ని మర్చిపోయే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి వాటి గురించి తోటి స్నేహితులతో అప్పుడప్పుడూ మాట్లాడుతుండాలి. ఇలా చేయడం వల్ల వాయిదా వేయకుండా అందరూ కలిసికట్టుగా అసైన్‌మెంట్లను పూర్తిచేయగలుగుతారు. మీరు అనుకున్న పద్ధతిలో కాకుండా సులువైన మార్గాల్లో చేసే ఉపాయాలు వారికి తట్టే అవకాశమూ లేకపోలేదు. అనుకున్న సమయాని కంటే కాస్త ముందుగానే పూర్తిచేస్తే స్నేహితులతో కలిసి సంతోషాన్నీ పంచుకోవచ్చు.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రేమ్‌జీ సంస్థల్లో యూజీ, పీజీ

‣ కంటెంట్‌ ఉంటే... క్రియేటర్లు మీరే!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Posted Date : 16-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌