• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చదివేయండి..పాకశాస్త్రం!

కలినరీ కోర్సులు-బీబీఏ, ఎంబీఏ నోటిఫికేషన్

ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు.. పోషకాలు, వంటలో అనుసరించాల్సిన ప్రమాణాలు, వంట సామగ్రి సేకరణ, వండిన పదార్థాలను చక్కగా అలంకరించడం...మొదలైనవి శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వాటిలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ముఖ్యమైంది. ఈ సంస్థ నోయిడా, తిరుపతి క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులు అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!  

ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమర్‌కంఠక్‌తో కలసి, ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్లు బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలు ఉంటాయి. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. హోటళ్లు, ఆతిథ్య, విమానయాన, పర్యాటక సంస్థలు, ఆసుపత్రులు, కార్పొరేట్‌ కంపెనీలు, క్యాటరింగ్, షిప్పింగ్‌ సంస్థలు, రైల్వే, మిలటరీ...మొదలైనవాటిలో సేవలందించవచ్చు. సెలబ్రిటీల వద్ద కూడా పనిచేయడానికి అవకాశం ఉంది. సొంతంగానూ ఫుడ్‌ చెయిన్‌ నిర్వహించవచ్చు. న్యూట్రిషన్‌ నిపుణులుగానూ అవతారమెత్తవచ్చు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ తరహా కోర్సులు పూర్తిచేసుకుని కెరియర్‌ రుచికరంగా మలచుకోవచ్చు.

బీబీఏ కలినరీ ఆర్ట్స్‌

సీట్లు: నోయిడా, తిరుపతి ఒక్కో క్యాంపస్‌లో 120 చొప్పున ఉన్నాయి. 

విద్యార్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా సమాన స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

పరీక్ష ఇలా: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ వీటిలో ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.

ఎంబీఏ కలినరీ ఆర్ట్స్‌

సీట్లు: ఒక్కో సంస్థలో 30 చొప్పున ఉన్నాయి.

అర్హత: బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా కలినరీ ఆర్ట్స్‌ లేదా హాస్పిటాలిటీ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతాయి. 

పరీక్ష ఇలా: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫుడ్‌ ప్రొడక్షన్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30.పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.icitirupati.in/home
 

Posted Date : 23-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌