• facebook
  • twitter
  • whatsapp
  • telegram

robotics: కొత్తతరం కెరియర్లు మెకట్రానిక్స్‌.. రోబోటిక్స్‌ 

ఈ ఉద్యోగాలకు భవిష్యత్తులో భారీ డిమాండ్

నిపుణుల సూచనలు పాటిస్తే మేలు

సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ అవసరాన్ని తీర్చే సామర్థ్యమున్నవే మెకట్రానిక్స్, రోబోటిక్స్‌. అందుకే ఇవి ఎవరూ ఊహించని స్థాయిలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. వీటి సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలకు జీవం పోయటమే కాకుండా వాటి నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడానికీ ఉపయోగపడుతోంది. ఈ ఉద్యోగాలకు భవిష్యత్తులో బాగా డిమాండ్‌ పెరగబోతోందని లింక్డ్‌ఇన్‌ నివేదిక వెల్లడిస్తోంది! 

ఆటోమేషన్‌ అభివృద్ధికి అవసరమైన పునాది వేస్తుంది మెకట్రానిక్స్‌. ఇది మెకానికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటింగ్‌ విభాగాల సమ్మేళనం. ప్రస్తుతం తయారీ రంగంలో ఆటోమేషన్‌ యంత్రాల వాడకం పెరుగుతోంది. దీంతో ఉపాధినిచ్చే కెరియర్‌గా మెకట్రానిక్స్‌ ప్రాధాన్యం విస్తరిస్తోంది. సంక్షిప్తంగా చెప్పాలంటే... మెకట్రానిక్స్‌ ఇంజినీర్లు పారిశ్రామిక కార్యకలాపాలు ఆటోమేట్‌ అయ్యేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజినీరింగ్‌ వ్యవస్థల డిజైన్, అభివృద్ధి, సమర్థ నిర్వహణ లాంటి విధులను నిర్వర్తిస్తుంటారు. యువతలో ప్రతిభ- నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించటానికి మెకట్రానిక్స్‌- రోబోటిక్స్‌ లాంటి నైపుణ్యాలు తోడ్పడతాయి. అందుకే పరిశ్రమలు వీటికి ఇప్పుడెంతో ప్రాధాన్యమిస్తున్నాయి.

ఆటోమేషన్‌-సంబంధ అవకాశాలకు మార్గం సుగమం

రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ ప్రధానంగా రోబోట్ల రూపకల్పన, ఉత్పత్తి, అనువర్తనం, ఆపరేషన్‌లతో వ్యవహరిస్తుంది.ఇది ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లతో అనుసంధానమై ఉంటుంది. మెకానిజమ్స్, కైనమాటిక్స్, డైనమిక్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌.. మొదలైన అంశాల మీద రోబోటిక్‌ కోర్సులు అవగాహన కల్పిస్తాయి. ఈ కోర్సుల్లో ఎల్రక్టో-మెకానిక్స్, రోబోటిక్స్‌ సెన్సార్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, రోబోటిక్స్‌ ఫాబ్రికేషన్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, రోబోటిక్స్‌ విజన్‌ అంశాలుంటాయి. 

అంతరిక్ష అన్వేషణ, పవర్‌ ప్లాంట్‌ల నిర్వహణ, ఆటోమొబైల్‌ పరిశ్రమ మొదలైనవాటిలో ఎక్కువగా వృద్ధి చెందుతున్నందున కెరియర్‌గా రోబోటిక్స్‌కు ప్రాధాన్యం, ఆదరణ పెరిగాయి. ఈ రంగంలో ముందుకు వెళుతున్నప్పుడు మైక్రో రోబోటిక్స్, ఆటోమేషన్, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్లు, మెడికల్‌ రోబోటిక్స్, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌తో పాటు రోబోట్‌ మానిప్యులేటర్లు, రోబోట్‌ మోషన్‌ ప్లానింగ్, కంప్యూటర్‌-ఎయిడెడ్‌ తయారీ మార్కెట్లను కెరియర్‌ అవకాశాలుగా మలచుకోవచ్చు. రోబోటిక్స్‌ పరిజ్ఞానం ఉన్న నిపుణులు ఆటోమేషన్‌ సిస్టమ్‌ ఇంజినీర్లు, రోబోటిక్స్‌ ప్రోగ్రామర్లు, రోబోటిక్స్‌ టెక్నీషియన్లు, ఆటోమేటెడ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజినీర్లు, రోబోటిక్స్‌ టెస్టర్లు, రోబోటిక్స్‌ సిస్టమ్‌ ఇంజినీర్లు మొదలైన ఉద్యోగ ప్రొఫైల్స్‌లో పని చేసే వీలుంటుంది.

రెంటికీ దగ్గర సంబంధం

మెకట్రానిక్స్, రోబోటిక్స్‌లకు విడదీయరాని సంబంధం ఉంది. వీటి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. 

మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ల సమ్మేళనమే మెకట్రానిక్స్‌. సుదీర్ఘ కాలం నిర్విరామంగా, సమర్థంగా పనిచేసే యంత్రాలను రూపొందించడం, డిజైన్‌ చేయడం, వాటి నిర్వహణ.. ఇవన్నీ మెకట్రానిక్స్‌ కిందికే వస్తాయి. ఇది మెకానిజమ్స్, ఎలక్ట్రానిక్స్‌ల కలబోత. సిద్ధాంతపరంగా నేర్చుకున్న విషయాలకు వాస్తవ రూపాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మెకట్రానిక్‌ కంట్రోల్‌ సిస్టమ్స్, ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్స్‌తో పాటు ఉత్పత్తి ప్రక్రియలు, గణాంకాలు, పారిశ్రామిక నియంత్రణ సూత్రాలు, ప్రాక్టికల్‌ ఫిజిక్స్, మెషీన్‌ డిజైన్‌ ఎలిమెంట్స్, కైనమాటిక్స్‌లలో వైవిధ్యభరితమైన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. 

మెకట్రానిక్స్‌ నిపుణులు.. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రాథమికాంశాల్లాంటి భిన్న ప్రపంచాలను ఒకే వేదిక మీదకు తీసుకొస్తారు. సంబంధిత కోర్సులు చేస్తే.. అగ్రికల్చర్, ఆటోమోటివ్, టెలి కమ్యూనికేషన్స్, రోబోటిక్స్, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ కెరియర్‌ అవకాశాలు లభిస్తాయి. ఈ నిపుణులు సాధారణంగా వివిధ పారిశ్రామిక రోబోలతో పనిచేస్తారు. ఉదాహరణకు పిక్‌ అండ్‌ ప్లేస్‌ ఆపరేషన్స్, ఆహార- పానీయాల మార్కెట్లో వినియోగదారుల ఉత్పత్తుల బాట్లింగ్‌ లేదా ప్యాకేజింగ్‌.  

మెకానిక్స్, రోబోటిక్స్, ఉత్పత్తి పరికరాలు, సృజనాత్మక సమస్యా పరిష్కారం, చురుకైన సాంకేతిక ఇంజినీరింగ్‌ విధులంటే ఆసక్తి ఉన్న విద్యార్థులకూ, నిపుణులకూ ఇది చక్కని కెరియర్‌ మార్గం. మెకట్రానిక్స్‌ నిపుణులుగా మారితే ఉత్పత్తి, మైనింగ్, రోబోటిక్స్, విమానయాన, రవాణా, రక్షణ  విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్లలోనూ ఉపాధి పొందవచ్చు. అంతేకాదు- సైబర్‌ సెక్యూరిటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ రంగాల్లోనూ మెకట్రానిక్స్‌ నిపుణులను నియమించుకుంటున్నారు.

గణనీయంగా వృద్ధి

ప్రస్తుత కాలపు డిజిటల్‌-ఎనేబుల్డ్‌ ప్రపంచంలో మెకట్రానిక్స్, రోబోటిక్స్‌ రెండూ చాలా ప్రధానమైనవి. ఈ సాంకేతికతలతో కూడిన వివిధ ఉత్పత్తులూ, సేవలను వినియోగదారులు విరివిగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్‌ విప్లవం వేగవంతమవుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే- ఈ హై-ఎండ్‌ టెక్‌ సొల్యూషన్లూ, ఉద్యోగాలూ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని పొందుతున్నాయని గ్రహించవచ్చు.

విద్యార్థులు ఈ కోర్సులను ఎంచుకోవడానికి ఒక్క ప్రధాన కారణం చెప్పాలంటే.. వారు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు; ఉన్నతంగా ఎదగటానికి వారికి వివిధ మార్గాలు స్వాగతిస్తాయి. పరిశోధన- అభివృద్ధిలోనో, నిర్దిష్ట సాంకేతిక విభాగాల్లోనో, అగ్రశ్రేణి పరిశ్రమల్లోనో, దిగ్గజ టెక్‌ పరిశ్రమల్లోనో వారు కెరియర్‌లను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రతిభ- నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం ద్వారా ఈ అత్యాధునిక రంగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. అందువల్ల ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో కోర్సులు ఎంచుకుంటే సురక్షితమైన- ఉజ్వలమైన భవిష్యత్తుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్కెట్లో ఇతరుల కంటే ముందుండగలుగుతారు! 

ఎదిగే మార్గాలు

ఈ కోర్సులను ఎంచుకుని పరిజ్ఞానం సంపాదిస్తే ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయి. ఉన్నతంగా ఎదిగే వివిధ మార్గాలు స్వాగతిస్తాయి. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించుకుంటే ఉద్యోగ మార్కెట్లో ఇతరుల కంటే ముందు ఉండొచ్చు. మేటి  భవి

మెకట్రానిక్స్, రోబోటిక్స్‌ రంగాలకు విస్తారమైన జ్ఞానం, అభ్యాసం అవసరం. వీటి అధ్యయనం విద్యార్థులను సృజనాత్మకంగా, టెకీ ఫ్యాషన్‌గా రూపొందిస్తాయి. అధునాతన తయారీ, అటానమస్‌ రోబోటిక్‌ ఇంటలిజెంట్‌ సిస్టమ్స్, డిజైన్‌ ఇంజినీరింగ్‌ నుంచి ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ వరకూ హై-ఎండ్‌ కోర్సులను ఈ రంగాలు అందిస్తాయి. పని నాణ్యతలోనూ, వేతనం విషయంలోనూ ఈ రంగాల్లోని ఉద్యోగాలు పూర్తిస్థాయి సంతృప్తినిస్తాయి. 

దేశీయంగా, ప్రపంచ స్థాయిలో ఇవి ప్రసిద్ధ కెరియర్‌ అవకాశాలుగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులు విస్తృతమైన జ్ఞానం, ఆచరణాత్మక అభ్యాసం, సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షణ, పారిశ్రామిక అనుభవం ఇస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి అవకాశమిస్తాయి. ఈ రకంగా  నాయకత్వ లక్షణాలు, సమస్యా పరిష్కార నైపుణ్యం, త్వరగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు, తార్కిక ఆలోచనా సామర్ధ్యాలతో వృత్తినిపుణులు తయారవుతారు.ష్యత్తు సాధ్యమవుతుంది!  

Posted Date : 21-07-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌