• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్ నైపుణ్యాలకు ఆమోదముద్ర
 

సీఐఐ-ఐప్యాట్ నోటిఫికేషన్ విడుదల

గ్రాడ్యుయేట్లకు దరఖాస్తు గడువు మార్చి 31

డిప్లొమా అభ్యర్థులకు మే 1 నుంచి 20 వరకు అవకాశం

ఉద్యోగ అన్వేషణలో తోడ్పాటు

ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లను అత్యధికంగా అందిస్తున్న ‌దేశాల్లో భారతదేశం ఒకటి. ఏటా దేశ‌వ్యాప్తంగా కొన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. అనంత‌రం వీరి నైపుణ్యాల‌ను లోతుగా అంచ‌నా వేయ‌డానికి స‌రైన బెంచ్ మార్క్ అందుబాటులో లేదు. దీంతో చాలా మంది ఉద్యోగ అన్వేష‌ణ‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌రికొందరు స‌రైన నైపుణ్యాలు లేక‌ ఏళ్ల త‌ర‌బ‌డి నిరుద్యోగులుగానే ఉండిపోవాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో వీట‌న్నింటికి ప‌రిష్కారం తెలిపే దిశ‌గా కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (సీఐఐ) ఇండ‌స్ట్రీయ‌ల్ ప్రొఫీషియ‌న్సీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫ‌ర్ ఇంజినీర్స్(ఐప్యాట్‌)‌ను రూపొందించింది. సీఐఐ ప్రభుత్వేతర, లాభాపేక్షలేని, పరిశ్రమల నేతృత్వ, పరిశ్రమ-నిర్వహణ సంస్థ. ఇది ఏఐసీటీఈతోపాటు ఇత‌ర విద్యాసంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తోంది. 

ఐప్యాట్ ముఖ్య ఉద్దేశం

పాన్ ఇండియా ప్రాతిపదికన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల పారిశ్రామిక ఆప్టిట్యూడ్ & నైపుణ్యాన్ని అంచనా వేయడంతోపాటు సాంకేతిక ప్రతిభను గుర్తించేందుకు సీఐఐ ఐప్యాట్ నిర్వహిస్తోంది. ఇది తప్పనిసరి పరీక్ష కాదు. దీనికి అర్హత సాధిస్తే కంపెనీలు అభ్యర్థికి మెరుగైన నైపుణ్యాలు ఉన్నాయని గుర్తించి తొలి ప్రాధాన్యం ఇస్తాయి. దీంతో మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సీఐఐ అంతర్జాతీయంగా సూచన కేంద్రంగా పనిచేస్తోంది. దేశీయంగానే కాకుండా, యూకే, యూఎస్ఏతో పాటు 133 దేశాల్లోనూ ఐప్యాట్ పరీక్ష మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. సాంకేతిక ప్రతిభను పరీక్షించుకోవడానికి భారతీయ పరిశ్రమల తరపున సీఐఐ ఐప్యాట్ నిర్వహిస్తోంది. ఇది నేరుగా నియామకాలు చేపట్టదు. గ్రేడ్లు, స్కోర్లు, ర్యాంకులఆధారంగా విజయవంతమైన అభ్యర్థుల లైవ్ డేటాబేస్‌ను భారతీయ పరిశ్రమలకు అందజేస్తుంది. కంపెనీలు ప్రతిభావంతులైన అభ్యర్థులను తమ ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.

అర్హత, చెల్లుబాటు

ఈ పరీక్ష ఒకసారి రాస్తే మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. వయసు పరిమితి లేదు. గ్రాడ్యుయేట్లయితే చాలు. బీఈ/ బీటెక్, డిప్లొమా ఇంజినీరింగ్, బీఆర్క్(అయిదేళ్ల కోర్సు)/ నావల్ ఆర్కిటెక్చర్ (నాలుగేళ్ల కోర్సు)/ ప్లానింగ్ (నాలుగేళ్ల కోర్సు), పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విభాగాల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నిసార్లయినా దరఖాస్తు చేసుకుని పరీక్షరాసుకోవచ్చు. ఐప్యాట్ కు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండవని గుర్తుంచుకోవాలి. సీఐఐ నిర్ణయించినట్లు 30% కనీస అర్హత మార్కులు సాధించాలి. అభ్యర్థులను ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించాలంటే కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది.

పరీక్ష సమాచారం

ఐప్యాట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది 100 మార్కులకు ఉంటుంది. మూడు విభాగాల్లో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. 3 గంటల సమయంలో రాయాలి. ఒక ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/2 మార్కులు కోత విధిస్తారు. విభాగం-1లో అభిజ్ఞా సామర్థ్యాలు పరీక్షిస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అనలైటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నుంచి 20 ప్రశ్నలడుగుతారు. విభాగం-2లో వృత్తిపరమైన నైపుణ్యాలకు సంబంధించి ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఆరోగ్యం, భద్రత, ప్రమాద నిర్వహణ, పర్యావరణ చట్టాలు, సామాజిక బాధ్యత & విలువలు, ఫైనాన్స్ & అకౌంట్స్, చట్టపరమైన ఒప్పందాలు, మధ్యవర్తిత్వంపై 20 ప్రశ్నలు వస్తాయి. విభాగం-3లో రెండు సెక్షన్లు ఉంటాయి. సాంకేతిక సామర్థ్యాలపై ప్రశ్నలడుగుతారు. విభాగం 3(ఎ)లో 10 ఇంటర్మీడియట్ స్థాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ (టెక్నికల్ ఎబిలిటీస్) ప్రశ్నలుంటాయి. విభాగం 3(బి)లో ఇంజినీరింగ్ విభాగంలో సబ్జెక్టుల వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు

ఐప్యాట్‌ను కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), కాల్నెస్టర్ నాలెడ్జ్ సొల్యూషన్స్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. పరిపాలనా ప్రయోజనాల కోసం ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, నార్త్ ఈస్ట్ ప్రాంతీయ కేంద్రాలుగా విభజించారు. తెలుగు రాష్ట్రాలు సౌత్ రీజియన్ కిందకి వస్తాయి. పరీక్షా కేంద్రాలను దేశంలోని ప్రధాన నగరాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏపీలో గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్లో ఉన్నాయి. 

దరఖాస్తు విధానం

ఐప్యాట్ పరీక్షకు గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ) జూన్ ఒకటి లేదా రెండో వారంలో ఉంటుంది. జులైలో ధ్రువపత్రం ఇస్తారు. ఆగస్టు నుంచి ఉద్యోగాన్వేషణకు అర్హత సాధిస్తారు. డిప్లొమా ఇంజినీర్లు మే 1 నుంచి 20 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. సీబీటీ ఆగస్టు ఒకటి లేదా రెండో వారంలో ఉంటుంది. సెప్టెంబర్లో ధ్రువపత్రం అందజేస్తారు. అక్టోబర్ నుంచి ఉద్యోగాన్వేషణ ప్రారంభించుకోవచ్చు. అభ్యర్థులందరూ పరీక్ష రుసుముగా రూ.1500 చెల్లించాలి.

పరీక్షకు అర్హత గల విభాగాలు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్

మెకానికల్ ఇంజినీరింగ్

సివిల్ ఇంజినీరింగ్

కంప్యూటర్ ఇంజినీరింగ్

అగ్రికల్చర్ ఇంజినీరింగ్

కెమికల్ ఇంజినీరింగ్

ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్

బయోటెక్నాలజీ

బయోమెడికల్ ఇంజినీరింగ్

ఫుడ్ టెక్నాలజీ

మెటలర్జీ ఇంజినీరింగ్

మైనింగ్ ఇంజినీరింగ్

ప్రొడక్షన్ ఇంజినీరింగ్

పెట్రోలియం ఇంజినీరింగ్

టెక్ట్స్‌టైల్‌ ఇంజినీరింగ్

ఏరోస్పేస్ ఇంజినీరింగ్

ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ ఇంజినీరింగ్

సిల‌బ‌స్‌

కాగ్నిటివ్ ఎబిలిటీ

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సమ్మేళనాలు లేదా మిశ్రమాలు, కొలతలు & వైశాల్యాలు, సగటు, పడవలు & ప్రవాహాలు, క్యాలెండర్, గొలుసు నియమం, సమన్వయ జ్యామితి, బారువడ్డీ, చక్రవడ్డీ, క్రిప్ట్ అరిథమెటిక్ సమస్యలు, ఎత్తు & దూరం, క.సా.గు & గ.సా.భా, సంఖ్యా వ్యవస్థ, భాగస్వామ్యం, శాతం, పైపులు & తొట్టెలు, వయసు ఆధారిత, రైళ్లసమస్యలు, లాభనష్టాలు, శ్రేణులు, నిష్పత్తి & అనుపాతం, సరళీకరణ, వర్గ, ఘన మూలాలు, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, కాలం & పని,వేగం & దూరం, ఘనపరిమాణం, ఉపరితల వైశాల్యం.

అనలైటికల్ రీజనింగ్: సారూప్యతలు, వాదనలు, రక్తసంబంధాలు, క్యాలెండర్లు, కారణాలు & ప్రభావం, కోర్సు ఆఫ్ యాక్షన్, వర్గీకరణ, గడియారాలు, ఘనాలు, డేటా సఫిషియెన్సీ, లెటర్ సింబల్, లెటర్ సిరీస్, లాజిక్స్, లాజికల్ డిడక్షన్, లాజికల్ కనెక్టివ్స్, లాజికల్ గేమ్, లాజికల్ సీక్వెన్స్ అండ్ మ్యాచింగ్, నంబర్ సిరీస్, సిలోజిజం, నిజ ధ్రువీకరణ, సీటింగ్ అరెంజ్మెంట్, కృత్రిమ భాష, బైనరీ లాజిక్.

డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌: మిస్సింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పై చార్ట్, బార్గ్రాఫ్, కేస్లెట్ ఫారం,రాడార్ / వెబ్, కంబైన్డ్ డేటా సెట్, గ్రాఫ్, లైన్ చార్ట్, టేబులర్ ఫారం.

ఇంగ్లిష్ కమ్యూనికేషన్: ఛేంజ్ ఆఫ్ వాయిస్, కంప్రహెన్షన్, వ్యాకరణం, ఇడియమ్స్ & పదబంధాల మార్పు, పేరా నిర్మాణం, వాక్య నిర్మాణం, వాక్య క్రమం, స్పాటింగ్ ఎర్రర్స్, పర్యాయ, వ్యతిరేక పదాలు, పదజాలం, పదాల క్రమం.

ప్రొఫెషనల్ ఎబిలిటీ

ప్రాజెక్టు మేనేజ్మెంట్: కాన్సెప్ట్:  ప్రాజెక్టు ప్రణాళిక, స్కోప్, వర్క్ స్టేట్మెంట్, వర్క్ డెఫినిషన్, ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్.

ఉపకరణాలు: డబ్ల్యూబీఎస్ (వర్క్ బ్రేక్డౌన్స్ట్రక్చర్), గాంట్ చార్ట్స్, యాక్టివిటీ చార్ట్స్, నెట్వర్క్ రేఖాచిత్రాలు, పీఈఆర్టీ & సీపీఎం, క్రాషింగ్ & రిసోర్స్ ప్లానింగ్.
ప్లానింగ్, షెడ్యూల్ పటాలు, గ్రాఫ్లు: మైల్స్టోన్, రన్ చార్ట్, కంట్రోల్ చార్ట్, ఫిష్బోన్ రేఖాచిత్రం.

ఆరోగ్యం, భద్రత, రిస్క్ మేనేజ్మెంట్: వృత్తి ఆరోగ్య విపత్తులు, ప్రమాదాల భావనలు, విపత్తుల గుర్తింపు, ప్రమాద అంచనా సూత్రాలు, పద్ధతులు, హ్యూమన్ బిహేవియరల్ కోణాలు, ఫ్యాక్టరీ చట్టం 1948 ప్రకారం భద్రతా నిబంధనలు.

పర్యావరణ చట్టాలు: పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ముఖ్య విధులు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కీలక విధులు, పర్యావరణ నిర్వహణ వ్యవస్థ (ఐఎస్ఓ: 14001-1996) సాధారణ అవసరాలు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, క్యోటో ప్రోటోకాల్.

సామాన్య బాధ్యతలు & విలువలు: ప్రొఫెషనల్ బిహేవియర్, జవాబుదారీతనం, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ ప్రొఫెషనల్ ఇంజినీర్స్కు చెందిన ఏఎస్ఎంఈ, ఐఈఈఈ, ఐఈ మొదలైనవి.
సమాన అవకాశాలు, లింగ సమస్యలు, ఇంజినీర్ల వృత్తిపరమైన బాధ్యత; సెక్స్, లింగం; కుటుంబం;

మహిళలు & పని: అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం; లైంగిక వేధింపుల భావనలు; వ్యక్తిగత చట్టాలు - ఒక అవలోకనం (ఆస్తి హక్కులు / కుటుంబ చట్టాలు); సైన్స్ అండ్ టెక్నాలజీ సామాజిక విధులు.

ఫైనాన్స్ & అకౌంట్స్: వ్యయ విశ్లేషణ; ప్రాసెస్ / ప్రొడక్ట్ మార్జినల్ కాస్ట్ - బ్రేక్-ఈవెన్ కాస్టింగ్, వేరియెన్స్ అనాలిసిస్, మేక్ ఆర్బై డిసిషన్.

ఆర్థిక క్రమశిక్షణ: వేర్వేరు బడ్జెట్ల తయారీ, సెక్షనల్ ఖాతాల నిర్వహణ, నగదు ప్రవాహ నియంత్రణ & విశ్లేషణ, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, వ్యయాల విశ్లేషణ, బ్యాలెన్స్ షీట్ - బేసిక్స్, పెట్టుబడులపై రాబడి.

చట్టపరమైన ఒప్పందాలు & మధ్యవర్తిత్వం: ఒప్పందాలు: వివిధ రకాల ఒప్పందాలు - ప్రభుత్వం, ఎఫ్ఐడీఐసీ, ఐసీఈ; కాంట్రాక్ట్ లీగల్ బేసిస్ - ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ & లా ఆఫ్ టోర్ట్స్; యజమాన్యం, ఇంజినీర్, కాంట్రాక్టర్ / సరఫరాదారు విధులు, బాధ్యతలు; వివాద, సాధారణ ప్రాంతాలు; ఒప్పంద రకాలు.

వివాదాలు, మధ్యవర్తిత్వం: కాంట్రాక్ట్ నిబంధనలు - మొదటి దశగా పరస్పర చర్చలు, స్నేహపూర్వక పరిష్కారం; వివాద పరిష్కార నిపుణుడు / బోర్డు; మధ్యవర్తిత్వం - మధ్యవర్తిత్వ స్థానం, సింగిల్ ఆర్బిట్రేటర్.

టెక్నికల్ ఎబిలిటీస్ (ఎ)

ఫిజిక్స్: కొలతలు, ప్రమాణాలు; కైనమాటిక్స్; చలన నియమాలు; పని, శక్తి, సామర్థ్యం; కణాల వ్యవస్థ; గురుత్వాకర్షణ; బల్క్ మ్యాటర్ల లక్షణాలు; థర్మోడైనమిక్స్; వాయువుల గతి సిద్ధాంతం.

ఎలెక్ట్రోస్టాటిక్స్; విద్యుత్తు;  విద్యుత్తు & అయస్కాంతాలఅయస్కాంతత్వ ప్రభావం; విద్యుదయస్కాంత ప్రేరణ & ప్రత్యామ్నాయ ప్రవాహం; విద్యుదయస్కాంత తరంగాలు; ఆప్టిక్స్; పదార్థ ద్వంద్వ స్వభావం; అణువులు & కేంద్రకాలు; ఎలక్ట్రానిక్ పరికరాలు; కమ్యూనికేషన్ సిస్టమ్స్.

కెమిస్ట్రీ: పరమాణువు నిర్మాణం; మూలకాల వర్గీకరణ & లక్షణాల్లో ఆవర్తనత; రసాయన బంధం & పరమాణు నిర్మాణం; వాయువులు & ద్రవాలు; థర్మోడైనమిక్స్; సమతౌల్యత; కర్బన రసాయన శాస్త్రము; హైడ్రోకార్బన్లు, ఘన స్థితి; పరిష్కారాలు; ఎలెక్ట్రోకెమిస్ట్రీ; రసాయన గతిశాస్త్రం; ఉపరితల కెమిస్ట్రీ; మూలకాల ఐసోలేషన్; సమన్వయ సమ్మేళనాలు; ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్; ఆల్డిహైడ్లు, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాలు; జీవఅణువులు; పాలిమర్లు.

టెక్నికల్ ఎబిలిటీ (బి)

ఈ ప్ర‌శ్న‌ప‌త్రం అభ్య‌ర్థులంద‌రికీ ఒకే విధంగా ఉండ‌దు. మొత్తం 18 ఇంజినీరింగ్ విభాగాలు ఉండ‌గా అందులో అభ్య‌ర్థి ఎంచుకునే విభాగం స‌బ్జెక్టుల‌ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి.

వెబ్‌సైట్ : https://www.ipate.in/

Posted Date : 20-03-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌