• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Innovations: ప్రతిభ విరిసె.. ఆవిష్కరణలు మెరిసె


 

న్యూస్‌టుడే - కరీంనగర్‌ విద్యావిభాగం: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను నూతన ఆవిష్కకర్తలుగా మార్చేందుకు స్కూల్స్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పోటీలు దోహదపడుతున్నాయి. సామాజిక సమస్యలపై పరిశోధన చేస్తూ సరికొత్త ఆలోచనలతో పరిష్కారం చూపుతున్నారు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని విద్యార్థులు. గైడ్‌ టీచర్ల సహకారంతో నూతన ఆవిష్కరణలను తయారు చేసి అందరిని ఆలోచింపజేస్తున్నారు. ఇంక్విలాబ్‌ ఫౌండేషన్, రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్, యూనిసెఫ్‌ల ఆధ్వర్యంలో జరిగిన స్కూల్స్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి 14 ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలిచాయి. వారి ఆలోచనలకు మరింత పదును పెట్టి ప్రాజెక్టుల రూపకల్పన మరింత సమర్థంగా నిలిచేందుకు ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ నిర్వాహకులు బుధవారం కరీంనగర్‌లో సదరు విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు ప్రత్యేకంగా ప్రోటో టైపింగ్‌ వర్క్‌షాప్‌(బూట్‌క్యాంపు)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని విద్యార్థుల ఆవిష్కరణలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ప్రయాణికులకు ఈ-టికెట్‌

పెద్దపల్లి జిల్లా మూలసాల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ.అరవింద్‌ రెడ్డి, కె.లిఖిత్, కె.శవవకుమార్, కె.అనూషరెడ్డిలు ఈ-టికెట్‌ ప్రాజెక్టు రూపొందించారు. బస్సు బొమ్మ, చార్టులు, క్యూఆర్‌ కోడ్‌ పేపర్‌ను దీని తయారీకి వాడారు. బస్సులో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను చరవాణి ద్వారా స్కాన్‌ చేసి చరవాణిలోనే టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా దీనికి రూపకల్పన చేశారు.

మెడిసిన్‌ టైంటేబుల్‌ బ్యాగ్‌

నిరక్షరాస్యులు వైద్యులు రాసిచ్చిన మందులను సరైన సమయానికి వేసుకోవడం, ఏవి ఎప్పుడు వేసుకోవాలనే విషయంలో తెలియకపోవడం వంటి సమస్యలకు చెక్‌ పెడుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు బి.తమన్న, జి.శివానిలు మెడిసిన్‌ టైంటేబుల్‌ బ్యాగ్‌ను తయారు చేశారు. వస్త్రం, పేపర్లు ఉపయోగించి దీన్ని రూపొందించారు. బ్యాగ్‌ ముందు భాగంలో 4 ప్యాకెట్లను నాలుగు రంగులతో కూడిన గుర్తులతో పాటు పరిగడుపున, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాన్ని గుర్తు చేసేలా సూర్య, చంద్రుల గుర్తులను అమర్చారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిని కూడా వాడారు. 

పోర్టబుల్‌ డ్రైయింగ్‌ క్లాత్స్‌ ర్యాక్‌

వర్షాకాలంలో బట్టలు ఆరవేయడం, వాసన రావడం వంటి సమస్యను అధిగమించేందుకు పోర్టబుల్‌ డ్రైయింగ్‌ క్లాత్స్‌ ర్యాక్‌ను తయారు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని కేజీబీవీ విద్యార్థినులు. ఎ.భవ్యశ్రీ, టి.సంధ్య, బి.కావ్య ఇందు కోసం పీవీసీ ప్లాస్టిక్‌ పైపులు, స్క్రూలు, నట్లను ఉపయోగించారు. టేబుల్‌ మోడ్‌లో ఉండే ఈ ఆవిష్కరణకు గల పైపులపై ఎక్కువ దుస్తులు ఆరవేయడంతో పాటు అవసరం లేనప్పుడు మడతపెట్టి దాన్ని ఓ పక్కన పెట్టవచ్చని విద్యార్థినులు తెలిపారు.

చపాతి తయారీ యంత్రం

ఇంట్లో చపాతిలు తయారు చేసేందుకు తల్లులు పడుతున్న శ్రమకు ప్రత్యామ్నాయంగా చపాతి తయారీ యంత్రాన్ని   తయారు చేశారు కరీంనగర్‌ జిల్లాలోని దుర్శేడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్‌.శివాజి, వి.స్పందన, జి.అశ్విత. గైడ్‌ టీచర్‌ సహకారంతో పుల్లలు, కాట్‌బోర్డు, పేపర్లు, చార్టులను ఉపయోగించారు. నీటితో కలిపిన పిండిని ఈమిషన్‌లో వేయడం ద్వారా చపాతీ పిండి ముద్దలను కట్టర్‌తో కోసి ముందుకు తోసేస్తుంది. ఆ ముద్దను చపాతిగా మలుస్తుంది. వేడి చేయడం వల్ల సులభంగా చపాతి సిద్ధమవుతుందని విద్యార్థులు వివరించారు.

న్యాప్‌కిన్‌ ఇన్సినిరేటర్‌

పాఠశాలలో విద్యార్థినులు న్యాప్‌కిన్‌ ప్యాడ్స్‌తో ఎదుర్కొంటున్న సమస్యను నివారించేందుకు పర్యావరణ హిత న్యాప్‌కిన్‌ ఇన్సినిరేటర్‌ను తయారు చేశారు నగునూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆర్‌.హర్షిత, పి.అక్షయ, అస్ఫియా, డి.హరిణిలు. కుండ, హీటర్, త్రీపిన్‌ సాకెట్, ట్రేను ఉపయోగించారు. వాడిన న్యాప్‌కిన్‌ ప్యాడ్లను కుండలో వేయడం ద్వారా అందులోని హీటర్‌ ద్వారా అవి కాలి బూడిద రూపంలోకి మారుతాయి. తద్వారా పర్యావరణానికే గాకుండా ఇతరులకు ఎలాంటి హాని ఉండదు. దుర్వాసనకు దూరంగా నిలపవచ్చని విద్యార్థులు వివరించారు. 

తక్కువ ఖర్చుతో వ్యాయామ సైకిల్‌

జగిత్యాల జిల్లా గోధూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల బాలలు ఎన్‌.మనుశ్రీ, ఆర్‌.చరన్‌తేజ వ్యాయామ సైకిల్‌ రూపొందించారు. ఐరన్‌ స్టాండ్, పాత సైకిల్, డైనమో, లెడ్‌ బల్బులు వాడారు. ఇనుప స్టాండ్‌కు అమర్చి నిలబెట్టిన సైకిల్‌పై కూర్చుని తొక్కడం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామం అందుతుంది. తద్వారా కొన్ని క్యాలరీలను ఉన్న చోటనే ఖర్చు చేయవచ్చు. అధిక బరువు సమస్య గల మహిళలకు ఉపయోగపడుతుంది. డైనమో అమరిస్తే విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చని విద్యార్థులు వివరించారు. 

బురదలో పనిచేసే చెప్పులు

రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ ఉన్నత పాఠశాల వల్లంపట్ల విద్యార్థులు బి.రంజిత్, బి.విశ్వతేజ బరదలో దిగబడకుండా పనులు చేసుకునేందుకు ప్రత్యేకంగా చెప్పులు తయారు చేశారు. ఇందుకోసం తేలికపాటి ప్లాస్టిక్‌ చెప్పులు, కుషన్లు, చిన్న స్టూల్, వైబ్రేటర్, అడ్జెస్టబుల్‌ లెగ్స్‌ను వాడారు. రేగడి నేలలు, పొలాల్లో రైతులు దిగబడకుండా ఈ చెప్పుల పరికరం సాయంతో వారు కూర్చుండి వ్యవసాయ పనులు చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. దీనికి అమర్చిన వైబ్రేటర్‌ ద్వారా పాములు వంటి విష పురుగుల నుంచి కూడా రక్షణ పొందవచ్చని విద్యార్థులు వివరించారు. వ్యయసాయం చేస్తున్న తల్లిదండ్రులు బురదలో దిగబడుతూ ఇక్కట్లు పడుతున్న తీరును చూసి ఆవిష్కరణ తయారు చేశారు. 

చేపలను శుభ్రపరిచి.. కత్తిరించే యంత్రం

కొందరి తండ్రులు చేపలు పట్టి వాటిని శుభ్రం చేసి అమ్మడం ద్వారా చేతులు గాయాలవడం, వాటి వాసనతో శ్వాస సంబంధ వ్యాధులకు గురువుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు  జి.రఘువర్మ, టి.ఆకర్ష్, పి.శ్రీజ, డి.ఉమశ్రీలు. ఇందు కోసం వారు చేపలను శుభ్రం చేసి కత్తిరించే యంత్రం తయారు చేశారు. డీసీ మోటర్లు, కట్టర్స్, రోలర్స్, కన్వేయర్‌ బెల్టును దీనికి ఉపయోగించారు. యంత్రం సాయంతో చేపల పోలుసులను శుభ్రపరిచి, కావాల్సిన పరిమాణంలో కత్తిరించేలా ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు సాయంతో పనిచేసే కన్వేయర్‌ బెల్టు ముక్కలను బయటికి పంపిస్తుంది. 

స్టూడెంట్స్‌ ఫ్రెండ్లీ వాటర్‌ బాటిల్‌

పెద్దపల్లి జిల్లా చందనపూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు డి.హర్షిత, ఎం.శ్రీవర్ష, ఎం.రాజాంజలి, కె.మధుురిమలు యాంటీ పాండమిక్‌ స్టూడెంట్స్‌ ఫ్రెండ్లీ వాటర్‌ బాటిల్‌ను తయారు చేశారు. మూడు స్టెప్పుల బాటిల్‌ను తయారు చేసి అందులో ఒక స్టెప్పులో శానిటైజర్, మిగిలిన రెండింట్లో తాగునీరు, సోపు వాటర్‌ను నింపేలా చేశారు. యూవీ లైట్, బ్యాటరీలు, స్విచ్, సోప్‌ పేపర్లు, టైమర్‌ను దీని తయారీకి ఉపయోగించారు. విద్యార్థులు ప్రతి అరగంటకు ఒక సారి నీరు తాగేలా అలారం గుర్తు చేయడంతో శానిటైజర్‌ లేదా సోపు వాటర్‌తో చేతులను శుభ్రం చేసుకుని విద్యార్థులు నీరు తాగేలా చేయవచ్చని విద్యార్థులు వివరించారు. బాటిల్‌కు అమర్చిన యూవీ లైట్‌ ద్వారా వచ్చే కిరణాలు నీటిలోని వైరస్‌లను నిర్మూలించి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుందని చెప్పారు. 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌