• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్ అభ్య‌స‌న నైపుణ్యాలు పెంచుకోవాలి
 

* ప్రణాళికబద్ధంగా చదువు సాగాలంటున్న నిపుణులు


ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో కీలకం. కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు రెండేళ్లుగా చదువులు సరిగా సాగక.. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌ విద్య ప్రత్యామ్నాయంగా మారినా.. విద్యార్థుల్లో అభ్యసన, పఠన నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో కేవలం 49శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగితే విజయం సాధించవచ్చని విద్యావేత్తలు, నిపుణలు చెబుతున్నారు. 
పాఠ్యాంశాలు పునశ్చరణ చేయాలి: వాసిరెడ్డి అమర్‌నాథ్, విద్యావేత్త
ఆన్‌లైన్‌ తరగతుల సమయంలో సరిగా శ్రద్ధ పెట్టకపోవడం, వసతులు లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. చదువుకునేతత్వం, క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం పడ్డాయి. ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లలకు ‘ఛార్జ్‌ పిరియడ్స్‌’ నిర్వహిస్తే మేలు. ఇందులో పిల్లలు తోటి విద్యార్థులతో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటారు. దీనివల్ల విద్యార్థుల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. పాఠ్యాంశాలు పునశ్చరణ చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, చేతి రాతను మెరుగుపరచాలి.
సందేహాలు నివృత్తి చేసే వాతావరణం కల్పించాలి: ఆర్‌ఎన్‌ రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌
ఆన్‌లైన్‌ విద్యతో మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వినియోగంపై పిల్లల్లో మంచి పట్టు వచ్చింది. ఇది సానుకూల అంశమైనప్పటికీ.. అదే సమయంలో దుష్ప్రభావాలూ ఉన్నాయి. పిల్లలు ఆన్‌లైన్‌ ఆటలకు అలవాటుపడ్డారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరగాలి. ఆన్‌లైన్‌ తరగతులు వింటుంటే వారికి ఎప్పటికప్పుడు వచ్చే సందేహాలు నివృత్తి చేసే వాతావరణం కల్పించాలి. అవసరమైన ఆహారం, విశ్రాంతి అందేలా చూడాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడించాలి. తగిన జాగ్రత్తలతో స్నేహితులతో అనుసంధానంగా ఉండేలా చూడాలి. బయటి వాతావరణం అలవాటు చేయాలి. 
శారీరక శ్రమతో మానసికంగా దృఢం: డాక్టర్‌ రాంచందర్, మానసిక విశ్లేషకులు
ప్రస్తుత పరిస్థితుల్లో తరగతి గదితో పిల్లలకు సంబంధాలు తగ్గిపోయాయి. ఎక్కువకాలం పిల్లలకు మొబైల్‌ చూడటంతో జ్ఞాపకశక్తి, ఒకేచోట కూర్చుని ఉండటంతో వెన్నెముకపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆలోచన శక్తి తగ్గిపోతోంది. కంటి సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా చురుకుదనం లోపిస్తోంది. అంతిమంగా పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తాయి. వాటిని అధిగమించేందుకు ముందుగా శారీరక శ్రమ కల్పించాలి. ఆటలు, వ్యాయామం ఉండాలి. ఇంటి వద్దనే ఎంతోకొంత వీలు చూసుకుని పిల్లలు వ్యాయామం చేసేలా తల్లిదండ్రులు చూడాలి. 
మరికొన్ని సూచనలు పాటించాలి...
* విద్యార్థులు రోజూవారీ ప్రణాళిక రూపొందించుకోవాలి.
* పాఠ్యాంశాలు ఎప్పటికప్పుడు రివిజన్‌ చేసుకోవాలి.
* పాఠ్యపుస్తకాల వెనుక ప్రశ్నలపై పట్టు సాధించాలి.
* ఆన్‌లైన్‌ తరగతులు వింటుంటే ప్రతి 40 నిమిషాలకోసారి విశ్రాంతి ఇవ్వాలి.
మూడు జిల్లాల్లో పాఠశాల విద్యార్థుల సంఖ్య ఇలా..

జిల్లా   మొత్తం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్న వారు 
హైదరాబాద్‌    7,91,452   3,24,243
మేడ్చల్‌    5,74,353   2,70,943
రంగారెడ్డి    6,21,821    4,31,305 


 

Posted Date : 01-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌