• facebook
  • twitter
  • whatsapp
  • telegram

skills: డీలా పడకు.. ధీమా పెంచుకో!

విద్యార్థులు కష్టపడి ఎంత బాగా చదివినా.. ఆందోళన ఎక్కువై ఆత్మవిశ్వాసం తగ్గితే అంతా తలకిందులవుతుంది. పరీక్షల్లో అనుకున్నంత ప్రతిభను చూపించలేరు. మరేం చేయాలి? 

అమూల్య డిగ్రీ చివరి సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈలోగా పీజీ ప్రవేశ పరీక్షకు తేదీ ఖరారు కావడంతో ఆందోళన చెందుతోంది. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు రాకపోతే చదువుకు ఎక్కడ అంతరాయం కలుగుతుందోనని భయపడుతోంది. 

చైతన్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. బ్యాంకు ఉద్యోగం సంపాదించాలనేది అతడి కల. స్నేహితుల్లో కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. దాంతో ఉద్యోగం వస్తుందో రాదోననే ఆందోళన అతడికి ఎక్కువైంది. 

కరోనా పరిణామాల కారణంగా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని గందరగోళ పరిస్థితి ఉండేది. ఇప్పుడేమో వివిధ పరీక్షలకు వరుసగా తేదీలు ఖరారు కావడంతో విద్యారుల్లో ఒత్తిడి పెరిగింది. ప్రణాళికాబద్ధంగా చదవాలన్నా, చదివింది గుర్తుండాలన్నా ఆందోళన లేకుండా ప్రశాంతంగా చదవగలగాలి. అలా చదవాలంటే ఈ నియమాలను పాటించాలి. అవేమిటంటే...

1. అర్థం చేసుకోవాలి: ముందుగా ‘ఆందోళన నుంచి బయటపడలేనేమో.. ఏమీ సాధించలేనేమో..’ లాంటి ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత పెరిగే అవకాశముంటుంది. దీన్నొక తాత్కాలిక సమస్యగానే గుర్తించాలి. అలాగే మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలను అన్వేషించాలి. పరీక్షలు దగ్గరపడటం, చదివేటప్పుడు ఏకాగ్రత కుదరకపోవడం, చదివింది గుర్తులేకపోవడం, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు... ఇలా అనేక కారణాల వల్ల మీ మీద ఒత్తిడి పెరగొచ్చు. అసలు కారణాన్ని కనుక్కుంటే సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. ఏయే విషయాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయో ఒకచోట రాసుకోవాలి. తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలి. అవసరమైతే ఈ విషయంలో స్నేహితులు, కుటుంబసభ్యుల సహాయ సహకారాలను తీసుకోవచ్చు. 

2. వ్యాయామం తప్పనిసరి: ఆందోళనకు దూరంగా ఆనందానికి దగ్గరగా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అది కసరత్తుల రూపంలో కావచ్చు లేదా మీకిష్టమైన క్రీడ, డాన్స్‌లను ఎంచుకుని రోజూ గంటసేపు సాధన చేయొచ్చు. శారీరక వ్యాయామంతో సంతోషానికి కారణమయ్యే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. బాగా ఆందోళనగా అనిపించినప్పుడు వ్యాయమం చేసినా లేదా కాసేపు ఆరుబయట నడిచినా ఫలితం ఉంటుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా ఆందోళనను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. నాలుగు సెకన్లపాటు మెల్లగా గాలి పీల్చి, దాన్ని అలాగే నాలుగు సెకన్లపాటు నిలిపి ఉంచాలి. తర్వాత నాలుగు సెకన్లపాటు నిదానంగా బయటకు వదలాలి. దీంతో ఆందోళన తగ్గి ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. 

3. నెట్టేయకూడదు: ఆందోళనకు కారణం.. మీ చేతుల్లో లేని పరిస్థితులేనని నేరాన్ని వాటి మీదకు నెట్టేయకూడదు. తార్కికంగా ఆలోచించడం నేర్చుకోవాలి. వాస్తవ విరుద్ధంగా ఉండే ఆలోచనలతో లేనిపోని భయాలను సృష్టించుకుని ఆందోళన పడకూడదు. తార్కికంగా, వాస్తవాలను పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే చాలావరకు ఆందోళనకు దూరంగా ఉండొచ్చు. 

4. సానుకూల అంశాలు: ఆందోళనకు గురిచేస్తున్న విషయాలను సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చో ఆలోచించాలి. ప్రతికూల ఆలోచనలను పూర్తిగా వదిలిపెట్టి సానుకూల ఆలోచనల మీదే దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ‘నాకు వచ్చే మార్కులతో మంచి కాలేజీలో సీటు రాదేమో. నా స్నేహితులందరూ అందులో చేరితే నా పరిస్థితి ఏంటి?..’ ఇలా ఆలోచించే బదులు ముందుగా మీ చేతిలో ఉన్న అవకాశం గురించి మాత్రమే ఆలోచించాలి. పరీక్షలు ఇంకా జరగలేదు కాబట్టి ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దాన్నే ఆయుధంగా మార్చుకుని అనుకున్నది సాధించాలి. చేయగలిగే మరో పని ఏమిటంటే.. ఆందోళనకు కారణమైన సమస్యలకు సానుకూల పరిష్కారాలను ఒకచోట రాసుకోవాలి. వాటిలో నుంచి అనువైన దాన్ని ఎంచుకుని ఆచరించాలి.  
 

Posted Date : 04-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌