• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బోధన..  పరిశోధన!

జాతీయస్థాయి యూజీసీ-నెట్‌ ప్రకటన విడుదల

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో సహాయ ఆచార్యులు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అర్హత కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ నెట్‌ ప్రకటన వెలువడింది!

యూజీసీ- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)- మే 2021 ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ (లాంగ్వేజెస్‌ కలిపి), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్, ఎలక్ట్రానిక్‌ సైన్స్‌ మొదలైన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్‌ఎఫ్, లెక్చరర్‌షిప్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హతను నిర్ధారిస్తారు. 
దీని రాతపరీక్షలో భాగంగా రెండు పేపర్లు (పేపర్‌-1, పేపర్‌-2) ఉంటాయి. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. వ్యవధి మూడు గంటలు, మార్కులు 300.  

పేపర్‌-1: (జనరల్‌ పేపర్‌/ టీచింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌): 50 ప్రశ్నలు 100 మార్కులు

పేపర్‌-2: సంబంధిత/ ఎంచుకున్న సబ్జెక్టు 100 ప్రశ్నలు 200 మార్కులు 

మొత్తం 150 ప్రశ్నలు 300 మార్కులు

పరీక్షను రెండు షిఫ్టుల్లో - ఉదయం 9గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు నిర్వహిస్తారు.

ఏ పరీక్ష రాయటానికైనా కృషితో పాటు ఆత్మవిశ్వాసం ముఖ్యం. అందుకే  ఆలస్యం చేయకుండా ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత ప్రారంభించాలి.

సిలబస్‌ను చిన్న విభాగాలుగా విడగొట్టుకోవాలి. సొంతంగా నోట్సు తయారు చేసుకుంటే మంచిది.

ప్రధాన అధ్యాయాలపై దృష్టి కేంద్రీకరించాలి. 

పేపర్‌-1లోని అధ్యాయాల్లో కొన్ని థియరిటికల్‌గా అభ్యసించి, సాధన చేసేవి. ఉదా: బోధన, పరిశోధన సామర్థ్యాలు, భావప్రసారం, ప్రజలు-అభివృద్ధి- పర్యావరణం, ఉన్నత విద్యా వ్యవస్థ సమాచార-సాంకేతిక భావనలు మొదలైనవి.  మరికొన్ని ప్రాక్టికల్‌గా సాధన, తార్కికత అవసరమైనవి, గణిత ప్రాథమిక ప్రక్రియలతో సంబంధం ఉన్నవి. 

ఉదా: అంకగణిత వివేచన, భిన్నాలు, సమయం, కాలం-దూరం, శాతాలు, నిష్పత్తి, లాభం-నష్టం, వడ్డీ, సగటు మొదలైన భావనలకు చెందినవి. డేటా ఇంటర్‌ప్రిటేషన్, తార్కిక వివేచనలో ప్రమాణాలు, ప్రత్యక్ష, అసమాన, ఉపమాన, శబ్ద, అర్ధపట్టి, అనుపలబ్ధి..

సన్నద్ధత ఎలా?

పేపర్‌-1లోని కొన్ని అంశాలు చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. కాబట్టి నూతన అంశాలు, ప్రాథమిక భావనలపై మొట్టమొదట దృష్టి కేంద్రీకరించి అవగాహన చేసుకోవాలి. యూజీసీ నెట్‌ పేపర్‌-1 సిలబస్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌/ పుస్తకాలను ఎంపిక చేసుకుని, క్షుణ్ణంగా సిలబస్‌ పరిధిలో అభ్యసించి, పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.

ప్రాథమిక భావనలపై పట్టు సాధించాక గత సంవత్సరాల పరీక్ష ప్రశ్నపత్రాలను అభ్యాసం/ సాధన చేయాలి. దీనివల్ల ఎలాంటి భావనలపై ప్రశ్నలు అడుగుతారో, ఏ అంశాలకు ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తారనే విషయాలపై అభ్యర్థులకు స్పష్టత ఏర్పడుతుంది.

సాధన వల్ల సరైన సమాధానం రాయడంలో స్పష్టత, నిర్దిష్టత, వేగం పెరుగుతాయి. ఇందువల్ల సమయపాలన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయి. 

పేపర్‌-1లోని సిలబస్‌లో ఏ విభాగాన్నీ అభ్యసించకుండా ఉండే నిర్లక్ష్యం చేయొద్దు. మంచి స్కోరు చేయడం కోసం అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసేలా పూర్తి అవగాహనతో సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించాలి. అప్పుడే ఉత్తీర్ణతకు మార్గం సుగమం అవుతుంది.

నిరంతర అభ్యాసం కొనసాగించేటపుడు మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి. ఇది దీర్ఘకాల స్మృతికి తోడ్పడుతుంది. పరీక్ష గదిలో పునఃస్మరణకూ సాయపడుతుంది.

సబ్జెక్టు అవగాహనకు సహచరుల, అధ్యాపకుల సాయంతో సందేహాలను నివృత్తి చేసుకోవడం/ ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉండే వివిధ రకాల నిపుణుల పాఠాలను వినడం అవసరం. దీని ద్వారా విషయ పరిజ్ఞానంతోపాటు వారి అనుభవాలూ తోడ్పడతాయి. సమయమూ ఆదా అవుతుంది.

వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే ఉత్తమ స్కోరుకు వీలవుతుంది.

సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ రిఫరెన్స్‌ పుస్తకాలు, ఇంటర్నెట్‌లో ఉచిత వనరులను ఉపయోగించుకోవాలి.

పేపర్‌-1లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పరీక్షను దృష్టిలో ఉంచుకుని సెల్‌ఫోన్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లకు దూరంగా ఉండాలి. అవసరమైన విషయాలకోసం మాత్రమే సాంకేతిక సాధనాలు తెలివిగా ఉపయోగించుకోవాలి. 

పరీక్ష పూర్తయ్యే వరకు ప్రేరణ కొనసాగించాలి. 

సంపూర్ణ వ్యూహంతో, కాలనిర్ణయ పట్టిక ప్రకారం సరైన మార్గాన్ని అనుసరించి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. 

మాక్‌టెస్టులను సాధన చేసి, తప్పులు గుర్తించుకోవాలి. తర్వాత రాసే పరీక్షలో ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా నిరంతర సాధనతో విజయతీరాలకు చేరవచ్చు.

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం.

తెలంగాణ: హైదరాబాద్‌/ సికింద్రాబాద్‌/ రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌.

రెండు పేపర్లలో పేపర్‌-1 అభ్యర్థులందరూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పేపర్‌-2 పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఎంచుకున్న సబ్జెక్టులో రాయొచ్చు.

పేపర్‌-1: సిలబస్‌లో మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. ప్రతి దానినుంచి 5 చొప్పున మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. అన్ని ప్రశ్నలకూ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. కాబట్టి, ప్రతి అధ్యాయంలోని అంశాలకూ ప్రాధాన్యమివ్వాలి.

ముఖ్యమైన తేదీలు: 

‣ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.02.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.03.2021.

పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 03.03.2021.

పరీక్ష తేదీలు: 2021 మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17. 

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/

రిఫరెన్స్‌ పుస్తకాలు 

అరిహంత్‌ పబ్లికేషన్స్‌

మెక్‌ గ్రా హిల్‌ ఎడ్యుకేషన్‌

ట్రూమాన్స్‌ యూజీసీ నెట్‌ జనరల్‌ పేపర్‌-1

పేపర్‌-2 సంగతి?

దీనిలో ప్రశ్నలు ప్రధానంగా డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయి సిలబస్‌ నుంచి అడుగుతారు. అందువల్ల సన్నద్ధతలో అన్ని విభాగాలకూ, చాప్టర్లకూ ప్రాధాన్యం ఇస్తూ అభ్యసించాలి. వర్తమాన అంశాలు చదవాలి. డిగ్రీ, పీజీలో అభ్యసించిన అంశాల్లో వేటిపై గట్టి పట్టు ఉంది, ఏ విభాగాల్లో వెనుకబడ్డారో గుర్తించాలి. తక్కువ అవగాహన ఉన్న సబ్జెక్టు కాన్సెప్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం అదనపు సమయం వెచ్చించాలి. మెంటర్, ప్రొఫెసర్లు, ఆన్‌లైన్‌ ద్వారా బలమైన పునాదిని నిర్మాణాత్మకంగా ఏర్పరచుకోవాలి. ఎక్కువసార్లు పునశ్చరణ, వీలైనన్ని మాదిరి పరీక్షలు రాయడం, నిరంతర సాధన, లోప నిర్ధారణ, లోప నివారణ అభ్యసనం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇవన్నీ పాటిస్తే ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పరీక్షలో అర్హత సాధించడం సులభం అవుతుంది!

Posted Date : 04-02-2021 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం