• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Gvt Schools: సర్కారీ బడులకు సాంకేతిక దన్ను

మౌలిక వసతుల కల్పనే కీలకం
కరోనా కారణంగా విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడుతుండటంతో విద్యారంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. దేశంలో 2020-21 విద్యాసంవత్సరంలో 39.72 లక్షల మంది విద్యార్థులు ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యాసంస్థలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని యూడైస్‌ప్లస్‌ 2020-21, సర్కారు బడుల్లో 70.3శాతం విద్యార్థులు ప్రవేశాలు పొందారని అసర్‌-2021 నివేదికలు వెల్లడించాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. అయితే, ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రభుత్వాలు సర్కారు బడుల్లో యుద్ధప్రాతిపదికన మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరముంది.
కొవిడ్‌ కారణంగా పట్టణాల్లో 19శాతం, గ్రామాల్లో 37శాతం విద్యార్థులు చదువులకు పూర్తిగా దూరమయ్యారని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ నేతృత్వంలో భారత్‌లో నిర్వహించిన సర్వే తేల్చింది. పాఠశాలలు తెరుచుకోకపోవడంతో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు పంపించారు. దీనివల్ల పైతరగతులకు సంబంధించిన పాఠాలను అవగాహన చేసుకునే సామర్థ్యం విద్యార్థుల్లో ఉండదు. కింది తరగతిలో కోల్పోయిన పరిజ్ఞానాన్ని తరవాతి తరగతిలో పొందేలా అన్ని సబ్జెక్టులను పకడ్బందీగా బోధించడం ఎంతో అవసరం. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల కొరత వేధిస్తోంది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 18శాతం (తెలంగాణలో 13.65శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14శాతం) ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా 6.80శాతం (తెలంగాణలో 11.23శాతం, ఏపీలో 19శాతం) ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని సాక్షాత్తూ విద్యాశాఖే పార్లమెంటుకు నివేదించింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన ఎలా అందుతుందనేది ప్రభుత్వాలే ఆలోచించాలి.
‣ పాఠశాల స్థాయిలో సాంకేతిక విద్యకు పునాదులు వేస్తేనే ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అయితే, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలతో పోలిస్తే సర్కారు బడుల్లో కంప్యూటర్లు, వాటి బోధన పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నా, బోధకులను నియమించకపోవడం, విద్యుత్తు సదుపాయం కరవు కావడంతో అవి అటకెక్కాయి. యూడైస్‌ప్లస్‌ 2020-21 నివేదిక ప్రకారం- 2020-21లో దేశంలో 10.32 లక్షలకుగాను 32.54శాతం సర్కారు బడుల్లోనే (తెలంగాణలో 25శాతం, ఏపీలో 24శాతం) కంప్యూటర్లు ఉన్నాయి. అరవై శాతానికిపైగా ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో కంప్యూటర్లు ఉండగా, కనీసం యాభై శాతం ప్రభుత్వ బడుల్లోనూ అవి అందుబాటులో లేకపోవడం ఒకింత ఆందోళనకు గురిచేసే అంశమే. పాఠశాలల్లో అంతర్జాల సదుపాయమూ అంతంత మాత్రమే. కేవలం 13.64శాతం (తెలంగాణలో 8.2శాతం, ఏపీలో 8.83శాతం) ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆ సౌకర్యం ఉంది. దేశంలోని అయిదుశాతం పాఠశాలల్లోనే సమాచార, సాంకేతిక పరిజ్ఞాన ప్రయోగశాలలు ఉన్నాయని, 19శాతం బడుల్లోనే అంతర్జాల సదుపాయం ఉందని యునెస్కో సర్వే కళ్లకు కట్టింది. విద్యుత్తు సదుపాయం లేక చాలా పాఠశాలల్లో కంప్యూటర్లు పని చేయడం లేదు. ఇప్పటికీ 82.15శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యుత్తు సదుపాయం ఉందని యూడైస్‌ప్లస్‌ 2020-21, 74శాతం విద్యాసంస్థల్లోనే ఈ సౌకర్యం ఉందని యునెస్కో సర్వే వెల్లడించింది. ఇలా బోధకులు, కంప్యూటర్లు, అంతర్జాలం కొరత, విద్యుత్‌ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థుల సాంకేతిక విద్య అభ్యాసానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి.
‣ మొబైల్‌ ఫోన్లు, టీవీలు, రేడియోల ద్వారా  1-12 తరగతులకు బోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 12 ఛానళ్లను ‘ఒన్‌ క్లాస్‌.. ఒన్‌ టీవీ ఛానల్‌’ పేరిట 200కు పెంచనున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే సర్కారు బడుల్లో కంప్యూటర్లు, అంతర్జాలం, విద్యుత్‌ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. దిల్లీ 100శాతం, పంజాబ్‌ 99శాతం, కేరళ 95శాతం, గుజరాత్‌ 94శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను సమకూర్చి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలూ ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ‘విద్యాంజలి’, తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాల ద్వారా దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సర్కారు బడుల బాగుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి కింద పాఠశాలల్లో కంప్యూటర్లు, అంతర్జాలం, విద్యుత్‌, డిజిటల్‌, స్మార్ట్‌ క్లాస్‌రూం సదుపాయాలు కల్పించాలి. అయితే, కేవలం సౌకర్యాల ఏర్పాటుతో సరిపెట్టకుండా, వాటిని సమర్థంగా వినియోగించుకోవడం, అవసరమైన వనరుల కల్పించడం, ఫలితాలు రాబట్టడంపై దృష్టి సారించాలి.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 23-03-2022 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం