• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలుసుకోండి... ఇవి డిమాండ్ ఉన్న కోర్సులే!

బీకాం అనలిటిక్స్‌, బీఎస్‌సీ డేటా సైన్స్

ఉద్యోగాలపరంగా మార్కెట్లో ఎంతో డిమాండ్‌.. ప్రామాణిక అధ్యయనాలు పదేపదే చెప్తున్నాయి. అందుకే బీఎస్‌సీలో గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌ సబ్జెక్టులతో కూడిన కోర్సునూ, బీకాం (బిజినెస్‌ అనలిటిక్స్‌), బీకాం (ఫారెన్‌ ట్రేడ్‌), బీకాం (టాక్సేషన్‌) అనే కొత్త కోర్సులనూ ప్రవేశపెట్టారు. కానీ వీటిపై ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు అంతగా మొగ్గు చూపలేదు.  వారికి తగినంత అవగాహన కల్పించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నూతన కోర్సులు ప్రవేశపెట్టిన కొత్తలో ఈ పరిస్థితి సాధారణమేననీ, ఒకటి రెండేళ్ల తర్వాత విద్యార్థులు వీటికోసం పోటీపడతారనీ అధికారులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులపై విద్యార్థులు వేచిచూచే ధోరణిని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ విద్యా సంవత్సరం (2020-21)లో డిగ్రీలో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చినా విద్యార్థులు వాటిల్లో చేరేందుకు స్వల్ప సంఖ్యలోనే ముందుకొచ్చారు. ఉద్యోగాలపరంగా మార్కెట్లో డిమాండ్‌ ఉన్నట్లు జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నా బీకాం బిజినెస్‌ అనలిటిక్స్, బీఎస్‌సీ డేటా సైన్స్‌ కోర్సుల్లో నామమాత్రంగా చేరడం గమనార్హం. అందులో డేటా సైన్స్‌లో దాదాపు 42 శాతం సీట్లు భర్తీకాగా...బిజినెస్‌ అనలిటిక్స్‌లో నాలుగో శాతం కూడా నిండకపోవడం విశేషం. 

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ తీసుకొని ఈసారి బీఎస్‌సీలో గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌ సబ్జెక్టులతో కూడిన కోర్సుతోపాటు బీకాం (బిజినెస్‌ అనలిటిక్స్‌), బీకాం (ఫారెన్‌ ట్రేడ్‌), బీకాం (టాక్సేషన్‌) అనే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటికి డిమాండ్‌ ఉండటంతో పెద్దఎత్తున కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. బిజినెస్‌ అనలిటిక్స్‌ను 126 కళాశాలల్లో, డేటా సైన్స్‌ కోర్సును 128 కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ-కామర్స్‌ పెరుగుతున్న పరిస్థితుల్లో వ్యాపారాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... డేటా అన్నది చాలా ముఖ్యమని, దాన్ని విశ్లేషిస్తే తగిన నిర్ణయం తీసుకోవచ్చని, అందుకే ఇంజినీరింగ్‌లో డేటా సైన్స్‌ను ప్రవేశపెట్టారని నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో డిగ్రీలోనే  ఈసారి దాన్ని చేర్చారు.

చేరకపోవడానికి కారణాలివీ...

కొత్త కోర్సుల గురించి విద్యార్థుల్లో తగిన అవగాహన లేదు. 

ఆ దిశగా విశ్వవిద్యాలయాలు గానీ, ఉన్నత విద్యామండలి గానీ చొరవ తీసుకోలేదు. 

ఈసారి కళాశాలలకు తనిఖీ లేకుండానే అనుమతి ఇచ్చారు. దీంతో కొత్త సబ్జెక్టులను బోధించే అధ్యాపకులు ఉంటారో? ఉండరో? అన్న సందిగ్ధత విద్యార్థుల్లో తలెత్తింది. 

డిగ్రీలో చేరేవారిలో అత్యధికంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. వీరు ప్రయోగం చేయడమెందుకని తొలి సంవత్సరం ఈ కోర్సుల్లో చేరలేదని నిపుణులు చెబుతున్నారు. 

వచ్చే ఏడాది నుంచి ఈ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

ఈ ఏడాది డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) ద్వారా 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందారు. సొంతగా ప్రవేశాలు జరుపుకున్న మరో 40 కళాశాలల్లో మరో 20 వేల మంది చేరారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దోస్త్‌ ద్వారా డిగ్రీ కళాశాలల్లో దాదాపు 30 వేల మంది పెరిగారని అధికారులు ప్రకటించారు. ఇంటర్‌లో ఈసారి అందరినీ ఉత్తీర్ణులను చేయడంతో డిగ్రీలో ప్రవేశాలు పెరిగాయని భావిస్తున్నారు.

క్రమేణా డిమాండ్‌ పెరుగుతుంది

ఏ కోర్సు ప్రవేశపెట్టినా తొలి ఏడాది భారీ సంఖ్యలో విద్యార్థులు చేరరు. ఒకటీ రెండు సంవత్సరాలు పరిశీలించి ఆ తర్వాత అందరూ డిమాండ్‌ ఉన్న కోర్సులకు పోటీ పడతారు. ఇప్పటికీ రాష్ట్రంలో బీకాంలోనే అత్యధికంగా, ఆ తర్వాత లైఫ్‌ సైన్సెస్, అనంతరం ఫిజిక్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు. చాలామంది బీకాం చదువుతూనే సీఏ పరీక్షలూ రాస్తున్నారు. బీకాం పూర్తయిన తర్వాత కొందరు కామర్స్‌కు సంబంధించి సర్టిఫికెట్‌ కోర్సులు, ఆయా సంస్థల్లో అవసరమయ్యే కంప్యూటర్‌ కోర్సులు చేసి కొలువులు చేస్తున్నారు. ఎంసెట్‌ ద్వారా ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు చేరేందుకు మెడికల్, వెటర్నరీ, బీఎస్‌సీ అగ్రికల్చర్, హార్టికల్చర్‌ లాంటి కోర్సుల్లో చేరాలన్న ఆసక్తి ఉన్నా సీట్లు చాలా పరిమితం. మరికొంత మంది బీఫార్మసీలో చేరుతున్నారు. మిగిలిన వారందరూ బీఎస్‌సీ జీవశాస్త్రాన్ని ఎంచుకుంటున్నారు. - ఆచార్య ఆర్‌.లింబాద్రి (కన్వీనర్, దోస్త్‌)

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దోస్త్‌ ద్వారా తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య దాదాపు 30 వేలు అధికం! 

కొత్తగా ఆన్‌లైన్‌లో మూక్స్‌ కోర్సులు

కళాశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవతో మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్స్‌) విధానంలో సైకాలజీ, జాగ్రఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం సబ్జెక్టులను ఈసారి ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 797 మంది ఆ సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు ముందుకు రావడం గమనార్హం.

- పెమ్మసాని బాపనయ్య (ఈనాడు - హైదరాబాద్‌)
 

Posted Date : 12-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌