• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Agnipath: అపోహల అగ్నిపథం

మరింత పదునెక్కాల్సిన ప్రక్రియ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని వర్గాలు ఈ పథకాన్ని స్వాగతించగా, నిరుద్యోగ యువతతోపాటు కొందరు మాజీ సైనికోద్యోగులూ నిరసన స్వరం వినిపించారు. కొన్నిచోట్ల యువకులు హింసాకాండకూ పాల్పడటం బాధాకరం. విచ్చలవిడిగా దౌర్జన్యకాండకు దిగిన యువకులు క్రమశిక్షణకు మారుపేరైన సాయుధ బలగాల్లో చేరడానికి అనర్హులు. అందుకే అలాంటివారికి సాయుధ బలగాల్లో ప్రవేశం దక్కదని త్రివిధ సాయుధ బలగాలు స్పష్టం చేశాయి. అగ్నిపథ్‌ను మొత్తంగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసేవారు కొందరైతే, ఆ పథకానికి తగిన మార్పుచేర్పులు చేయాలనేవారు మరికొందరు. అగ్నిపథ్‌కు సవరణలు చేయాలన్న సూచనపై ప్రభుత్వం సుముఖంగా ఉండటం స్వాగతించదగిందే. పథకానికి తుది రూపు ఇచ్చేముందు మాజీ సైనికోద్యోగుల సలహా సంప్రదింపులను పరిగణనలోకి తీసుకోవాలి. సాయుధ బలగాల్లో సుదీర్ఘ అనుభవంతో పదవీ విరమణ పొంది బయటికొచ్చిన మాజీ సిబ్బంది పౌర జీవితంలో ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరపడుతుంటారు. సర్వీసులో ఉన్నప్పుడు, బయటికొచ్చినప్పుడు వారికి ఎదురైన అనుభవాలు అగ్నిపథ్‌ పథక రూపకల్పనకు తప్పక ఉపకరించి ఉండేవి. ఇకనైనా వారిని సంప్రదించి అగ్నిపథ్‌కు సమగ్ర రూపం కల్పించాలి.
పింఛను వ్యయాలు తగ్గించేందుకు...
అగ్నిపథ్‌ను హడావుడిగా రూపొందించి అమలులో పెడుతున్నారా అన్న ప్రశ్నలు, సందేహాలు లేకపోలేదు. అందుకేనేమో ఈ పథకాన్ని ఆశావహులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనే వాదనలు ఉన్నాయి. దీనిపై అపోహలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల్లో అగ్నిపథ్‌ను పోలిన పథకాలు ఉన్నాయంటూ పోలికలు తీసుకురావడానికి సాయుధ దళాలు ప్రయత్నించాయి. అది బొత్తిగా అసందర్భం, అసంబద్ధమని చెప్పకతప్పదు. 22 వేల కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దులు ఉండి, రెండు వైపుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారతదేశాన్ని మరే దేశంతోనూ పోల్చడానికి వీల్లేదు. స్థూలంగా అగ్నిపథ్‌ పథకం కింద సైనికులను నాలుగేళ్ల సర్వీసు కోసం బలగాల్లోకి చేర్చుకుంటారు. గడువు ముగిసిన తరవాత వీరిలో 25 శాతం సిబ్బందిని అవసరం మేరకు శాశ్వత ప్రాతిపదికపై త్రివిధ సాయుధ బలగాల్లో నియమిస్తారు. 75 శాతాన్ని సర్వీసు నుంచి విడుదల చేస్తారు. అగ్నిపథ్‌ కింద నియామకం చేసుకునే అగ్నివీరులకు కేవలం ఆరు నెలల శిక్షణ ఇస్తారు. సాయుధ బలగాల్లో యువ సైనికులు, అధికారుల సంఖ్యను పెంచి, పింఛను వ్యయాల్ని తగ్గించడం అగ్నిపథ్‌ లక్ష్యం. ఈ పథకం కింద సాయుధ బలగాల్లో చేరి, గడువు తరవాత బయటికొచ్చిన సైనికులు, అధికారులు భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు రిజర్వు దళంగా ఉపయోగపడతారు. అయితే, అగ్నిపథ్‌ పథకాన్ని పరిమిత కాల (షార్ట్‌ సర్వీస్‌) నియామకాలతో పోల్చడం సరికాదు. షార్ట్‌ సర్వీస్‌ అధికారులు అయిదేళ్ల తరవాత బయటకు రావచ్చు. అవసరమనుకుంటే వీరి సర్వీసు గడువును పదేళ్లకు పెంచవచ్చు.
పరిష్కరించాల్సిన సమస్యలు
అగ్నివీరులను సీఆర్పీఎఫ్‌ వంటి పారామిలిటరీ దళాల్లోకి బదిలీ చేసే ప్రక్రియ బహిరంగంగా, పారదర్శకంగా జరగాలి. సైన్యానికి పనికిరానివాళ్లను ఇలా బదిలీ చేస్తున్నారనే అపోహలు, ఆరోపణలు తలెత్తే పరిస్థితికి తావివ్వకూడదు. సాయుధ దళాల్లో మిగులు సిబ్బందిని బదిలీ చేస్తారనే వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. మొదట 50 నుంచి 60 శాతం సిబ్బందికి శాశ్వత ప్రాతిపదికపై నియామకాలు ఇచ్చి, తరవాత అయిదేళ్ల నుంచి ఏడేళ్లలో క్రమంగా 25 శాతానికి తగ్గించడం మేలు. మొదటి సంవత్సరం కేవలం 46 వేల మంది అగ్నివీరులను తీసుకునే బదులు లక్ష మందితో మొదలుపెట్టాలి. తరవాత క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. గడచిన రెండేళ్లలో సైన్యంలో నియామకాలు నిలిచిపోయినందువల్ల దాదాపు 1.5 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అయిదు శాతం ఉద్యోగాలను మాజీ అగ్నివీరులకు కేటాయించాలి. ఈ కోటాను నెరవేర్చని సంస్థలపై జరిమానా విధించాలి. నాలుగేళ్ల తరవాత అగ్నివీరులకు 12వ తరగతి సర్టిఫికెట్‌ ఇవ్వడంతో సరిపెట్టకూడదు. వారు ఉన్నత విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు చేయాలి. అన్ని కళాశాలల్లో వారికి 0.05 శాతం సీట్లు రిజర్వు చేయాలి. అగ్నివీరులకు శిక్షణను కేవలం ఆరు నెలలకే పరిమితం చేయడం కూడా సరికాదు. అదనంగా నాలుగైదు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. షార్ట్‌ సర్వీసు అధికారుల సీనియారిటీకి అనుసరిస్తున్న పద్ధతులను అగ్నివీరులకూ వర్తింపజేయాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే విధంగా జీతభత్యాలు నిర్ణయించాలి. వారికి కొంత పింఛన్‌ వచ్చే ఏర్పాటు చేయాలి. పింఛన్‌ బిల్లులో మిగులును సాయుధ బలగాల ఆధునికీకరణకే వెచ్చించాలి. అగ్నిపథ్‌ పథకాన్ని ఒక పైలట్‌ ప్రాజెక్టుగా పరిగణించి ఏడాది తరవాత తగిన మార్పుచేర్పులు చేయాలి. సాయుధ బలగాలకు జవసత్వాలు సమకూర్చేది జూనియర్‌ సిబ్బంది మాత్రమేనని గుర్తుంచుకొని అగ్నివీరులను మెరికల్లా తీర్చిదిద్దాలి. కొత్త వ్యవస్థ ఏదైనా కొన్ని సమస్యలు ఉంటాయి. సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది. ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు కొన్ని మార్పులు, పరిష్కారాలు అవసరం. కొంత ఆలస్యమైనా, పథకాన్ని అవసరమైన మార్పులతో తీసుకురావాలి. మెరుగుదిద్దిన పథకం ఆశావహులకు ఆకర్షణీయంగా ఉండాలి. శిక్షణకు సంబంధించిన కొన్ని మార్పులు బలగాల సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాయి. ప్రభుత్వం ఈ పథకంలో నెలకొన్న లోటుపాట్లను సరిదిద్ది నియామక ప్రక్రియను సవ్యంగా తీర్చిదిద్దుతుందనే ఆశిద్దాం.
దేశ రక్షణ... ఉద్యోగ భద్రత
 సాయుధ బలగాల్లో చేరితే ఉద్యోగ భద్రత ఉంటుంది. 35-40 ఏళ్ల వయసు వచ్చాక బయటికొస్తే ఉద్యోగానంతర పింఛను, ఆరోగ్య బీమా వంటి వసతులూ ఉంటాయి. యువతను పోరాట విధుల్లోకి ఆకర్షించే అంశాల్లో ఇవి కీలకమైనవి.
 సైన్యంలో చేరడం దేశభక్తికి ఉత్కృష్ట నిదర్శనమనడంలో సందేహం లేదు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడంకన్నా త్యాగం ఏముంటుంది? అయితే అగ్నిపథ్‌ పథకంలో సందిగ్ధతకు తావు ఇవ్వకుండా ముందే జాగ్రత్తపడి ఉండాల్సింది.
 అగ్నిపథ్‌ పథకం కింద చేరి నిర్దిష్ట గడువు తరవాత బయటికొచ్చే 75 శాతం జవాన్లకు ఈ ప్రయోజనాలు దక్కవంటే సహజంగానే వారిలో నిరసన తలెత్తుతుంది. అసంతృప్తిని చల్లార్చడానికి తగిన సవరణలు చేస్తామంటూ ప్రభుత్వం పేర్కొనడం హర్షణీయం.

Posted Date : 29-06-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌