• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అరిథ్‌మెటిక్‌

2022ను కొలువుల నామసంవత్సరంగా చెప్పొచ్చు! ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల సంఖ్యలో భర్తీ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో  80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. వాటిలో దాదాపు 18 వేలకు పైగా ఉన్న ఖాళీలకు సంబంధించిన గ్రూప్‌ 1, ఎస్సై, కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఏపీపీఎస్సీ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్లు రానున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 11 లక్షలకు పైగా ఖాళీలు బ్యాంకు, రైల్వే, ఇతర సంస్థల్లో ఉన్నట్లుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేసింది. వాటిలో చాలా ఖాళీలు ఈ ఏడాది భర్తీ చేసే అవకాశం ఉంది. వీటన్నింటిలో రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అరిథ్‌మెటిక్‌ విభాగాలు చాలా కీలకం! మరి వీటికి పరీక్షల వారీగా ఎలా చదవాలో చూద్దామా!

బ్యాంకు ఉద్యోగాలకు త్వరలో ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ నుంచి నోటిఫికేషన్లు రానున్నాయి. అదేవిధంగా రైల్వేలోనూ ఉద్యోగాలకు ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. 2022 సంవత్సర పరీక్షల క్యాలెండర్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల చేయనుంది. వీటితోపాటు ఇన్సూరెన్స్‌లోని ఏఓ, ఏఏఓ, అసిస్టెంట్‌ నోటిఫికేషన్లు కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇలా అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు భర్తీ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. తగిన విధంగా సన్నద్ధత ప్రణాళిక తయారు చేసుకోవాలి.

పరీక్షల వారీ ప్రాధాన్యం

ఈ అన్ని పరీక్షల్లో రీజనింగ్, ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్లు చాలా ముఖ్యమైన విభాగాలు. బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ,  రైల్వే, ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్‌ 4 పరీక్షల్లో దాదాపు 50 శాతం... గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల్లో 10 శాతం నుంచి 20 శాతం వరకూ వీటి నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ, గ్రూప్‌ 2, 3 పరీక్షల్లో రీజనింగ్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లోని 6 పేపర్లలో 5వ పేపర్‌ అయిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో ఎక్కువ ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రెటేషన్, అరిథ్‌మెటిక్‌ల నుంచి వస్తాయి. బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పరీక్షల్లో వీటికి సమాన ప్రాధాన్యం ఉంటుంది.

సబ్జెక్టులు - ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌

రీజనింగ్‌

దీనిలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువగా వెర్బల్‌ రీజనింగ్‌లోని లాజికల్, అనలిటికల్, క్రిటికల్‌ రీజనింగ్‌ల నుంచి ఉంటాయి. లెటర్‌ లేదా నంబర్‌ సిరీస్, డైరెక్షన్స్, కోడింగ్‌ - డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్, ఇనీక్వాలిటీస్, సిలాజిజమ్, వెన్‌ డయాగ్రామ్, ఆర్డర్‌ ర్యాంకింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్, కాజ్‌ ఎఫెక్ట్, స్టేÆట్‌మెంట్‌ అజెంప్షన్, స్టేట్‌మెంట్‌ కన్‌క్లూజన్స్, స్టేట్‌మెంట్‌ కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్, స్టేట్‌మెంట్‌ ఆర్గ్యుమెంట్‌ మొదలైనవాటి నుంచి ఉంటాయి. అదేవిధంగా నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లోని క్యూబ్స్, క్లాక్స్, క్యాలెండర్స్, అనాలజీ, క్లాసిఫికేషన్, పేపర్‌ కటింగ్, పేపర్‌ ఫోల్డింగ్, మిర్రర్‌ ఇమేజ్, వాటర్‌ ఇమేజ్‌ మొదలైన వాటి నుంచి సాధారణంగా ప్రశ్నలు వస్తాయి. ఎకడమిక్‌ స్టడీస్‌లో ఎక్కడా చదవని విభాగమైనప్పటికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. అర్థం చేసుకుని చదివే అభ్యర్థులు 100 శాతం మార్కులు పొందగలరు.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

కేంద్ర ప్రభుత్వ పరీక్షల్లో చాలా కీలకమైన విభాగమిది. వీటిలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల్లోనూ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనిలో సరళీకరణ, సంఖ్యా వ్యవస్థ, కసాగు - గసాభా, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసు, నంబర్‌ సిరీస్, సగటు, శాతాలు, లాభం - నష్టం, వడ్డీ - చక్రవడ్డీ, కాలం - పని, కాలం - దూరం, అలిగేషన్‌ - మిశ్రమాలు, క్షేత్రగణితం: కొలతలు నుంచి ప్రశ్నలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పరీక్షల్లో వీటితోపాటు వర్గ సమీకరణాలు, ప్రస్తారణ, కాంబినేషన్లు, సంభావ్యత నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. గ్రూప్‌ 1 మెయిన్స్‌లోని పేపర్‌ 5లో ఒక మోస్తరుగా ప్రశ్నలు వస్తాయి. దైనందిన జీవితంలో ఉపయోగపడే మ్యాథమెటిక్స్, అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌లోని ప్రశ్నల్లో మనం ఉన్నట్టుగా ఊహించుకుంటే సులువుగా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం షార్ట్‌కట్‌ పద్ధతులు అభ్యసనం చేయాలి.

డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో

అన్ని పరీక్షల్లోనూ దీన్నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అయితే బ్యాంకు, గ్రూప్‌ 1 మెయిన్స్‌లో ఇది చాలా ముఖ్యమైన విభాగం. వివిధ చార్టుల రూపంలో ఇచ్చిన డేటాను విశ్లేషించి ప్రశ్నలు సాధించాలి. సమాచారం పట్టికలు, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్, పై ఛార్ట్, వెబ్‌ గ్రాఫ్‌ తదితర రూపాల్లో ఉంటుంది. ఈ ప్రశ్నలు సాధించడానికి క్యాలిక్యులేషన్స్, పర్సంటేజ్, యావరేజ్, రేషియో - ప్రపోర్షన్‌ల్లో మంచి పట్టుండాలి. సంఖ్యల మధ్య సంబంధాలను త్వరగా కనుగొనాలి. బాగా సాధన చేస్తే అన్ని ప్రశ్నలూ చాలా తేలికగా సాధించవచ్చు. కొన్ని లెక్క చేయాల్సిన అవసరం లేకుండా గ్రాఫ్‌ చూడగానే జవాబు గుర్తించే అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ముఖ్యంగా హైస్కూల్‌ విద్య తర్వాత గణిత నేపథ్యం లేనివారు ఇది కష్టమైన విభాగంగా భావిస్తారు. కానీ అర్థం చేసుకుంటే ఎవరైనా తేలిగ్గా ప్రశ్నలు సాధించవచ్చు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్ని పరీక్షల్లోనూ ఈ విభాగాలు చాలా కీలకమైనవి. దాదాపుగా ఎక్కువ పరీక్షల్లో ఫలితాలను నిర్ణయిస్తాయి. అందుచేత వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో పట్టు సాధిస్తూ ఇతర విభాగాలను కూడా ప్రాధాన్యం ఇస్తూ సాధన చేస్తే మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమవుతుంది.

 

Posted Date : 03-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌