• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టార్గెట్ ఐసెట్!

సన్నద్ధత వ్యూహం

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ప్ర‌క‌ట‌న ‌విడుద‌ల‌

ఆగ‌స్టు 19, 20 తేదీల్లో ప‌రీక్ష‌

ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మేనేజ్‌మెంట్ లేదా కంప్యూటర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లాలనుకునే వారికి ఐ-సెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఒక మంచి అవకాశం. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు సరైన సన్నద్ధతతో హాజరై ర్యాంకు సంపాదిస్తే మంచి కళాశాలలో చేరి పీజీ పూర్తి చేయవచ్చు. 2021 సంవత్సరానికి  టీఎస్ఐసెట్‌(తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్) ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ యూనివ‌ర్సిటీల్లో ఎంబీఏ/ ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్షను ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఈ ఏడాది కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం (వ‌రంగ‌ల్‌) నిర్వ‌హిస్తోంది. 

అర్హ‌త‌లు

ఎంబీఏ చేయాల‌ని ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు 50% మార్కుల‌(ఎస్సీ/ ఎస్టీలు 40శాతం)తో మూడు లేదా నాలుగేళ్ల ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ బీసీఏ/ బీటెక్‌/ బీఫార్మ‌సీ/ ఓరియంట‌ల్ లాంగ్వేజె‌స్ మిన‌హాయించి) ఉత్తీర్ణ‌త సాధించాలి‌.
ఎంసీఏలో ప్ర‌వేశం పొందాల‌నుకుంటే 50% మార్కుల(ఎస్సీ/ ఎస్టీలు 40శాతం)తో మూడేళ్ల బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణులు కావాలి. 10+2 లేదా గ్రాడ్యుయేష‌న్ స్థాయిలో మ్యాథ‌మేటిక్స్ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించాలి. యూజీసీ-2013 నిబంధ‌న‌ల ప్ర‌కారం దూర విద్యలో డిగ్రీ చేసిన, డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారూ అర్హులే. అభ్య‌ర్థులు టీఎస్ఐసెట్-2021లో 25% మార్కులు సాధిస్తే స‌రిపోతుంది. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులకైతే క‌నిష్ఠ మార్కులూ లేవు. ‌‌

ప‌రీక్షా విధానం

ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు టీఎస్ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో మూడు సెక్ష‌న్లు ఉంటాయి. 200 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 200 ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు రాయాల్సి ఉంటుంది. అన‌లైటిక‌ల్ ఎబిలిటీ(75), మ్యాథ‌మెటిక‌ల్ ఎబిలిటీ(75), క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ నుంచి 50 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ప‌రీక్షా స‌మ‌యం రెండున్న‌ర (150 నిమిషాలు) గంట‌లు.

ప‌రీక్ష కేంద్రాలు

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో క‌లిపి మొత్తం 14 ప్రాంతీయ ఆన్‌లైన్ ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, కోదాడ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, సిద్దిపేట‌, నిజామాబాద్, వ‌రంగ‌ల్, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, వైజాగ్ ప‌ట్ట‌ణాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. 

కోర్సుల‌ను అందిస్తున్న విశ్వ‌విద్యాల‌యాలు

 ప్రొ.జ‌య‌శంక‌ర్ అగ్ర‌క‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ (పీజేఏయూ), హైద‌రాబాద్‌

 డాక్ట‌ర్‌.బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (డా.బీఆర్ఏఓయూ), హైద‌రాబాద్‌

 జేఎన్‌టీయూ, హైద‌రాబాద్

‣ ఉస్మానియా యూనివ‌ర్సిటీ (ఓయూ), హైద‌రాబాద్‌

 కాక‌తీయ యూనివ‌ర్సిటీ (కేయూ), వ‌రంగ‌ల్‌

‣ మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ (ఎంజీయూ), న‌ల్గొండ‌

‣ పాల‌మూరు యూనివ‌ర్సిటీ (పీయూ), మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌

‣ శాతావాహ‌న యూనివ‌ర్సిటీ (ఎస్‌యూ), క‌రీంన‌గ‌ర్‌

‣ తెలంగాణ యూనివ‌ర్సిటీ (టీయూ), నిజామాబాద్‌

ఈ యూనివ‌ర్సిటీల గుర్తింపు పొందిన‌/ ఏ అనుబంధ క‌ళాశాల‌లోనైనా ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. క‌ళాశాల‌లో అవ‌కాశాన్ని బ‌ట్టి ఫుల్‌టైం/ పార్ట్‌టైం/ ఈవినింగ్/ డిస్టెన్స్ మోడ్/ డీఓఎల్‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌

ఆస‌క్తితోపాటు అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష రుసుముగా ఎస్టీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ విద్యార్థులు రూ.450, ఇత‌రులు రూ.650 చెల్లించాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏప్రిల్ 7, 2021న ప్రారంభ‌మై జూన్ 15, 2021న ముగుస్తుంది. రూ.250 ఆల‌స్య రుసుముతో జూన్ 30, రూ.500తో జులై 15, రూ.1000తో ఆగ‌స్టు 11వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ప‌రీక్ష ఆగ‌స్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల‌పాటు నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టిరోజు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు; మ‌రుస‌టి రోజు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగ‌నుంది. 

సిల‌బ‌స్ - ప్ర‌ణాళిక‌‌

ఐసెట్‌ప్ర‌వేశ ప‌రీక్ష‌లో మూడు సెక్ష‌న్లు ఉంటాయి. సెక్ష‌న్ ఎలో డేటా స‌ఫిషియ‌న్సీ నుంచి 20, ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 55 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. సెక్ష‌న్ బిలో అరిథ్‌మెటిక్ ఎబిలిటీ(35), జామెట్రిక‌ల్ అండ్ ఆల్‌జిబ్రా ఎబిలిటీ (30), స్టాటిస్టిక‌ల్ ఎబిలిటీ నుంచి 10 ప్ర‌శ్న‌లు అడుగుతారు. సెక్ష‌న్ సిలో వొకాబుల‌రీ(10), ఫంక్ష‌న‌ల్ గ్రామ‌ర్ (15), బిజినెస్ అండ్ కంప్యూట‌ర్ టెర్మినాల‌జీ(10), రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్ నుంచి 15 ప్ర‌శ్న‌ల వెయిటేజీ ఉంటుంది. 

అకడమిక్‌పరీక్షలతో పోలిస్తే పోటీ పరీక్షలు భిన్నమైనవి. ప్రణాళిక ప్రకారం చదివితే సుల‌భంగా మార్కులు సాధించ‌వ‌చ్చు. ఐసెట్‌లో సమయపాలన చాలా కీలకం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబ‌ట్టాలి. సమాధానం కష్టమైన ప్రశ్నల వ‌ద్ద స‌మ‌యం వృథా చేయ‌కుండా ఇత‌ర ప్ర‌శ్న‌ల‌కు వెళ్లాలి. మౌలిక అంశాలపై ప‌ట్టు తెచ్చుకోవ‌డం, మాక్‌పరీక్షలు రాయడం అనే రెండు అంచెల్లో సన్నద్ధతను రూపొందించుకోవాలి. మొదటి అంచెకు ఎక్కువ సమయం తీసుకోరాదు. కేవలం 10 నుంచి 15 రోజుల సమయం చాలు. అయితే గ్రాడ్యుయేషన్‌చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్‌పరీక్షల షెడ్యూల్‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా చూసుకోవాలి. వీలైనన్నీ మాక్‌పరీక్షలు రాయాలి. తక్కువ మార్కులు వస్తున్న అంశాలకు సంబంధించి అధ్యాయాల వారీగా ఎక్కువ దృష్టిసారించాలి. ఈ సంవత్సరమే డిగ్రీ చివరి సంవత్సరం ప‌రీక్ష‌లు రాసిన అభ్యర్థులు ఈ అంశాల‌ను గుర్తుంచుకోవాలి.

ముందుగా సెక్ష‌న్-బి

సెక్షన్‌బి నుంచి పరీక్షకు సిద్ధం కావడం మంచిది. సెక్షన్-బిలో నేర్చుకున్న అరిథ్‌మెటిక్‌సెక్షన్‌ఎకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే ముందుగా అరిథ్‌మెటిక్‌ఎబిలిటీ చూడాలి. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటే తేలికగా సమాధానాలు గుర్తించొచ్చు. ఇందుకు న‌మూనా, గ‌త ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను తిర‌గెయ్యాలి.

ఇంగ్లిష్ ప‌ట్టు సాధించాలంటే..

నిత్యం ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీనిపై పట్టు పెంచుకోవచ్చు. కొత్తగా వచ్చే ఆంగ్ల పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. వాటికి నానార్ధాలు, వ్యతిరేక అర్థాలను కూడా తెలుసుకోవాలి. ఫంక్షనల్‌గ్రామర్‌లో వ్యాకరణానికి సంబంధించిన అంశాలు కీలకం. వివిధ భాగాల వాడకం, ఒక వాక్యంలో సబ్జెక్ట్, వర్బ్‌అగ్రిమెంట్, టెన్సెస్‌సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. డిగ్రీ రెండో సంవత్సరం వరకు ఎలాగూ గ్రామర్‌చదివి ఉంటారు కాబట్టి, పాత ప్రశ్నలను ఒకసారి పరిశీలించాలి. కొన్ని మాక్‌పరీక్షలు రాస్తే సరిపోతుంది.

కాంప్రహెన్షన్‌లో మంచి మార్కులు సాధించడానికి సాధనే ఏకైక మార్గం. నిత్యం ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను చదివి, అందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందో పరిశీలించాలి. అందులో వచ్చే కొత్త పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకొనే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. దీని ద్వారా వొకాబులరీలో కూడా పట్టు లభిస్తుంది.

బిజినెస్‌అండ్‌కంప్యూటర్‌టెర్మినాలజీ అన్నది కొత్త అంశం. కేవలం పదాలు తెలుసుకుంటే సరిపోతుంది. బిజినెస్‌టెర్మినాలజీ కోసం కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు దినపత్రికలలో వచ్చే వ్యాపార సంబంధ పదాలను చదివితే సరిపోతుంది. నిత్యం వాడుకలో ఉండే వ్యాపార సంబంధిత పదాలను కూడా తెలుసుకోవాలి.‌‌


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: జూన్ 15, 2021

వెబ్‌సైట్లు: 

http://​​​​​​​https://icet.tsche.ac.in/

https://kakatiya.ac.in/

https://www.tsche.ac.in/

Posted Date : 07-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌