• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సైనిక మ‌హిళా క‌ళాశాల‌లోకి స్వాగ‌తం!

బీఎస్సీ, బీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ప్ర‌క‌ట‌న‌

దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌) మహిళలకు అవకాశాలు పెరిగాయి. విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం రాఘవాపురం శివారులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల తర్ఫీదునిస్తోంది.  

ఇక్కడ ఉచిత విద్యాబోధనతో పాటు మహిళలను మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసి దేశరక్షణలో భాగస్వాములను చేసేందుకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ప్రవేశ ప్రకటన విడుదలైంది. 

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆ డిగ్రీ కళాశాలను 2018 అక్టోబరులో తెలంగాణ సోషల్‌ వెల్‌ఫెర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ (టీఎస్‌డబ్యూఆర్‌ఏఎఫ్‌పీడీసీడబ్ల్యూ)గా మార్చారు.  ప్రస్తుతం 376 మంది డిగ్రీ విద్యార్థినులు సైనిక శిక్షణ పొందుతున్నారు. ఈ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు గోపు చాముండేశ్వరి (బెల్లంపల్లి), డప్పు లయ (సంగారెడ్డి), బొంతు సీతారావమ్మ (ఖమ్మం), తేజశ్రీ (మహబూబ్‌నగర్‌)లు ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో అర్హత సాధించారు.  

శిక్షణ తీరు..

జాతీయస్థాయి సైనిక శిక్షణకు ఏ మాత్రం తీసిపోకుండా తర్ఫీదు ఇస్తున్నారు. ఇందుకు అవసరమైన వ్యాయామశాల, మైదానం, పరికరాలు ఇక్కడ ఉన్నాయి. రోజూ ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు సైనిక శిక్షణ లభిస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు డిగ్రీ తరగతులు ఉంటాయి. అనంతరం 5 గంటల వరకు సైనిక శిక్షణ ఇస్తారు. మొత్తంగా విద్యార్థినులకు డిగ్రీ కోర్సులతో పాటు మేజర్‌ ఉషాకుమార్‌ శర్మ ఆధ్వర్యంలో నలుగురు శిక్షకులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. 

ఏ కోర్సులున్నాయి?

బీఎస్సీ: ఎంపీసీ 

బీఏ: హెచ్‌ఈసీ

అర్హతలు.. దరఖాస్తు విధానం

ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థినులకు అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థినులు కనీసం 5.2 అడుగుల ఎత్తు, 45-50 కిలోల బరువు ఉండాలి. విజన్, ఫిజికల్‌ పరీక్షలతోపాటు రాత పరీక్షలు నిర్వహించి మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తున్నారు. కళాశాలకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ సంవత్సరం ఒక్కో కోర్సుకు 120 మంది చొప్పున 240 మంది విద్యార్థినులకు అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 31 చివరి తేది. రూ.100 చెల్లించి https://tswreis.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉపాధికి  అధిక అవకాశం - బాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ 

సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు సైనిక శిక్షణ ఇప్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ఇది విద్యార్థినులకు మంచి అవకాశం. సద్వినియోగం చేసుకుంటే ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్, పారామిలిటరీ పోలీసు విభాగాల్లో చేరిపోవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ చదివినవారందరికీ ఉపాధి దొరికే మంచి అవకాశం ఉంది. 


 

Posted Date : 27-04-2021 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం