• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీజే కావాలని అనుకుంటున్నారా?

డీజే... మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగల సత్తా ఉన్నవారిని ఆకర్షించే కెరియర్‌ ఆప్షన్‌! ఇప్పుడు పెద్దపెద్ద ఈవెంట్లలో వీరిదే హవా. సంగీతం పట్ల ఆసక్తి, జన సమూహాలను ఉత్సాహపరచగల నైపుణ్యాలు, సౌండ్‌ మిక్సింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్లను ఉపయోగించడం, సొంతంగా మార్కెట్‌ చేసుకునే వ్యూహాలు... ఇవన్నీ కలిసినవారే సరైన డీజే. ఇలాంటి వారికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఒక ప్రదర్శనకు లక్షల్లో పారితోషికం ఇచ్చేంత డిమాండ్‌ ఉందంటే ఇది ఎంత లాభదాయకమో అర్థమవుతోంది కదా!

 

 

డీజేయింగ్‌లో ఎదుటివారిని మన సంగీతంతో మెప్పించడమే ప్రథమ కర్తవ్యం. డీజే పూర్తి రూపం డిస్క్‌ జాకీ. ముందుగా రికార్డ్‌ చేసిన సంగీతాన్ని శ్రోతల కోసం వినిపించేవారే డీజే. ఇందులో 4 రకాలున్నాయి. 

రెసిడెంట్‌ డీజే: ఏదైనా ఒక రెస్టారెంట్, హోటల్, క్లబ్‌లో తరచూ లేదా పూర్తిస్థాయిలో ప్రదర్శనలు ఇచ్చేవారిని రెసిడెంట్‌ డీజే అంటారు. ప్రతి ప్రదేశానికి దానికంటూ ఒక థీమ్, అలవాటుపడిన సందర్శకులు ఉంటారు. డీజేలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యాపార వృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆహూతులను అలరిస్తూ డ్యాన్స్‌ ఫ్లోర్‌ను బిజీగా ఉంచేలా చూసుకోవాలి.

మొబైల్‌ డీజే: కార్పొరేట్‌ పార్టీలు, ఇతర ప్రైవేట్‌ ఈవెంట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారే వీరు. సొంతంగా సౌండ్‌ ఎక్విప్‌మెంట్‌ సమకూర్చుకోవడం, బృందంతో కలిసి పనిచేయడం అవసరం. షోను సమర్థంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం, సమూహాన్ని రంజింపజేయడం ఆవశ్యకం.

రేడియో డీజే: రేడియో జాకీ లాగా¸û ఆన్‌ ఎయిర్‌ పనిచేసేవారే రేడియో డీజే. స్థానికంగా ఉన్న ఎఫ్‌ఎం చానెళ్లలో సంగీతాన్ని వినిపించేలా పూర్తిస్థాయి ఉద్యోగాలు చేసేవారు ఈ కోవలోకి వస్తారు.

ఈవెంట్‌ అండ్‌ ఫెస్టివల్‌ డీజే: వేలల్లో జనం ఉండే పెద్ద ఈవెంట్లకు ప్లే చేసేవారు వీరు. పేరున్న మ్యూజిక్‌ ఫెస్ట్‌లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.  కళాకారులుగా అయినా పాటకు అయినా గుర్తింపు వచ్చి, అభిమానుల సంఖ్య ఎక్కువవున్న వారంతా ఈ విభాగంలోకి వస్తారు.

డీజేలు సొంతంగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేయరు. ఇదివరకే రికార్డ్‌ అయి ఉన్న సంగీతాన్ని ఆకట్టుకునేలా వినిపిస్తారు. సొంతంగా కూడా ట్యూన్స్‌ చేసేవారూ ఉన్నారు, వారిని ప్రొడ్యూసర్స్‌ అంటారు.

 

సాఫ్ట్‌వేర్ల సాయంతో..

డీజేలు ఉపయోగించేందుకు ఇప్పుడు అనేక రకాలైన సాఫ్ట్‌వేర్లు, యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉచితంగా సేవలు అందించేవి, రుసుం కట్టాల్సినవి కూడా ఉన్నాయి. వీటన్నింటి మీద సరైన అవగాహన పెంచుకుంటే పని నేర్చుకోవడం సులభం అవుతుంది. ఇందులో రికార్డెక్స్, సెరటో, ట్రాక్‌టోర్‌ వంటి వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫాంలతో ప్లేలిస్ట్‌లు తయారుచేయడం వంటి పనులు చేసేందుకు వీలుంటుంది. కీబోర్డ్, మౌస్‌లను ఉపయోగిస్తూ వర్చువల్‌గానూ మిక్సింగ్‌ చేయొచ్చు.

 

కావాల్సిన నైపుణ్యాలు

ఏ రకమైన సంగీతాన్నైనా... ఎంత ప్రభావవంతంగా వినిపిస్తున్నామనేది తెలుసుకోవాలి. సందర్భానికి తగినట్టుగా పాటలను ఎంచుకోవడం, శ్రోతలను దృష్టిలో పెట్టుకుని మిక్సింగ్‌ చేయడం, బీట్‌ను ఎంపిక చేసుకోవడం వంటివి ఇందులో ప్రధానం. సాంకేతిక నైపుణ్యాలు కూడా ముఖ్యమే. తదుపరి సొంతంగా విపణిని అధ్యయనం చేయడం, పోటీని తట్టుకుని మన ప్రత్యేకతలు ఏంటో స్పష్టంగా తెలియజేయడం, పూర్తిస్థాయిలో పని దొరికేలా కాంటాక్ట్‌లు పెంచుకోవడం వంటివి చేయాలి. డీజే సెటప్, కంట్రోలర్లు, అప్లికేషన్లు వంటివి కొనుగోలు చేసేందుకు కొంత పెట్టుబడి అవసరం. 

మ్యూజిక్‌ స్కూల్స్, డీజే అకాడమీలో ప్రవేశం పొందితే క్యూయింగ్, లూపింగ్, మిక్సింగ్, ఈక్విటీ, బీట్‌మ్యాచింగ్‌ వంటి అంశాలపై శిక్షణ పొందొచ్చు.

 

కోర్సులు అందించే ప్రముఖ సంస్థలు :

ఐ లవ్‌ మ్యూజిక్‌ అకాడమీ - గుర్గావ్, 

ఎలక్ట్రానిక్‌ అకాడమీ-దిల్లీ, 

జాజీ జోయ్‌ - దిల్లీ, 

స్క్రాచబుల్‌ డీజే అకాడమీ - చెన్నై, 

గ్లోబల్‌ డీజే మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ అండ్‌ డీజే ట్రైనింగ్‌ అకాడమీ - ముంబై, 

స్పిన్‌ గురూస్‌ - దిల్లీ. 

 

ప్రముఖ కోర్సులు : 

వీటిలో పార్ట్‌టైం, ఫుల్‌టైం, వీకెండ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో నేర్చుకునే అవకాశం ఉంది. 

ప్రొ డీజే, డీజే ప్రొడ్యూసర్, 

ప్రొఫెషనల్‌ డీజే, 

మొబైల్‌ డీజే, 

టర్నటబ్లిస్ట్‌ వినైల్, 

అడ్వాన్స్‌డ్‌ ప్రొఫెషనల్‌ డీజే, 

రాక్‌స్టార్‌ డీజే వంటి అనేక రకాలున్నాయి. 

కోర్సు రకం, వ్యవధిని బట్టి రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకూ ఫీజు ఉంటుంది.

 

ప్రతికూలతలు

డీజేయింగ్‌ను కెరియర్‌గా ఎంచుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి.

1. పూర్తిస్థాయిలో అవకాశాలు దొరక్కపోవచ్చు. ముఖ్యంగా చిన్న నగరాల్లో వీరికి ఉపాధి తక్కువ. 

2. సరైన గుర్తింపు వచ్చేవరకూ తక్కువ పారితోషికానికే పనిచేయాల్సి రావడం. 

3. మార్కెట్‌లో విస్తరించడం, పని వెతుక్కోవడం సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది.
 

Posted Date : 09-06-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌