• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిజైనింగ్ రంగంలో మెర‌వాలంటే..!

ఎన్ఐడీలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

విశ్వంలో ప్ర‌తిఒక దానికి ఒక రూపం ఉంటుంది. అది మ‌న కంటికి క‌నిపించేది కావ‌చ్చు, క‌నిపించ‌నిదైనా అయి ఉండ‌వ‌చ్చు. వాటిలో కొన్ని ప్ర‌కృతి సిద్ధంగా ఏర్ప‌డితే.. మిగ‌తా వాటిని మ‌నిషి త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాడు. మొద‌ట‌ఆదిమాన‌వుడు త‌న మ‌నుగ‌డ కోసం ఏదో ఒక ఆకృతిలో వ‌స్తువుల‌ను త‌యారు చేసుకున్నాడు. ఆ త‌ర్వాతి త‌రాల వారంతా త‌మ నైపుణ్యాలు ప్ర‌ద‌ర్శిస్తూ వాటిని కంటికి ఇంపుగా క‌నిపించేలా త‌యారు చేయ‌డం ప్రారంభించారు. దీంతో అది ఒక క‌ళ‌గా మారింది. మ‌నం ఎప్పుడైనా కొన్ని వ‌స్తువుల‌ను చూడ‌గానే క‌ళ్లు చెమ్మ‌గిల్లి పోతాయి. ఆ ఆకృతుల‌ను చూసి ఆక‌ర్షితులమ‌వుతాం. వాటిని అలా రూపుదిద్ద‌డానికి కృషి చేసే వారే డిజైన‌ర్లు. వీరంతా ఒక వ‌స్తువును త‌మ ప్ర‌తిభ‌తో ఎన్నో ర‌కాలుగా తీర్చిదిద్దుతుంటారు.  వీరికి ఆ క‌ళ‌పై ఉన్న ఆస‌క్తిని ప్రోత్స‌హించి, కావాల్సిన నైపుణ్యాలను ప్ర‌త్యేకంగా నేర్పించేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు వెలిశాయి. దీంతో క‌మ్యూనికేష‌న్ డిజైన్‌, ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్‌, టెక్స్‌టైల్, లైఫ్‌స్టైల్‌, ఫ్యాష‌న్‌డిజైన్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఇంట‌ర్ డిసిప్లిన‌రీ డిజైన్ స్ట‌డీస్ అంటూ చాలా విభాగాలు అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌న‌దేశంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) స్కూళ్ల‌‌ను స్థాపించి వీటిని మ‌న‌కు ప‌రిచ‌యం చేసింది. ప్ర‌స్తుతం వీటిలో బ్యాచిల‌ర్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్‌డీ చేసేందుకు అవ‌కాశం వ‌చ్చింది. ఇందుకు సంబంధించి 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌వేశాలు కోరుతూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

అర్హ‌త‌

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ కోర్సు కాల వ్య‌వ‌ధి నాలుగు సంవ‌త్స‌రాలు. దీనికి ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన ఏదైనా క‌ళాశాల‌లో 2020-21 విద్యాసంవ‌త్స‌రంలో ఇంట‌ర్మీడియ‌ట్, పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జ‌న‌ర‌ల్/ ఈడ‌బ్ల్యూఎస్/ విదేశీ విద్యార్థులు జులై 1, 2001 త‌ర్వాత‌, ఓబీసీ/ ఎస్టీ/ ఎస్సీలు జులై 1, 1998 త‌ర్వాత‌, దివ్యాంగులు జులై 1, 1996 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. విదేశీ విద్యార్థుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హ‌రియాణ‌, అస్సాం రాష్ట్రాల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ చేసేందుకు అవ‌కాశం లేదు. మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాం కాల వ్య‌వ‌ధి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు. ఈ కోర్సుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే బ్యాచిల‌ర్/ డిప్లొమా ఇంజినీరింగ్ లేదా డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించాలి. ‌జ‌న‌ర‌ల్/ ఈడ‌బ్ల్యూఎస్/ విదేశీ‌విద్యార్థులు జులై 1, 1991 త‌ర్వాత‌, ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీలు జులై 1, 1988 త‌ర్వాత‌, దివ్యాంగులు జులై 1, 1986 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి.  

ఎంపిక ఎలా?

విద్యార్థుల ఎంపిక రెండు ద‌శ‌ల్లో ఉంటుంది. మొద‌ట డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ప్రిలిమ్స్ నిర్వ‌హిస్తారు. బ్యాచిల‌ర్ కోర్సు ద‌ర‌ఖాస్తుదారుల‌కు ప్రిలిమ్స్‌లో 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. మూడు గంట‌ల స‌మ‌యం ఇస్తారు. ప్ర‌శ్న‌లు టెక్ట్స్, విజువ‌ల్స్ రూపంలో ఉండ‌వ‌చ్చు. ఇందులో ఉత్తీర్ణులైతే మెయిన్స్‌కు అర్హ‌త సాధిస్తారు. మాస్ట‌ర్ ప్రోగ్రాం విద్యార్థుల‌కు డీఏటీ ప్రిలిమ్స్ 100 మార్కుల‌కు ఉంటుంది.ఇందులో కామ‌న్ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీడీఏటీ) తో పాటు ద‌ర‌ఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం 2.30 గంట‌లు. రెండు విభాగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి కామ‌న్ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌తో పాటు రెండు డిసిప్లిన్ స్పెసిఫిక్ టెస్టులు ఉంటాయి. వీరికి ప‌రీక్షా స‌మ‌యం 4.30 గంట‌లు. (సీడీఏటీకి 30 నిమిషాలు, ఒక్కో సంబంధిత విభాగానికి రెండు గంట‌లు).  ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఒక విద్యార్థి రెండు విభాగాల కంటే మించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం లేదు. జ‌న‌ర‌ల్ విద్యార్థుల‌కు 10, ఓబీసీల‌కు 27, ఎస్సీల‌కు 15, ఎస్టీల‌కు 7.5 శాతం రిజ‌ర్వేష‌న్లు కేటాయించారు.  

దేశంలో ఎక్క‌డెక్క‌డ‌..

1961లో మొద‌ట అహ్మ‌దాబాద్ (గుజ‌రాత్‌)లో ఆ త‌ర్వాత గాంధీన‌గ‌ర్ (గుజ‌రాత్‌), బెంగ‌ళూరు(క‌ర్ణాట‌క‌), విజ‌య‌వాడ (ఆంధ్ర‌ప్ర‌దేశ్), కురుక్షేత్ర (హ‌రియాణ), జోర్‌హ‌ట్ (అస్సాం)‌, భోపాల్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ల‌ను నెల‌కొల్పారు. కేంద్ర శాస్త్ర‌, సాంకేతిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్ రిసెర్చ్ విభాగం ఎన్ఐడీని శాస్త్రీయ‌, పారిశ్రామిక రూప‌క‌ల్ప‌న ప‌రిశోధ‌న సంస్థ‌గా గుర్తించింది. 

బ్యాచిల‌ర్ కోర్సులో అందుబాటులో ఉన్న సీట్లు

అహ్మ‌దాబాద్  125

ఆంధ్ర‌ప్ర‌దేశ్   75

హ‌రియాణ     75

మ‌ధ్య‌ప్ర‌దేశ్   75

అస్సాం      75

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాంలో విభాగాలు

యానిమేష‌న్ ఫిల్మ్ డిజైన్‌

ఎగ్జిబిష‌న్ డిజైన్‌

ఫిల్మ్ & వీడియో క‌మ్యూనికేష‌న్‌

గ్రాఫిక్ డిజైన్ 

సిరామిక్ & గ్లాస్ డిజైన్‌

ఫ‌ర్నీచ‌ర్ & ఇంటీరియ‌ర్ డిజైన్ 

ప్రొడ‌క్ట్ డిజైన్‌

టెక్స్‌టైల్ డిజైన్

మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాంలో...

యానిమేష‌న్ ఫిల్మ్ డిజైన్‌

ఫిల్మ్ & వీడియో క‌మ్యూనికేష‌న్‌

గ్రాఫిక్ డిజైన్ 

ఫొటోగ్ర‌ఫీ డిజైన్‌

సిరామిక్ & గ్లాస్ డిజైన్‌

ఫ‌ర్నీచ‌ర్ & ఇంటీరియ‌ర్ డిజైన్ 

ప్రొడ‌క్ట్ డిజైన్‌

టాయ్ & గేమ్ డిజైన్‌

ట్రాన్స్‌పొర్టేష‌న్ & ఆటోమొబైల్ డిజైన్‌ 

యూనివ‌ర్స‌ల్ డిజైన్‌

డిజిట‌ల్ గేమ్‌డిజైన్‌

ఇన్ఫ‌ర్మేష‌న్ డిజైన్‌

ఇంట‌రాక్ష‌న్ డిజైన్‌

న్యూ మీడియా డిజైన్‌

డిజైన్ ఫ‌ర్ రిటైల్ ఎక్స్‌ఫిరియ‌న్స్‌

స్ట్రాటెజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్

అప్ప‌రెల్‌(దుస్తులు) డిజైన్‌

లైఫ్‌స్టైల్ యాక్సిస్సోరీ డిజైన్‌

టెక్స్‌టైల్ డిజైన్

ఫీజులు

బ్యాచిల‌ర్ ప్రోగ్రాంలో ఎనిమిది సెమిస్ట‌ర్ల‌కు హాస్ట‌ల్ ఫీజుతో క‌లిపి సుమారు రూ.14 ల‌క్ష‌లు, మాస్ట‌ర్ ప్రోగ్రాంలో ఐదు సెమిస్ట‌ర్ల‌కు హాస్ట‌ల్ ఫీజు కాకుండా దాదాపు రూ.9.5లక్ష‌లు ఖ‌ర్చ‌వుతుంది. వీరికి మెస్ ఛార్జీలు వేరుగా ఉంటాయి.  

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు

హైద‌రాబాద్‌, విజ‌యవాడ‌.

ద‌ర‌ఖాస్తు విధానం

బ్యాచిల‌ర్‌, మాస్ట‌ర్ ప్రోగ్రాంల‌పై ఆస‌క్తి క‌లిగిన విద్యార్థులు జ‌న‌వ‌రి 8, 2021 నుంచి ఫిబ్ర‌వ‌రి 7, 2021 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు రుసుముగా జ‌న‌ర‌ల్/ ఈడ‌బ్ల్యూఎస్‌/ ఓబీసీలు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.1500, విదేశీ విద్యార్థులు రూ.5000 చెల్లించాలి. మాస్ట‌ర్ ప్రోగ్రాంలో రెండు విభాగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు రెట్టింపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండు కోర్సుల విద్యార్థుల‌కు ప్రిలిమ్స్ ప‌రీక్ష మార్చి 14, 2021న నిర్వ‌హిస్తారు. 

వెబ్‌సైట్ : https://admissions.nid.edu/
 

Posted Date : 25-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌