• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్వ్యూల్లో ఏయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు?

డిగ్రీ చదివిన అభిరామ్‌ మొదటిసారిగా ఇంటర్వ్యూకు వెళుతున్నాడు. అక్కడ తనను ఎలా పరిచయం చేసుకోవాలో.. ఎలాంటి ప్రశ్నలు వేస్తారో.. అనుకుంటూ సందేహాలతో సతమతం అవుతున్నాడు. మీరూ ఇలాగే ఆందోళన పడుతున్నారా... అయితే ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడగడానికి అవకాశం ఉండే ఈ ప్రశ్నల గురించి తెలుసుకుంటే ఫలితం ఉంటుంది. 

మీ గురించి చెప్పండి: అభ్యర్థికి ఉండే బెరుకుదనాన్ని పోగొట్టడానికి సాధారణంగా రిక్రూటర్లు ఈ ప్రశ్న వేస్తుంటారు. అభ్యర్థిగా మీ విద్యార్హతలు, అనుభవం లాంటి విషయాలన్నింటినీ రెజ్యూమెలో పొందుపరుస్తారు. అయిన్పటికీ ఈ ప్రశ్న వేస్తున్నారంటే అర్థం.. రెజ్యూమెలో ఉన్న విషయాలనే మళ్లీ చెప్పమని కాదు. అంతకుమించిన అదనపు వివరాలను మీ నుంచి వినడానికి ఆసక్తి చూపిస్తున్నారనే. ఈ సందర్భంగా మీకున్న లక్ష్యాల గురించి చెప్పొచ్చు. వాటి సాధన దిశగా మీరు చేస్తోన్న కృషినీ వివరించవచ్చు. అప్పటికే ఉద్యోగానుభవం ఉన్నవారైతే తాము చేసిన పనుల గురించి చెప్పొచ్చు. 

దీన్నే ఎందుకు ఎంచుకున్నారు: ఈ రంగంలో మీకు ఉన్న ఆసక్తిని తెలుసుకోవడానికే ఈ ప్రశ్న వేస్తారు. మీకు స్వతహాగా ఆసక్తి అనేది లేకపోతే ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోలేరు. ఆసక్తి ఉంటేనే ఇష్టంగా పనిచేయగలుగుతారు. పనిచేసే క్రమంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా భావించి ముందుకు వెళ్లగలుగుతారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. స్నేహితుల బలవంతం లేదా ఆర్థిక అవసరాల వల్ల ఈ రంగాన్ని ఎంచుకున్నాను... అని కాకుండా ఆసక్తితో ఇష్టపడే ఈ రంగాన్ని ఎంచుకున్నానని చెప్పాలి. 

మార్పులకు సిద్ధమేనా?: ఒక్కోసారి కార్యాలయంలో పనిచేయడానికి తీసుకున్న సిబ్బందిని ఫీల్డ్‌ వర్క్‌ కోసం బయటకు పంపిస్తుంటారు. అలాంటప్పుడు ఆఫీసులో ఉండి మాత్రమే పనిచేస్తానంటే కుదరదు. బయటకూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో స్పష్టత కోసమే ఈ ప్రశ్న వేస్తుంటారు. మార్పులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యోగావకాశాన్ని వదులుకున్నట్టే అవుతుంది. ‘ఇది నా మొదటి ఉద్యోగం. కొత్త విషయాలను తెలుసుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోను. తప్పకుండా ఫీల్డ్‌వర్క్‌కు కూడా వెళతాను’ అని సమాధానం చెప్పొచ్చు.

మీ బలం ఏమిటి?: అభ్యర్థి ఉద్యోగానికి తగినవాడో కాదో తెలుసుకోవడానికి సాధారణంగా ఈ ప్రశ్న వేస్తుంటారు. ‘ఒత్తిడికి గురిచేసే పరిస్థితుల్లోనూ కంగారు పడకుండా బాధ్యతలను నిర్వర్తించగలను. అలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురైతే సమస్య మరింత జటిలమవుతుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలను’ అని చెప్పగలగాలి.  

ఇప్పటివరకు సాధించిందేమిటి?: మీరు ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నను అడుగుతుంటారు. ఇలా అడగడం ద్వారా మీ లక్ష్యాల గురించీ తెలుసుకుంటారు. ఉదాహరణకు మీరు రాసిన ఒక కథనం ప్రముఖ మేగజీన్‌లో ప్రచురితం కావచ్చు. దాన్ని చదివిన నిపుణులు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. ఇదే విషయాన్ని మీరు చెబితే మీరు సాధించిన విజయాన్ని సందర్భానుసారం వెల్లడించినట్టు అవుతుంది. 

లక్ష్యసాధనకు ప్రణాళిక ఉందా?: ఎంపికచేసిన అభ్యర్థులు తమ సంస్థలో ఎక్కువ కాలంపాటు కొనసాగాలని కోరుకుంటారు రిక్రూటర్లు. అందుకే ఉద్యోగులకు లక్ష్యాలతోపాటు వాటిని సాధించే ప్రణాళిక కూడా ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు.. ‘నా ఉద్యోగ లక్ష్యాలను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలని రెండు రకాలుగా విభజించుకున్నాను. ఇలా చేయడం వల్ల వాటి మీదే దృష్టి కేంద్రీకరించి సాధించడం సులువవుతుంది. ప్రస్తుతం అకౌంట్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ కోర్సులో చేరాను. దీంతో ఉద్యోగ లక్ష్యాలను సులువుగా సాధించగలను అనుకుంటున్నా’ .. ఈ తరహా సమాధానం చెబితే సరిపోతుంది. 

జీతం ఎంత ఆశిస్తున్నారు?: మొదటిసారి ఇంటర్వ్యూ ఎదుర్కొంటోన్న అభ్యర్థులతోపాటు అనుభవం సంపాదించిన ఉద్యోగులకూ ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. మొదటిసారి ఇంటర్వ్యూకు హాజరైనవారైతే.. అనుభవంలేని అభ్యర్థులకు సంస్థ ఎంత వేతనం ఇస్తుందో.. నాకూ అంతే ఇవ్వమని అడగొచ్చు. అనుభవం ఉన్న అభ్యర్థులైతే గతంలో పనిచేసినప్పుడు ఎంత వచ్చేదో పే స్లిప్‌ చూపించి వేతనం అడగొచ్చు. 

ఏమైనా సందేహాలున్నాయా?: మీకు ఏమైనా సందేహాలుంటే అడగమని రిక్రూటర్లూ మిమ్మల్ని అడగొచ్చు. సంస్థకు లేదా మీరు చేరబోయే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. ఇలా అడగడం వల్ల ఈ ఉద్యోగం అంటే మీరు ఎంత ఆసక్తి చూపిస్తున్నారనే విషయం రిక్రూటర్లకు అర్థమవుతుంది. అలాగే సంస్థకు సంబంధించిన కొన్ని విషయాలను అధ్యయనం చేసిన తర్వాతే సందేహాలను అడిగారనే విషయమూ స్పష్టమవుతుంది. 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-01-2022 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం