• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగంలో ఎదుగుదల ఎందుకు లేదు?

ఒకేలాంటి విద్యార్హతలు, సమాన హోదాతో ఒకేరోజు ఉద్యోగంలో చేరిన కొంతమందిని పరిశీలిస్తే.. ఆసక్తికరమైన విషయాలెన్నో తెలుస్తాయి. కొందరు అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మరికొందరు చేరిన చోట అలాగే ఉండిపోతారు. దీనికి కారణాలెన్నో. అయితే వారిలో విషయ గ్రహణ సామర్థ్యం లేకపోవడం ప్రధానమని స్పష్టమవుతుంది. 

పరిధులు పెట్టుకోకుండా విస్తృతంగా పనిచేయాలన్నా, నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలన్నా, బృందాన్ని సమర్థంగా ముందుకు నడిపించాలన్నా గ్రహించే సామర్థ్యం ఎంతో అవసరం. దీన్ని మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలో చూద్దామా...

నేర్చుకోవడానికి ప్రాధాన్యం: పాఠ్యాంశాల్లో నేర్చుకున్న వాటికి, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా.. వాస్తవంగా చేయాల్సిన పనులకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. కాబట్టి పనిచేసే పద్ధతులను నిశితంగా పరిశీలించి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. వివిధ బృందాల మధ్య జరిగే మేధోమథనాన్ని అర్థంచేసుకోవాలి. వివిధ సమస్యలను అనుభవజ్ఞులు ఎలా పరిష్కరిస్తున్నారో గమనించాలి. అవసరమైనప్పుడు నోట్సు రాసుకోవాలి. కొన్ని చిట్కాలు, మార్గదర్శకాలను వారినే నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. ఆయా నైపుణ్యాలను అవసరమైనప్పుడు మీరూ అనుసరించవచ్చు. 

సానుకూల దృక్పథం: ప్రతి పనిని నిర్ణీత సమయం లోపల పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవచ్చు. అలాంటప్పుడు ప్రతికూల పరిస్థితి గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా దాన్నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించాలి. ప్రతి ఒక్కరూ పనులన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తికావాలనే కోరుకుంటారు. కానీ అవన్నీ ఎప్పుడూ అలా జరగకపోవచ్చు కూడా. అలాంటప్పుడు అనుభవజ్ఞుల సూచనలు తీసుకుని పాటించవచ్చు. వీటిని ఒకచోట రాసుకుంటే.. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది పడకుండా పాఠాల్లా ఉపయోగపడతాయి. ఇవన్నీ చేయాలంటే పరిస్థితులకు సానుకూలంగా స్పందించే నైపుణ్యం ఎంతో అవసరం. ఇదే లేకపోతే ప్రతి చిన్న విషయానికీ భయపడి ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడతారు. అలాంటప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఏమాత్రం ఉండదు. 

పొరపాట్లు జరిగినా..: అందరూ అన్ని పనుల్లోనూ పరిపూర్ణులు కాలేరు. పని నేర్చుకునే క్రమంలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి భయపడి పనిచేయడానికే సందేహించకూడదు. పొరపాటు జరగగానే వెంటనే కుంగిపోయి ఆ పని చేయడానికే భయపడకూడదు. ఇలాచేస్తే ఆ పనిని ఎప్పటికీ నేర్చుకోలేరు. అలాగని పొరపాట్లను తేలిగ్గానూ తీసుకోకూడదు. అలాంటివి పునరావృతం కాకుండా అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకోవాలి.

అడగడం మర్చిపోవద్దు: ఆఫీసులో ఒంటరిగానే అన్నీ సాధించాలంటే సాధ్యం కాకపోవచ్చు. చాలా విషయాల్లో మీకు అవగాహన లేకపోవచ్చు. అలాంటప్పుడు తెలియని విషయాలను సంబంధిత వ్యక్తులను అడిగి నేర్చుకోవడానికి ఇబ్బంది పడకూడదు. ప్రముఖులుగా గుర్తింపు పొందిన వ్యక్తులనే పరిశీలిస్తే.. వారి జీవితాల్లో ప్రేరణ నింపే, మార్గనిర్దేశం చేసే వ్యక్తులు ఉంటారనే విషయం అర్థమవుతుంది. అలాగే వివిధ అంశాల మీద మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం వల్ల కూడా మీ ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. ఒక సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం మీ సొంతం అవుతుంది. ఈ నైపుణ్యం ఉద్యోగ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 

మార్పును స్వాగతించాలి: పరిస్థితులకు అనుగుణంగా, మార్పులకు తగినట్టుగా మిమ్మల్ని మీరు మలచుకోవడం అనేది ఒక కళ. ఆఫీసులో విధులను నిర్వర్తించే క్రమంలోనూ కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. మీకున్న సాంకేతిక నైపుణ్యంతో వాటిని అందుకోవడం సాధ్యంకాకపోవచ్చు. అలాంటప్పుడు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పని గంటలు ముగిసిన తర్వాత కూడా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేదా మీకు అనుకూలమైన సమయాల్లో ఆన్‌లైన్‌ తరగతులకూ హాజరుకావచ్చు. మార్పులను అందిపుచ్చుకుంటూ అందుకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాలి. ఈ నైపుణ్యం వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. 
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌