• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వాయిదా పద్ధతిని వదిలించే మెలుకువలు

అర్జెంటుగా పని పూర్తిచేయాలి. సమయమేమో మించిపోతుంటుంది. కంగారుపడుతూ, కాలంతో పాటు పరుగెడుతూ పూర్తిచేయడానికి ప్రయత్నించడం! తాపీగా చేయాల్సినదాన్ని అనవసరంగా వాయిదా వేస్తూ.. చివర్లో హడావుడి పడే ఇలాంటి పరిసితి తరచూ విద్యారులకూ, ఉద్యోగులకూ అనుభవంలోకి వస్తుంటుంది. చిన్నగా కనిపిస్తున్నా.. ఒక్కోసారి ఇది పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి, ఈ విధానానికి ముందే చెక్‌ పెట్టేయాలి! 

కళాశాలలో అసైన్‌మెంట్‌ ఇచ్చారు. సునీల్‌.. తెలిసిన అంశమే కాబట్టి, సులువుగానే చేసెయ్యొచ్చని జాగు చేస్తూ వచ్చాడు. మరుసటి రోజే ఆఖరి రోజు. అయినా టీవీ చూస్తూ, వీడియోగేమ్‌లు ఆడుతూ గడిపేశాడు. తీరా సాయంత్రమయ్యేసరికి కంగారు మొదలైంది. ముందే పూర్తిచేసిన స్నేహితులది తీసుకుని కాపీ చేసుకుని, సమర్పించాల్సివచ్చింది.

శ్రావణ్‌.. చదువుతోపాటు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తాడు. ఇంకా ఇంటి పనుల్లో వాళ్ల అమ్మా, నాన్నకి సాయం చేస్తాడు. రోజు మొత్తం బిజీనే. అసైన్‌మెంట్‌ కాస్త కష్టంగా తోచింది. ఒక అవగాహన తెచ్చుకుని చిన్నగా చేద్దామనుకున్నాడు. ఈలోగా దాని సంగతే మర్చిపోయాడు. తీరా గడువు ముగిసే సమయానికి గుర్తొచ్చింది. కంగారుపడుతూ రోజంతా కష్టపడి పూర్తిచేశాడు. పేరుకు పూర్తిచేశాడు కానీ, చేసినదానిపై సంతృప్తి మాత్రం లేదు.

ఇక్కడ సునీల్, శ్రావణ్‌ ఇద్దరూ ఇచ్చిన పనిని జాగు చేస్తూ వచ్చారు. కానీ ఒకరిది బద్ధకమైతే ఇంకొకరిది ప్రొక్రాస్టినేషన్‌/ సాగదీత కింద చెప్పొచ్చు. సునీల్‌ సమయం, పనిమీద అవగాహన ఉండీ చేయలేకపోయాడు. శ్రావణ్‌ సరిగా సమయాన్ని మేనేజ్‌ చేయలేకపోయాడు. వాయిదా వేయడం వల్ల నష్టపోయాడు. 

చాలామంది విద్యార్థులూ, ఉద్యోగారులూ, ఉద్యోగులూ చివరి నిమిషంలో కంగారు పడుతూ పని పూర్తిచేస్తుండటం చూస్తుంటాం. ఒక్కోసారి ఎలాగోలా పూర్తిచేసినా.. ఇబ్బందిపడే అవకాశాలే ఎక్కువ. కాబట్టి, ఈ పద్ధతి సరికాదు.

కారణాలేంటి?

చేసే అంశంపై స్పష్టత లేకపోవడం

సరైన ప్రేరణ లేకపోవడం

ఎలా చేస్తామో, ఏమవుతుందోనన్న భయం

సరైన వనరులు లేకపోవడం

మర్చిపోవడం

సమయాన్ని సరిగా అంచనా వేయకపోవడం

ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం

విఫలమవుతారని భయపడటం  

అధిగమించాలంటే..

పక్కన పెట్టొద్దు: ఏదైనా ప్రాజెక్టు/ అసైన్‌మెంట్‌ ఇవ్వగానే తర్వాత చేద్దామని వెంటనే పక్కన పెట్టేయొద్దు. ముందు ఎంతసేపు పడుతుందో ఆలోచించుకోవాలి. కొద్దిసేపట్లో అయిపోతుందనిపిస్తే వెంటనే చేసేయండి. చాలా సమయం తీసుకునేవాటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. రెండింట్లో ఏదైనా మర్చిపోవడం ఉండదు, సకాలంలోనూ పూర్తిచేయొచ్చు.

జాబితా రాసుకోవాలి: ‘దీన్నెలా మర్చిపోతాం’, ‘ఎలాగూ గుర్తుంటుంది’ అన్న ధోరణితోనే ఎక్కువగా మర్చిపోతుంటాం. చేసేది చిన్నదైనా పెద్దదైనా ప్రతిదాన్నీ జాబితాగా రాసిపెట్టుకోవాలి. దాన్ని రోజులు, వారాలుగా రాసుంచుకోవాలి. పూర్తయిన వెంటనే దాన్ని కొట్టేయాలి. చేయాల్సిన పనులు తగ్గేకొద్దీ ఆనందం వేయడంతోపాటు ఉత్సాహమూ వస్తుంది. మానసికంగా సానుకూలత ఏర్పడే అవకాశమూ ఉంటుంది. అయితే ప్రాధాన్యక్రమంలో రాసుకోవడం ప్రధానం.

వీటికి దూరంగా ఉండాలి: చాలా సమయాల్లో పరధ్యానం, ఏకాగ్రతకు భంగం కలిగించేవాటికి దూరంగా ఉండటం అసాధ్యమే. అయితే వాటిని పట్టించుకోకుండా ఉండొచ్చు. ఉదాహరణకు- స్నేహితులెవరైనా వచ్చి మాట్లాడుతుంటారు.ఒక్కోసారి తర్వాత మాట్లాడుదామని చెప్పడం కొంచెం కష్టమే. ఇలాంటప్పుడు వారించలేము. కానీ కొనసాగించకుండా ఉండొచ్చు. ఎలాగంటే.. వాళ్లు మాట్లాడుతున్నపుడు వినడానికే పరిమితం కండి. మీ పనిని మీరు కొనసాగించండి. కాసేటపటికి వారే మిమ్మల్ని అరం చేసుకుంటారు. కావాలంటే పని పూర్తయ్యాక తిరిగి మాట్లాడొచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లో వచ్చే పదేపదే వచ్చే నోటిఫికేషన్ల శబ్దం ఇబ్బంది పెడుతుంటే.. మ్యూట్‌లో పెట్టొచ్చు.

ప్రదేశం విషయంలో..: చదువు/ పని సాగాలంటే వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోండి. గాలి, వెలుతురు చక్కగా ఉండేలా చూసుకోండి. ఎలాంటి ఆటంకమూ ఉండదనుకుంటే ఆహ్లాద‌కరమైన మ్యూజిక్‌నూ పెట్టుకోవచ్చు. 

కష్టమైనవి ముందు: చాలామంది ముందు సులువైన వాటిని పూర్తిచేసి, ఆపై కష్టమైనవాటి జోలికి పోదామనుకుంటారు. ఇదే ఆలస్యానికీ కారణమవుతుంది. ముందుగా కష్టమైనవాటిని పూర్తిచేస్తే తరువాత సులువైన వాటిని త్వరగా పూర్తిచేసుకోవచ్చు. వాటిని ‘త్వరగా చేయాల్సినవీ-ముఖ్యమైనవీ; ముఖ్యమైనవి కానీ సమయం ఉన్నవీ; త్వరగా పూర్తిచేయాలి కానీ అంత ప్రధానం కానివి; ప్రధానం కావు- అవసరమూ కావు’ ఇలా విభజించుకోవాలి. ఆ ప్రకారంగా పనిచేయాలి.

గడువు పెట్టుకున్నారా?: ప్రతి పనికీ గడువనేది ఎలాగూ ఉంటుంది. ప్రత్యేకంగా పెట్టుకునేదేముంది? అనుకోవద్దు. మీకు మీరుగా గడువు పెట్టుకోండి. ఆ సమయంలోగా పని పూర్తిచేసేలా కట్టుబడి ఉండండి. ఒకేసారి మొత్తం పూర్తిచేయాలన్న నియమమూ లేదు. చిన్న చిన్న టాస్క్‌లుగా విడగొట్టుకోండి. నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా చూసుకోండి. ఈ నియమం మిమ్మల్ని మీరు ప్రేరేపించుకునేలా చేయడంతోపాటు మరింత ఉత్సాహాన్నీ నింపుతుంది. 

అనుకూల సమయంలో: ఏదైనా పనిచేయాలన్నప్పుడు పొద్దున్నే/ తెల్లవారుజామున మొదలుపెట్టాలి లాంటి సలహాలు వస్తుంటాయి. నిజానికి ఒక్కొక్కరికి ఒక్కో సమయం అనుకూలం. హుషారుగా అనిపించే సమయాన్ని ఎంచుకుని చేయండి. వేరే వాళ్ల మాట విని పొద్దున్నే లేచినా.. నిద్ర సరిపోనపుడు ఆలోచనలు మాత్రం ఎలా వస్తాయి? శరీరం మాట వినండి, అది ఎప్పుడు సంసిద్ధంగా ఉంటే అప్పుడే చేయండి. 

ఒత్తిడి వద్దు: ‘విఫలమవుతుంది, చేయలేము’- ఇలా ప్రతికూలంగా భావించినప్పుడే చాలావరకూ పనులు ఆలస్యం చేయాలనిపిస్తుంది. ఫలితమే ఒత్తిడీ. కాబట్టి, ముందు పూర్తిచేయడం ద్వారా కలిగే లాభాలను అంచనా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా పూర్తిచేసుకుంటూ రావాలి. అలాగే పూర్తిచేసినదానికి అనుగుణంగా మధ్యలో చిన్న చిన్న విరామాలూ తీసుకోవచ్చు. కానీ సమయానికి కట్టుబడి ఉండటం మర్చిపోవద్దు. ఉదాహరణకు- విరామంలో భాగంగా ఒక ప్రోగ్రామ్‌ ఒక ఎపిసోడ్‌ చూశాక పని కొనసాగిద్దామనుకుంటే తప్పక దాన్ని పాటించాలి. తరువాతి టాస్క్‌ పూర్తిచేశాక ఏం చేయాలో ముందుగా నిర్ణయించుకున్నా ఉత్సాహంగా పని కొనసాగించగలుగుతారు.

సాయం తీసుకోవచ్చు: పూర్తిగా ఒకరి మీద ఆధారపడటం తప్పు కానీ.. సాయం తీసుకోవడంలో తప్పులేదు. అన్ని విషయాలూ తెలియాలనేమీ లేదు. కాబట్టి తెలిసినవారి సలహాలు తీసుకోవచ్చు. కాకపోతే అవతలి వ్యక్తికి సంబంధిత అంశంలో పరిజ్ఞానంతో పాటు మిమ్మల్ని ప్రోత్సహించేలా కూడా ఉండాలి. ఇంకా మీ సమయాన్ని కబుర్లు, అనవసర విషయాలతో వృథా చేయకూడదు. 

సత్వరమే ఆరంభించాలి: చాలావరకూ గమనించండి.. చేతిలో ఉన్న ప్రాధాన్యం ముందే తెలుస్తుంది. అయినా ఏదో వ్యాపకం కావాలనిపిస్తుంది. అందులో భాగంగానే ఒకసారి సోషల్‌ మీడియా అకౌంట్‌ తెరిచాక చేద్దాం, ఫలానా ప్రోగ్రామ్‌ చూశాకో, వారితో మాట్లాడాకో అని జాగు చేస్తుంటారు. ఇవన్నీ తెలియకుండానే సమయం వృథా చేసేస్తాయి. చేయాలనుకోగానే మొదలుపెట్టేయాలి. కావాలంటే మధ్యలో విసుగు అనిపించినా, అలసిపోయినా అప్పుడు వీటిని చేయొచ్చు. విరామంతోపాటు కొత్త ఉత్సాహంతో పని తిరిగి ఆరంభించగలుగుతారు.

Posted Date : 02-06-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌