• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రపంచం మెచ్చిన...‘మహో’పాధ్యాయుడు

‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’కు ఎంపిక‌

లండన్‌: మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్‌ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2020’ వరించింది! దీని కింద ఆయన రూ.7.38 కోట్ల (1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) నగదు బహుమతి అందుకోనున్నారు. ఉపాధ్యాయునిగా అత్యంత ప్రభావం చూపి, వృత్తిలో అత్యుత్తమంగా నిలిచిన వారికి వర్కే ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డును అందిస్తోంది. లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో డిసెంబ‌రు 3న‌ ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయనీ, తుది దశ ఎంపికలో మొత్తం పది మంది నిలవగా... రంజిత్‌ విజేతగా నిలిచారని ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు. సోలాపుర్‌ జిల్లా, పరిదేవాడికి చెందిన జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ (32) ఎంతో ఇష్టంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. గోదాము, గోశాల మధ్య శిథిలావస్థలో ఉన్న బడి భవనాన్ని బాగుచేయించారు. పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేసి... వాటిని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఆడియో, వీడియో, కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. గ్రామంలో బాల్య వివాహాలను నిర్మూలించారు. బాలికలు నూరు శాతం బడులకు హాజరయ్యేలా చొరవ తీసుకున్నారు. వారాంతాల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలకు తీసుకెళ్లి... సమాజం, వనరుల పట్ల అవగాహన కలిగిస్తున్నారు.

ఈ ప్రయత్నాల ఫలితంగా, ప‌రిదేవాడి జిల్లా ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ 2016 సంవ‌త్స‌రంలో జిల్లాలో ఉత్తమ పాఠశాలగా నిలిచింది. 98 శాతం విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తికాక‌ ముందు ఆయ‌న‌ ఆశించిన అభ్యాస ఫలితాలను సాధించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెల్లా తన హిట్ రిఫ్రెష్ పుస్తకంలో రంజిత్‌సిన్హ్ పనిని భారతదేశం నుంచి వచ్చిన మూడు కథలలో ఒకటిగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రంజిత్‌సిన్హ్‌ను ఇన్నోవేటివ్ రీసెర్చర్ ఆఫ్ ది ఇయర్‌-2016 గా ప్ర‌క‌టించింది. 2018 లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌కు చెందిన‌ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆయ‌న గెలుచుకున్నారు. 500కి పైగా వార్తాపత్రిక కథనాలు, బ్లాగులు రాయడంతో పాటు టెలివిజన్ చర్చల్లో పాల్గొనడం ద్వారా ఆయ‌న‌ తన పద్ధతులను విస్తృతం చేశారు. మొద‌ట ఐటీ ఇంజినీర్ కావాల‌నుకున్న రంజిత్ సిన్హ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఆశించినంత‌గా రాణించ‌లేక పోయారు. ఆయ‌న తండ్రి సూచ‌న మేర‌కు టీచింగ్ శిక్ష‌ణ‌ను ప్ర‌త్యామ్నాయంగా ఎంచుకున్నారు. చివ‌ర‌కు ప్ర‌పంచ మెచ్చే స్థాయికి ఎదిగారు.

ప్రపంచాన్ని మార్చేది ఉపాధ్యాయులే

ప్రపంచాన్ని నిజంగా మార్చగలిగేది ఉపాధ్యాయులే. సమాజానికి పంచి పెట్టడంలోనే వారు ఆనందం పొందుతారు. అందుకే నాకు వచ్చే ప్రైజ్‌ మనీలో సగం తోటి పోటీదారులతో పంచుకుంటా. ఉపాధ్యాయులుగా వారెంతో కృషి చేస్తున్నారు.

- రంజిత్‌ సిన్హ్‌ దిసాలే 

Posted Date : 09-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌