• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యువత ఉద్యోగాల సృష్టికర్తలుగా మారాలి..

* విశ్వవిద్యాలయాలు ఆ దిశగా కృషి చేయాలి
* మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
* ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) గ్లోబల్‌ సదస్సు 2020లో ఎం.వెంకయ్య నాయుడు

యువత ఉద్యోగార్థులుగా కాకుండా.. ఉద్యోగాలను సృష్టించే వారిగా మారాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో 65 శాతం మంది యువత ఉన్నారనీ, ప్రతిభావంతులైన యువత శక్తిసామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబ‌రు 8న టై గ్లోబల్‌ సదస్సు 2020 దృశ్యమాధ్యమ సదస్సును ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ‘విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక రంగంతో కలిసి అవి పనిచేయాలి. కార్పొరేట్‌ సంస్థలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాలి. ప్రపంచంలో మూడో అతి పెద్ద అంకుర నిలయంగా మన దేశం మారింది. టెక్‌ అంకురాల్లో 50 శాతం కరోనాకు ముందున్న పరిస్థితుల దిశగా పుంజుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అన్ని భారతీయ అంకుర సంస్థలు మంచి విజయాలు, ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయి. ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామిక దేశాలు సుసంపన్నంగా ఉన్నాయి. తద్వారా పారిశ్రామిక ప్రోత్సాహంతోపాటు ప్రజలకు సౌకర్యం, ఆనందం లభిస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడం లాభాల కోసమే కాదు.. విద్య, ఆరోగ్య సంరక్షణ, కనీస సౌకర్యాల కల్పన ద్వారా ప్రజల జీవన విధానాన్ని మెరుగు పర్చేందుకు ఇది మరింత కీలకం’ అని పేర్కొన్నారు.

కరోనా విసిరిన సవాళ్లు కొత్త అవకాశాలను సృష్టించాయని, ఇదే కాకుండా నానాటికీ పెరుగుతున్న అనేక సవాళ్లను వినూత్న ఆలోచనతో ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇలాంటి ఆలోచనలతో వచ్చిన ఔత్సాహిక అంకుర సంస్థలకు అనువైన వాతావారణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు సూచించారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలో వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తుందనీ, ఈ దిశగా ‘స్టార్టప్‌ ఇండియా’ ఎంతో బాగా పనిచేస్తోందని అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విజయాలు, సృష్టించే ఆర్థిక అవకాశాలు మన దేశానికే కాకుండా యావత్‌ ప్రపంచానికీ ఉపయోగపడతాయన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయనీ, అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తర్వాతి తరాలకు మార్గనిర్దేశనం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. చక్కటి అంకుర ఆలోచనలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయన్నారు. సిలికాన్‌వ్యాలీ లాంటి చోట్ల మాత్రమే కాకుండా.. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రతిభావంతులున్న ఇతర ప్రదేశాల్లోనూ ప్రంపంచస్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగం సానుకూల మార్గంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాపారాన్ని ఆరంభించడం చాలా క్లిష్టమైన పనిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనుభవం ఉన్న మార్గదర్శకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. టై గ్లోబల్‌ సదస్సు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు దిశా నిర్దేశం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  


భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి.. -మోదీ

కొవిడ్‌-19 తర్వాత పరిస్థితులను తట్టుకునేందుకు నిపుణుల అవసరం ఎంతో ఉందని, ఇది భారత్‌కు సానుకూలంగా మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టై గ్లోబల్‌ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఆరున్నరేళ్లుగా భారత ప్రభుత్వం ఎన్నో విస్తృత సంస్కరణలను ఎన్నో తీసుకొచ్చిందని, ఇవన్నీ ప్రజలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌-19 తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే వ్యాపార సంస్థలు నిలదొక్కుకుంటాయని సూచించారు. టై గ్లోబల్‌ సదస్సులాంటివి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంతో తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. 


ఎంఎస్‌ఎంఈల నుంచి 60% ఎగుమతులు - గడ్కరీ

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలు వెన్నెముకగా నిలుస్తున్నాయని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ  మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. దేశ జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) 30 శాతం వాటా ఉందని, కొన్నేళ్లలోనే ఇది 40శాతానికి చేరుకుంటుందని  48శాతం ఉన్న ఎగుమతులు 60శాతానికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌-19 ప్రభావాన్ని తట్టుకొని, పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ ఎంతో తోడ్పడుతోందని తెలిపారు. ఈ సదస్సులో టై గ్లోబల్‌ సమ్మిట్‌ అధ్యక్షుడు మహావీర్‌ శర్మ, టై హైదరాబాద్‌ విభాగం అధ్యక్షుడు పిన్నపురెడ్డి శ్రీధర్‌ రెడ్డి, భారత్‌తోపాటు, పలు దేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ దృశ్యమాధ్యమ సదస్సులో పాలుపంచుకున్నారు.


ఇంటింటా ఇన్నోవేటివ్‌తో అద్భుత ఫలితాలు.. - కేటీఆర్‌

ఆరేడేళ్ల క్రితం అంకుర సంస్థలు హైదరాబాద్‌ను పట్టించుకోలేదని, కానీ, ఇప్పుడు హైదరాబాద్‌ అంకుర సంస్థల చిరునామాగా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. టై గ్లోబల్‌ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అంకుర సంస్థల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకురాకముందే తెలంగాణ ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కొత్త సాధారణ ప్రపంచంలో అంకుర సంస్థల పాత్ర ఎంతో ఉందని, అందులో తెలంగాణ నుంచి వచ్చిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌ సవాళ్లు ఎదురైనప్పుడు తక్కువ ఖర్చుతో కరోనా నిర్ధారణ కిట్‌లు, వెంటిలేటర్ల తయారీ, కరోనా రోగుల పర్యవేక్షణ తదితరాల్లో ఇక్కడి అంకురాలు ప్రభుత్వంతో కలిసి పనిచేశాయని తెలిపారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఎన్నో సాంకేతికతలను అంకురాలే అభివృద్ధి చేశాయని, పారిశ్రామిక వ్యవస్థాపకతకు ప్రభుత్వాలతోపాటు, ప్రైవేటు, వ్యక్తుల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యను తీర్చని సాంకేతికత వృథా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటివ్‌ కార్యక్రమంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి వినూత్న ఆలోచనలు వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో టై అంతర్జాతీయ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా తమ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. 

Posted Date : 11-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌