• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Employment: సవాళ్లను అధిగమించేలా యువతను సిద్ధం చేద్దాం

ఉద్యోగ, ఉపాధిరంగ అనిశ్చితులను అధిగమించేలా సరికొత్త నైపుణ్యాలు

ఈనాడు, దిల్లీ: ఇది అత్యాధునిక సాంకేతిక యుగం. ఎప్పటికప్పుడు ప్రత్యేక నైపుణ్యాలను సొంతం చేసుకుంటేనే మనుగడ సాధ్యం. లేదంటే వెనుకబడిపోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో సంప్రదాయ ఉద్యోగాలకు కాలం చెల్లిపోతోంది. భవిష్యత్తులో రానున్న సాంకేతికతలను ముందుగానే పసిగట్టి అన్ని విధాలుగా సన్నద్ధం చేయగలిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దగలమని ‘యునిసెఫ్‌ జనరేషన్‌ అన్‌లిమిటెడ్‌’ సీఈవో కెవిన్‌ ఫ్రే అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ విభాగం యువతకు ఆధునిక నైపుణ్యాలు నేర్పించే క్రతువులో భాగంగా 10 నుంచి 24 ఏళ్ల వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ దేశాలతో పాటు మన దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలతోనూ ‘యువా’ పేరుతో కలిసి పనిచేస్తోంది. యువత సామాజిక, ఆర్థిక పురోగతికి బాటలు వేయడం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, వినూత్న ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించడం కోసం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణ విభాగం(టీఎస్‌ఐసీ)తో కలిసి ‘పాఠశాలల ఆవిష్కరణల సవాలు’కు శ్రీకారం చుట్టింది. ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా కెవిన్‌ ఫ్రే ...ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన వెల్లడించిన పలు ఆసక్తికరమైన విషయాలు క్లుప్తంగా...

ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల యువ జనాభా ఉంది. భారత్‌లో 10-24ఏళ్ల వయసున్న వారి సంఖ్య 33 కోట్లకు పైనే. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం మన ముందున్న అతిపెద్ద సవాలు. అదే సమయంలో భారత దేశం సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి ఇదో గొప్ప అవకాశం కూడా. యువత అవసరాలను అత్యవసర ప్రాతిపదికన తీర్చే లక్ష్యంతో యునిసెస్‌.. ‘జనరేషన్‌ అన్‌లిమిటెడ్‌’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా యువతకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు భవిష్యత్తు ఉద్యోగాలకు వారిని సిద్ధం చేస్తోంది. కొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దుతుంది.

భారత్‌లో ‘జనరేషన్‌ అన్‌లిమిటెడ్‌’ ఉద్యమం ‘యువా’ పేరుతో కొనసాగుతుంది.

విశ్లేషణాత్మక ఆలోచన, నూతన ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్‌ లిటరసీ వంటి 25 రకాల నైపుణ్యాలను సొంతం చేసుకునే యువతకు భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)అధ్యయనం ప్రకారం ఈ నైపుణ్యాలను 10-24 ఏళ్ల వయసు వారు చాలా సులభంగా సొంతం చేసుకోగలరు. ఇవి నేర్చుకునే క్రమంలో వారి చదువులకు ఎలాంటి అవరోధం కలగదు. ఇటువంటి యువత లక్ష్యంగానే యునిసెఫ్‌..‘జనరేషన్‌ అన్‌లిమిటెడ్‌’ను 2018లో ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా యువతకు నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేస్తుంది. భారత్‌లో ‘యువా’ 2019లో ప్రారంభమయ్యింది.

భారత్‌లో 11 భాషల్లో ‘యువా’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేస్తున్నాం. ‘పాఠశాలల ఆవిష్కరణల సవాలు’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తోంది. ఇది విజయవంతంగా కొనసాగుతోంది.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన యువతకు ‘యువా’ కార్యక్రమాలు ఎంతో భరోసానిస్తున్నాయి. ముఖ్యంగా బాలికల సాధికారతకు అండగా నిలుస్తోంది.

భారత్‌ ప్రారంభించిన ‘స్కిల్‌ ఇండియా’తోనూ కలిసి పనిచేస్తున్నాం. క్రీడల శాఖ, యువా సంయుక్తంగా దేశవ్యాప్త నైపుణ్య అభ్యాస కార్యక్రమాలను ఈ ఏడాది ఆగస్టులో చేపట్టాయి.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కరోనా పెను సవాల్‌ విసిరింది. నిరుద్యోగం భారీగా పెరిగింది. భవిష్యత్తులో ఎదురయ్యే ఇటువంటి సవాళ్లను అధిగమించడానికి యువత నైపుణ్యాలను పెంచుకోవడమే పరిష్కారం.

తెలంగాణలో ‘యువా’ ఇలా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల విభాగం (టీఎస్‌ఐసీ), విద్యాశాఖ, యునిసెఫ్‌-యువా, ఇంక్వి-ల్యాబ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 20న ‘పాఠశాలల ఆవిష్కరణల సవాలు’(స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌)-2021 ప్రారంభమైంది. పాఠశాలల స్థాయిలో విద్యార్థుల మనసులోని ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేందుకు దీనిని చేపట్టారు. నేటి చిన్నారులే రేపటి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నది సంకల్పం.

4,041 ప్రభుత్వ పాఠశాలలు..స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నాయి.

‘వినూత్నంగా ఆలోచించడం’పై ఆన్‌లైన్‌లో నిర్వహించిన శిక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6-10 తరగతుల విద్యార్థులు 23,881 మంది పాల్గొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలను పొందారు.

తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన 5,091 ప్రభుత్వ హైస్కూలు ఉపాధ్యాయులు ‘మేనేజింగ్‌ డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌స్కూల్స్‌’పై శిక్షణ పొందారు.

7093 వినూత్న ఆలోచనలు ఆయా కార్యక్రమాల ద్వారా అందాయి.

Posted Date : 08-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌