• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉపాధినిచ్చేలా విభిన్న బ్రాంచీల సమ్మేళనం

స్పెషలైజ్డ్‌ మల్టీ డిసిప్లినరీ ఇంజినీరింగ్‌ కోర్సులు

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కింద బీఆర్క్‌ కోర్సుతోపాటు బ్యాచిలర్, మాస్టర్స్‌ స్థాయిలో ప్రత్యేక రంగాల్లో ప్రోగ్రాములను ప్రవేశ పెట్టారు. ఈ ఇంజినీరింగ్‌ కోర్సులన్నీ స్పెషలైజ్డ్‌ మల్టీ డిసిప్లినరీగా ఉంటాయి. ఏపీ ఎంసెట్‌ (ఈఏపీసెట్‌) ద్వారా ప్రవేశాలుంటాయి.  

ప్రత్యేకంగా దేశంలో, ఇతర యూనివర్సిటీల్లో మాస్టర్స్‌ ప్రోగ్రాముల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన కోర్సులను యూజీలోనే డా.వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ ప్రవేశపెట్టింది. ఉపాధి అవకాశాలు పొందటంతో పాటు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునేలా వీటిని  రూపొందించామని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య డి. విజయ్‌కిశోర్‌ తెలిపారు.  

1. ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ ఇంజినీరింగ్‌: ఈ కోర్సును బిల్డింగ్‌ టెక్నాలజీస్‌గా కూడా పేర్కొంటారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ ఇలా వేర్వేరు విభాగాల కలయికే ఈ కోర్సు. ఈ మల్టీ డిసిప్లినరీ ఇంజినీరింగ్‌ కోర్సు చేస్తే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌లు పూర్తిచేస్తే వచ్చే అవకాశాలను పొందవచ్చు. సైటు ఇంజినీర్, ఫెసిలిటీస్‌ ప్లానర్‌/మేనేజర్, ఎంఈపీ ఇంజినీర్‌/మోడెలర్, బీఐఎం ఇంజినీర్‌గా బహుళజాతి కంపెనీల్లో, ప్రభుత్వరంగ యూనిట్లు, మెట్రోరైల్, ఐటీ సంస్థలు, ఆర్కిటెక్చర్, నిర్మాణ సంస్థలు, నిఘా విభాగాలతోపాటు కేంద్రప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 
ఈ కోర్సు తర్వాత బిల్డింగ్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్, రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌వీఏసీ ఇంజినీరింగ్‌ అర్బన్‌ ప్లానింగ్, ఆటోమేషన్‌ ఇంజినీరింగ్‌లలో మాస్టర్స్‌ డిగ్రీ చేయొచ్చు.

2. బీటెక్‌ ఇన్‌ టౌన్‌ ప్లానింగ్‌: టౌన్‌ ప్లానర్లు పట్టణ, గ్రామీణ జీవితాన్ని నివాసయోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తారు. కరవు, వరదలు, విపరీతమైన ఉష్ణోగ్రత లాంటి తీవ్రమైన పర్యావరణ, వాతావరణ మార్పులకు, ట్రాఫిక్, రవాణా, నీటి పారుదల లాంటి విభిన్న కార్యకలాపాలకు స్థిరమైన, సురక్షితమైన డిజైన్లు, ప్లాన్లు రూపొందించడంలో భాగస్వాములవుతారు. మెట్రోపాలిటిన్‌ ప్రాంతాల్లో జనాభా అధికం కావడం వల్ల అక్కడ భూమిని సమర్థంగా వినియోగించడంలో ప్లానర్ల పాత్ర ఉంటుంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్, మున్సిపల్‌ కార్పొరేషన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, సాఫ్ట్‌వేర్, బహుళజాతి సంస్థల్లో, ప్రైవేట్‌ ప్రాక్టీస్‌గానూ ఉద్యోగ అవకాశాలున్నాయి.
ఉన్నత చదువుల విషయానికొస్తే పీజీ ఇన్‌ అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌/ సిటీ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్లానింగ్, ఎన్విరాన్మెంటల్‌ ప్లానింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్, అర్బన్‌ డిజైన్, రిమోట్‌ సెన్సింగ్, పబ్లిక్‌ పాలసీ లాంటి వాటిలో చదవొచ్చు. 

3. డిజిటల్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌: ఈ  కోర్సు ద్వారా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) డిజైన్స్, జియో గ్రాఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), మల్టీమీడియా టెక్నాలజీలను నేర్చుకుంటారు. ఆర్కిటెక్చర్, ప్లానింగ్, డిజైనింగ్, యానిమేషన్, నిర్మాణ పరిశ్రమలకు సంబంధించిన ఏ పనినైనా సులువుగా డిజిటైైజ్‌ చేయగలరు. సాఫ్ట్‌వేర్‌ కొలువులు, ప్లానింగ్‌ (సీఏడీ అండ్‌ జీఐఎస్‌ ఇంజినీర్‌), డిజైన్‌ ఇండస్ట్రీ (ఆర్కిటెక్చరల్, గ్రాఫిక్స్‌ డిజైనర్‌ ఇంజినీర్‌), కన్‌స్ట్రక్షన్, ప్రింట్‌ మీడియా, వెబ్‌ డిజైన్, సినీ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
ఉన్నత విద్యకు సంబంధించి- పీజీ (ఎంటెక్‌/ ఎంఎస్‌) ఇన్‌ సీఎస్‌ఈ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) యానిమేషన్, ఐటీ, జీఐఎస్, రిమోట్‌ సెన్సింగ్‌ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్‌లో మాస్టర్స్‌ కొనసాగించవచ్చు.

4. కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌: ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో (డ్రోన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, క్లౌడ్‌ టెస్ట్‌ కంప్యూటింగ్, వర్చువల్‌ రియాలిటీ) ఒక నిర్మాణాన్ని రూపొందించడంలో, రూపకల్పనలో ఈ కోర్సు ఉపయోగపడుతుంది. దీనిద్వారా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సెన్సార్లు అమర్చడం, అధునాతన నిర్మాణాలు, పర్యావరణ హిత గ్రీన్‌బిల్డింగ్స్‌ లాంటివాటిలో రాణించవచ్చు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు సొంతంగా కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేయడం సులువవుతుంది. ప్రముఖ సంస్థల్లో ప్రాజెక్ట్‌ మేనేజర్, కన్‌స్ట్రక్షన్‌ సేఫ్టీ మేనేజర్, ప్రాజెక్ట్‌ డిజైన్‌ కన్సల్టెంట్స్, ఎస్టిమేటర్‌ ఇన్‌ బిల్డింగ్స్‌ సర్వేయర్స్‌గా స్థిరపడొచ్చు. 

ఈ కోర్సు పూర్తిచేసినవారు ఎంటెక్‌ ఇన్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, బిల్డింగ్‌ టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, కాంటెంపరరీ స్మార్ట్‌సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సిటీ సర్వేయింగ్‌ లాంటి కోర్సులకు అర్హులు. 
 

Posted Date : 01-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌