‣ సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం
పరిమిత కాల సేవల ప్రాతిపదికన ఇండియన్ నేవీ అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సులు చదివినవారు ప్రయత్నించవచ్చు. అకడమిక్ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో మెరిసినవారిని శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు విధుల్లో చేరి, సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందుకోవచ్చు.
హైడ్రోగ్రఫీ, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్, టెక్నికల్, ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. అన్ని విభాగాల్లోనూ కలుపుకుని మొత్తం 155 పోస్టులు ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా పరీక్ష రాయనవసరం లేదు. అకడమిక్ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. వీటిని సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకూ 60 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఖరారు చేస్తారు.
ఇలా ఎంపికైనవారికి నేవల్ అకాడెమీ, ఎజిమాళలో జనవరి, 2023 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలపాటు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారికి లెవెల్ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. ప్రొబేషన్ వ్యవధి ఆయా పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు. అందువల్ల గరిష్ఠంగా 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది.
విభాగాలు...ఖాళీలు

నేవల్ ఆర్మమెంట్ క్యాడర్‌లో 6 ఖాళీలు ఉన్నాయి. నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్ 60 శాతం మార్కులతో పూర్తిచేసుకున్న స్త్రీ, పురుషులు అర్హులు. ఏటీసీ 6, అబ్జర్వర్ 8, పైలట్ 15, లాజిస్టిక్స్ 18, ఎడ్యుకేషన్ 17 ఖాళీలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు స్త్రీ, పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి ఆయా పోస్టుల ప్రకారం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు. ఏటీసీ, అబ్జర్వర్, పైలట్ పోస్టులకు జనవరి 2, 1998 - జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. లాజిస్టిక్స్ పోస్టులకు జనవరి 2, 1998 - జులై 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎడ్యుకేషన్ పోస్టులకు జనవరి 2, 1996 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు.
టెక్నికల్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ బ్రాంచ్ 15, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 30 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2, 1998 - జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. పై అన్ని పోస్టులకు ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లూ అర్హులే ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ ఉన్నవారికి అకడమిక్ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టులవారీ తమ ప్రాధాన్యం ఎంచుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 12 వరకు స్వీకరిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా. పైలట్, అబ్జర్వర్ పోస్టులకు మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in/
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.