• facebook
  • whatsapp
  • telegram

అవుతారా.. అగ్నివీరులు!

నౌకాదళ ఆహ్వానం 

పది, ఇంటర్‌తో అవకాశాలు


అగ్నివీర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌), సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకటనలను భారత నౌకాదళం విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఈ రెండు పోస్టులకూ మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. ఇలా అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలినవారు ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలుగుతారు.  

‣ ఇవి శాశ్వత ఉద్యోగాలు కానప్పటికీ అగ్నివీర్‌గా ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రం ఆ అవకాశం దక్కుతుంది. ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్‌.. వీటిలో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ నాలుగేళ్లు కొనసాగుతున్నందుకు సేవానిధి ప్యాకేజీ అందిస్తారు. 


దాదాపు ఏటా రెండుసార్లు ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్‌ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. అందువల్ల నౌకాదళంలో ఉద్యోగాలు ఆశించేవారు వీటిని లక్ష్యంగా చేసుకుంటే విజయవంతం కావచ్చు. అర్హతలు ఉన్నవారు రెండు పరీక్షలకూ విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. 


 పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్హతలతో పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ ఈ రెండింటిలో ఏ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ వేతనం, ప్రయోజనాలు అన్నీ సమానమే. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు జీవిత భీమా భద్రత వర్తిస్తుంది. చివరలో అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. ఇలా వైదొలిగిన వీరు కార్పొరేట్‌ సంస్థల్లో సెక్యూరిటీ విభాగంలో ముఖ్య ఉద్యోగాలు, విధులను నిర్వర్తించగలరు. ఇప్పటికే కొన్ని సంస్థలు అగ్నివీరులకు ఎంపికలో ప్రాధాన్యమిస్తామని ప్రకటించాయి. వీరు సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ దిశగా అడుగులేయాలనుకుంటే బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చూస్తారు.  

ప్యాకేజీ (నెలకు): మొదటి సంవత్సరం: రూ.30,000, 

రెండో ఏడాది: రూ.33,000 

మూడో సంవత్సరం: రూ.36,500, 

నాలుగో ఏట: రూ.40,000

సేవానిధి.. ప్రతి నెల అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి   రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీరుని చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,550 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. 

 ఇలా నాలుగో ఏడాదిలో వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి పోగవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జమ చేస్తుంది. అంటే రూ.10.04 లక్షలన్నమాట. దీనికి వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సుమారు  రూ.11.71 లక్షలు అందుతాయి. దీనిపై పన్ను ఉండదు. 


మధ్యలో మానేస్తే...

అగ్నివీరులు నాలుగేళ్లలోపే కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి అందిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం దక్కదు. 


వర్తించనివి...

పింఛను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) వర్తించవు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌గా పరిగణించరు. 


శాశ్వత విధుల్లోకి...

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని నేవీలో సెయిలర్‌ హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి అవకాశమిస్తారు.  ఇందుకోసం ఆ వ్యవధిలో ప్రతిభ, పనితీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా అవకాశం పొందినవారు పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. ప్రోత్సాహాలన్నీ వర్తిస్తాయి. వైదొలిగిన తర్వాత  పింఛను అందుతుంది. 


ఎంపిక

ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్‌ రెండు పోస్టులకూ విడిగా పరీక్షలు ఉంటాయి. స్టేజ్‌-1లో భాగంగా అభ్యర్థులను వడపోయడానికి ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్టు (ఐనెట్‌) నిర్వహిస్తారు. రాష్ట్రాల వారీ కేటాయించిన పోస్టుల ప్రకారం కటాఫ్‌లు మారుతాయి. ఇందులో అవకాశం వచ్చినవారు స్టేజ్‌-2కి అర్హులవుతారు. ఈ దశలో ముందు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ) నిర్వహిస్తారు. ఇందులో నిర్ణీత ప్రమాణాలు ఉన్నవారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధిస్తే, వైద్య పరీక్షలు నిర్వహించి, ఎలాంటి సమస్యలూ లేనివారిని శిక్షణకు తీసుకుంటారు. 


ఎస్‌ఎస్‌ఆర్‌ అర్హత

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌/ప్లస్‌2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లేదా మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఆటోమొబైల్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు. వీరు నవంబరు 1, 2003 - ఏప్రిల్‌ 30, 2007 మధ్య జన్మించి ఉండాలి. అవివాహితులే అర్హులు.


ఎస్‌ఎస్‌ఆర్‌ స్టేజ్‌-1 (ఐనెట్‌) ఇలా..

ఆన్‌లైన్‌లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్ల నుంచి వీటిని అడుగుతారు. అవి... ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్‌ అవేర్‌నెస్‌. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి. నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. 


స్టేజ్‌-2..(ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్‌)

రెండు పోస్టులకూ స్టేజ్‌-1లో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సిలబస్‌ వివరాలు నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ఈ పరీక్షకు హాజరుకావడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి. పరీక్ష కంటే ముందు వీరికి ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. రెండు పోస్టులకూ మహిళలు, పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు తప్పనిసరి. 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు ఆరున్నర, మహిళలు 8 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 20, మహిళలు 15 గుంజీలు తీయగలగాలి. వీటితోపాటు పురుషులు 15, మహిళలు 10 పుష్‌ అప్స్, పురుషులు 15, మహిళలు 10 బెంట్‌ నీ సిట్‌ అప్స్‌ తీస్తే అర్హత సాధిస్తారు. వీటన్నింటీలోనూ విజయవంతమైనవారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ ప్రతిభ చూపితే మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశనూ దాటితే స్టేజ్‌-2 పరీక్షలో పొందిన మార్కుల ప్రకారం రాష్ట్రాలవారీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్, చిలక సరస్సులో నవంబరు, 2024 నుంచి శిక్షణ మొదలవుతుంది.  


అగ్నివీర్‌ (ఎంఆర్‌) అర్హత 

కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూరించాలి. నవంబరు 1, 2003 - ఏప్రిల్‌ 30, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. దీనికీ రెండు దశల్లో పరీక్షలు, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. 


ఎంఆర్‌ స్టేజ్‌-1 (ఐనెట్‌) పరీక్ష 

దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. యాభై ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి అరగంట. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ఇందులో రెండు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో వీటిని అడుగుతారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు వస్తాయి. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను ఇండియన్‌ నేవీ

వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు.

వీరికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్టులు, మెడికల్‌ పరీక్షలు, శిక్షణ, వేతనాలు, నిబంధనలు.. అన్నీ నేవీ (ఎస్‌ఎస్‌ఆర్‌) మాదిరిగానే ఉంటాయి.    

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్‌ రెండు పోస్టులకూ మే 27 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్‌ ఒక్కో దానికీ జీఎస్‌టీతో కలిపి రూ.649 చెల్లించాలి. 

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Some more information

‣  "Beyond Expectations: How Yasir M. Defied the Odds"

Posted Date : 13-05-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.