• facebook
  • whatsapp
  • telegram

పదండి పోదాం... పల్లె బ్యాంకుల కొలువుకు!

13 వేల‌కు పైగా కొలువులకు ఐబీపీఎస్-ఆర్ఆర్బీ ప్రకటన విడుదల

విద్యార్హతలు డిగ్రీ / ఎంబీఏ/ సీఏ

నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఈ ఏడాదికి సంబంధించి భారీగా బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో(ఆర్ఆర్బీ), కామన్ రిక్రూట్ ప్రాసెస్(సీఆర్పీ) ద్వారా ఆఫీసర్ స్కేల్-1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) కొలువుల నియామకాల ప్రక్రియ ప్రారంభించింది.

విభాగాలు.. ఖాళీలు

ఐబీపీఎస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 13 వేల‌కు పైగా పోస్టులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్)-5096, ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు  4119, ఆఫీసర్ స్కేల్-2(అగ్రికల్చర్ ఆఫీసర్)-25, ఆఫీసర్ స్కేల్-2(మార్కెటింగ్ ఆఫీసర్)-43, ఆఫీసర్ స్కేల్-2(ట్రెజరీ మేనేజర్)-10, ఆఫీసర్ స్కేల్-2(లా)-27, ఆఫీసర్ స్కేల్-2(సీఏ)-32, ఆఫీసర్ స్కేల్-2(ఐటీ)-59, ఆఫీసర్ స్కేల్-2(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)-905, ఆఫీసర్ స్కేల్-3కి సంబంధించి 151  పోస్టులున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల వివరాలు

దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 750 అసిస్టెంట్‌ ఖాళీలు ఉన్నాయి. అందులో ఏపీలో 343, తెలంగాణలో 407 ఉన్నాయి. అలాగే ఏపీలో స్కేల్-1 ఆఫీసర్ల పోస్టులు 82, తెలంగాణలో 89 ఖాళీలు ఉ న్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఈ ఖాళీల భర్తీ జరుగుతుంది.

అర్హతలు

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక లాంగ్వేజీలో ప్రొఫిషియన్సీ తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఆఫీసర్ స్కేల్‌-1 పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్ తదితర కోర్సుల్లో తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్థానిక లాంగ్వేజీలో ప్రొఫిషియన్సీ తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఆఫీస‌ర్ స్కేల్‌-2(జనరల్ బ్యాంకింగ్) పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే వారు కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్ మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎకానమిక్స్ అండ్ అకౌంటెన్సీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో డిగ్రీ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ఏదైనా బ్యాంకు/  ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో కనీసం రెండేళ్లు ఆఫీసర్గా పని చేసిన అనుభం తప్పనిసరి. వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఆఫీసర్ స్కేల్-2(స్పెషలిస్ట్ ఆఫీసర్)లో వివిధ పోస్టులు ఉన్నాయి. వాటిని బట్టి అర్హత ఉంటుంది. కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం తప్పనిసరి. చార్టెడ్ అకౌంటెంట్, లా ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఆగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత డిగ్రీ పట్టా ఉండాలి. అలాగే పని అనుభవం తప్పనిసరి.

ఆఫీస‌ర్ స్కేల్‌-3 పోస్టుల‌కు దరఖాస్తు చేయాలంటే  కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్ తదితర విభాగాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. వయసు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్‌-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పద్ధతిలో ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారినే మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు. దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అసిస్టెంట్ల ఎంపిక ఉంటుంది. స్కేల్‌-1 పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్కేల్-2, 3 పోస్టులకు ఒకే రాత పరీక్ష (సింగిల్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు చేయడం ఎలా?

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్, 2021. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రుసుం రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టులో, మెయిన్స్ పరీక్ష సెప్టెంబరు/అక్టోబరులో నిర్వహిస్తారు. 

ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు

అనంతపురం, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

రాత పరీక్ష తీరు

ప్రిలిమ్స్ పరీక్ష ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీస‌ర్ స్కేల్‌-1 పోస్టులకు మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రెండింట్లో రీజనింగ్ సబ్జెక్టు కామన్గా ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ వేర్వేరుగా ఉంటాయి. ఒక్కో విభాగానికి 40 చొప్పున మొత్తం 80 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు ఇస్తారు. దీంట్లో అభ్యర్థులు కనీస మార్కులతో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. 

మెయిన్స్ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌తో పోలిస్తే ఇందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ కామన్గా ఉంటాయి. అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్ ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. సమయం రెండు గంటలు ఉంటుంది. ఈ రెండు పరీక్షల ప్రశ్నపత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లిష్, హిందీ, తెలుగులో, తెలంగాణలో అదనంగా ఉర్దూలో ఉంటుంది.  

ఆఫీసర్ స్కేల్(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ కేడర్)- 3 పోస్టులకు సింగిల్ లెవెల్ పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. వీటిలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్/డేటా ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్టులు కామన్గా ఉంటాయి. స్పెషలిస్ట్ కేడర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు అదనంగా ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆయా పరీక్షల్లో రుణాత్మక మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించి ప్రతి సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు.  

చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ వారికి అవకాశం?

దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌. అయితే దరఖాస్తుకు చివరి తేదీ అయిన 28, జూన్‌ 2021 లోగా గ్రాడ్యుయేషన్‌ పూర్తయి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా డిగ్రీ చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు ఆ సమయంలోగా డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు తెలియడం కష్టం. కాబట్టి వారికి ఈ నోటిఫికేషన్‌తో అవకాశం లేనట్టే. అయితే గత సంవత్సరం ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఐబీపీఎస్‌ నవంబరులో దీనికి అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా అనుబంధ నోటిఫికేషన్‌ వెలువడితే చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్పు లేని పరీక్ష విధానం: ఎంపిక విధానం, పరీక్షా విధానం గత సంవత్సరం మాదిరిగానే ఉంది. ఎలాంటి మార్పూ లేదు.

సన్నద్ధత ఇలా !

అన్ని బ్యాంకుల పరీక్షలతో పోలిస్తే తక్కువ స్థాయిలో ప్రశ్నలుండే ఐబీపీఎస్-ఆర్ఆర్బీ పరీక్షకు ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే కొంత తేలిగ్గా విజయం సాధించవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో రెండే విభాగాలున్నాయి. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ప్రిలిమ్స్, మెయిన్స్కు కలిపి ఉమ్మడిగా కొనసాగించాలి. తొలిసారి పరీక్ష రాసే అభ్యర్థులు మొదటి 20-25 రోజులు అన్ని అంశాలనూ పూర్తి చేసుకోవాలి. ముందుగా ఎక్కువ మార్కులు వచ్చే అంశాలను గుర్తించి వాటిని పూర్తి చేసుకోవాలి. అలాగే మాదిరి ప్రశ్నపత్రాలపై దృష్టి పెట్టాలి. దీనివల్ల పరీక్షావిధానానికి అలవాటు పడతారు. నిర్ణీత సమయంలో సమాధానాలు ఎలా గుర్తించాలో నేర్చుకుంటారు. దాని ఆధారంగా ప్రిపరేషన్లో మార్పులు చేసుకోవచ్చు. నిత్యం 12 గంటలు తగ్గకుండా ప్రిపేర్ అవ్వాలి. మొత్తం సమయంలో మోడల్ పేపర్ రాసే సమయాన్ని మినహాయించి, 40 శాతం ఆప్టిట్యూట్, 30 శాతం రీజనింగ్, 20 శాతం ఇంగ్లిష్, 10 శాతం జనరల్ అవేర్నెస్కు కేటాయించాలి. నిత్యం ఆంగ్ల దినపత్రికలను చదవడం అవసరం. ఈ అధ్యయనం ఆంగ్ల భాష, జనరల్ అవేర్నెస్ విభాగాలకు ఉపయోగపడుతుంది.  ప్రిపరేషన్ చివరివరకు కొనసాగిస్తేనే విజయం సాధ్యమవుతుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 

సిలబస్ లో ఏముంది?

ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే స్కేల్‌-1 ఆఫీస‌ర్స్, ఆఫీస్ అసిస్టెంట్ల ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 5 విభాగాలు (సబ్జెక్టులు) ఉంటాయి. వాటిలో ఏయే అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవాలంటే గతం ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్/ న్యూమరికల్ ఎబిలిటీ; ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ అంశాల వారీగా చూస్తే పెద్దగా తేడా ఉండదు. కానీ ప్రశ్నల స్థాయిలో భేదముంటుంది. సింప్లిఫికేషన్స్/  ఆప్రాక్సిమేట్ వాల్యూస్ నుంచి 10-12 ప్రశ్నలు ఆఫీస్ అసిస్టెంట్ల పరీక్షలో వస్తాయి. స్కేల్-1 ఆఫీసర్ల పరీక్షలో సుమారు 5 ప్రశ్నలు అడుగుతారు. నంబర్ సిరీస్ నుంచి 5, క్వాడ్వాట్రిక్ ఈక్వేషన్-5, డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌ నుంచి 5-10, అరిథ్మెటిక్ ప్రశ్నలు 5-10 వరకు రెండింటిలోనూ వస్తాయి. 

రీజనింగ్; ఈ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు 15-20 ప్రశ్నలు సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ నుంచే ఉంటాయి. ఇనీక్వాలిటీస్ నుంచి 4-5 ప్రశ్నలు, కోడింగ్-డీకోడింగ్ 3-5, అల్ఫాబెటికల్ సీక్వెన్స్ 3-5, సిలాజియమ్ 3-5, బ్లడ్ రిలేషన్స్ 3-4, డైరెక్షన్స్ నుంచి 2-3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వెయిన్స్ పరీక్షలో వీటితోపాటు లాజికల్ రీజనింగ్ నుంచి స్టేట్‌మెంట్‌కు సంబంధించినవి, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కాజ్ అండ్ ఎఫెక్ట్ తదితర ప్రశ్నలు అడుగుతారు. 

ఇంగ్లిష్ లాంగ్వేజ్; ఈ విభాగం మెయిన్స్లో మాత్రమే ఉంటుంది. ఇందులో గ్రామర్ ఆధారిత ప్రశ్నలు, ఒకాబ్యులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 7-10 ప్రశ్నలు, ఒకాబ్యులరీ 3-5 ప్రశ్నలు అడుగుతారు. ఇక గ్రామర్ ఆధారంగా ఉండే జంబుల్డ్ సెంటెన్సెస్, రీ-అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, ఫిల్లింగ్ ద బ్యాంక్స్, సెంటెన్స్ కరెక్షన్ మొదలైన మాదిరి ప్రశ్నలు ఉంటాయి. 

జనరల్ అవేర్నెస్; ముఖ్యంగా దీనిలోని ప్రశ్నలు బ్యాంకింగ్, ఎకానమీ, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటాయి. పరీక్షకు 5-6 నెలల ముందు నుంచి జరిగిన పరిణామాలపై అడుగుతారు. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం స్కీములు, జాతీయ/ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ముఖ్యమైన దినోత్సవాలు, పుస్తకాలు, రచయితలు, ప్రదేశాలు, వ్యక్తులు, బ్యాంకుల ట్యాగ్‌లైన్లు తదితర విషయాలపై దృష్టి సారించాలి. 

తెలుగులోనూ...

బ్యాంకు పరీక్షలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అయితే గ్రామీణ బ్యాంకుల్లో నియామకాలకు ఐబీపీఎస్‌ నిర్వహించే ఆర్‌ఆర్‌బీ స్కేల్‌-1 ఆఫీసర్, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలు మాత్రం దేశీయంగా గుర్తింపు పొందిన భాషలన్నింటిలోనూ ప్రశ్నపత్రం రూపొందిస్తారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వీటిని తెలుగులోనూ రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇంగ్లిష్, హిందీ, తెలుగు మాధ్యమాల్లో రాసుకునే అవకాశం ఉంది. తెలంగాణ వారికి వీటితోపాటు ఉర్దూలో రాసుకునే సౌకర్యం కల్పించారు.

కెరియ‌ర్ ఇలా..

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌ కెరియ‌ర్ కూడా బాగుంటుంది. వీరికి మొద‌టి నెల నుంచే రూ.15 వేల నుంచి రూ.20 వేల వ‌ర‌కు వేత‌నం అందుతుంది. త‌ర్వాత అనుభ‌వాన్ని బట్టి పోస్టు మారుతుంది. ఇందులో భాగంగా పీఓ(స్కేల్‌-1 ఆఫీస‌ర్‌)గా ప్ర‌మోట్ అవుతారు. అనంత‌రం మేనేజర్‌(స్కేల్‌-2), సీనియ‌ర్ మేనేజ‌ర్‌(స్కేల్‌-3), చీఫ్ మేనేజ‌ర్‌(స్కేల్‌-4), అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(స్కేల్‌-5), జ‌న‌ర‌ల్ మేనేజర్‌(స్కేల్‌-6, 7) స్థాయికి ఎదుగుతారు. మారిన పోస్టుకు అనుగుణంగా జీత‌భ‌త్యాల్లో కూడా మార్పు ఉంటుంది. ఇక స్కేల్-1 ఆఫీస‌ర్‌గా ఉద్యోగం ప్రారంభించిన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.20 వేల నుంచి రూ.25 వేల వ‌ర‌కు వేత‌నం చెల్లిస్తారు. వీరు కూడా అనుభ‌వాన్ని బ‌ట్టి పైస్థాయికి చేరుకుంటారు.

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

- డా. జీఎస్ గిరిధ‌ర్‌

Posted Date : 25-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌