• facebook
  • whatsapp
  • telegram

ఇవి చ‌ద‌వాల్సిందే!

రైల్వే ఉద్యోగం నిరుద్యోగ యువ‌త క‌ల‌గా మారింది. అందులో ఉద్యోగం సాధించాలంటే ఎంతో సిల‌బ‌స్ చ‌ద‌వాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చ‌ద‌వాల్సిన‌వి ఇవే..
భారతదేశ చరిత్ర : ప్రాచీన చరిత్ర నుంచి సింధూ, ఆర్య నాగరికతలు; జైన-బౌద్ధమతాలు మొదలైనవి; మధ్యయుగం నుంచి వివిధ రాజపుత్ర రాజవంశాలు, ఢిల్లీ సుల్తానులు, మొగలులు మొదలైనవి; ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఐరోపా వారి రాక, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, 1857-సిపాయిల తిరుగుబాటు, జాతీయోద్యమం మొదలైన అంశాలు చదవాలి. 
భారత రాజకీయ వ్యవస్థ: ప్రజాస్వామ్యం, భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, రాజ్యాంగ చరిత్ర, ఇటీవల వచ్చిన రాజ్యాంగ సవరణలు, ప్రముఖుల సవరించిన జీతభత్యాలు, పార్లమెంటరీ కమిటీలు, ఐక్యరాజ్య సమితి విధులు మొదలైన అంశాలు అధ్యయనం చేయాలి. 
ప్రపంచ, భారతదేశ భౌగోళిక పరిస్థితులు: భారతదేశ నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, ఖనిజ వనరులు, సమాచార రంగం, రవాణా వ్యవస్థ మొదలైన అంశాల గురించి నేర్చుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థ: ఆదినుంచీ భారత్ ఆర్థికవ్యవస్థ వ్యవసాయం పైనే ఆధారపడింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రణాళికలు అమలుచేయడం, పారిశ్రామిక రంగానికి కూడా అధిక ప్రాధాన్యం కల్పించడం తదితర ప్రగతి కారక చర్యలతో భారత ఆర్థిక రంగం బాగా పురోగమించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటోంది? ప్రణాళికలు, ఆర్థిక వృద్ధి రేటు, రైల్వే బడ్జెట్, కేంద్ర వార్షిక బడ్జెట్, వ్యవసాయ రంగ పురోగతి, పారిశ్రామిక వృద్ధి, మొదలైన అంశాలను ఈ విభాగంలో చదవాలి. రోజువారీ పేపర్లు చదువుతుంటే ఆర్థిక రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అర్థమవుతుంటాయి. వీటిని నోట్సు రాసుకుంటే పరీక్షలో వాటికి సంబంధించిన ప్రశ్నలకు సులువుగా ఆన్సర్ చేయవచ్చు.
జనరల్ సైన్స్: క్లోనింగ్, విటమిన్లు, మానవ నిర్మాణం, వ్యాధులు, రక్తగ్రూపులు, భౌతిక, రసాయన శాస్త్రాలు, వృక్ష శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ, తదితరాల నుంచి ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటి అధ్యయనానికి పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి సైన్స్ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. జి.కె. వర్తమాన వ్యవహారాలపై పట్టు సాధించడం కోసం దినపత్రికల ప్రత్యేక వ్యాసాలు, సంపాదకీయాలను, మ్యాగజీన్లను క్రమం తప్పకుండా చదువుతుండాలి. మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ బుక్ లాంటివి ఉపయోగపడతాయి. 
అరిథ్‌మెటిక్‌ : దీనిలో క్షేత్రగణితం, సూక్ష్మీకరణ (సింప్లిఫికేషన్), నంబర్ సిస్టమ్స్, కాలం-దూరం, కాలం-పని, రైళ్లు, లాభనష్టాలు, ట్యాంకులు-కుళాయిలు, శాతాలు, సగటు, చక్రవడ్డీ, బారువడ్డీ, వయసులు, సంభావ్యత, ప్రస్తారాలు-సంయోగాలు, భాగస్వామ్యం, నిష్పత్తి-అనుపాతం, గడియారం, ఘనపరిమాణాలు, క.సా.గు, - గ.సా.భా. మొదలైన అంశాలు ముఖ్యమైనవి. అలాగే మిగిలిన అంశాల్లో సంబంధిత సూత్రాల వినియోగంతో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడాన్ని అభ్యాసం చేయాలి. ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకూ గణితశాస్త్ర పుస్తకాలను అధ్యయనం చేయాలి. R.S.Aggarwal రచించిన Quantitative Aptitude and Ashish Aggarwal రచించిన Quick Arithmetic పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. 
జనరల్ ఇంగ్లిష్: ఈ పరీక్షలో ఇంగ్లిష్ కోసం పదోతరగతి వరకు చదివిన వ్యాకరణంపై మళ్లీ దృష్టి పెడితే సరిపోతుంది. Wren and Martin పుస్తకం చదివి, దానిలోని Exercises సాధన చేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అధిక మార్కుల కోసం Synonyms, Antonyms, One Word Substitutions, Prepositions, Verbs, Tenses, Question Tags, Comprehension Passages పై ఎక్కువ శ్రద్ధ వహించాలని తెలుస్తోంది. భాషకు ప్రాణం లాంటి Verb పై బాగా అవగాహన పెంచుకోవాలి. 
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ : ఈ విభాగంలో వెర్బల్ రీజనింగ్, నాన్‌వెర్బల్ రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో అభ్యర్థి మానసిక పరిస్థితులు, ఆలోచనా శక్తి, సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. వెర్బల్ రీజనింగ్ నుంచి పోలిక పరీక్ష, భిన్నమైనవి (odd man), సిరీస్, కోడింగ్-డీకోడింగ్, రక్తసంబంధాలు, పజిల్ టెస్ట్, దిశ-నిర్దేశ పరీక్ష, లాజికల్ వెన్ డయాగ్రమ్స్, అల్ఫాబెట్ టెస్ట్,ర్యాంకింగ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మిస్‌లేనియస్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్, క్యాలెండర్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.నాన్ వెర్బల్ రీజనింగ్‌లో సిరీస్, పోలిక పరీక్ష (అనాలజీ), క్లాసిఫికేషన్, Oddman, మిర్రర్ ఇమేజ్, డైస్ మొదలైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పై అంశాల కోసం పూర్తిస్థాయిలో R.S.Aggarwal రచించిన A Modern Approach to Verbal & Non-Verbal Reasoning పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. 
చిరునామా: అసిస్టెంట్ సెక్రెటరీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, సౌత్ లాలాగూడా, సికింద్రాబాద్-500 017.  Ph: 040-27821663.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌