ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువు పొందే అవకాశం ఉన్న ఉద్యోగం స్టెనోగ్రాఫర్. సమాచారాన్ని వేగంగా, కచ్చితంగా రికార్డ్ చేయడంలో స్టెనోగ్రాఫర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. అరిథ్మెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్తో పాటు ఇంగ్లిషు మీద కూడా పట్టు సాధిస్తే విజయం మీదే!
ప్రిపరేషన్ విధానం
జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్: ఇందులో వెర్బల్, నాన్-వెర్బల్ ప్రశ్నలు ఇస్తారు. సాధారణంగా అభ్యర్థుల్లోని నైరూప్య ఆలోచనలను (abstract ideas) పరీక్షించే విధంగా ఉంటాయి. గుర్తులు, వాటి మధ్య సంబంధాలను గుర్తించగలిగిన నేర్పు; అంకగణిత నైపుణ్యాలు, ఇతర రకాల విశ్లేషణాత్మక శక్తిని పరిశీలిస్తారు. ప్రధానంగా ప్రశ్నలు అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్ షిప్ కాన్సెప్ట్స్, అరిథ్ మెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అరిథ్ మెటికల్ నంబర్ సిరీస్, నాన్-వెర్బల్ సిరీస్ తదితర విభాగాల నుంచి వస్తుంటాయి.
జనరల్ అవేర్ నెస్: ఈ విభాగంలో నిత్య జీవితంలో అభ్యర్థి తన చుట్టూ ఉన్న పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలపై ఎంతమేరకు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నాడనే అంశాన్ని పరిశీలిస్తారు. ప్రశ్నలు ప్రధానంగా భారతదేశం, చుట్టుపక్కల దేశాల్లో జరిగిన సంఘటనలపై ఉంటాయి. క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్ పరిశోధనలు తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ అభ్యర్థి సాధారణ నాలెడ్జ్ ను మాత్రమే పరిశీలిస్తాయి.
ఎలాంటి లెక్కలు వేసే పని లేకుండా వేగంగా పూర్తి చేయగలిగిన విభాగం ఇది. కానీ పూర్తిస్థాయి స్కోరు ఆశించడం సాధ్యం కాదు. విషయావగాహన మేరకు మాత్రమే చేయగలిగిన విభాగం. స్టాక్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత సంఘటల ఆధారంగా స్టాక్ జీకే, ఎస్ అండ్ టీ అంశాలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి. జనాభా లెక్కలు, బడ్జెట్లు, అవార్డుల వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్: ఈ విభాగంలో అభ్యర్థి సాధారణ ఆంగ్లభాష నాలెడ్జ్ ను పరిశీలిస్తారు. వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సిననిమ్స్, ఆంటనిమ్స్ - వాటి ప్రయోగం తదితరాలతోపాటు ఆంగ్లంలో అభ్యర్థి రాత నైపుణ్యాలను పరిశీలిస్తారు. కాంప్రహెన్షన్ ను పెంచుకోడానికి రోజూ ఒక ఇంగ్లిష్ పేపర్ ను చదవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల క్లోజ్ టెస్ట్, పేరా జంబుల్, వొకాబ్యులరీ ప్రశ్నలను తేలిగ్గా పరిష్కరించగలుగుతారు.
మొదట పాత ప్రశ్రపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని గమనించాలి. అనుగుణమైన ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. రీజనింగ్, అరిథిమెటిక్ అంశాలను వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయడమే విజయానికి దగ్గరిదారి.