• facebook
  • whatsapp
  • telegram

ఈ కేంద్ర కొలువులకు ఇంటర్‌ చాలు!

ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని కొలువుల్లో చేర‌వ‌చ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మూడంచెల్లో నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (ఎస్సెస్సీ సీహెచ్ఎస్ఎల్) పరీక్షలో నెగ్గినవారు ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. చిన్న వయసులోనే సుస్థిరమైన కెరీర్ జీవితాన్ని నిర్మించుకోవచ్చు.

సన్నద్ధత ఇలా సాగాలి..
నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం సన్నద్ధత కొనసాగించాలి. పాత, మాదిరి ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చో తెలుస్తుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ప్రతి ప్రశ్నకూ 36 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటలిజెన్స్‌ల్లో ప్రశ్నలకు ఈ వ్యవధిలో జవాబులు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
సూత్రాలు ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. ఇప్పటినుంచి టైర్‌-1 కోసమే సన్నద్ధం కావడం మంచిది. టైర్‌-1, టైర్‌-2 మధ్య దాదాపు 3 నెలల వ్యవధి ఉంది. ఆ సమయం టైర్‌-2, టైర్‌-3 సన్నద్ధతకు సరిపోతుంది.
జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమపద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.
జనరల్‌ ఇంటలిజెన్స్‌: వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ రెండు రకాల ప్రశ్నలూ వస్తాయి. నంబర్‌ ఎనాలజీ, నంబర్‌ క్లాసిఫికేషన్‌, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్‌, నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ డీకోడింగ్‌, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. సంఖ్యలు, అంకెలపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధిస్తే.. వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్‌, త్రికోణమితి అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌లో శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ గణిత పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.
జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే చాలావరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడేవుంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జులై 2019 నుంచి ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.

ముఖ్య వివరాలు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్ లో సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి

Posted Date : 06-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు