• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ సవాల్‌: రెండు వైపులా పదునే!

విద్యార్థిలోకంలో సివిల్స్‌ పరీక్షలంటే అమితాసక్తి. విలువైన సమయాన్ని దీనికి వెచ్చించటంపై కొందరికి సందేహలున్నాయి. విఫలమైతే ఇతర అవకాశాలు కూడా కోల్పోయి వెనకబడిపోతామా? అనే భయం వెంటాడుతుంటుంది. సివిల్స్‌ను కెరియర్‌ మార్గంగా ఎంచుకోవటంపై అపోహలు తొలగించి స్పష్టతనిచ్చే కథనమిది!

 

ఈ మధ్యకాలంలో ప్రజాదరణ పొందిన ఓ సినిమాలో ‘వూరు చాలా ఇచ్చింది. తిరిగి ఇచ్చెయ్యాలి’ అని నాయికా నాయకులు అంటారు. సొంత వూరును దత్తత చేసుకుని బాగుచేయడం ఆ చిత్ర కథాంశం. ఇలాంటి ప్రేరణతో సమాజంలోని చాలామంది తాము పుట్టిన గ్రామాలను దత్తత చేసుకుంటున్నారు. వాటి సర్వతోముఖాభివృద్ధికి శ్రద్ధ తీసుకుంటున్నారు.

‘ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వటం’ అనే సామాజిక బాధ్యతను ఇప్పుడు ఎందరో గుర్తిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించటంలో, సంపన్నుడిగా పేరు తెచ్చుకోవటంలో కాకుండా చుట్టూ ఉన్న ప్రజలకు మేలు చేయటంలోనే నిజమైన సంతోషం, సంతృప్తి ఉన్నాయని గ్రహిస్తున్నారు.
 

వృత్తి ఉద్యోగాల్లో పాతికేళ్ళు కొనసాగి, ఒక స్థితికి చేరుకున్నాక మాత్రమే సాధారణంగా ఇలాంటి సేవకు ఆస్కారం ఉంటుంది. కానీ ఈ అవకాశాన్ని కెరియర్‌ మొదటి రోజునుంచీ పొందాలంటే? ఈ కలను నిజం చేస్తాయి... సివిల్‌ సర్వీసులు! ఐఏఎస్‌, ఐపీఎస్‌లాంటి కీలక సర్వీసుల్లో ఎందుకు చేరాలనే విషయంలో స్పష్టత రావాలంటే... ఇతర అవకాశాలతో దీన్ని పోల్చటం మెరుగైన పద్ధతి. ఏ విద్యార్థి అయినా గ్రాడ్యుయేషన్‌ తర్వాత కింది అవకాశాల్లో ఏదో ఒకదానిపై మొగ్గు చూపుతాడు.
1) ఉన్నత విద్య కోసమో, ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళటం
2) తనకు ప్రతిభ ఉన్న రంగంలో ప్రైవేటు ఉద్యోగంలో చేరటం
3) ఔత్సాహికునిగా సొంత పరిశ్రమను ఆరంభించటం
4) సివిల్‌ సర్వీసుల ద్వారా ప్రభుత్వంలో చేరటం
5) వృత్తిపరమైన అర్హత ఉంటే సొంతంగా ప్రాక్టీసు పెట్టటం పట్టికలో ఒక్కో మార్గంలో ఉండే అనుకూలతలను పోల్చిచూడండి. ప్రతికూలతలను బేరీజు వేసుకోండి. సివిల్స్‌ ప్రత్యేకత తేటతెల్లమవుతుంది.

 

ఎన్‌ఆర్‌ఐ గానీ, ప్రైవేటు రంగ ఉద్యోగి గానీ, వృత్తినిపుణుడు గానీ దేన్ని ఆశిస్తారు? భద్రత, హోదా, గౌరవం, అధికారం... వీటితో పాటు పని-జీవితం మధ్య తగిన సమతౌల్యత. ఒక్క సివిల్స్‌ తప్ప పట్టికలోని ఏ కెరియర్‌ కూడా ఆరంభంలోనే వీటిని అందించలేదు. అరుదుగా... అది కూడా సుదీర్ఘమైన, శ్రమతో కృషి చేసినపుడు మాత్రమే ఇతర కెరియర్లలో ఇది కొంత సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది.
 

దీర్ఘకాల కృషి
ఏ ప్రమాణాల్లో చూసినా ఉన్నతస్థాయిలో నిలపటంతో పాటు జీవితంలోని తొలి దశలోనే సమాజానికి సేవ చేసే అరుదైన అవకాశాన్నిస్తుంది సివిల్‌ సర్వీసెస్‌. దీనిలో చేరాలంటే దీర్ఘకాలం పట్టుదలతో కృషి చేయాల్సివుంటుంది.  ప్రిలిమినరీలో నెగ్గి మెయిన్స్‌కు అర్హత సాధించాలి. దానిలో ప్రతిభ చూపి పర్సనాలిటీ టెస్టులో స్కోరు చేయాలి. ఏడాది నుంచి రెండేళ్ళ పాటు రోజుకు పది గంటలకు పైగానే సన్నద్ధతకు వెచ్చించాల్సివుంటుంది. విస్తృతంగా చదవటం, తార్కికంగా ఆలోచించటం అవసరం. ఏ అంశాన్ని అయినా ప్రజోపయోగ కోణంలో విశ్లేషించగల పరిజ్ఞానం, పరిణతి పెంచుకోవాలి. సివిల్స్‌ నియామక ప్రక్రియలో విజయం సాధించి సర్వీస్‌ పొందితే మానసికంగా పొందే భావం.. భద్రత. ఆర్థిక మాంద్యం, లే ఆఫ్‌లు మొదలైనవాటి గురించి చింతించే అవసరం ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ సంక్షోభస్థితిలో ఉన్నా జీతభత్యాలు సకాలంలో అందుకోవచ్చు. ప్రైవేటు రంగంతో పోలిస్తే వేతనం తక్కువ ఉండొచ్చు. వ్యాపారంలో వచ్చే లాభం కంటే అది స్వల్పంగానే ఉండొచ్చు. కానీ ఆరో వేతన సంఘం సిఫార్సుల ఫలితంగా చక్కని జీవితం గడపటానికి సరిపోను జీతం లభిస్తోంది. ఏడో వేతన సంఘం మూలంగా ఇది మరింత అధికంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా... జీవితాన్ని ఫలవంతంగా మల్చుకోవచ్చు.
అత్యుత్తమ సర్వీసుల్లో స్థానం దక్కించుకుంటే... ఆ క్షణం నుంచే ప్రముఖ హోదా వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ గుర్తించటం మొదలుపెడతారు.

 

విస్తృత సేవకు వీలు
గుర్తింపు, హోదా సరే; మరి సమాజానికి తమ వంతు సమర్పించే విషయం? ఐఏఎస్‌లో అధికారం, ప్రభుత్వపరమైన దన్ను ఉంటుంది. ఎంత అంకితభావం ఉన్నవారికైనా వ్యక్తిగత స్థాయిలో ప్రజోపయోగమైన పనులు చేయటానికి పెద్దగా వీలుండదు. కానీ శక్తిమంతమైన ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైతే విస్తృతంగా గణనీయమైన సమాజసేవ చేయటానికి వీలుంటుంది. ఈ రకంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆశయం గొప్పగా నెరవేరుతుంది. ఐఏఎస్‌/ ఐపీఎస్‌/ ఐఎఫ్‌ఎస్‌ లాంటి ప్రథమశ్రేణి సర్వీసులకు ఎంపికైతే చేరితే వివిధ హోదాల్లో పనిచేయాల్సివస్తుంది. అంకితభావంతో చేస్తే ఆకాశమే హద్దు! నిత్యోత్సాహం తప్ప నిస్సారమైన క్షణాలు ఉండవు. 

 

సివిల్‌ సర్వీసులను ఎంచుకునేందుకు ప్రధానమైన ఈ కారణాలు సరిపోతాయి కదా! అయితే నాణేనికి వేరేవైపు గురించి సందేహాలు ఉండవచ్చు. రాజకీయ జోక్యం, నిరాధార ఆరోపణలు... ఇలాంటివి. కానీ ఏ వృత్తిలోనైనా ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అమూల్యమైన కాలం సివిల్స్‌కు వెచ్చిస్తే ఒకవేళ విజయం రాకపోతే నష్టపోవాల్సివస్తుంది కదా? ఉద్యోగవేటలో, స్థిరపడటంలో వెనకబడిపోతాం కదా? అని కొందరు సందేహపడుతుంటారు; ఈ మార్గంలోకి రావటానికి జంకుతుంటారు.
సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు అదే తరహా పోటీ పరీక్షలు కూడా రాసి ‘రిస్కు’ను తగ్గించుకోవచ్చు.
కేంద్ర సర్వీసులు దక్కకపోయినా, రాష్ట్రస్థాయి సర్వీసుల్లో తేలిగ్గానే ప్రవేశించవచ్చు. ఇతర పోటీపరీక్షల్లోనూ విజయాలు సాధించవచ్చు.
సివిల్స్‌కు తయారయ్యే సందర్భంగా సంపాదించిన పరిజ్ఞానం ఏ వృత్తిలోనైనా విజయవంతంగా రాణించేలా చేస్తుంది.
కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అనవసరమైన అపోహలను వదిలి సివిల్స్‌ సవాలును అందుకోవచ్చు. చిత్తశుద్ధితో కృషిచేసి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు!

Posted Date : 05-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌