• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

ఈఎస్‌ఈ-2022 ప్రిలిమినరీ పరీక్షకు సూచనలు

 

 

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) ప్రిలిమ్స్‌-2022 త్వరలో జరగబోతోంది. ఇప్పటివరకు చేసిన సన్నద్ధతకు తుది మెరుగులు దిద్దుకుంటే మంచి మార్కులతో మెయిన్స్‌కు అర్హత సాధించవచ్చు. అంతే కాదు; దీనిలో సాధించే మార్కులు తుది ర్యాంకు సాధనలోనూ కీలక పాత్ర వహిస్తాయి. ఈ తరుణంలో పునశ్చరణ తీరు, వ్యూహం ఎలా ఉండాలి? నిపుణుల సూచనలు ఇవిగో! 

 

ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:6 లేదా 1:7 నిష్పత్తిలో ఈఎస్‌ఈ మెయిన్స్‌కు అర్హులను నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం మొత్తం 247 ఖాళీలున్నాయి. అంటే 1482 నుంచి 1529 మంది మాత్రమే మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. ప్రిలిమ్స్‌ వ్యవధి తక్కువగా ఉన్న కారణంగా రోజుకు 8 నుంచి 10 గంటల సమయం సన్నద్ధతకు కేటాయించటం అవసరం.

 

ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌)- పేపర్‌-1లోని జనరల్‌ స్టడీస్, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో 200 మార్కులు ఉన్నందున ప్రిపరేషన్‌లో ప్రతిరోజూ కొంత సమయాన్ని దీనికి కేటాయించాలి. గేట్, ఈఎస్‌ఈ.. రెండు పరీక్షలూ రాసేవారు మాత్రం గేట్‌ రాసేవరకూ జనరల్‌ స్టడీస్, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ చదవకపోవడం మంచిది. 

 

ఈఎస్‌ఈ సిలబస్‌ పరిధి చాలా ఎక్కువ. చాలావరకు ప్రశ్నలు థియరీ బేస్డ్‌గా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటి ప్రశ్నల సన్నద్ధతకు తగిన జాగ్రత్త వహించాలి. 

 

పదోన్నతులు, ఉద్యోగ భద్రత

జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ లాంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్, మిలిటరీ ఇంజినీరింగ్, సెంట్రల్‌ వాటర్, సెంట్రల్‌ ఇంజినీరింగ్, నావల్, సెంట్రల్‌ పవర్, టెలికాం, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ లాంటి విభాగాల్లో దీని ద్వారా నియామకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగంలో చేరితే సమాజంలో మంచి గౌరవం, అత్యున్నత స్థాయికి చేరుకునే పదోన్నతులు, ఉద్యోగ భద్రత ఉంటాయి.

 

త్వరిత పునశ్చరణకు... 

1. పరీక్షలోపు ఉన్న ఈ సమయాన్ని పునశ్చరణ సమయంగా పరిగణించాలి. చదివిన అంశాలన్నిటినీ శ్రద్ధగా రివిజన్‌ చేయాలి. ప్రతిరోజు 2 లేదా 3 సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన ఫార్ములాలను అభ్యసించి వాటిని నోట్స్‌లాగా తయారుచేసుకోవాలి. ఇది పరీక్ష ముందురోజు త్వరిత పునశ్చరణకు ఉపయోగపడుతుంది.

2. ప్రిపరేషన్‌ సమయంలో తయారుచేసుకున్న చిన్న చిన్న పట్టికలు, షార్ట్‌నోట్స్‌ ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి. 

3. చిన్న చిన్న గణాంకాలనూ సాధన చేయాలి. 2 నుంచి 20 ఎక్కాలు కంఠస్థం చేయాలి.  దీనివల్ల తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించవచ్చు.

4. పరీక్షలో కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వాటికి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక పాఠ్య పుస్తకాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి. 

5. 20 శాతం సమయాన్ని ప్రాథమిక అంశాలపై, 70 శాతం సమయాన్ని పరీక్షలోపు దృష్టిపెట్టాల్సిన అంశాలపై, చివరి 10 శాతం సమయాన్ని కఠినమైన అంశాల సాధనకు కేటాయించాలి. 

6. ఎక్కువ ప్రశ్నలు నాలుగు నుంచి ఏడు స్టెప్‌లలో సమాధానం రాబట్టే విధంగా ఉంటున్నాయి. అలాంటి మాదిరి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. 

 

 

సంపూర్ణంగా రివిజన్‌ 

గతంలో చదివిన అంశాలు గుర్తుంటాయని భావించకుండా వాటన్నిటినీ రివిజన్‌ చేయాలి.

అభ్యర్థులు సాధారణంగా ప్రిపరేషన్‌ తర్వాత తమకు సులభంగా అనిపించిన అంశాలను మాత్రమే పునశ్చరణ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాకాకుండా పూర్వం చదివిన క్లిష్టమైన అంశాలనూ రివైజ్‌ చేయాలి.

సబ్జెక్టు మీద పూర్తిగా పట్టులేనివారు పరీక్ష సమయం చాలా దగ్గర పడినందున కఠిన అంశాలపై ఎక్కువ సమయం కేటాయించడం సరి కాదు. 

గత ప్రశ్నపత్రాలను బట్టి దాదాపు 25 శాతం ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. వీటి కోసం సుమారు 20 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. ఈఎస్‌ఈ సిలబస్‌పరంగా ఈ సమయంలో వెయిటేజి ఎక్కువున్న అంశాలపై దృష్టి సారించాలి. 

పరీక్షలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం కష్టం. అందుబాటులో ఉన్న సమయంలో ఏ ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి. 

ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కుకు 1/3 (0.33) రుణాత్మక మార్కులు. ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు కేటాయించినందున ఒక సమాధానం తప్పుగా రాస్తే 0.66 మార్కులు తగ్గిస్తారు.  

 

వీలైనంత త్వరగా...

సన్నద్ధతను వీలైనంత త్వరగా పూర్తిచేసి పునశ్చరణకు ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.

సబ్జెక్టుల వెయిటేజి ఆధారంగా ముఖ్యమైన ఫార్ములాలు, కీలకాంశాలను ఈ సమయంలో సాధన చేయాలి. 

పాఠ్య పుస్తకాల్లో ఉండే సాల్వ్‌డ్, అన్‌సాల్వ్‌డ్‌ ప్రశ్నలను సాధన చేయాలి.

వీలైనన్ని ఎక్కువ ఆన్‌లైన్‌ టెస్టులు రాయాలి. ఈ టెస్టులు రాసినప్పుడు చేసిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవాలి.

వీలైతే ఈఎస్‌ఈ పరీక్షకు రాసే స్నేహితులతో బృందంగా ఏర్పడాలి. చదివిన అంశాలను ఒకరికొకరు చర్చించుకుంటే కొన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. కొత్త అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. 

 

గేట్, ఈఎస్‌ఈ, ఇతర రాష్ట్రస్థాయి పరీక్షల గత ప్రశ్నపత్రాలను గమనిస్తే సన్నద్ధమైన అంశాలపై ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. ప్రిలిమ్స్‌లో క్యాలిక్యులేటర్‌కు అనుమతి లేనందున న్యూమరికల్‌ ప్రశ్నలకు క్యాలిక్యులేటర్‌ ఉపయోగించకుండా సమాధానాలు రాబట్టాలి. 

 

ఈఎస్‌ఈ సిలబస్‌ పరిధి చాలా ఎక్కువ. చాలావరకు ప్రశ్నలు థియరీ బేస్డ్‌గా ఉంటాయి.

పరీక్షలోపు ఉన్న ఈ సమయాన్ని పునశ్చరణ సమయంగా పరిగణించాలి. 

ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు ఎక్కువ, సమయం తక్కువ. పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించారనేదే ముఖ్యం.

 

పరీక్ష సమయంలో.. 

పరీక్ష సన్నద్ధత, పునశ్చరణ ఒక ఎత్తు అయితే పరీక్ష రాసే సమయంలో జాగ్రత్తలు వహించడం మరో ఎత్తు. పరీక్షకు ముందుగానీ, పరీక్ష రాసే సమయంలోగానీ ఎలాంటి ఆందోళనలకూ గురికాకూడదు. పరీక్ష రాసేటపుడు మానసిక ప్రశాంతత కీలకం.  

ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు ఎక్కువ, సమయం తక్కువ. అందుబాటులో ఉన్న పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించారనేదే ముఖ్యం.

పరీక్ష రాసే సమయలో ఏదైనా బాగా తెలిసిన ప్రశ్నలకో, ఇతర ప్రశ్నలకో సమాధానం రాబట్టలేనపుడు కొంత ఆందోళన సహజం. అలాంటి పరిస్థితిలో సమయం వృథా చేయకుండా ఆ ప్రశ్నలను పక్కనపెట్టి ఆ తర్వాతి ప్రశ్నలకు సమాధానాలు రాయడం మొదలుపెట్టాలి. ఎందుకంటే వాటి తర్వాత ప్రశ్నలు సులభంగా ఉండొచ్చు. తర్వాత ముందుగా వదిలిపట్టిన ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.

సాధన మొదలుపెట్టినప్పటి నుంచి పరీక్ష సమయం వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రేరణ కోల్పోకూడదు. 

మైండ్‌ మేనేజ్‌మెంట్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అనేవి ఈఎస్‌ఈ నెగ్గడానికి ఉపయోగపడే సాధనాలని మరవకూడదు.

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నానోలో అవకాశాలు ఎన్నో!

‣ మానసిక ఆరోగ్యం... మరవొద్దు!

‣ కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!

‣ ఆసాంతం స్ఫూర్తితో అలాగే సాగాలంటే?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌