• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఇలా సాధించాడు!

ప్రిపరేషన్‌ పై 8వ ర్యాంకర్‌ సూచనలు

పదో తరగతిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుని సూచనతో ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టును ఎంచుకున్నాడు.. కష్టపడి చదివి.. కరోనా కారణంగా వచ్చిన సెలవులను సద్వినియోగం చేసుకుని పట్టు పెంచుకున్నాడు. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ)లో అఖిల భారత స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు హైదరాబాద్‌ నగరానికి చెందిన వికాస్‌పాండే. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి బీటెక్‌ పూర్తి చేసి.. ప్రస్తుతం ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. ఈఎస్‌ఈలో  విజేతగా నిలిచిన తీరు.. అతని మాటల్లోనే...

‘‘హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నాన్న బద్రిప్రసాద్‌ ప్రైవేటు ఉద్యోగి. నలుగురు అన్నదమ్ములు. పదో తరగతి వరకు బోరబండ వివేకానందనగర్‌లో చదివా. ఆ సమయంలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు నాలోని ఆసక్తిని గమనించి ఎలక్ట్రానిక్స్‌ వైపు వెళ్లాలని సూచించారు. అలా పదో తరగతి అయ్యాక పాలీసెట్‌ రాసి ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమాలో చేరా. తర్వాత డిప్లొమా మూడో ఏడాదిలో టీఎస్‌ ఈసెట్‌ రాసి 2016లో తెలంగాణ టాపర్‌గా నిలిచా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈసీఈ విభాగంలో సీటు వచ్చింది. అక్కడ 2019లో బీటెక్‌ పూర్తి చేసి 9.2 సీజీపీఏతో కళాశాల స్థాయిలో ద్వితీయ స్థానం సాధించా.

బీటెక్‌ చివరి ఏడాదిలో ఉన్నప్పుడే గేట్, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఒకేసారి ప్రిపేర్‌ అయ్యి రాశాను. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేదు. గేట్‌లోనూ 77వ ర్యాంకు వచ్చింది. అందుకే ఈఎస్‌ఈపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనుకున్నా. విద్యార్థులకు రెండు పడవల ప్రయాణం మంచిది కాదు. ఏదైనా ఒకే పరీక్షపై దృష్టి పెడితే మంచిది. ఒకవేళ ఈఎస్‌ఈ, గేట్‌.. రెండూ రాయాలనుకుంటే ఇంజినీరింగ్‌ మూడో ఏడాది నుంచే సన్నద్ధత ప్రారంభించాలి.

రోజుకు పది గంటలపాటు

ఒక్కసారి ఇంజినీరింగ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైతే మిగిలిన అన్ని పరీక్షలు రాయడం సులువు అవుతుంది. 2019లో ఇస్రోలో సైంటిస్ట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చింది. కరోనా కారణంగా పరీక్ష 2020లో జరిగింది. తర్వాత నియామక ప్రక్రియ పూర్తయ్యి విజయం సాధించడంతో ఇస్రోలో ఈ మార్చి 15నే ఉద్యోగంలో చేరారు. ఈలోపు ఈఎస్‌ఈలోనూ మంచి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. 

ఈ రెండేళ్ల వ్యవధిలో ఈఎస్‌ఈకి సొంతంగా ప్రిపేర్‌ అయ్యాను. నిత్యం పది గంటలపాటు సాధన చేశాను. మధ్యలో రెండు గంటలపాటు విశ్రాంతి తీసుకునేవాడ్ని. 45-50 నిమిషాలు యోగా చేసేవాడ్ని. శని, ఆదివారాల్లో విశ్రాంతి తీసుకునేవాడ్ని. కొందరు ఉద్యోగం చేస్తూ సిద్ధమవుతూ ఉంటారు. అలాంటి వారు రోజుకు నాలుగు గంటలైనా సబ్జెక్టులపై పూర్తి ఏకాగ్రతతో చదవాలి. శని, ఆదివారాల్లో సమయం ఎక్కువగా లభిస్తుంది కనుక ఎక్కువగా సాధన చేయాలి. ఏడాదిపాటు కష్టపడితే సులువుగా మంచి ర్యాంకు సాధించవచ్చు.

సిలబస్‌పై పట్టు అవసరం

పరీక్షకు సంబంధించిన సిలబస్‌ నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. దానిపై పట్టు పెంచుకుని ప్రిపేర్‌ అవ్వాలి. శిక్షణకు వెళ్లకపోయినా సరైన దిశలో ప్రయత్నిస్తే ర్యాంకు సాధించడం సులువే. గతంలో కోచింగ్‌ సెంటర్లకు వెళ్లిన విద్యార్థుల రాసిన నోట్స్‌ బయట మార్కెట్‌లో లభిస్తాయి. ప్రామాణిక పుస్తకాలు తీసుకుని చదువుకుంటూ సిద్ధం కావొచ్చు. విద్యార్థులు రాసిన నోట్స్‌తో ఏయే అంశాలు చదవాలి.. ఏయే అంశాల జోలికి వెళ్లనక్కర్లేదో తెలుస్తుంది. దానివల్ల ప్రామాణిక పుస్తకాల్లోని అనవసర అంశాల జోలికి పోకుండా చదువుకోవచ్చు.

అన్ని పరీక్షలూ ముఖ్యమే.. 

సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే.. ఆ మార్కులు తర్వాత మెయిన్‌కు లెక్కించరు. కానీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో అలా కాదు.. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా అన్నింటి మార్కులు పరిగణనలోకి తీసుకుని మొత్తం స్కోర్‌ ఇస్తారు.. అందుకే అన్ని పరీక్షలూ ముఖ్యమనుకుని సన్నద్ధమైతే మంచిది.

ప్రిలిమ్స్‌లో పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్, ఆప్టిట్యూడ్‌ టెస్టు ఉంటుంది. ఇది 200 మార్కులకు జరుగుతుంది. రెండు గంటల కాల వ్యవధి. పేపర్‌-2లో ఇంజినీరింగ్‌లో మనం ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రశ్నపత్రం ఉంటుంది. ఇది 300 మార్కులకు ఉంటుంది. మూడు గంటలు కాల వ్యవధి.

ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల కటాఫ్‌ ప్రకారం మెయిన్‌కు క్వాలిఫై అవుతారు. ఇది రాత పరీక్ష. ప్రశ్నపత్రంలోనే ప్రతి ప్రశ్న కింద ఇచ్చిన స్థలంలోనే జవాబు రాసి ముగించాలి. మెయిన్‌లో 300 మార్కుల చొప్పున రెండు పేపర్లు పూర్తిగా టెక్నికల్‌ అంశాలపై ఆధారపడి ప్రశ్నలు వస్తాయి. ఇంజినీరింగ్‌ నాలుగేళ్లలో చదివిన అన్ని అంశాలపైనా ప్రశ్నలు ఉంటాయి. 

ప్రిలిమ్స్, మెయిన్‌లో వచ్చిన మార్కులు కలిపి ఇంటర్వ్యూ కు ఎంపిక చేస్తారు. ముఖాముఖి యూపీఎస్‌సీ దిల్లీలో జరుగుతుంది. ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంజినీరింగ్‌ సబ్జెక్టు సహా జనరల్‌ స్టడీస్, వర్తమాన అంశాలపై ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో మార్కులు కలుపుకొని ప్రిలిమ్స్, మెయిన్‌తో జత చేసి తుది విజేతలను యూపీఎస్‌సీ ప్రకటిస్తుంది.
సాధారణంగా ఈఎస్‌ఈలో 51 - 52 శాతం వస్తేనే కొన్నిసార్లు ఆలిండియా టాపర్లుగా నిలుస్తారు. ప్రశ్నలు ఊహకు అందని విధంగా వస్తాయి. అందుకే టాపర్స్‌కు వచ్చిన మార్కుల పర్సంటేజీ తక్కువగా ఉంటుంది.

- యార్లగడ్డ అమరేంద్ర, ఈనాడు, హైదరాబాద్‌

స్టడీమెటీరియల్ 

జాగ్ర‌ఫీ
జ‌న‌ర‌ల్ సైన్స్
పాలిటీ
ఎకాన‌మీ
పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు
‣ నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోలీస్‌ కొలువు సాధించాలంటే?

‣ ఇంగ్లిష్‌ సన్నద్ధత ఈజీగా..!

‣ ‘డిజిటల్‌ సొసైటీ’లో ఎమ్మెస్సీ

‣ అధిక వేతనాలతో అవకాశాలు అందించే ఆస్ట్రో ఫిజిక్స్‌

‣ భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌