• facebook
  • whatsapp
  • telegram

జ్ఞానేంద్రియాలు

కన్ను

          సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే ఇంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైందని అర్థం. మన భౌతిక పరిసరాల్లో కోరుకున్న గమ్యాలు (లక్ష్యాలు), భయాలు, మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ఉండటానికి దృష్టి (చూపు) సహాయపడుతుంది. మానవుడి కన్ను ‘బైనాక్యులర్‌ విజన్‌’ను కలిగి ఉంటుంది. ఒక వస్తువును రెండు కళ్లతో ఒకేసారి చూడవచ్చు.
 

నిర్మాణం
   కంటిలో కనురెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు ఉంటాయి. కంటి ముందుభాగాన్ని పలుచటి కంటి పొర కప్పి ఉంటుంది. కనుగుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది. కంటిగుడ్డులో కేవలం 1/6వ వంతు భాగం మాత్రమే బయటకు కనిపిస్తుంది. కంటిలో మూడు ముఖ్యమైన పొరలు ఉన్నాయి. అవి దృఢస్తరం, రక్తపటలం, నేత్ర పటలం.

దృఢస్తరం: ఇది దళసరిగా, గట్టిగా, తంతుయుతంగా, స్థితిస్థాపకత లేకుండా తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొర. దృఢస్తరం ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. దృఢస్తరం కొనభాగంలో దృక్‌నాడి కలపబడుతుంది.
* శుక్లపటలం పారదర్శకంగా ఉండి కాంతికిరణాలను కంటిలోనికి పోనిస్తుంది. శుక్లపటలాన్ని కప్పి, కంటిపొర ఉంటుంది. అశ్రుగ్రంథి స్రావం కంటి పొరని తడిగా ఉంచి కాపాడుతుంది.


రక్తపటలం: నలుపురంగులో ఉంటుంది. అనేక రక్తనాళాలు ఉంటాయి. తారక భాగాన్ని కాకుండా కంటిలోని అన్ని భాగాలను రక్తపటలం ఆవరించి ఉంటుంది.
* తారకభాగం చుట్టూ, రక్తపటలం నుంచి ఏర్పడేదే కంటిపాప. దీనిలో కిరణాకార, వర్తులాకార కండరాలు ఉంటాయి.
* తారకకు వెనుక ద్వికుంభాకారంలో కటకం ఉంటుంది. ఇది శైలికాకార కండరాలకు, అవలంబిత స్నాయువులకు కలపబడి ఉంటుంది.
* కనుపాప, తారకల పనిని కెమెరాలోని డయాఫ్రమ్‌తో పోల్చవచ్చు. కంటిరంగు కనుపాపను బట్టి ఉంటుంది.


నేత్రపటలం: ఇది కంటిలో మూడో పొర. కటకం కంటిగుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష, కాచవత్‌ కక్షలుగా విడగొడుతుంది. నేత్రోదయ కక్ష నీరు లాంటి ద్రవంతో నిండి ఉంటుంది.
* కచావత్‌ కక్ష జెల్లీ లాంటి ద్రవంతో నిండి ఉంటుంది.
* నేత్రపటలంలో దండాలు, శంకువులు అనే కణాలుంటాయి. ఇందులో దృష్టిజ్ఞానం లేని అంధచుక్క, మంచి దృష్టిజ్ఞానాన్ని కలిగిన పచ్చచుక్క ఉంటాయి. పచ్చచుక్కనే మేక్యులా, ఫోవియా అని కూడా అంటారు.
* నేత్రపటలంలో దండాలు, కోనులు 15 : 1 నిష్పత్తిలో ఉంటాయి. హ్రస్వదృష్టి ఉన్నవారిలో నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి.
* దూరదృష్టి ఉన్నవారిలో నేత్రపటలానికి వెనుకగా ప్రతిబింబాలు ఏర్పడతాయి. దీర్ఘదృష్టి లోపాన్ని సరిచేయడానికి కుంభాకార కటకాన్ని, హ్రస్వదృష్టి లోపాన్ని సరిచేయడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు.
* కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘‘ఆప్తల్మాలజీ’’ అంటారు.

 

కంటికి వచ్చే వ్యాధులు
1) రేచీకటి 2) పొడిబారిన కళ్లు 3) హ్రస్వదృష్టి 4) దీర్ఘదృష్టి
5) గ్లూకోమా 6) కంటిశుక్లం 7) వర్ణాంధత్వం

 

చెవి

  చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఓటాలజీ’ అంటారు. వినడానికే కాకుండా మన శరీర సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద శబ్దాలు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవికి చేరడాన్ని ‘‘బోనికండక్షన్‌’’ అంటారు. చెవిలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి. అవి: 1) వెలుపలి చెవి 2) మధ్య చెవి 3) లోపలి చెవి.

వెలుపలి చెవి: తలకు ఇరువైపులా ఉండి, మన కంటికి కనిపించే చెవి భాగమే వెలుపలి చెవి. ఇది డొప్ప మాదిరిగా ఉంటుంది. దీన్నే ‘‘పిన్నా’’ (Pinna) అని కూడా అంటారు. పిన్నా మృదులాస్థి నిర్మితం. ఇది శ్రవణకుహరంలోకి తెరుచుకుంటుంది.
* పిన్నాలో మైనాన్ని స్రవించే సెరుమినస్‌ గ్రంథులు, తైలాన్ని స్రవించే తైలగ్రంథులు ఉంటాయి. సెరుమినస్, తైలగ్రంథులు శ్రవణకుహరాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. దుమ్ము, ధూళి శ్రవణకుహరంలోకి చేరకుండా అడ్డుకుంటాయి. శ్రవణ కుహరాన్ని ‘‘ఆడిటరీమీటస్‌’’ అని కూడా అంటారు.
* శ్రవణకుహరం చివరలో కర్ణభేరి అనే ఒక పలుచని పొర ఉంటుంది. కర్ణభేరి వెలుపలి చెవికి, మధ్యచెవికి మధ్యలో ఉంటుంది. ఇది ఒక శంకువు ఆకారంలో ఉంటుంది. కర్ణభేరి సన్నటి భాగం మధ్యచెవి మొదటి ఎముక కూటకానికి కలపబడి ఉంటుంది.


మధ్యచెవి: కర్ణభేరిపై కలిగిన ప్రకంపనాలను పెంచడంలో మధ్య చెవి ముఖ్య పాత్రను వహిస్తుంది. మధ్యచెవిలో మూడు ఎముకలు గొలుసుగా అమరి ఉంటాయి.
    1. కూటకం/సుత్తి 
    2. దాగలి/పట్టెడ 
    3. కర్ణాంతరాస్థి/అంకవన్నె
 ఇవి మూడు శబ్ద తీవ్రతను పెంచుతాయి.
* కర్ణభేరి  కూటకం  దాగలి  కర్ణాంతరాస్థితో కలిసి గొలుసు మాదిరిగా అమరి ఉంటాయి.
* మధ్యచెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే పొర ఉంటుంది. మధ్యచెవి వర్తులాకార కిటికీ ద్వారా లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది.

అంతరచెవి (లేదా) లోపలి చెవి: వినడంలో అసలు పాత్ర వహించేది ఇదే. లోపలి చెవిలో త్వచాగహనాన్ని ఆవరించి అస్తిగహనం ఉంటుంది. అస్తిగహనంలో మూడు భాగాలుంటాయి. అవి: 1) పేటిక 2) అర్ధవర్తుల కుల్యలు 3) కర్ణావర్తం.
* పేటిక ముందు భాగాన్ని ‘‘సేక్యులస్‌’’ అని, వెనుక భాగాన్ని యుట్రిక్యులస్‌ అంటారు. సేక్యులస్, యుట్రిక్యులస్‌ నుంచి వచ్చే నాడీతంతువులు ‘పేటికానాడి’ని ఏర్పరుస్తాయి. అర్ధవర్తులాకార కుల్యలు, పేటికకు కలిపి ఉంటాయి. వీటిలో అంతరలసిక అనే ద్రవం ఉంటుంది. పేటిక, అర్ధవర్తుల కుల్యలు కలిసి పేటికా ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి. ఇది శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది. కర్ణావర్తం ఒక సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలావెస్టిబ్యులై, స్కాలామీడియా, స్కాలాటింపాని అనే మూడు సమాంతర నాళాలను కలిగి ఉంటుంది.
* స్కాలావెస్టిబ్యులై, స్కాలాటింపాని పరలసికద్రవంతోనూ, స్కాలామీడియా అంతరలసికద్రవంతోనూ నిండి ఉంటాయి. కర్ణావర్త నాడీతంతువులు కర్ణావర్త నాడిని ఏర్పరుస్తాయి. పేటికానాడి, కర్ణావర్తనాడి కలిసి శ్రవణనాడీగా ఏర్పడతాయి.

 

వ్యాధులు 
* బ్యాక్టీరియా, ఫంగస్‌ వల్ల చీము కారడం
* కర్ణభేరికి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

 

ముక్కు

  ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘రైనాలజీ’ అంటారు. దీనిలో ఉండే రెండు నాసికా రంధ్రాలు నాసికా కుహరంలోకి తెరుచుకుని ఉంటాయి. నాసికా విభాజకం నాసికా కుహరాన్ని రెండుగా విభజిస్తుంది.

నాసికాకుహరం గోడలు శ్లేష్మస్తరాన్ని, చిన్నవెంట్రుకలను కలిగి ఉంటాయి. శ్లేష్మస్తరంలో ఘ్రాణ గ్రాహకాలు ఉంటాయి. ముక్కు కుహరంలోని వెంట్రుకలు, మ్యూకస్‌ దుమ్ము, సూక్ష్మక్రిములు, అనవసర పదార్థాలు ముక్కు ద్వారా శరీరంలోకి చేరకుండా కాపాడతాయి. ఇతర జంతువులతో పోలిస్తే మన ఘ్రాణశక్తి సామర్థ్యం చాలా తక్కువ.
* ముక్కులోని నాడీకణాలు మాత్రమే బాహ్యప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఘ్రాణ గ్రాహకాలు వాసననిచ్చే అణువులను గుర్తించగలవు. ముక్కులోని గ్రాహక కణాలు ప్రేరణను నాడీసంకేతాలుగా మార్చి మొదడులో కిందిభాగాన ఉండే ఘ్రాణ కేంద్రాలకు చేరుస్తాయి. అక్కడ ఘ్రాణజ్ఞానం (వాసన) ప్రక్రియ జరిగిన తరువాత మెదడులోని ఇతర భాగాలకు చేరుతుంది. వాసనని, రుచిని గ్రహించే గ్రాహకాలను ‘‘రసాయనిక గ్రాహకాలు’’ అంటారు.

 

నాలుక

   నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘‘లారింగాలజీ’’ అంటారు. ఇది నియంత్రిత కండరాలు, సుమారు ‘‘పదివేల’’ రుచి కణికలను కలిగి ఉంటుంది. ఈ రుచికణికలు నాలుకలో ఉండే సూక్ష్మాంకురాల గోడల్లో ఉంటాయి. నాలుకపై నాలుగు ప్రాథమిక రుచి జ్ఞాన రకాలు ఉంటాయి. అవి:
తీపి నాలుక ముందు భాగం; పులుపు నాలుక పక్క భాగం; చేదు నాలుక లోపలి భాగం; ఉప్పు నాలుక ముందు భాగం.
* నాలుకపై పొలుసుల లాంటి నిర్మాణాలు ఫిలిఫార్మ్‌పాపిల్లే
* నాలుకపై గుండ్రంగా కనిపించే నిర్మాణాలు ఫంగిఫార్మ్‌ పాపిల్లే
* నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్దపాపిల్లేలు సర్కం వేలేట్‌ పాపిల్లే
* నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలు ఫోలియేట్‌ పాపిల్లే 
* ఫిలిఫార్మ్‌ పాపిల్లే మినహా అన్ని రకాల పాపిల్లేల్లోనూ రుచికణికలు ఉంటాయి.

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌