• facebook
  • whatsapp
  • telegram

ఉత్తర అమెరికా  

ఉనికి - విస్తరణ:

* ఉత్తర అమెరికా ఖండం ఉత్తరార్ధ గోళంలో ఉంది. ఇది ప్రపంచంలో మూడో పెద్ద ఖండం.
* ఈ ఖండం ఎక్కువ భాగం ఆర్కిటిక్ వలయంలో ఉంది.
* ఈ ఖండానికి తూర్పున అట్లాంటిక్, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రాలు ఉన్నాయి.

 

ఉనికి:
* ఉత్తర అమెరికా 7o ఉత్తర అక్షాంశం నుంచి, 83o ఉత్తర అక్షాంశం వరకు, 20o పశ్చిమ రేఖాంశం నుంచి 
   120o పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
* ఆర్కిటిక్ వలయం
  ఈ ఖండం ఉత్తర భాగం మీదుగా వెళ్తోంది.
* కర్కటకరేఖ
  ఈ ఖండం ద్వారా వెళ్తోంది.
* వాయువ్య ఉత్తర అమెరికాకు ఆసియా ఈశాన్యపు అంచు 96 కిలోమీటర్ల దూరంలో ఉంది.

* బేరింగ్ జలసంధి ఈ రెండు ఖండాలను వేరు చేస్తోంది.
* 'అమెరిగో వెస్పుస్సి' అనే ఇటలీ దేశానికి చెందిన అన్వేషకుడి పేరు మీదుగా 'అమెరికా'కు ఆ పేరు వచ్చింది.
* పరిమాణంలో ఆసియా, ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా అతి పెద్ద ఖండం.
* ఉత్తర అమెరికా భారతదేశంతో పోలిస్తే సుమారుగా 8 రెట్లు అధికంగా ఉంటుంది.
* ఈ ఖండం ఐరోపా, ఆసియాలతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉంది.

భౌతిక స్వరూపం:
* ఈ ఖండ భౌతిక స్వరూపాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.
అవి: *  పశ్చిమ 'కార్డిలెరా' అని పిలిచే పశ్చిమపర్వత ప్రాంతం.
     * తూర్పు మెట్టభూములు.
     * విశాల మధ్య మైదానాలు.

 

పశ్చిమ కార్డిలెరా:
* ఉత్తర అమెరికా పశ్చిమ భాగంలోని విశాలమైన పర్వత ప్రాంతాన్ని పశ్చిమ కార్డిలెరాగా పిలుస్తారు.

* ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి.
* ఉత్తర అమెరికాలోని నదులకు పశ్చిమ కార్డిలెరా జన్మస్థానం.
* అలస్కాలోని 'మెకిన్‌లే' శిఖరం ఎత్తయినది.
* దీని ఎత్తు సముద్రమట్టం నుంచి 6,187 మీటర్లు.
* పశ్చిమ కార్డిలెరా అనేక సమాంతర పర్వత శ్రేణులు కలిగి ఉంది.
* 'సిర్రా నవాడా' అనే పర్వత శ్రేణి ఈ ఖండంలో ఉంది.
* సహజ సౌందర్యానికి ఈ ఖండం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.

 

తూర్పు మెట్టభూములు:
* లేబ్రడార్ నుంచి న్యూఫౌండ్ లాండ్ వరకు విస్తరించి ఉన్న అప్పలేషియాన్ పర్వతాలు ఈ మెట్టభూముల్లో
 ఉన్నాయి.
* ఈ పర్వతాలు పశ్చిమ కార్డిలెరాల కంటే పురాతనమైనవి.
* ఇవి శిథిలం కావడంతో పర్వతాల ఎత్తు తగ్గింది.

విశాల మధ్య మైదానాలు:
* విశాల మధ్య మైదానాలు పశ్చిమ కార్డిలెరా, తూర్పు మెట్ట భూములకు మధ్య విస్తరించి ఉన్నాయి.
* ఈ మైదానంలో మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఉన్న విశాల, సమతల ప్రాంతంలో మిసిసిప్పి నది ప్రవహిస్తోంది.
* ఇక్కడి సుపీరియర్ సరస్సు ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు.
* ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నయాగరా జలపాతం ఉంది.
* ఈ ప్రాంతంలో మిసిసిప్పి, సెయింట్ లారెన్స్ నదులు ముఖ్యమైనవి.

 

శీతోష్ణస్థితి:
* ఉత్తర అమెరికా, ఉత్తరాన ధృవప్రాంతం నుంచి దక్షిణాన ఉష్ణమండలం వరకు విస్తరించి ఉంది.
* ఎత్తయిన రాఖీ పర్వతాలు, తూర్పు మెట్టభూములు రెండూ ఉత్తర, దక్షిణ దిశల్లో విస్తరించి ఉన్నాయి.
* ఉత్తర దిశ నుంచి అతిశీతల పవనాలు, దక్షిణ దిశ నుంచి ఉష్ణపవనాలు మధ్య మైదానం వైపుకు వీస్తాయి.
* పశ్చిమ తీరంలో 30o - 40o ఉత్తర అక్షాంశాల మధ్య, మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది.

ఉష్ణోగ్రత:
* ఉత్తర పవనాల వల్ల శీతకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది.
* ఉత్తర అమెరికా మధ్య మైదాన భాగం ఉష్ణోగ్రత శీతకాలంలో ఘనీభవనస్థానం కంటే తక్కువగా ఉంటుంది.
* వేసవిలో సముద్ర సామీప్యం వల్ల పశ్చిమతీరం చల్లగా, ఖండ మధ్యభాగం వేడిగా ఉంటుంది.

 

వర్షపాతం:
* ఈ ఖండంలోని చాలా భాగాల్లో వర్షపాతం సమృద్ధిగా ఉంటుంది.
* కెనడా పశ్చిమతీరం, మెక్సికో తూర్పుభాగం, మధ్య అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పుభాగం, తూర్పు కెనడాల్లో వర్షపాతం సమృద్ధిగా ఉంటుంది.
* తీరానికి దూరంగా ఉన్న ఖండాంతర్గత ప్రాంతంలో వర్షపాతం తక్కువ.
* అమెరికా సంయుక్త రాష్ట్రాలకు నైరుతి ప్రాంతంలో, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ.
* ఈ ప్రాంతాల్లో ఎడారులు ఉన్నాయి.
* నైసర్గిక స్వరూపం, పవనాల దిశ, సముద్ర ప్రవాహాలు, వర్షపాతంపై ప్రభావాన్ని చూపుతాయి.
* ఉత్తర అమెరికాలో అన్ని రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.
* కొన్ని ప్రాంతాల్లో శీతకాల ఉష్ణోగ్రత ఘనీభవనస్థానం కంటే తక్కువుగా ఉంటుంది.

 

అడవులు - వన్యజీవులు:
* ఉత్తర అమెరికాలోని వివిధ శీతోష్ణ పరిస్థితులను బట్టి అడవులు, వన్యజీవులు ఉన్నాయి.
* అతి శీతలంగా ఉండే ఉత్తరప్రాంతం ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పి ఉంటుంది.
* ఈ ప్రాంతం పొట్టి చెట్లతో, టండ్రా రకం తృణజాతులను కలిగి ఉంటుంది.
* ధృవపు ఎలుగుబంటి, కాలిబౌ, కస్తూరి మృగం, రైన్‌డీర్ ఈ ప్రాంతంలో ఉండే కొన్ని జంతువులు.
* టండ్రా ప్రాంతానికి దక్షిణాన శృంగాకార అడవులు ఉన్న విశాలమైన మేఖల ఉంటుంది.
* ఇది అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వరకు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉంది.
* స్ప్రూస్, పైన్, ఫిర్ ఈ ప్రాంతాల్లో ముఖ్యమైన వృక్షాలు.
* కౌరిబౌ, బీవర్, మింక్ జంతువులు ఉంటాయి.
* శృంగాకార అడవులకు దక్షిణాన మిశ్రమారణ్య మేఖల ఉంది.
* మధ్య అమెరికా, మెక్సికోలోని ఉష్ణమండలారణ్యాల్లో మహాగని, తాడిజాతి చెట్లు ఉన్నాయి.
* ఉత్తర అమెరికాలోని మధ్య పల్లపు భూముల్లో, ఖండాంతర్భాగ మైదానాల్లో వృక్షాలు లేని ప్రైరీలు అనే విశాల పచ్చిక భూములు ఉన్నాయి.
* పశ్చిమ తీరాన 30o, 40o ఉత్తర అక్షాంశాల ప్రాంతంలో పొడవైన వేర్లు స్థూలాకార కాండం, దళసరి ఆకులు కలిగిన వృక్షాలు ఉన్నాయి.

 

జనాభా:
* ఉత్తర అమెరికా జనాభా, భారతదేశ జనాభాలో సగం.
* ఈ ఖండం మొత్తం జనాభా సుమారు 400 మిలియన్లు.
* జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 15 మంది మాత్రమే.
* ఈ ఖండం పశ్చిమ భాగంలోని చాలా ప్రాంతాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు రెండు కంటే తక్కువ.
* మధ్య పల్లపు భూముల్లో పెద్ద నగరాలు లేనప్పటికీ మితమైన జనాభా ఉంది.
* ఈ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలమైంది.
* పశ్చిమ కార్డిలెరాలో జనాభా తక్కువ.
* ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతంలో, సరస్సుల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ.
* ఈ ప్రాంతంలో 15 పెద్ద నగరాలు ఉన్నాయి.
* తూర్పుతీర ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ మేలిరకపు బొగ్గు నిక్షేపాలు, తగినంత శక్తి  సంపద, అనేక పరిశ్రమలు ఉన్నాయి.
* ఈ ప్రాంతంలో మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడికి వలస వచ్చిన ఐరోపా దేశస్థులకు ఇది మొదటి స్థావరం.
* మెక్సికో నగరం చుట్టూ జనసాంద్రత ఎక్కువ.
* పశ్చిమ ఇండీస్ దీవుల్లో జనసాంద్రత చాలా ఎక్కువ.
* కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జనాభా విస్తరణ ఒకే రకంగా లేదు.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు భాగంలో జనాభా తక్కువ.
* ఈశాన్య ప్రాంతంలో జన సాంద్రత ఎక్కువ.
* కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెల్లవారు అధికంగా ఉంటారు.
* ఐరోపా, ఆసియా దేశస్థులు ఉత్తర అమెరికాలో ఎక్కువగా స్థిరపడ్డారు.
* విక్టోరియా, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, న్యూఓర్లిన్స్, మెక్సికో, న్యూయార్క్, బోస్టన్, చికాగో లాంటి నగరాలు ఉత్తర అమెరికాలో ముఖ్యమైనవి.

 

వ్యవసాయం:
* సారవంతమైన మైదానాలు, చక్కని నీటి సదుపాయం ఉన్న మైదానాలు ఉండటం వల్ల ఉత్తర అమెరికా వ్యవసాయ రంగంలో ఉన్నత స్థానంలో ఉంది.
* ఇక్కడ విస్తృత వ్యవసాయం ప్రధానమైంది.
* వ్యవసాయ క్షేత్రాలు పెద్దగా ఉండటం వల్ల, యంత్రాల సహాయంతో వ్యవసాయం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
* రైతులు శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు.
* దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల మిగులు ఉత్పత్తులను ఎగుమతి చేస్తారు.
* ఉత్తర అమెరికాలో అనేక రకాల పంటలు పండిస్తారు.
* మొక్కజొన్న, గోధుమ, పత్తి, పొగాకు, ఓట్స్, బార్లీ, సోయాచిక్కుడు వీటిలో ముఖ్యమైనవి.
* తరచూ వర్షం కురిసే ఉష్ణ ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది.
* ప్రపంచంలోని జొన్న ఉత్పత్తిలో సగానికి పైగా ఉత్తర అమెరికాలోనే పండిస్తున్నారు.
* మెక్సికోలో జొన్న ప్రధాన పంట.

* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పండిన జొన్న పంటను ఎక్కువగా పందులు, పశువుల మేతకు ఉపయోగిస్తారు.
* ప్రపంచంలో గోధుమ ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా ముఖ్యమైనవి.
* ప్రపంచంలోని అయిదో వంతు గోధుమను ఉత్తర అమెరికాలో పండిస్తున్నారు.
* ఇక్కడ గోధుమ క్షేత్రాలు పెద్దగా ఉంటాయి.

* పంటను కోయడం, నూర్చడం లాంటి వ్యవసాయ పనులన్నీ యంత్రాలతోనే జరుగుతాయి.
* దక్షిణ మిసిసిప్పి హరివాణంలో పత్తి ఎక్కువగా పండుతుంది.
* ఇవి సారవంతమైన నేలలు. వేసవిలో వెచ్చటి వాతావరణం, తగిన వర్షపాతం ఉంటుంది.
* ఇక్కడ శీతోష్ణస్థితి మంచు లేకుండా, ఆకాశం నిర్మలంగా ఉండటం, సూర్యరశ్మి పుష్కలంగా లభించడం వల్ల పత్తికాయలు తొందరగా పక్వానికి వస్తాయి.
* ఈ ప్రాంతం పత్తి పంటకు చాలా అనుకూలమైంది.
* ఉత్తర అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో లాంటివి పత్తి ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు.
* ఉత్తర అమెరికా పొగాకు పంటకు ప్రసిద్ధిగాంచింది.
* ప్రపంచంలో 30 శాతం పొగాకు ఈ ఖండంలోనే పండుతోంది.
* పాలు, మాంసం కోసం పశువులను పెంచుతారు.
* మాంసం ఉత్పత్తిలో ఉత్తర అమెరికా ఖండం అగ్రస్థానంలో ఉంది.

 

ఖనిజాలు:
* ఉత్తర అమెరికా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన ఖండం.
* ఇక్కడ ఖనిజ సంపద సమృద్ధిగా ఉంది. ఇందులో చాలా రకాల ఖనిజాలు లభిస్తాయి.
* కెనడా షీల్డు, నికెల్, ప్లాటినం, యశదం, సీసం, బంగారం, వెండి, రాగి నిక్షేపాలు ఉన్నాయి.
* రాఖీ పర్వత ప్రాంతంలో రాగి, యురేనియం, బంగారం, యశదం, సీసం నిక్షేపాలు ఉన్నాయి.
* అప్పలేషియాన్ ప్రాంతం నేలబొగ్గు క్షేత్రాలకు ప్రసిద్ధి.
* మధ్య మైదానాల గల్ఫ్ తీరాల్లో ఖనిజ, తైల, సహజ వాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ముడి ఇనుము నిక్షేపాలు చాలా ఉన్నాయి.
* ఈ నిక్షేపాలు సుపీరియర్ సరస్సు చుట్టూ ఉన్నాయి.
* ముడి ఇనుముతో ఏర్పడ్డ అనేక శిలా శ్రేణులు ఉన్నాయి.
* ఉత్తర అమెరికాలో నేలబొగ్గు, పెట్రోలియం నిక్షేపాలు చాలా ఉన్నాయి.
* ప్రపంచ ఉత్పత్తిలో నాల్గో వంతు నేలబొగ్గు, మూడో వంతు పెట్రోలియం ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి.
* పెట్రోలియం, నేలబొగ్గు, రాగి ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి.
* ప్రపంచంలో యశదంలో మూడోవంతు, నికెల్‌లో (3/4) నాలుగింట మూడో వంతును ఉత్తర అమెరికానే ఉత్పత్తి చేస్తుంది.
 ప్రపంచంలో సగం వెండి ఉత్తర అమెరికాలోనే ఉత్పత్తి అవుతుంది.

పరిశ్రమలు:
* ఉత్తర అమెరికా ప్రపంచంలో ఎక్కువగా పారిశ్రామికీకరణ చెందిన ఖండం.
* ఈ ఖండంలో చాలా ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నాయి.
* ఈ ఖండంలో సారవంతమైన వ్యవసాయ క్షేత్రాలు, ఖనిజ, జలవిద్యుత్ సంపదలు ఉండటంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
* ఆధునిక రవాణా సౌకర్యాలు ఉండటంతో పారిశ్రామికీకరణ సులభతరం అయ్యిందని చెప్పవచ్చు.
* దాదాపు అన్ని నగరాల్లో ఉత్పాదక పరిశ్రమలు ఉన్నాయి.
* అవసరమైన మూలధనం, నైపుణ్యం ఉన్న కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
* ఇనుము ఉక్కు పరిశ్రమలు ఇక్కడ ముఖ్యమైనవి. ఈ పరిశ్రమల్లో భారీ యంత్రాలు, వాహనాలు, రైలుపెట్టెలు, కార్లు ఉత్పత్తి అవుతాయి.
* అమెరికా సంయుక్త రాష్ట్రాలు తయారీలో ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడ శ్రామిక శక్తిని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే యంత్రాల సహాయంతో పరిశ్రమలను నడుపుతున్నారు.
* వస్త్రాలు, కాగితం, ఆహార సంబంధ పరిశ్రమలు వీటిలో ముఖ్యమైనవి.
* అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్, ఫిలదెల్ఫియా, డెట్రాయిట్, చికాగో, లాస్ ఎంజెల్స్ లాంటి నగరాల్లో ఉత్పత్తి పరిశ్రమలు ఎక్కువ.
* వార్తాపత్రికల్లో ఉపయోగించే కాగితం ఉత్పత్తికి కెనడా ప్రసిద్ధి.
* లోహశుద్ధి, విద్యుత్, కార్ల పరికరాలు, కాగిత పరిశ్రమలు కూడా ఉన్నాయి.
* పరిశ్రమలను చాలా వరకు సరస్సుల చుట్టూ స్థాపించారు.

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గాలు:
* ఉత్తర అమెరికాలో రోడ్డు మార్గాలు ఎక్కువ.

* కెనడా దక్షిణ భాగం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నాణ్యమైన రోడ్డు రహదారులు ఉన్నాయి.
* ఇక్కడ కార్ల వాడకం ఎక్కువ.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు భాగంలో రైలు మార్గాలు ఎక్కువగా ఉన్నాయి.
* కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అనేక రైలు మార్గాలు ఖండం మధ్య నుంచి వెళ్తూ తీరప్రాంతాలను కలుపుతున్నాయి.

 

జలమార్గాలు:
* ఉత్తర అమెరికా అట్లాంటిక్ తీరం వైపు అనేక ఓడ రేవులు ఉన్నాయి.
* ఇక్కడ వ్యాపారం చాలావరకు జలమార్గాల ద్వారానే జరుగుతోంది.
* మిసిసిప్పి, సెయింట్ లారెన్స్ నదులు, అయిదు మహా సరస్సులు 
* ప్రపంచంలోనే అత్యధిక రవాణా ఉన్న ఖండాంతర్గత జలమార్గాలు.
* అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువకు వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది.
* న్యూయార్క్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు పనామా కాలువ ద్వారా ప్రయాణించడం వల్ల 12,640 కి.మీ. దూరం తగ్గుతుంది.

 

వాయుమార్గాలు:
* ఉత్తర అమెరికాలో విమానం ముఖ్య ప్రయాణ సాధనం.
* ఇంచుమించు అన్ని నగరాలు వాయు మార్గాలతో అనుసంధానమై ఉన్నాయి.
* ఈ ఖండంలో సుమారు 9,000 విమానాశ్రయాలు ఉన్నాయి.
* న్యూయార్క్‌లోని 'కెనడీ' విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం.
* కెనడా ఉత్తర భాగంలో శీతకాలంలో విమానాలు దిగడానికి చక్రాలకు బదులు మంచుపై జారే బల్లలను ఉపయోగిస్తారు.
* వీటికి ఘనీభవించిన నదులు, సరస్సులపై కూడా దిగే సామర్థ్యం ఉంది.


ఎగుమతి - దిగుమతులు:
* కెనడా ఎగుమతుల్లో ప్రసిద్ధి చెందింది. అంతేకాక ఇక్కడ మిగులు ఉత్పత్తులు కూడా ఎక్కువే.
* అంతర్జాతీయ వ్యాపారంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి.
* కెనడాలో విదేశీ వ్యాపారం ఎక్కువ.
* ఈ దేశం యంత్రాలు, మోటార్, కార్లు, రైలు ఇంజిన్లు, విమానాలు, యుద్ధ సామగ్రిని ఎగుమతి చేస్తోంది.
* విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఎగుమతి చేస్తోంది.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి పత్తి, ఉన్ని, సింథటిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
* గోధుమపిండి, పొగాకు, వనస్పతి నూనెలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కూడా కొన్ని ముఖ్యమైన ఎగుమతులు.
* పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు, కాఫీ, కర్రగుజ్జు, కాగితం, పంచదార, రబ్బరు ముఖ్యమైన దిగుమతులు.
* మెక్సికో ప్రధాన సంపదలైన మేలిరకం ఖనిజాలు, కూరగాయలను అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడాకు ఎగుమతి చేస్తారు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌