• facebook
  • whatsapp
  • telegram

సౌరకుటుంబం - భూమి  

సౌరవ్యవస్థ పుట్టుక - పరిణామం

కీలక పదాలు - వివరణ
అంతరిక్షం:
భూమి, భూ వాతావరణం కాకుండా మిగిలిన ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు.
సౌరవ్యవస్థ: అంతరిక్షంలోని సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, తోక చుక్కలు, ఆస్టరాయిడ్స్ లాంటి వాటిని సౌరవ్యవస్థ అని అంటారు.
సౌరవ్యవస్థ పుట్టుక: సౌరవ్యవస్థ పుట్టుక గురించి ఆక్షేపణ లేని పరికల్పన ఇంతవరకూ లేదు. వీటిలో జార్జెస్ అబె లిమిటియర్ ప్రతిపాదించిన 'విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం' ఆమోద యోగ్యమైంది.

 

విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ముఖ్య సిద్ధాంతాలు
i) బిగ్ బ్యాంగ్ థియరీ - జార్జెస్ లిమిటియర్
ii) నిరంతర సృష్టి సిద్ధాంతం - థామస్ గోల్డ్, హెర్మన్ బొండి
iii) సంకోచ, వ్యాకోచ సిద్ధాంతం - అలెన్ శాండేజ్
 ఈ సిద్ధాంతాలన్నింటిలో విశ్వ సంకోచ, వ్యాకోచ సిద్ధాంతాన్ని అధునాతన సిద్ధాంతంగా చెప్పవచ్చు.

విశ్వసృష్టి సిద్ధాంతాలు

మహావిస్ఫోటన సిద్ధాంతం (Big Bang Theory)
ఈ సిద్ధాంతాన్ని బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లిమిటియర్ ప్రతిపాదించాడు. దీని ప్రకారం కొన్ని వందల కోట్ల సంవత్సరాల కిందట విశ్వపదార్థం అంతా అత్యధిక సాంద్రత ఉన్న, అత్యంత సంకోచ స్థితిలో ఉండేది. ఈ సంకోచ స్థితిలో ఉన్న గోళాకార పదార్థం మహావిస్ఫోటనం (పెద్ద పేలుడు) చెంది ముక్కలై వ్యాకోచించడం ప్రారంభించింది. శకలాలుగా మారిన విశ్వపదార్థం నక్షత్రాలుగా, గెలాక్సీలుగా మారి సెకనుకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ఇంకా వ్యాకోచిస్తూనే ఉంది.
 

నిరంతర సృష్టి సిద్ధాంతం (Continous Creation Theory)
ఈ సిద్ధాంతాన్ని థామస్ గోల్డ్, హెర్మన్ బొండి అనే ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. దీని ప్రకారం గెలాక్సీలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతున్నాయి. అయితే విశ్వ సాంద్రతలో మార్పు ఉండదు.
 

సంకోచ, వ్యాకోచ సిద్ధాంతం (Pulsating (or) Oscillating Theory )
    డాక్టర్ అలెన్ శాండేజ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ఒకసారి సంకోచిస్తుంది. తిరిగి కొన్ని కోట్ల సంవత్సరాలకు ఒకసారి వ్యాకోచిస్తుంది. శాండేజ్ ప్రకారం 1200 కోట్ల సంవత్సరాల కిందట గొప్ప విస్ఫోటనం సంభవించి విశ్వపదార్థం వ్యాకోచించడం ప్రారంభించింది. మరో 2900 కోట్ల సంవత్సరాలు ఈ విధంగా వ్యాకోచించి గురుత్వాకర్షణ శక్తి వల్ల సంకోచించడం ప్రారంభించింది. ఈ విధంగా విశ్వపదార్థం 4,100 కోట్ల సంవత్సరాలు సంకోచించి చివరకు అత్యంత సాంద్రత ఉన్న గోళంగా మారుతుంది. విశ్వసృష్టిని గురించి వివరించిన సిద్ధాంతాల్లో ఇది అధునాతన సిద్ధాంతం.

సౌర కుటుంబంలో సూర్యుడు, ఎనిమిది గ్రహాలు, 162 ఉపగ్రహాలు ఉంటాయి.
* వీటితో పాటు మన కంటికి కనిపించని చిన్న శిలా శకలాలు ఉన్నాయి. ఈ శిలా శకలాలను 'లఘుగ్రహాలు' అని అంటారు.
* సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.
* భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు కావాల్సిన జీవనాధార శక్తి సూర్యుడి నుంచే లభిస్తుంది.
* సూర్యుడి ఉపరితలంపై
6,000 oC, కేంద్రంలో 1,00,000 oC ల ఉష్ణోగ్రత ఉంటుంది.

* సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు. గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి.
* గ్రహాల్లో బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నాడు.
* భూమికి సూర్యుడి నుంచి 149.4 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది.
* సూర్య కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.

ఉపగ్రహం: గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళాలను ఉపగ్రహాలు అంటారు. ఇవి కూడా సూర్యుడి నుంచి కాంతిని పొంది ప్రకాశిస్తాయి.
* కొన్ని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.
ఉదా: బుధుడు, శుక్రుడు
* భూమి సహజ ఉపగ్రహం చంద్రుడు.
* భూమికి, చంద్రుడికి మధ్య సూమారు 3,84,365 కిలోమీటర్ల సగటు దూరం ఉంది.

 

అంతర గ్రహాలు
అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ప్రాంతంలో ఉండే కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరిగే శిథిల గ్రహభాగాలను 'గ్రహశకలాలు' అని అంటారు.
* ఈ గ్రహశకలాలకు లోపలి (సూర్యుడి) వైపు ఉన్న గ్రహాలను అంతర గ్రహాలు అని అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు.

 

బాహ్య గ్రహాలు
* ఈ గ్రహశకలాలకు బయట వైపు ఉన్న గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు.
అవి: గురుడు, శని, యురెనెస్, నెప్ట్యూన్.
* గ్రహాలు, ఉపగ్రహాలు స్వయం ప్రకాశమైనవి కావు.
* గ్రహాలన్నింటిలో బృహస్పతి పెద్దది.
* రెండో పెద్ద గ్రహం - శని.
* గ్రహాల పరిమాణంలో భూమి - అయిదోది (5)
* గ్రహాలన్నింటిలో చిన్నగ్రహం - బుధుడు.

 

4. భూ అంతర్భాగం
* భూ అంతర్భాగం గురించి స్వయంగా తెలుసుకోవడం కష్టం.
* భూమి వ్యాసార్థం అంటే ఉపరితలం నుంచి నాభి వరకు ఉన్న దూరం 6.440 కిలోమీటర్లు.
* మానవుడు ఇంతవరకూ తవ్వకాల ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం మాత్రమే చేరగలిగాడు.
* చమురు తవ్వకాల కోసం గొట్టాలను 6   కి.మీ లోతు వరకు పంపించగలిగారు.
* భూమి అంతర్భాగ నిర్మాణం తెలుసుకోవడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకవు కాబట్టి భూకంప తరంగాలు, ఇతర మార్గాల ద్వారా సేకరించారు.
* భూ ఉపరితలం నుంచి భూమిలోకి వెళ్లేకొద్ది, ప్రతీ 32 మీటర్లకు
1o సెం.గ్రే ఉష్ణోగ్రత పెరుగుతుంది.
* భూ నాభి వద్ద 6,000o  సెం.గ్రే. ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా వేశారు.
* భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ కొన్ని ప్రాంతాల్లో శిలలు కరుగుతాయి. అందుకే అవి ద్రవరూపంలో ఉంటాయి.
* భూ అంతర్భాగంలోకి వెళ్లేకొద్ది ఉష్ణోగ్రతతో పాటు పీడన బలం కూడా పెరగడంతో నాభి వద్ద శిలాద్రవం ద్రవరూపంలో కాకుండా మెత్తటి ముద్ద లాగా ఉండి ఘనపదార్థ లక్షణాలు కలిగి ఉంటుంది.
* భూమిలో కొన్నిపొరలు ఉంటాయి. ఆ పొరల్లో మందం, విశిష్టసాంద్రత, రసాయన పదార్థాలు కింది విధంగా ఉన్నాయి.

'సుయోస్' అభిప్రాయం ప్రకారం భూమిలో 3 పొరలు ఉన్నాయి. ఆ పొరల్లో ఉన్న ముఖ్య రసాయన పదార్థాల పేర్ల మొదటి అక్షరాలను కలిపి వాటిని కింది విధంగా పేర్కొన్నారు. అవి.
 

1. సియాల్ (Sial): ఇది అన్నింటికంటే పైన ఉండే పొర. ఈ పొరలో సిలికా, అల్యూమినియం మిశ్రమం ప్రధానంగా ఉంటుంది. ఆంగ్లభాషలోని వాటి మొదటి అక్షరాలను కలిపి (Si + Al = Sial) ఈ పొరను సియాల్ అంటారు.
 

2. సిమా (Sima): సియాల్ కింద సిమా పొర ఉంది. ఈ పొరలో ప్రధానంగా సిలికా, మెగ్నీషియం మూలకాల మిశ్రమం ఉంటుంది. కాబట్టి వీటి మొదటి అక్షరాలను కలిపి సిమా అని అంటారు.
 

3. నిఫె (Nife): సిమా నుంచి భూ కేంద్రం వరకు ఉన్న మూడో పొరను నిఫె అంటారు. ఇది నికెల్, ఇనుము ఖనిజాల మిశ్రమంతో మాత్రమే ఏర్పడిన పొర అందుకే వీటి మొదటి అక్షరాలను కలిపి నిఫె అని అంటారు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌