• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక కాలంలో విద్యావిధానం

* ఆధునిక కాలంలో ప్రజల్లో విద్య విషయంలో చైతన్యం వచ్చింది. జీవనోపాధిని చూపే కొత్త విద్యావిధానం వైపు మొగ్గు చూపారు.


 

బ్రిటిష్ పాలనలో విద్యావిధానం
* క్రిస్టియన్ మత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో మిషనరీ పాఠశాలలను
   ప్రారంభించడానికి అనుమతించింది.


బ్రిటిష్ పాలనలో విద్యాలక్ష్యాలు:
1) క్రిస్టియన్ మత ప్రచారం, బైబిల్ బోధన.
2) ఒకేరకమైన పాఠ్యప్రణాళిక. ఆదివారం సెలవుతో నియతకాల ప్రకారం ఉండేది.
3) బోధనాభాష ప్రాంతీయభాష. దీంతోపాటు వ్యాకరణం, చరిత్ర, భూగోళం లాంటి విషయాలు బోధించడం.
4) సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ముద్రించడం.
5) ఏకోపాధ్యాయుడి బోధనకు బదులు బహుళ ఉపాధ్యాయ బోధనను ప్రవేశపెట్టడం.
* బ్రిటిష్ పాలనకాలంలో భారతీయులు కూడా ఆధునిక విద్యను అందించడానికి పాఠశాలలను స్థాపించారు. వారిలో ఒకరు రాజారామ్మోహన్‌రాయ్.
* వీరు 1817లో హిందూ కాలేజిని స్థాపించారు.
* మైసూరు రాజా మద్రాసులో, ఫ్రేజరు ఢిల్లీలో విద్యా సంస్థలను ప్రారంభించారు.
* బ్రిటిష్ పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ తర్వాత ఈస్టిండియా కంపెనీ తనకు వచ్చిన ఆదాయంలో ఏడాదికి రూ. లక్ష ఖర్చు చేయడానికి డంకన్ దొర నిర్ణయించారు. వీటినే 1813 చట్టంలో పేర్కొన్నారు.
* భారతదేశ సంస్కృతి, సాహిత్యాల వికాసానికి కవులు, శాస్త్రవేత్తలు, పండితులను ప్రోత్సహించడానికి; భారతీయులకు అవసరమైన శాస్త్రవిజ్ఞానాన్ని బోధించడానికి కంపెనీ తన ఆదాయంలో ఏడాదికి రూ. లక్ష ఖర్చు చేయాలని నిర్ణయించింది.
* ఆంగ్లేయులు 1813లో భారతీయ విద్యావిధానంలో అధికారికంగా జోక్యం చేసుకున్నారు. కానీ ఇది  సంపూర్ణంగా అమలవడానికి దాదాపు పదేళ్లు పట్టింది.
* 1800 - 1830 మధ్యకాలంలో మద్రాసు గవర్నర్ మన్రో, బొంబాయి గవర్నర్ ఎల్విన్‌స్టన్, కలకత్తా గవర్నర్ మన్రో జనరల్ మింటో లాంటి అధికారులు, జార్విన్ కెండి లాంటి విద్యాభిలాషులు కలిసి విద్యాసంఘాలు స్థాపించి విద్యాభివృద్ధికి/ విద్యావ్యాప్తికి ఉదారంగా కృషి చేశారు.
*  వీరు తమ రాష్ట్రాల్లోని గ్రామాల్లో దేశీయ సంప్రదాయ పాఠశాలలు స్థాపించారు. తాలూకా స్థాయిలో ఇంగ్లిష్ పాఠశాలలు, రాష్ట్రానికి ఒక కాలేజీ ఏర్పాటు చేశారు.
* గ్రామ, దేశీయ పాఠశాలల్లో విద్యా బోధన మాతృభాషలోనే జరగాలి అని పేర్కొన్నారు. 
* బెంగాల్ గవర్నర్ మింటో ప్రాంతీయభాషలో, పర్షియన్, సంస్కృత భాషల్లో విద్యాబోధన జరగాలని పేర్కొన్నారు.
* బాలికల పాఠశాలల్లో భాషాబోధనతోపాటు కుట్టుపని, అల్లికలు, కుటీర పరిశ్రమ నిర్వహణపై శిక్షణ ఇచ్చేవారు.
* బెంగాల్‌లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో కలకత్తా పరిసరాల్లో అనేక బాలికల పాఠశాలలు స్థాపించారు.
* బాలికా విద్యను ప్రభావితం చేసిన రాజారామ్మోహన్‌రాయ్ లాంటివారు హిందూ కళాశాల స్థాపనకు కృషి చేసి ఉన్నత విద్యను అందించడానికి పాటుపడ్డారు.
* బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్విన్‌స్టన్ 'స్కూల్ అండ్ స్కూల్‌బుక్ సొసైటీ అనే సంస్థను స్థాపించి విద్యాభివృద్ధికి గణనీయంగా సేవ చేశారు.
* పూనా సంస్కృత కళాశాలను కెప్టెన్ కెండీ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. ఇందులో భారతీయ శాస్త్రాలైన వేదాధ్యయనం, వ్యాకరణం, తర్కం, ఆయుర్వేదం లాంటివి బోధించడానికి ఏర్పాట్లు చేశారు.
* ఎప్ఫిన్‌స్టన్ ప్రోత్సాహంతో బొంబాయిలో ఇంజినీరింగ్, వైద్యకళాశాలలు ప్రారంభమయ్యాయి.
* జార్విన్ అనే కంపెనీ ఉద్యోగి భారతీయులకు అర్థమయ్యేలా ఇంజినీరింగ్ తరగతులను వారి ప్రాంతీయ భాషలైన అయిన కొంకణి, మరాఠీలో తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించారు.


విద్యా కమిషన్లు - వాటి ఫలితాలు
* భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెట్టింది మెకాలే.
* మెకాలే ప్రతిపాదనను అనుసరించి 1844లో గవర్నర్ జనరల్ లార్డ్‌హోర్డింగ్ ఉద్యోగ అవకాశాలను కేవలం ఆంగ్లం అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు.
* జనరల్ లార్డ్‌హోర్డింగ్ ప్రకటన వల్ల ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడే మధ్య, ఉన్నత కులాల్లో ఇంగ్లిష్ పాఠశాలలపై మోజు పెరిగింది. దేశీయ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
* విద్యావిధానాన్ని పునఃపరిశీలించడానికి డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడు చార్లెస్ ఉడ్‌ను మార్గదర్శక సూత్రాలను సూచించాల్సిందిగా ఈస్టిండియా కంపెనీ కోరింది. ఈ సూచనమేరకు ఉడ్ తన నివేదికను సమర్పించాడు.


ఉడ్ తాఖీదు 1854లోని అంశాలు
* ఉడ్ తాఖీదును భారత విద్యావిధానంలో మాగ్నాకార్టాగా హెచ్.ఆర్. జేమ్స్ అభివర్ణించాడు.
1) భారతీయ విద్యావ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి.
2) విద్య యొక్క లక్ష్యం భారతీయులను ప్రభుత్వ సేవకులుగా కాకుండా భారతీయ ప్రజ్ఞను, నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి.
3) ఆంగ్లభాషను కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం ఉన్నవారికి మాత్రమే బోధించాలి. మిగతా విద్యార్థులు తమ మాతృభాషలో చదువు నేర్చుకోవాలి.
4) ప్రతి రాష్ట్రంలో సమర్థమైన సిబ్బందితో విద్యాశాఖలు ఏర్పాటుచేసి, ప్రజావిద్య నిర్దేశికాధికారిని నియమించాలి.
5) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి.
6) విద్యాలయాల్లో మతబోధనపై తటస్థ విధానం పాటించాలి.
7) బాలిక, స్త్రీ విద్యను అందించే సంస్థలు, వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి.
8) ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకత, స్థాపన.
9) ప్రయివేటు సంస్థలకు విద్యాలయాలు స్థాపించడానికి తగిన ప్రోత్సాహం, సహాయక గ్రాంట్లు మంజూరు చేయాలి.
10) ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల స్థాయులు; విశ్వవిద్యాలయ స్థాయి లాంటి రకాలుగా నిర్ణీతమైన శ్రేణుల్లో విభజించి విద్యను బోధించడం, నిర్వహించడం.


ఉడ్స్ నివేదిక ఫలితాలు:
1) అనేక రాష్ట్రాల్లో విద్యాశ్రేణులు ఏర్పాటయ్యాయి.
2) ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు విద్యాలయాలు స్థాపించడానికి సహాయక విరాళాల నియమావళిని రూపొందించారు.
3) విశ్వవిద్యాలయ అవసరాన్ని గుర్తించారు.
4) మద్రాసు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయాలను 1857లో స్థాపించారు. పాశ్చాత్య విధానంలో తొలి భారతీయ పాశ్చాత్య విధాన విశ్వవిద్యాలయ విద్యాబోధన అనుబంధ కళాశాలలో జరిగేది.
5) ఇంగ్లండ్ కంటే ముందు భారతదేశంలోనే స్త్రీ విద్యను ప్రారంభించారు. 
* తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు - చంద్రముఖీబసు.
* ఉన్నత విద్యను పూర్తిచేసిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రవేశార్హత నిర్ణయించే పరీక్షను నిర్వహించే పనిని విశ్వవిద్యాలయాలు చేపట్టాయి. దీన్నే 'మెట్రిక్యులేషన్' పరీక్ష అన్నారు.
* 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు.
* ఈ సంస్థకు ప్రజల నుంచి విద్యాపన్ను వసూలు చేయడానికి అవకాశం కల్పించారు.

 

హంటర్ కమిషన్ - 1882 (ప్రథమ విద్యాకమిషన్)
* 1882లో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్‌గా భారతదేశం రాగానే విలియం హంటర్ అధ్యక్షతన మొదటి విద్యాకమిషన్ వేశారు.
* హంటర్ కమిషన్ ప్రధాన ఉద్దేశం - ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను తీసుకురావడం.
* ఈ కమిషన్ ప్రభావంతో ప్రాథమిక పాఠశాలలను స్థాపించారు. యాజమాన్య బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. విస్తృతంగా పాఠశాలలు నెలకొల్పారు.
* ప్రాథమిక విద్యాప్రణాళికలోని అంశాలు: నిత్య జీవితానికి పనికివచ్చే భౌతికశాస్త్రం, వ్యవసాయం, క్షేత్ర గణితం.
* మతపరమైన బోధనలను పాఠశాలల్లో చేర్చకూడదని కమిటీ పేర్కొంది.
* వెనుకబడిన వారికి, గిరిజనులకు, స్త్రీలకు విద్యాలయాల్లో ఉచితంగా ప్రవేశం కల్పించారు.
* ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చిన కమిషన్ - హంటర్ కమిషన్.

 

విశ్వవిద్యాలయాల కమిషన్ - 1902 
* హంటర్ కమిషన్ పేర్కొన్న అంశాలను ప్రాథమిక పాఠశాలలో విస్తృతంగా అమలు చేసినా అది కొద్దిరోజుల్లోనే  సన్నగిల్లింది. 1897 నుంచి 1902 మధ్య కాలంలో భయంకరమైన కరవు, ప్లేగు వ్యాధి వ్యాప్తితో దేశమంతటా
   విద్యార్థుల సంఖ్య తగ్గింది.
* ఈ కాలంలోనే అంటే 1899లో భారతదేశ గవర్నర్ జనరల్‌గా లార్డ్ కర్జన్ నియమితులయ్యారు. 
* భారతీయ పరిస్థితికి అనుకూలమైన విద్యను అందించే మార్పులు తీసుకురావడానికి లార్డ్ కర్జన్  విశ్వవిద్యాలయ కమిషన్‌ను 1902లో ఏర్పాటు చేశారు.
* వీటి ఆధారంగా 1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టం  రూపొందించారు.
* గోపాలకృష్ణ గోఖలే 1910లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ప్రాథమిక విద్యపై  కొన్ని తీర్మానాలు; 1911లో ప్రాథమిక విద్యపై బిల్లు ప్రవేశపెట్టాడు.
* 1916లో బెనారస్ హిందూ  విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
* 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన. ఈ విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారానికి లీడ్స్  విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ మైకాల్ శ్లాడర్స్ 1917లో కమిషన్ వేశారు.
* శ్లాడర్ కమిషన్ 10+2+3 విద్యావిధానాన్ని ప్రతిపాదించింది.

 

హార్టాగ్ కమిటీ - 1929
* 1927లో వచ్చిన సైమన్ కమిషన్‌లో సభ్యుడు సర్ ఫిలిప్ హార్టాగ్.
* ఈ కమిటీ గుణాత్మక విద్యను అందించడానికి పర్యవేక్షకుల సంఖ్య పెంచాలని కోరింది.
* ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలని సూచించింది.
* వృథా (wastage) లేదా అపవ్యయం స్తబ్దత లేదా నిలుపుదల (stagnation) ను అరికట్టడానికి
   సూచనలిచ్చింది.
* ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో మానివేయడాన్ని అపవ్యయం అంటారు.
* ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని నిలుపుదల అంటారు.


హార్టాగ్ కమిటీ ముఖ్య ఫలితాలు:
* ఉపాధ్యాయ శిక్షణ, దృక్పథం ఉన్న పాఠ్య ప్రణాళికలు, పర్యవేక్షకుల సంఖ్యను పెంచడం లాంటి మార్పులు జరిగాయి.
* [అబాట్-ఉడ్ నివేదిక (1937) బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించింది.]
* ఈ కమిటీ ఉపాధ్యాయులకు రెండేళ్లు వృత్తి శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.

 

సార్జంట్ ప్లాన్ - 1944:
* 1944లో భారతదేశ విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికను తయారు చేయాల్సిందిగా కేంద్ర విద్యా సలహా సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
* సార్జంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన ఈ ప్రణాళిక భారతదేశ విద్యావ్యవస్థకు మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు.


సూచించిన ముఖ్యాంశాలు
1) 3 - 6 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు ప్రీ-ప్రైమరీ విద్యను ఏర్పాటుచేయడం.
2) 6 - 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించడం.
3) ఎంపిక చేసిన 11 - 17 సంవత్సరాల పిల్లలకు ఆరేళ్లపాటు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయడం.
4) హయ్యర్ సెకండరీ విద్య తర్వాత 3 సంవత్సరాల కాలం డిగ్రీ విద్య.
5) సాంకేతిక, వాణిజ్య, ఇతర విద్యాకోర్సులను ఏర్పాటు చేయడం.
6) నిరక్షరాస్యతను నిర్మూలించడానికి గ్రంథాలయాల స్థాపన.
7) ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రూపొందించి, నిర్వహించడం.
8) వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించడం.
9) ఉపాధ్యాయ సలహా సంస్థ ఏర్పాటు.
10) సాంఘిక వినోద కార్యక్రమాల ఏర్పాటు.

 

స్వాతంత్య్రానంతరం విద్యావిధానం
* 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రావడంతో భారతదేశ విద్యావిధానంలో కొత్త శకం ఆరంభమైంది.
*  రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను 6-14 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ అందివ్వాలని సూచించింది. అప్పటి అక్షరాస్యత 15%.

విద్యా లక్ష్యాలు:
1) ప్రజాస్వామ్య దృక్పథంతో విద్య
2) నూతన జీవన విధానానికి విద్య
3) ఆర్థిక స్వావలంబన కోసం విద్య
4) జాతీయ దృక్పథంగా విద్య
* 1948లో సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన విశ్వవిద్యాలయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

 

సెకండరీ విద్యాకమిషన్ (1952-53)/ మొదలియార్ కమిషన్
* కేంద్ర విద్యా సలహా బోర్డు (C.A.B.E.) నియమించిన రెండో కమిషన్ - మొదలియార్ కమిషన్. దీన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు.
* ఈ కమిషన్ విద్య నిర్మితి 5 + 3 + 4 + 3, 1 - 5 ప్రాథమిక స్థాయి, 6 - 8 సెకండరీ స్థాయి 9 - 12 హయ్యర్  సెకండరీ స్థాయి, 3 ఏళ్ల డిగ్రీ స్థాయి. 
* బోధన శాస్త్రీయ పద్ధతిలో జరగాలని, హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలోనే బోధన సాగించాలని కమిషన్ సూచించింది.
* హిందీ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. 12వ తరగతి పూర్తయిన తర్వాత వృత్తి విద్యాకోర్సులకు అర్హులుగా నిర్ణయించింది.
* సెకండరీ స్థాయిలోనే సాంకేతిక విద్యాబోధన ప్రారంభించాలని, ఉన్నతస్థాయి కమిటీ ద్వారా పాఠ్యగ్రంథాల నిర్ణయం జరగాలని, కంపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. 
* బహుళార్థ సాధక పాఠశాలలు (Multipurpose Schools) నెలకొల్పాలని పేర్కొన్న కమిషన్ కూడా ఇదే.


జాతీయ విద్యా కమిషన్/ కొఠారి కమిషన్ - 1964
* ప్రాథమిక విద్యావిధానంలో సంస్కరణలను ప్రారంభించింది - కొఠారి కమిషన్(1964).
* విద్యా నిర్మితి 5 + 3 + 4 + 3.
* ప్రాథమిక విద్యకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తాలను  కేటాయించాలని ఈ కమిషన్ పేర్కొంది.
* ప్రాథమిక స్థాయిలో బాలికల విద్యను ప్రోత్సహించాలి. మహిళా ఉపాధ్యాయులను నియమించాలి, బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి.
* బాలికలకు ప్రాథమిక స్థాయిలో ఒక కిలోమీటరు దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి.
* మధ్యాహ్న భోజన వసతి, ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయాలి.
* ప్రతి అయిదేళ్లకు ఒకసారి విద్యావిధానాన్ని సమీక్షించాలి.
* ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి. పూర్తి హాజరు ఉన్నవారికి మాత్రమే ఉపకార వేతనాలు ఇవ్వాలి.
* అపవ్యయం నిలుపుదలను తగ్గిస్తూ ఉత్తమ బోధన జరిగేలా చూడాలి.
* అనియత విద్యాకేంద్రాలను స్థాపించి ఆర్థిక పరిస్థితులు సరిగా లేక బడి మానివేసిన వారిని వాటిలో  చేర్పించాలి.
* సామాజిక పాఠశాలలు (Common School System) స్థాపించమని కొఠారి కమిషన్ సూచించింది.

 

జాతీయ విద్యావిధానం-1968 
* భారతీయ విద్యావిధానాన్ని పునర్నిర్మాణం చేసే విద్యావిధానం - జాతీయ విద్యావిధానం 1968.
* 10 + 2 + 3 విద్యావిధానం అనుసరించింది.
* 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడం.
* పార్ట్‌టైం, కరస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడం.
* పాఠశాల స్థాయిలో త్రి భాషాసూత్రం అమలు, అంతర్జాతీయ భాషగా ఇంగ్లిష్, జాతీయ భాషగా హిందీ, మూడోది ప్రాంతీయ భాష.
* సమాన విద్యావకాశాలు, పని అనుభవం, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు; రాష్ట్రానికో వ్యవసాయ విశ్వవిద్యాలయం.
* ఐఐఐ, పాలిటెక్నిక్ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడం.

 

ఈశ్వరీ భాయి పటేల్ కమిటీ 1977: (గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్)
* పని అనుభవానికి బదులుగా సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు (SUPW) ప్రవేశపెట్టాలని సూచించింది.
* విద్య నియత, అనియత పద్ధతుల్లో జరగాలని, క్రియాశీలక విద్యకు ముఖ్యస్థానం కల్పించాలని ఈ కమిషన్ పేర్కొంది.
* SUPW  కోసం వారానికి 3 - 6 గంటలు కాలం కేటాయించాలని భాషకు, గణితం, పరిసరాల విజ్ఞానానికి పాఠ్యపుస్తకాలు అందించాలని, హోమ్‌వర్క్ తగ్గించాలని పేర్కొంది. ఉపాధ్యాయులకు మార్గదర్శక  పుస్తకాలు, బోధనోపకరణాలు అందజేయాలి.
* ఆంగ్ల భాషను 8వ తరగతి నుంచి ప్రవేశ పెట్టాలని నిలుపుదల అపవ్యయాన్ని తగ్గించాలని పేర్కొంది.
* తరగతుల స్థాయి 1 - 5 ప్రాథమిక, 6 - 7 మాధ్యమిక, 8 - 10 సెకండరీగా ఉండాలని సూచించింది.

 

డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య - 1978:
* మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య అధ్యక్షతన 1978లో ఒక కమిటీ   ఏర్పాటైంది. ఈ కమిటి ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తివిద్య కోర్సులను ప్రవేశపెట్టడానికి Learning to do అనే
   శీర్షికతో రిపోర్ట్ అందజేసింది.

 

కొత్త జాతీయ విద్యావిధానం - 1986
(New Policy on Education ) NPE 1986 (రాజీవ్‌గాంధీ కాలంలో):
* విద్యా సవాళ్లు, విద్యాదృక్పథం ఆధారంగా 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం NPE ని రూపొందించింది.
* 10 + 2 + 3 విద్యా నిర్మితిని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం.
* కుల, మత, జాతి, వర్గ విచక్షణ లేకుండా అందరికీ గుణాత్మక విద్యను అందిచడం.
*  త్రిభాష సూత్రం అమలు చేయడం.
* గ్రామీణ విశ్వవిద్యాలయాలను గాంధీజీ సూచించిన బేసిక్ విద్యావిధానం ఆధారంగా రూపొందించాలి.
* వృత్తి విద్యాకోర్సులు ప్రారంభించాలి. విద్య సముపార్జనలో విలువలకు స్థానం కల్పించాలి.
* వికలాంగులు, షెడ్యూల్డ్ కులాల వారికి విద్యా విషయక ప్రోత్సాహాలు కల్పించాలి.
* వయోజన విద్యావ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి.
* ప్రాథమిక విద్యను నిర్బంధం చేసి, నాణ్యతను పెంచుతూ, అపవ్యయం, నిలుపుదలను తగ్గించాలి.
* స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయంతో  ప్రోత్సహించాలి.
* ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే విధంగా విద్య ఉండాలి.
* బట్టీ చదువుకి స్వస్తి చెప్పి, నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి.

 

ఆచరణాత్మక కార్యక్రమం (Plan of Action):
* 1986 జాతీయ విద్యావిధానం సూచించిన అంశాలను ఆచరణలో పెట్టడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
* వీటిలో ముఖ్యమైనవి నల్లబల్ల ప్రక్రియ (Operation Black Board -OBB). 
* OBB ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలి.
* కావాల్సిన తరగతి గదులు సమకూర్చి, అవసరమైన భౌతిక వనరులు, బోధనోపకరణాలు అందజేసి సూక్ష్మ
   ప్రణాళికలో నమోదు చేయడం, పాఠ్యపుస్తకాల తయారీ, పంపిణీ లాంటి విషయాలను సూచించారు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌