• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర బోధనా ఉద్దేశాలు, విలువలు

 జీవశాస్త్ర బోధనా ఉద్దేశాలు:

'ఉద్దేశం అనేది కళ్ల ముందు కనిపిస్తూ, మనం చేసే ప్రతి కృత్యానికి దిశా నిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుంది. మన జయాపజయాలను మాపనం చేసే సాధనమే ఉద్దేశం' - జాన్‌డ్యూయి

కొన్ని జీవశాస్త్ర బోధనా ఉద్దేశాలు:

* శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించడం.
* జీవశాస్త్ర ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం.
* పరిసరాల గురించి అవగాహన కలిగించడం.
* విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహనను పెంపొందించడం.
* సాంకేతిక అభివృద్ధిలో సరితూగడం.
* నిత్య జీవితానికి అన్వయించుకోవడం.
* మెదడుకు పదునుపెట్టడం.
* వృత్తివిద్యా ప్రవేశానికి
* చక్కని అలవాట్లను, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం.
* సంస్కృతిని కాపాడి, అభివృద్ధి పరచడానికి

* ప్రపంచ శాంతిని పెంపొందించడానికి
* వినోదం కోసం
* ఉన్నత విద్య కోసం
* మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం.
* విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి

 

జీవశాస్త్ర బోధనా విలువలు:
* జీవశాస్త్ర అభ్యసనం ద్వారా వ్యక్తిలో వచ్చే ప్రవర్తనా మార్పులు లేదా మూర్తిమత్వ వికాసాన్ని విలువగా చెప్పవచ్చు.
* విలువ అంటే ఒక దృగ్విషయం యోగ్యతను తెలియజేసేది.
* విలువలు అమూర్త గమ్యాలు.


జీవశాస్త్ర బోధన వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెంది, ప్రదర్శించే విలువలు

1. బౌద్ధిక విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థికి పాత ఆలోచన స్థానంలో కొత్త ఆలోచన వస్తుంది. దీన్నే బౌద్ధిక విలువ అంటారు.
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థి ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలను తీసుకోవడమే బౌద్ధిక విలువ.
ఉదా: విద్య అనే బాలిక ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే ఆమెలో పెంపొందిన విలువ బౌద్ధిక విలువ.

2. ఉపయోగాత్మక విలువ/ఉపయోగిక విలువ:
* సహజ వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజ జీవితంలో వినియోగించగలగడమే ఉపయోగాత్మక విలువ.
ఉదా: రవి శ్రీవరిని సాగు చేసి అధిక దిగుబడిని పొందాడు. అతడిలో పెంపొందిన విలువ ఉపయోగాత్మక విలువ.

 

3. వృత్తిపరమైన విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థి జీవన భృతి కోసం ఒక వృత్తిని ఎన్నుకోవడాన్నే వృత్తి విలువ అంటారు.
* జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, నర్సు, న్యూట్రిషనిస్టు, శాస్త్రవేత్త, ఫిజియోథెరపిస్టు, డెంటిస్టుగా ఇలా వివిధ వృత్తుల్లో స్థిరపడటాన్ని వృత్తి విలువ అంటారు.
ఉదా: జానకి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కోళ్ల పరిశ్రమను తన జీవన భృతిగా ఎన్నుకుంది. అయితే ఆమెలో పెంపొందిన విలువ వృత్తి విలువ.

 

4. నైతిక విలువ:
* విద్యార్థిలో జీవశాస్త్ర అధ్యయనం వల్ల సత్యం, శివం, సుందరం అనే లక్షణాలను పెంపొందించడమే నైతిక విలువ.
* సత్యం అంటే నిష్పక్షపాతం, నిస్వార్థ సత్యాన్వేషణ.
* శివం అంటే సకల జీవరాశుల శ్రేయస్సును ఆకాంక్షించడం. సుందరం అంటే ప్రకృతిలోని సహజ సౌందర్యం, సమతౌల్యాన్ని భంగపరచకుండా ఉండటం.
* నిజాయతీ, నిస్వార్థం, నిష్పక్షపాతంగా ఉండటమే నైతిక విలువ.
ఉదా: పవన్ అణుపరిజ్ఞానాన్ని మాపన వినాశనం కోసం కాకుండా, మానవ కల్యాణం కోసం ఉపయోగిస్తే అతడిలో పెంపొందిన విలువ నైతిక విలువ.

5. సౌందర్య విలువ:
* విశ్వంలో ప్రతిదీ ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుంది. దానిలోని క్రమాన్ని, సౌష్ఠవాన్ని, సౌందర్యాన్ని, మృదుత్వాన్ని, రమణీయతను ఆశ్చర్యపడి అభినందించడమే సౌందర్య విలువ.
* 'ప్రకృతిలో ముందే ఉన్న సమన్వయం సౌందర్య సహితమై ఉంది' - ఐన్‌స్టీన్
ఉదా: సుష్మ గులాబిపై వాలిన రంగురంగుల సీతాకోకచిలుక అందాన్ని చూసి ముగ్ధురాలైంది. అయితే ఆమెలో పెంపొందిన విలువ సౌందర్య విలువ.

 

6. సాంస్కృతిక విలువ:
* విజ్ఞాన శాస్త్ర విలువలు దాగి ఉన్న సంస్కృతిని అనుసరిస్తూ, ముందు తరాలకు అందించడమే సాంస్కృతిక విలువ.
* మన పూర్వీకుల ఆచార వ్యవహారాల్లోని మూఢనమ్మకాలను విచక్షణతో పరిశీలించి, ఆచరించాల్సిన వాటిని కాపాడాలి.

 

7. క్రమశిక్షణ విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థి క్రమశిక్షణను అలవరచుకుని క్రమమైన జీవనాన్ని సాగించడమే క్రమశిక్షణ విలువ.

 

8. సృజనాత్మక విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థికి విభిన్న ఆలోచన, విమర్శనా శక్తి అలవడుతుంది. దీన్నే సృజనాత్మక విలువ అంటారు.
* విభిన్న కోణాల్లో వ్యాఖ్యానించ గల సామర్థ్యం, స్వతంత్య్రంగా ఆలోచించడం సృజనాత్మకతకు మూలం.
ఉదా: విద్యార్థి తాను చేసే పరికరాలకు ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకుంటాడు. అయితే అతడిలో పెంపొందిన విలువ సృజనాత్మక విలువ.

9. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ:
సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు ఉపయోగించే పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు.
ఉదా: సాత్విక్ నియంత్రిత పరిస్థితుల్లో చిక్కుడు విత్తనాలను పెంచి వాటి పెరుగుదలకు అవసరమైన పరిస్థితులను కనుక్కున్నాడు. అయితే అతడిలో పెంపొందిన విలువ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ.

 

10. శాస్త్రీయ వైఖరి:
* ఒక శాస్త్రవేత్త యొక్క వైఖరిని శాస్త్రీయ వైఖరి అంటారు.

 

శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి లక్షణాలు:
* నిశిత పరిశీలన
* సరైన ఆధారం లేనప్పుడు తీర్పును నిలిపివేయడం
* కచ్చితమైన ఆధారం లభించినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం
* ఇతరుల భావాలను గౌరవించడం
* పట్టుదల కలిగి ఉండటం
* అపజయాలకు లొంగకపోవడం
* పనిని దైవంగా భావించడం
ఉదా: మంత్రాల వల్ల వినాయకుడు పాలు తాగుతున్నాడు అనే విషయాన్ని ఖండిస్తే అతడిలో పెంపొందిన విలువ శాస్త్రీయ వైఖరి.

శాస్త్రీయ వైఖరిని పెంపొందించే మార్గాలు:
* మూఢనమ్మకాల అధ్యయనం
* విస్తార పఠనాన్ని ప్రోత్సహించడం
* ప్రయోగాల నిర్వహణ
* శాస్త్రవేత్తల గాథలు తెలియజేయడం
* సహ పాఠ్య ప్రణాళికా కార్యక్రమాలు (వైజ్ఞానిక ప్రదర్శనలు)

 

11. విరామ సమయ సద్వినియోగ విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. దీన్ని విరామ సమయ సద్వినియోగ విలువ అంటారు.

 

విరామ సమయ విలువ ఉన్న విద్యార్థి చేసే పనులు:
* ప్రకృతి అధ్యయనం 
జంతు కళేబరాలను, వృక్షాలను సేకరించడం, భద్రపరచడం
* పక్షులు, చేపలను పెంచడం
* వైజ్ఞానిక సంబంధమైన సేకరణ
* అక్వేరియం నిర్వహణ
* బడితోట నిర్వహణ
* తేనెటీగల పెంపకం
ఉదా: సహస్ర అనే విద్యార్థిని ఖాళీ సమయంలో పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టింది. అయితే ఆమెలో పెంపొందిన విలువ విరామ సమయ వినియోగ విలువ.

12. ఉన్నత జీవనానికి భూమిక:
* విద్యార్థి జీవశాస్త్ర అధ్యయనం వల్ల మేలైన జీవితాన్ని గడుపుతాడు. ఇదే ఉన్నత జీవనానికి భూమిక.
ఉదా: ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల మెరుగైన వైద్యాన్ని అందించడం.

 

13. ఉత్తేజాన్ని కలిగించే విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థి ఉత్తేజితం చెందడాన్నే ఉత్తేజిత విలువ అంటారు.
ఉదా: కోపర్నికస్, బ్రూన్ జీవిత చరిత్రలను చదివిన విద్యార్థి ఉత్తేజితుడవుతాడు. అప్పుడు అతడిలో పెంపొందిన విలువ ఉత్తేజిత విలువ.

 

14. వివరణాత్మక/వ్యాఖ్యానాత్మక విలువ:
* జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థి ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చూడటం, వివిధ కోణాల్లో వ్యాఖ్యానించడం చేస్తాడు. దీన్నే వివరణాత్మక/వ్యాఖ్యానాత్మక విలువ అంటారు.
గమనిక: అమెరికా ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ (1966) ప్రకారం విద్యార్థి ప్రశ్నించడం, తార్కికంగా ఆలోచించడం కూడా విజ్ఞాన శాస్త్ర విలువలే.


రచయిత: రాధాకృష్ణ
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌