• facebook
  • whatsapp
  • telegram

కవులు, రచయితలు - విశేషాంశాలు

  తెలుగు సాహిత్యంలో కవుల ఉక్తులూ, సూక్తులూ, పురాణాల్లోని వ్యక్తులు, ప్రముఖ నవలల్లోని ప్రసిద్ధ పాత్రలూ, ఒకరి గురించి మరొకరి వ్యాఖ్యలు కూడా ముఖ్యమైనవే. విశేషాంశాలుగా ఉన్న వాటిని అధ్యయనం చేయడం అవసరం. ఇవి పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడతాయి. ప్రాచీన, ఆధునిక కవుల ప్రసిద్ధ వాక్యాల గురించి తెలుసుకుందాం.
* నన్నయ భారతంలో ఉన్న సూక్తులన్నిటిలో 'గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్' అన్నది ప్రసిద్ధమైంది.
* 'శ్రీవాణీగిరిజాశ్చిరాయదధతో...' అనే సంస్కృత శ్లోకంతో నన్నయ భారతాన్ని ప్రారంభించాడు.
* తర్వాత 12వ శతాబ్దానికి చెందిన నన్నెచోడుడు 'శివకవి'గా 'మార్గకుమార్గము దేశియ మార్గము' అని చాటాడు.
* 'తిన్నని సూక్తుల ద్విపద రచింతు' అంటూ పాల్కురికి సోమన ద్విపద కావ్యానికి శ్రీకారం చుట్టాడు.
* తిక్కన 'ఆంధ్రావళి మోదము' కోసం రాస్తున్నానని ప్రకటించాడు.
* విశ్వనాథ సత్యనారాయణ 'రుషివంటి నన్నయ రెండో వాల్మీకి' అనీ, 'తిక్కన తెలుగు శిల్పంపుతోట' అనీ ప్రశంసించారు.
* 'నా కవిత్వంబు నిజము కర్ణాట భాష' అని శ్రీనాథుడు అనడంలో అర్థం శ్రవణానందం కలిగించే భాషలో చెబుతానని మాత్రమే.
* సంస్కృత విద్వాంసులు శ్రీనాథుడిని 'డుమువుల కవి' అని హేళన చేశారు.
* 'సత్కవుల్ హాలికులైననేమి' అంటూ బమ్మెర పోతన రాముడిని తప్ప మరొకరిని స్తుతించను, యాచించను అన్నాడు. 'పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట' అని భావించి భాగవతం రాశాడు పోతన.
* 'అల్లసాని వాని అల్లిక జిగిబిగి', 'ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు' లాంటివి ఆ కవుల కవితా రీతులను వెల్లడిస్తాయి.
* చేమకూర వేంకట కవి 'ప్రతిపద్య చమత్కృతి'తో విజయ విలాసం అనే కావ్యాన్ని రాశాడు. ''ఏ గతి రచియించిరేని సమకాలపు వారలు మెచ్చరే గదా" అనడం ఆయనకే చెల్లింది.
 

 ఆధునిక కవులు
* ఆధునిక కవులు కూడా సమాజపరంగా, కవితాపరంగా ఉక్తులు ప్రకటించారు.
* వీళ్లు ప్రధానంగా కవిత్వ ప్రయోజనం, సమానత్వం, మానవత్వం, జీవిత గమనం లాంటివాటిపై దృష్టి సారించారు.
* తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రాసిన కురుక్షేత్ర నాటకంలోని
'బావా, ఎప్పుడు వచ్చితీవు...',
'జెండాపై కపిరాజు...' - లాంటి పద్యాలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నాయి. ఈ జంట కవుల గురించి 'ప్రాచీన కవిత్వానికి భరత వాక్యం, ఆధునిక కవిత్వానికి నాంది వాక్యం' అని చెబుతారు. వీరి ఉక్తుల్లో
'తెనుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది' అనేది ప్రసిద్ధం.


* గురజాడ అప్పారావు కవిత్వంలో ఎన్నెన్నో సూక్తులున్నాయి. ఉదాహరణకు కొన్ని...
''దేశమును ప్రేమించుమన్న..."
''దేశమంటే మట్టికాదోయ్..."
''వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్"
లాంటివి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.


* రాయప్రోలు సుబ్బారావు రాసిన
''ఏ దేశమేగిన ఎందుకాలిడిన
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన..." అనేది అప్పటికీ ఇప్పటికీ మరచిపోలేని గేయం.


* గబ్బిలం కావ్యంలో జాషువా పలికిన 'నాలుగు పడగల హైందవ నాగరాజు' అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన పలుకులు.
* అడివి బాపిరాజు రాసిన 'లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా...' అనే గేయం ప్రసిద్ధమైంది.
* మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన చాలా పంక్తులు తప్పక చదవాల్సినవే. వాటిలో కొన్ని:

''నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను"
''తాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు"
''కాదేదీ కవితకనర్హం"


* భావకవిగా సుప్రసిద్ధుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షంలో ప్రాచుర్యం పొందిన పంక్తులున్నాయి. ఉదాహరణకి

''ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై..."
''నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?
నా యిచ్ఛయేగాక నాకేటి వెఱపు?"
''దిగిరాను దిగిరాను దివి నుండి భువికి"


* దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనను దుయ్యబడుతూ గర్జించారు. ఆయన పలుకులివి...
'నా తెలంగాణ కోటి రతనాల వీణ'
'మా నిజాము రాజు జన్మజన్మాల బూజు'
'తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?'


* వచన కవితకు ఆద్యుడైన శిష్ట్లా ఉమామహేశ్వరరావు 'నా యీ వచన పద్యాలనే దుడ్డు కర్రల్తో పద్యాల నడుముల్ విరగదంతాను' అన్నాడు.
* ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆంధ్ర భాషాభిమానంతో ఇలా అన్నారు.

'అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు
సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా?'

* జాతీయోద్యమంలో ఎన్నో పద్యాలు, పాటలు ఆనాడు చైతన్యాన్ని కలిగించాయి. అందులో కొన్ని ఇప్పటికీ మరిచిపోలేం....
* భరత ఖండంబు చక్కని పాడియావు... - చిలకమర్తి.
* కొల్లాయి గట్టితేనేమి...   - బసవరాజు అప్పారావు.
* మాకొద్దీ తెల్లదొరతనం దేవా...    - గరిమెళ్ల సత్యనారాయణ.
* మా తెలుగు తల్లికి మల్లెపూదండ...   - శంకరంబాడి సుందరాచారి
* చేయెత్తి జైకొట్టు తెలుగోడా... - వేములపల్లి శ్రీకృష్ణ.


 రచయితలు - బిరుదులు
* శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి - కథక చక్రవర్తి
* వేదం వేంకటరాయ శాస్త్రి - మహామహోపాధ్యాయ
* ధర్మవరం కృష్ణమాచార్యులు   - ఆంధ్రనాటక పితామహుడు
* కుందుర్తి ఆంజనేయులు  - వచన కవితా పితామహుడు
* ఆదిభట్ల నారాయణదాసు - హరికథా పితామహుడు
* షేక్ నాజర్ - బుర్రకథా పితామహుడు
* కందుకూరి వీరేశలింగం - నవయుగ వైతాళికుడు
* సురవరం ప్రతాపరెడ్డి - తెలంగాణ వైతాళికుడు
* మాడపాటి హనుమంతరావు - ఆంధ్ర పితామహ
* విశ్వనాథ సత్యనారాయణ - కవిసమ్రాట్
* పుట్టపర్తి నారాయణాచార్యులు - సరస్వతీపుత్ర
* దువ్వూరి రామిరెడ్డి - కవికోకిల
* సి.పి. బ్రౌన్ - తెలుగు సూర్యుడు
* పానుగంటి నరసింహారావు - ఆంధ్రా ఎడిసన్
* వావిలికొలను సుబ్బారావు - ఆంధ్ర వాల్మీకి
* వానమామలై వరదాచార్యులు - అభినవ పోతన
* గిడుగు రామమూర్తి - అభినవ వాగనుశాసనుడు
* భమిడిపాటి కామేశ్వరరావు - హాస్యబ్రహ్మ


 కొన్ని విశేషాంశాలు
* శ్రీరంగరాజ చరిత్రకు ఉన్న మరోపేరు - 'సోనాబాయి పరిణయం'.
* 'వివేక చంద్రిక' అనేది రాజశేఖర చరిత్రకు ఉన్న మరోపేరు.
* ఉన్నవవారి మాలపల్లి నవలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.
* చిలకమర్తి వారి 'గణపతి' - తొలి హాస్యనవల.
* మాలపల్లి నవలకు ఉన్న మరోపేరు - సంగవిజయం.
* నగ్నముని 'మాలపల్లి'ని నాటకంగా రాశారు.
* వేయి నవలలు రాసిన ఒకే ఒక్కడు - కొవ్వలి లక్ష్మీనరసింహారావు.
* కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన 'మంజరీ మధుకరీయం' తొలి నాటకం.
* బుచ్చిబాబు అసలు పేరు - శివరాజు వెంకట సుబ్బారావు
* పాలేరు నాటకం ద్వారా సంచలనం తీసుకువచ్చింది డా. బోయి భీమన్న.
* పాకుడురాళ్లు, జీవన సమరం లాంటి నవలలు, 500 కథలు రాసిన డా. రావూరి భరద్వాజకు ఇటీవల జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.


పత్రికలు - సంపాదకలు
* సుజనరంజని - చిన్నయసూరి
* ప్రబుద్ధాంధ్ర - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
* వివేకవర్థిని - కందుకూరి వీరేశలింగం
* గోల్కొండ - సురవరం ప్రతాపరెడ్డి
* కృష్ణాపత్రిక - ముట్నూరి కృష్ణారావు
* శోభ - దేవులపల్లి రామానుజరావు
* ఆంధ్రపత్రిక - కాశీనాథుని నాగేశ్వరరావు


 పురాణ పాత్రలు
  రామాయణ, భారత ఇతిహాసాల్లో, భాగవతంలో ఉన్న ముఖ్యమైన పాత్రల గురించి తెలుసుకోవడం అవసరం.
* వసిష్ఠుని భార్య - అరుంధతి
* ద్రోణుడి కుమారుడు - అశ్వత్థామ
* విరాటరాజు బావమరిది - కీచకుడు
* రావణుడి తమ్ముడు - కుంభకర్ణుడు
* వ్యాసుడి మరో పేరు - కృష్ణద్వైపాయనుడు
* ద్రుపదుడి కుమార్తె - ద్రౌపది
* వ్యాసుడి కుమారుడు - శుకుడు
* రావణుడి చెల్లెలు - శూర్పణఖ
* సత్రాజిత్తు కుమార్తె - సత్యభామ
* నలదమయంతులు ఉన్న కావ్యం - శృంగార నైషధం
* గుణనిధి పాత్ర ఉన్నది - కాశీఖండం
* నిగమశర్మ ఉన్న కావ్యం - పాండురంగ మహాత్మ్యం
* వరూధిని, ప్రవరులు ఉన్న కావ్యం - మనుచరిత్ర
* కమలిని పాత్ర ఉన్నది - దిద్దుబాటు కథ
* గిరీశం పాత్ర ఉన్న నవల - కన్యాశుల్కం
* కాంతం పాత్ర ఉన్నది - కాంతం కథలు
* బారిస్టర్ పార్వతీశం పాత్ర ఉన్న నవల - బారిస్టర్ పార్వతీశం
* ధర్మారావు పాత్ర ఉన్న నవల - వేయిపడగలు
* సీతారామారావు పాత్ర ఉన్న నవల - అసమర్థుని జీవయాత్ర
* సంగదాసు, రామదాసు పాత్రలు ఉన్నది - మాలపల్లి 
* దయానిధి పాత్ర ఉన్న నవల - చివరకు మిగిలేది

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌