• facebook
  • whatsapp
  • telegram

ప్రాచీన కవుల పరిచయాలు

తిక్కన
  కవిత్రయంలో ద్వితీయుడైనా కవిత్వంలో అద్వితీయుడు కొట్టరువు తిక్కనామాత్యుడు లేదా తిక్కన సోమయాజి. ఈయన 13వ శతాబ్దివాడు. నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి ఆస్థాన కవి. తిక్కన నెల్లూరు నివాసి. ఉభయ కవిమిత్ర, కవిబ్రహ్మ అనే బిరుదులున్నాయి. ఇతడి తొలి రచన 'నిర్వచనోత్తర రామాయణం'.

ఇది కేవలం పద్యరచన. దీన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. తిక్కన తన పదిహేను పర్వాల మహాభారత రచనను హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. తిక్కన 'ఆంధ్రావళిమోదము' కోసం రాస్తున్నాను అన్నాడు. తెలుగు పదాలు ఎక్కువగా ఉపయోగించాడు. మొదటి మాండలిక పదం (మోట), తొలి అన్యదేశ్యం (త్రాసు) వాడింది కూడా తిక్కనే. శ్రీనాథుడి అభిప్రాయం ప్రకారం తిక్కనలో 'రసాభ్యుచిత బంధం' ఉంది. విశ్వనాథ వారు 'తిక్కన తెలుగు శిల్పంపు తోట' అన్నారు. సుమతీ శతకం రాసిన బద్దెన, తిక్కనకు సమకాలీకుడు.


ఎఱ్ఱన
  కవిత్రయంలో ఎఱ్ఱన మూడోవాడు. ఈయన అద్దంకి ప్రభువు ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఉన్నాయి. 14వ శతాబ్దికి చెందిన ఎఱ్ఱన రామాయణం రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. కానీ అలభ్యం. ఇతడు రాసిన 'నృసింహ పురాణం' తెలుగులో తొలి క్షేత్ర మహాత్మ్య కావ్యం.
దీన్ని అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. 'హరివంశం' కావ్యంలో వర్ణనా నైపుణ్యం కనిపిస్తుంది. మహాభారతంలో నన్నయ రాయగా మిగిలిన అరణ్య పర్వభాగాన్ని ఎఱ్ఱన రాశాడు. ఎఱ్ఱన కవితాగుణాల్లో ముఖ్యమైంది సూక్తి వైచిత్రి. 'స్ఫురదరుణాంశ రాగరుచి....' అనేది భారతంలో ఎఱ్ఱన తొలి పద్యంగా పేర్కొంటారు. ఎఱ్ఱన సమకాలీకుడైన నాచన సోమన 'ఉత్తర హరివంశం' రచించాడు. గోన బుద్ధారెడ్డి రాసిన 'రంగనాథ రామాయణం' తెలుగులో తొలి (ద్విపద) రామాయణం.


శివకవులు
  శివకవుల్లో నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన ముఖ్యులు. నన్నచోడుడు 'కుమార సంభవం' కావ్యం రాసి తొలిసారిగా మార్గ, దేశి రీతులను ప్రస్తావించాడు. మల్లికార్జున పండితారాధ్యుడు 'శివతత్త్వ సారం', 'శ్రీగిరి శతకం' రచించాడు. పాల్కురికి సోమన సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో రచనలు చేసిన వీరశైవ కవి. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, బసవరగడ, బసవగద్య, బసవోదాహరణం, చెన్నమల్లు సీసాలు మొదలైనవి రచించాడు. ఇతడు రాసిన 'వృషాధిపశతకం' తొలి శతకం. ద్విపద రచనకు ప్రాచుర్యం కలిగించాడు.


తొలి రచనలు
* తొలి శతకం: పాల్కురికి సోమన - వృషాధిప శతకం
* తొలి లక్షణ గ్రంథం: రేచన - కవిజనాశ్రయం
* తొలి ద్వర్థికావ్యం: పింగళి సూరన - 'రాఘవ పాండవీయం'
* తొలి దండకం: పోతన - 'భోగినీ దండకం'    
* తొలి వీధి రూపకం: క్రీడాభిరామం
* తొలి వీరగాథాకావ్యం: శ్రీనాథుడు-'పలనాటి వీరచరిత్ర'
* తొలి సంకలన గ్రంథం: మడికి సింగన - 'సకలనీతి సమ్మతం'
* తొలి చాటుపద్య కవి: వేములవాడ భీమకవి
* తొలి ద్విపద కావ్య కవి: పాల్కురికి సోమన


శ్రీనాథుడు
   15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం అంటారు. దీన్నే 'కావ్యయుగం' అని కూడా అంటారు. 'కవి సార్వభౌముడు', 'ఈశ్వరార్చన కళాశీలుడు' అనిపించుకున్న శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి వద్ద విద్యాధికారిగా, వీరభద్రారెడ్డి వద్ద ఆస్థాన కవిగా ఉన్నాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో డిండిమభట్టు కంచు ఢక్క పగలగొట్టి కనకాభిషేకం చేయించుకున్నాడు. కొందరు శ్రీనాథుడిని 'డుమువుల కవి' అని హేళన చేశారు. శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర అనే కావ్యాలు రాశాడు. క్రీడాభిరామం అనే తొలి వీధిరూపకాన్ని శ్రీనాథుడు రాశాడని కొందరు, వినుకొండ వల్లభామాత్యుడు రాశాడని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. శ్రీనాథుడు మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్రలు రాశాడు కానీ అవి అలభ్యం. శ్రీనాథుడు సీసపద్య రచనకు ప్రసిద్ధుడు.

* శ్రీనాథుడి సమకాలికుడైన బమ్మెర పోతనను అతడి బావమరిదిగా పేర్కొంటారు. అయితే చారిత్రకంగా దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుడి బావమరిది.
* పోతనకు 'సహజ పాండిత్య' అనే బిరుదు ఉంది. పోతన తొలి రచన 'వీరభద్ర విజయం'. భోగినీ దండకం పోతన రాసినట్టు పేర్కొంటారు. ఇది తెలుగులో తొలి దండకం. నారాయణ శతకం కూడా రాశాడు. అయితే పోతన రాసిన 'ఆంధ్ర మహాభాగవతం' అపూర్వమైన, అద్భుతమైన రచన.
* 'పలికెడిది భాగవతమట....' అంటూ భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు. 12 స్కంధాలున్న భాగవతం వ్యాస భాగవతానికి స్వేచ్ఛానువాదం. ఇందులో పోతన 8 స్కంధాలు రాయగా మిగిలిన నాలుగు ఆయన శిష్యులైన నారయ, సింగయ, గంగయ పూర్తి చేశారు.
* పోతన కవిత్వంలో శబ్దసౌందర్యం, శబ్దాలంకార ప్రయోగాలు ఎక్కువ. భాగవతం విష్ణుభక్తులకు నిలయం. నవవిధ భక్తులతో ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, కుచేలోపాఖ్యానం లాంటి కథలను రసవత్తరంగా రచించాడు. ఇదే కాలానికి చెందిన మొల్ల రామాయణాన్ని రచించింది.

ప్రబంధ యుగం
  పదహారో శతాబ్దాన్ని రాయల యుగం లేదా ప్రబంధ యుగం అంటారు. శ్రీకృష్ణదేవరాయలకి 'ఆంధ్ర భోజ', 'సాహితీ సమరాంగణ సార్వభౌమ' అనే బిరుదులున్నాయి. ఇతడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులున్నారనీ, వారందరూ తెలుగువారే అయి ఉంటారని చాలామంది అభిప్రాయం. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆజ్ఞతో 'ఆముక్తమాల్యద' అనే ప్రబంధాన్ని రాశాడు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అనే వాక్యం ఇందులోదే.
కందుకూరి రుద్రకవి, సంకుసాల నృసింహ కవి, రాధామాధవ కవి కూడా ఈ కాలపు ప్రబంధ కవులే. తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థానంలో ఉండే అవకాశం లేదని చరిత్రకారుల అభిప్రాయం. పెద్దన కవిత్వం గురించి 'అల్లసాని వాని అల్లిక జిగిబిగి' అనీ, తిమ్మన కవిత్వం గురించి 'ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు' అనీ, తెనాలి రామకృష్ణుడి గురించి 'పాండురంగ విభుని పదగుంఫనం' అనీ చెప్పే చాటు పద్యం ఉంది. ప్రబంధాల్లోని ముఖ్య గుణం వర్ణనాధిక్యత.

దక్షిణాంధ్ర యుగం
    ఇది ఒక విలక్షణమైన, విశిష్టమైన యుగం. పూర్వయుగాల్లో లేని ప్రక్రియలు, విశేషాలు ఈ 17, 18 శతాబ్దాల్లో గమనిస్తాం. ఈ దక్షిణాంధ్ర యుగానికి 'నాయకరాజు యుగం' అనే పేరు కూడా ఉంది. తంజావూరు నాయక రాజులు, మహారాష్ట్ర నాయక రాజులు, మైసూరు నాయక రాజులు తెలుగు భాషా సాహిత్యాలను పోషించారు.
* ముఖ్యంగా తంజావూరు నాయకరాజు రఘునాథ నాయకుడు స్వయంగా కవి. ఇతడిని అభినవ శ్రీకృష్ణదేవరాయలు అంటారు. ఈయన రఘునాథ రామాయణం, శృంగార సావిత్రి, వాల్మీకి చరిత్ర రాశాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ కవి చేమకూర వేంకట కవి. ఈయన 'విజయవిలాసం', 'సారంగధర చరిత్ర' అనే కావ్యాలు రాశాడు. 'విజయవిలాసం'లో ప్రతిపద్య చమత్కృతి కనిపిస్తుంది. దీన్ని రఘునాథ నాయకుడికి అంకితమిచ్చాడు.
* విజయవిలాసానికి వేదం వేంకటరాయశాస్త్రి, తాపీ ధర్మారావు వ్యాఖ్యానాలు రాశారు. తాపీ ధర్మారావు 'హృదయోల్లాస వ్యాఖ్య' రాసి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. రఘునాథ నాయకుని కుమారుడు విజయరాఘవ నాయకుడు ఎక్కువగా యక్షగానాలు రాశాడు. తన ఆస్థానంలోని కవయిత్రి పసుపులేటి రంగాజమ్మకు కనకాభిషేకం చేశాడు.
* దక్షిణాంధ్ర యుగంలో వచన కావ్యాలు వెలువడ్డాయి. యక్షగానాలు వచ్చాయి. కందుకూరి రుద్రకవి రాసిన 'సుగ్రీవ విజయం' తెలుగులో తొలి యక్షగానం. 'అక్కమహాదేవి చరిత్ర' రాసిన బాల పాపాంబ యక్షగాన తొలి కవయిత్రిగా తెలుస్తోంది.


అష్టదిగ్గజ కవులు, వారి కావ్యాలు
అల్లసాని పెద్దన (ఆంధ్ర కవితాపితామహుడు) - మనుచరిత్ర
నంది తిమ్మన - పారిజాతాపహరణం
ధూర్జటి - శ్రీకాళహస్తి మహాత్మ్యం
తెనాలి రామకృష్ణుడు - పాండురంగ మహాత్మ్యం
రామరాజభూషణుడు (భట్టుమూర్తి) - వసుచరిత్ర
పింగళి సూరన - కళా పూర్ణోదయం
అయ్యలరాజు రామభద్రకవి - రామాభ్యుదయం
మాదయగారి మల్లన - రాజశేఖర చరిత్ర


పదకవులు
   పదకవుల్లో 'పదకవితా పితామహుడు' తాళ్లపాక అన్నమాచార్య. 15వ శతాబ్దికి చెందిన అన్నమయ్య తొలి వాగ్గేయకారుడు. 32 వేల కీర్తనలు రచించాడు. అన్నమయ్య భార్య తాళ్లపాక తిమ్మక్క 'సుభద్రా కల్యాణం' అనే ద్విపద కావ్యం రాసిన తొలి కవయిత్రి. పోతులూరి వీరబ్రహ్మం 'కాళికాంబ శతకం', శరభాంకలింగ కవి 'శరభాంకలింగ శతకం', అల్లంరాజు రంగశాయి కవి 'రఘురామ శతకం', బోయి భీమన్న 'పిల్లీ శతకం' మొదలైనవి శతక సాహిత్యానికి పుష్టి కలిగించాయి.
* త్యాగయ్య 24వేల కీర్తనలు రాసిన శ్రీరామభక్తుడు. ఇతడిని 'నాదబ్రహ్మ' అంటారు. క్షేత్రయ్య 4 వేల పదాలు రాశాడు. క్షేత్రయ్య పదాలను 'మువ్వ పదాలు' అంటారు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌