• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

గురు లఘువుల లయ విన్యాస వ్యవస్థ!
 


భాషలో పద్యాలకు లయబద్ధత, శ్రావ్యత అందించే క్రమబద్ధమైన వ్యవస్థ ఛందస్సు. ఇది వేదాంగాల్లో భాగం. భావాలను సమర్థంగా వ్యక్తం చేయడానికి సాయపడుతుంది. పద్య లక్షణాలను, పాదాల నియమాలను తెలియజేస్తుంది. సంస్కృతంలో మాదిరి వృత్త పద్యాలతో పాటు జాతులు, ఉపజాతుల పద్యాలు కూడా  తెలుగు ఛందస్సులో ఉంటాయి. వాటికి లయను సమకూర్చే గురు లఘువులు, ఇతర నియమాలు, గణాల రకాల గురించి పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. వివిధ ఛందస్సులు, తెలుగులో ఉన్న ఛందో గ్రంథాలు, రచయితలు గురించి అవగాహన పెంచుకోవాలి. 

పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్సు. వేదాంగాలు ఆరింటిలో ఛందస్సు ఒకటి. ‘ఛది ఆహ్లాదనే’ అనే ధాతువు నుంచి ఛందస్సు అనే పదం పుట్టింది. ఛది ఆహ్లాదమనగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది.

*   ఛది సంవరిణే అనే వ్యుత్పత్తిని చెప్పింది - భట్టోజి దీక్షితులు

*  ఛందాసి ఛాదనాత్‌ అనే వ్యుత్పత్తిని చెప్పింది - యాస్కుడు

*  ఛందాసి అంటే - వేదం

*  వేదాలకు ఇతర పేర్లు ఛందాసి, శ్రుతులు

* ఛందోహీనోన శబ్దో 2స్తినచ్ఛంద శబ్ద వర్జితమ్‌ - (ఛందస్సు లేకుండా శబ్దం ఉండదు) అని అభిప్రాయపడింది -  భరతుడు.

ఆరు వేదాంగాలు:

*  వేద పురుషుడికి పాదాల లాంటిది - ఛందస్సు

*  వేద పురుషుడి కళ్లతో పోల్చబడింది - జ్యోతిషం

* వేద పురుషుడి నాసిక (ముక్కు)తో పోల్చదగింది - శిక్ష

*  వేద పురుషుడి చేతులతో పోల్చదగింది - కల్పం

*  వేద పురుషుడి చెవులతో పోల్చదగింది - నిరుక్తం

* వేద పురుషుడి ముఖం (నోరు)తో పోల్చదగింది - వ్యాకరణం

*  వేద పురుషుడి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలతో పోల్చదగినవి - యతిప్రాసలు 

*  ‘వేదాలకు వేదాంగాలు ఆరు శరీర అంగాల్లాంటివి.’ అని అభిప్రాయపడింది - పాణిని

*   పద్య, గేయ   లక్షణాలను తెలియజేసే శాస్త్రం - ఛందశ్శాస్త్రం

సంస్కృత ఛందస్సు - రెండు రకాలు:  

1) వైదిక ఛందస్సు

2) లౌకిక ఛందస్సు

*   వైదిక ఛందస్సుకు పునాదులు వేసిన గ్రంథం - ఋగ్వేదం

* వైదిక ఛందస్సు ఋగ్వేదంతో ప్రారంభమవుతుంది.

*   వేదాల్లోని మంత్రాలను ఋక్కులు అంటారు.

*  వేదమంత్రాలను పఠించేవారిని రుత్విక్కులు అంటారు.

*  వైదిక ఛందస్సు (ఋగ్వేదం) ‘అగ్ని మీళే పురోహితమ్‌’ అనే రుక్కుతో ప్రారంభమవుతుంది.

లౌకిక ఛందస్సు:

* లౌకిక ఛందస్సుకు పునాదులు వేసిన గ్రంథం - వాల్మీకి రామాయణం

*  లౌకిక ఛందస్సుకు ప్రథమావతారంగా వాల్మీకిని భావిస్తారు

*  లౌకిక ఛందస్సులో తొలి శ్లోకం - మానిషాద ప్రతిష్ఠాత్వ

*  మానిషాద శ్లోకంలోని ఛందస్సు - అనుష్టుమ్‌ ఛందస్సు

*  తొలి లౌకిక ఛందస్సు - అనుష్టుమ్‌ ఛందస్సు

*  ఛందస్సుకు అధి దేవత - గాయత్రీదేవి * ఛందస్సు గాయత్రి  దేవత పేరుతో వెలసింది.

*   సంస్కృతంలో తొలి ఛందో గ్రంథం - పింగళ ఛందము

*  సంస్కృత భాషకు ప్రామాణికమైన ఛందో గ్రంథం - పింగళ ఛందము

*  ఛందశ్శాస్త్ర పితామహుడు - పింగళుడు  

*  ఛందశ్శాస్త్రాన్ని ప్రారంభించినవాడు - పింగళుడు               

*  పింగళ ఛందస్సుకు వ్యాఖ్యానం రాసినవారు - హలాదుడు

*  సంస్కృతంలో కేదారభట్టు రాసిన ‘వృత్తరత్నాకరం’ ఛందోగ్రంథానికి సంబంధించిన గ్రంథం.

తెలుగు ఛందో గ్రంథాలు:

*  తెలుగులో మొదటి ఛందో గ్రంథం ‘కవి జనాశ్రయము’. ఈ గ్రంథాన్ని మల్లియ రేచనతోపాటు వేములవాడ భీమకవి రాశాడనే వాదన ఉంది. కవి జనాశ్రయమునకు మరో పేరు భీమన ఛందము.

* అప్పకవీయం ‘ఆంధ్రశబ్ద చింతామణి’ సంస్కృత గ్రంథానికి వ్యాఖ్యానం.

*  అప్పకవీయం   ఛందో గ్రంథంగా ప్రసిద్ధి చెందింది.

* అప్పకవీయంలో ఛందస్సును గురించి 3  4 ఆశ్వాసాలున్నాయి (మొత్తం 5 ఆశ్వాసాలున్నాయి.)

* అప్పకవీయంలో వ్యాకరణానికి సంబంధించిన అంశం 5వ ఆశ్వాసంలో ఉంది.

* స్వప్న వృత్తాంతం చెప్పిన తొలి లాక్షణికుడు అప్పకవి.      

* ‘‘ప్రయోగ శరణం వ్యాకరణం-ప్రయోగ మూలం వ్యాకరణం’’ అనే వాక్యం ఉన్న ఛందో గ్రంథం-అప్పకవీయం. *‘‘వేదమునకు పాదంబులై వెలయు కతన ఛంద మన్నింటిలోన నవశ్యంబు గాదె’’ అన్నది - అప్పకవి

*  ఛందో దర్పణమును అనంతా మాత్యుడే కాకుండా వెల్లంకి తాతంభట్టు (17వ శతాబ్దం) కూడా రాశారు.

గణం ఏర్పడే విధానం:

*  అక్షరాలను గురువులు - లఘువులుగా గుర్తించవచ్చు. ఇలా ఏర్పడిన గురువులు - లఘువులు కలిస్తే వాటిని గణాలు అని పిలుస్తారు.

*  గురు లఘువుల సమూహమే గణం.

*   ఒక్క గురువూ గణం కావచ్చు, ఒక్క లఘువూ గణం కావచ్చు.

*  అనేక గురు, లఘువులు కలిసి గణం కావచ్చు.

గణాల్లో రకాలు

స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలు. అవి   

1) ఒక అక్షర గణాలు   

2) రెండక్షర గణాలు      

3) మూడక్షర గణాలు   

4) నాలుగు అక్షర గణాలు

1) ఒక అక్షర గణాలు: ఒకే అక్షరం గణంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటారు. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి.
 (వివరాల కోసం పట్టిక-1 చూడండి)

2) రెండక్షర గణాలు:  రెండేసి అక్షరాలతో ఏర్పడే  గణాలను రెండక్షర గణాలు అంటారు. ఇవి నాలుగు విధాలుగా ఉన్నాయి. 

(వివరాల కోసం పట్టిక-2 చూడండి)

3) మూడక్షర గణాలు: మూడక్షరాలతో ఏర్పడే గణాలను నిశబ్ద గణాలు అంటారు. ఇవి ఎనిమిది రకాలుగా ఉంటాయి. (వివరాల కోసం పట్టిక-3 చూడండి).

మూడక్షర గణాలను గుర్తించే విధానం: ఆదిమధ్యాంత గురువులు భ, జ, స - లు. 

*  భ, జ, స లు గురువు స్థానం ఆధారంగా ఏర్పడ్డాయి.

*  ‘‘మ’’ గణం అన్నీ గురువులు.

ఆదిమధ్యాంత లఘువులు య, ర, త - లు.

* య, ర, త లు లఘువు స్థానం ఆధారంగా  ఏర్పడ్డాయి. 

*  ‘‘న’’ గణం అన్నీ లఘువులు.

4) నాలుగు అక్షర గణాలు:  నాలుగు అక్షరాలతో ఏర్పడే గణాలను నాలుగు గణాలు అంటారు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. 

i) నలము (నగణం + లఘువు)- IIII

ii) నగము (నగణం + గురువు) -IIIU

iii) సలము (సగణం + లఘువు) -IIUI

                                                 ఛందో గ్రంథాలు

 గ్రంథాలు   రచయితలు
1. కవి జనాశ్రయం  (1270)   మల్లియ రేచన
2. ఛందో దర్పణము (1450) అనంతామాత్యుడు
3. ఛందోదర్పణము (1510) వెల్లంకి తాతంభట్టు
4. కవి చింతామణి/ (కావ్యాను శాసనం)  వెల్లంకి తాతంభట్టు
5. అప్పకవీయం (పద్యరచనకు పెద్దబాలశిక్ష)(1656)      కాకునూరి అప్పకవి
6. ఆనందరంగ రాచ్ఛందము లక్షణ చూడామణి (1750) కస్తూరి రంగకవి
 7. కవి సంశయ విచ్ఛేదము (1720)  అడిదం సూరకవి
 8. సులక్షణ సారము  (శ్రీరాముడికి అంకితం) (1862) లింగమకుంట తిమ్మకవి
9. కవిసార్వభౌమ ఛందస్సు  (కవి వాగ్బంధము) తిక్కన
10. కవి సర్ప గారుడము ఎఱ్ఱన
11. ఛందఃపదకోశము కోవెల సంపత్‌ కుమారాచార్య
 12. తెలుగు ఛందో వికాసము      కోవెల సంపత్‌ కుమారాచార్య

 

రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 19-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు