• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణ బోధన  

దోషరహిత భావ ప్రకటన సామర్థ్య సాధనం!

భాష నిర్మాణం, అందులోని నియమాలను వివరించేదే వ్యాకరణం. అది పదాలు, వాక్యాల నిర్మాణంలో అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. అందుకే భాషా బోధనలో వ్యాకరణం ప్రధానమైన అంశం. వ్యాకరణ రకాలు, బోధన పద్ధతులు, సోపాన క్రమాలు తదితర మౌలికాంశాలను కాబోయే ఉపాధ్యాయులు క్షుణ్నంగా తెలుసుకోవాలి. భాషా జ్ఞానాన్ని పెంపొందిస్తూనే, తార్కిక జ్ఞానాన్నీ వృద్ధి చేసే వ్యాకరణ లక్ష్యాలతోపాటు అందులో కాలానుగుణంగా వచ్చిన మార్పులు, తెలుగు వ్యాకరణంతో సంబంధం ఉన్న ప్రసిద్ధ రచయితలు, భాషావేత్తల గురించి తగిన అవగాహన కలిగి ఉండాలి.


*వ్యాకరణ బోధన ద్వారా విద్యార్థుల్లో భాషాజ్ఞానాన్ని పెంపొందింపజేయడం. పద స్వరూప స్వభావాలు తెలియజేయడం.

* వాక్య నిర్మాణ స్వరూప స్వభావాలు తెలియజేయడం.

* పద, వాక్య సమ్మేళన సంప్రదాయాలను గుర్తించి  విశ్లేషించగలగడం.

* ప్రాచీన, ఆధునిక భాషా వ్యవహారాలను  గ్రహింపజేయడం.

* దోషరహిత భావ ప్రకటనా సామర్థ్యాన్నిపెంపొందించడం.

* రచనాశక్తిని పెంపొందింపజేయడం.

* మాండలిక భాషలు, సోదర భాషల మధ్య ఉండే సామ్య భేదాలను గ్రహింపజేయడం.

* భాషా వ్యవహారంలో జరిగే ఆదాన ప్రదానాలను  తెలుసుకునేలా చేయడం.

* తార్కిక శక్తిని పెంపొందించడం.

* శాస్త్రీయ దృక్పథాన్ని అలవడేలా చేయడం.

* వ్యాకరణ అధ్యయనం పట్ల ఆసక్తి కలిగించడం.

వ్యాకరణం - రకాలు

అధ్యయన విధానం ఆధారంగా వ్యాకరణాన్ని మూడు  రకాలుగా చెప్పొచ్చు.

1) వర్ణనాత్మక వ్యాకరణం    

2) చారిత్రక వ్యాకరణం

3) తులనాత్మక వ్యాకరణం

1. వర్ణనాత్మక వ్యాకరణం:

* ఇది నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వివరిస్తుంది.

* వ్యాకర్త తన కాలం నాటి వరకు వినియోగిస్తున్న ప్రామాణిక ప్రయోగాలను ఆధారంగా చేసుకుని  సాధారణీకరణలు చేస్తూ వర్ణనాత్మక వ్యాకరణాన్నిరచిస్తాడు.

* నన్నయ కాలం నుంచి తమ కాలం వరకు లభ్యమైన ప్రామాణిక ప్రయోగాలను ఆధారంగా చేసుకుని చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం, బహుజనపల్లి

సీతారామాచార్యులు రాసిన ప్రౌఢ వ్యాకరణం, వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణలు.

2. చారిత్రక వ్యాకరణం:

*  ఒక భాష విభిన్న కాలాల్లో ఎలాంటి మార్పులకు లోనైందో తెలిపేది చారిత్రక వ్యాకరణం.

* ఆధునిక శాస్త్రవేత్తలు చారిత్రక వ్యాకరణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చారు.

* ఇది కాలగతిలో భాషలో జరిగిన ధ్వని మార్పులు, అర్థ విపరిణామాలు, శబ్దజాలంలో మార్పు, మాండలిక భేదాలు, ఇతర భాషల్లో ఆదాన ప్రదానాలు మొదలైన వాటి గురించి తెలుపుతుంది.

* సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషపై చేసిన కృషి ఈ పంథాలోనే సాగింది.

3. తులనాత్మక వ్యాకరణం:

* పలు భాషల మధ్య సామ్యభేదాలను అధ్యయనం చేసే క్రమంలో మౌలిక అంశాలైన సంఖ్యా వాచకాలు, బంధు వాచకాలు, ప్రత్యయాలను పరిగణనలోకి  తీసుకుని భాషల మధ్య జన్య, జనక సంబంధాలను తులనాత్మక వ్యాకరణం ప్రతిపాదిస్తుంది.

* పూర్వం తెలుగు భాష సంస్కృత భాషాజన్యం అని విశ్వసించేవారు.

* తెలుగు.. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని తులనాత్మక అధ్యయనాలు రుజువు చేశాయి.

* ద్రావిడ భాషల మధ్య సంబంధాన్ని తెలిపే కింది  ఉదాహరణ చూడండి.

కణ్‌ (తమిళం), కణ్ణు (కన్నడం), కణ్‌ (మలయాళం) కన్ను (తెలుగు)

* 10వ తరగతి వరకు ప్రథమ భాషగా తెలుగును బో ధించే సందర్భంలో వర్ణనాత్మక వ్యాకరణాంశాలు, చారిత్రక వ్యాకరణాంశాలు మాత్రమే పరిచయం చేయాలి.

వ్యాకరణ బోధన పద్ధతులు:

1) నిగమోప పత్తి పద్ధతి: ఇది ప్రాచీన పద్ధతి. దీన్ని శాస్త్ర, సూత్ర పద్ధతి అని కూడా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి తరువాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరిస్తాడు. ఆ తర్వాత సూత్రాన్ని ఉదాహరణలతో సమన్వయం చేసి చూపిస్తాడు.

2) అనుమానోప పత్తి పద్ధతి: ఇది నవీన వ్యాకరణ బోధన పద్ధతి. దీన్ని వైయ్యాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని కూడా పేర్కొంటారు. ఒకే సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణ పదాలను విద్యార్థుల నుంచి రాబట్టి ఆయా ఉదాహరణ పదాలను వారే విడదీసేలా చేసి, ఆయా పదాల మధ్య జరిగిన సంధి కార్యాన్ని, దానిలోని సామాన్య ధర్మాన్ని వారితోనే చెప్పించాలి.

3) అనుసంధాన పద్ధతి: విద్యార్థులు ఇంతకుముందు తెలుసుకున్న వ్యాకరణ జ్ఞానాన్ని వారు నేర్చుకునే వివిధ పాఠ్యాంశాల్లోని రూపాలు, ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆయా వ్యాకరణ నియమాల అభ్యసనను బలోపేతం చేసే పద్ధతిని అనుసంధాన పద్ధతి అంటారు.

4) ప్రయోగ పద్ధతి: ‘ప్రయోగ శరణం వ్యాకరణం’ అనే భావన ప్రాతిపదికతో వ్యాకరణాంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠ్య బోధనాంశాలతో కలిపి బోధించాలనేది ఈ పద్ధతిలోని విశేషం. భాషా బోధన సందర్భంలో ఈ విధానాన్ని అనుసరించేవారు. దీనికి సంప్రదాయ పద్ధతి అని కూడా పేరు.

అభ్యాస ప్రశ్నలు


1. సాధు రూపాలో, అసాధు రూపాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే బోధన?

1) పద్య బోధన   2) గద్య బోధన   

3) వ్యాకరణ బోధన  4) వ్యాస బోధన


2.   బాల, ప్రౌఢ వ్యాకరణాలు ఏ కోవకు చెందినవి?

1) వర్ణనాత్మక వ్యాకరణాలు   

2) చారిత్రాక వ్యాకరణాలు

3) ప్రాయోగిక వ్యాకరణాలు   

4) తులనాత్మక వ్యాకరణాలు


3.  ‘భాష ప్రయోగాత్మక విశ్లేషణ, భాషా శరీరధర్మ శాస్త్రమే వ్యాకరణం.’ అని నిర్వచించింది ఎవరు?

1) స్టర్ట్‌వర్ట్‌       2) హాకెట్‌   

3) స్వీట్‌       4) ఎం.ఎన్‌.బాచ్‌


4. భాషాభ్యసనం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన  ఫలితాలను పేర్కొన్నది?

1) భాషా బోధన ఆధార పత్రం

2) నిరంతర సమగ్ర మూల్యాంకనం

3) పాఠ్య విషయ మూల్యాంకనా సాధనాలు

4) విద్యాలక్ష్యాల వర్గీకరణ


5. అధిభాషా స్పృహ - అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది ఎవరు?

1) మెటా కాగ్నిటివ్‌ నాలెడ్జ్‌     

2) ఎడ్వర్డ్‌ కార్పెంటర్‌

3) షంక్‌    4) కర్ట్నె సెజ్‌డన్‌


6.  కిందివాటిలో ‘శాస్త్ర పద్ధతి’ అని దేనికి పేరు?

1) నిగమోప పత్తి పద్ధతి 

2) అనుమానోప పత్తి పద్ధతి    

3) అనుసంధాన పద్ధతి      

4) ప్రయోగ పద్ధతి


7. సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషపై చేసిన కృషి ఏ కోవకు చెందిన వ్యాకరణంగా చెప్పొచ్చు?

1) వర్ణనాత్మక వ్యాకరణం   2) చారిత్రక వ్యాకరణం

3) తులనాత్మక వ్యాకరణం  4) ప్రాయోగిక వ్యాకరణం


8. కిందివాటిలో అనుమానోప పత్తి పద్ధతి కానిది-

1) వైయాకరణ పద్ధతి     2) ఉదాహరణ పద్ధతి

3) సంప్రదాయ పద్ధతి   4) సూత్రీకరణ పద్ధతి


9. పలు రకాలైన ప్రయోగాలను ఉదాహరణలుగా చేసుకుని వాటికి సంబంధించిన నియమాలను విద్యార్థులే గుర్తించేలా చేసే బోధన?

1) అనువర్తిత వ్యాకరణ బోధన   

2) ప్రాయోగిక వ్యాకరణ బోధన

3) రూపాత్మక వ్యాకరణ బోధన   

4) సంప్రదాయ వ్యాకరణ బోధన


10. ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి తరువాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించే పద్ధతి-

1) ప్రయోగ పద్ధతి       

2) అనుసంధాన పద్ధతి

3) అనుమానోప పత్తి పద్ధతి   

4) నిగమోప పత్తి పద్ధతి


11. ఒక భాషలో భిన్నకాలాల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవడానికి ఏ వ్యాకరణం అధ్యయనం చేయాలి?

1) బాల వ్యాకరణం    2) వర్ణనాత్మక వ్యాకరణం

3) చారిత్రక వ్యాకరణం  4) తులనాత్మక వ్యాకరణం


12. భాషా బోధన ఆధారపత్రాన్ని దేని ఆధారంగా రూపొందిస్తారు?

1) జాతీయ విద్యావిధానం - 1986    

2) ఉడ్స్‌ డిస్పాచ్‌ నివేదిక   

3) కొఠారీ కమిషన్‌ నివేదిక   

4) రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం - 2011


13. ‘వ్యాకరణ శాస్త్ర గ్రంథాలన్నీ సూత్ర పద్ధతిలోనే రాసి ఉన్నాయి’ అని భావించే వ్యాకరణ బోధనా పద్ధతి-

1) నిగమోప పత్తి పద్ధతి   

2) అనుమానోప పత్తి పద్ధతి

3) ఉదాహరణ పద్ధతి   

4) నిష్పత్తి పద్ధతి


14. ‘ప్రయోగ శరణం వ్యాకరణం’ అనే భావన    ఆధారంగా రూపొందించిన పద్ధతి?

1) నిగమోప పత్తి పద్ధతి 2) అనుసంధాన పద్ధతి

3) ప్రయోగ పద్ధతి       4) సంప్రదాయ పద్ధతి


15. పద సేకరణ, పద పరిశీలన, విశ్లేషణ, సూత్రీకరణ అనే సోపాన క్రమం ఉండే బోధన?

1) పద్య బోధన    2) గద్య బోధన   

3) వ్యాకరణ బోధన   4) వ్యాస బోధన


16. కిందివాటిలో సరైంది.

ఎ) లాటిన్‌లో Grammaticus గా మారిన ఈ పదం నుంచి ఆంగ్లంలో Grammar ఏర్పడింది.

బి) Grammar అంటే అర్థం లిఖితాక్షరం.

సి) Graph in అంటే గీయడం, రాయడం.

డి) Grammar కు బహువచన రూపం Grammata.

1) ఎ, సి   2) బి, డి   3) బి, సి  4) పైవన్నీ 


17. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

1) వర్ణనాత్మక వ్యాకరణం  ఎ) అర్థ విపరిణామం,మాండలికాలు

2) చారిత్రక వ్యాకరణం   బి) బాల వ్యాకరణం,ఆంధ్ర శబ్ద చింతామణి   

3) తులనాత్మక వ్యాకరణం    సి) ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం

1) 1-ఎ, 2-బి, 3-సి     2) 1-బి, 2-సి, 3-ఎ  

3) 1-బి, 2-ఎ, 3-సి    4) 1-సి, 2-ఎ, 3-బి


18. భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ, భాషా శరీర ధర్మశాస్త్రమే వ్యాకరణం అన్నవారు?

1) హెన్రీ స్వీట్‌   2) జి.ఎన్‌.రెడ్డి   

3) గంటి జోగి సోమయాజీ  4) తూమాటి దోణప్ప


19. కిందివాటిలో ప్రాయోగిక వ్యాకరణానికి సంబంధించి సరైంది? 

ఎ) దీన్ని ప్రయోగ పద్ధతి అంటారు.

బి) ఇది ప్రస్తుతం 3, 4, 5 తరగతుల వాచకల్లోనిది.

సి) వ్యాకరణ నియమాలు బోధించకుండా వ్యాకరణ బోధన చేసేది.

డి) భాషా భాగాలు, వాక్య నిర్మాణం, ఏకవచన - బహువచనాలు దీనికి ఉదాహరణ.

1) ఎ, బి, సి  2) ఎ, సి, డి   

3) బి, డి    4) ఎ, బి, సి, డి 


20. అనువర్తిత వ్యాకరణం అని దేనికి పేరు?

1) ప్రాయోగిక వ్యాకరణం 2) నైమిత్తిక వ్యాకరణం

3) రూపాత్మక వ్యాకరణం 4) పెవన్నీ


21. పిల్లలకు పుట్టుకతోనే వ్యాకరణ స్పృహ ఉంటుంది. వారి మౌఖిక వ్యవహారంలో ఎలాంటి దోషాలు ఉండవు అన్నవారు?

1) నోమ్‌చామ్‌ స్కీ      

2) భద్రిరాజు కృష్ణమూర్తి

3) తూమాటి దోణప్ప    

4) పి.ఎస్‌. సుబ్రహ్మణ్యం

జవాబులు:1-3; 2-1; 3-3; 4-1; 5-4; 6-1; 7-2; 8-3; 9-1; 10-4; 11-3; 12-4; 13-1; 14-3; 15-3; 16-4; 17-3; 18-1; 19-4; 20-2; 21-1.

రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 17-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌