• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి

*   ప్రతి వ్యక్తికి ఒక నైతిక ప్రవర్తనా నియమావళి (ethics code) అవసరం. ఇది స్వీయ నియంత్రణను, స్వీయ ఆచరణలను కోరుకుంటుంది.
*   ఈ నియమావళి ఆ సమూహంలోని ఇతర సభ్యుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కూడా ఉపకరిస్తుంది.
*   నియమావళి సంతోషాన్నివ్వని, అనుసరణీయం కాని ప్రవర్తనల నుంచి వ్యక్తులను కాపాడి, వారి వృత్తి ప్రమాణాలను, ధర్మాలను నిలపడానికి తోడ్పడుతుంది.


లక్షణాలు
1) వృత్తి ఒక సామాజిక విధి
2) వృత్తి నిర్వహణకు ప్రత్యేక శిక్షణ అవసరం.
3) లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో నిర్వహించేదే వృత్తి.
4) అధికారిక గుర్తింపు, సమాజంలో ఉన్నతస్థాయి ఉంటాయి.
5) సాంకేతికమైన, ప్రత్యేక లక్షణాలు ఉన్న సేవలు.
6) తమ సామర్థ్యం, ప్రమాణాలను కాపాడటానికి వృత్తిసంఘాలు ఏర్పడ్డాయి.
*   పై లక్షణాలు ఉపాధ్యాయ వృత్తికి కూడా వర్తిస్తాయి.
*   ఉపాధ్యాయ వృత్తి దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది. ఉపాధ్యాయుడు మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తాడు. బాలబాలికలను భావిపౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంది. అందుకే ఈ వృత్తి మనసా, వాచా, కర్మణా పవిత్రమైందని పలువురు విశ్వసిస్తారు.
*   ఉపాధ్యాయ వృత్తిలో నియమితుడైన వ్యక్తి తప్పనిసరిగా ఆ వృత్తి నియమావళిని అనుసరించాలి.
*   వృత్తిపరమైన హక్కులు, సౌకర్యాలు, సామర్థ్యాలు, మర్యాదలు వృత్తి గౌరవాన్ని పెంపొందిస్తాయి.
*   ప్రభావశీలమైన బోధన 'మానవసేవే మాధవసేవ' అనే భావనను రేకెత్తిస్తుంది.
*   ఈ ప్రవర్తన నియమావళి ఉపాధ్యాయులు తమ విధులను సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది.
*   ఈ నియమావళి 1984లో UNESCO సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపం.
*   1986 నాటి జాతీయ విద్యావిధాన సూచనలకు అనుగుణంగా NCERT ఒక చిత్తు ప్రవర్తనా నియమావళి (Draft Code of Ethics) రూపొందించింది. దీనిపై పలువురు నిపుణులు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకుని 1997లో NCERT ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళిని ప్రకటించింది.
*   ఈ నియమావళిలో 30 అంశాలను ఆరు రంగాల్లో వివరించారు.

ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తనా నియమావళి - పీఠిక
1) ప్రతి శిశువుకు నాణ్యమైన విద్యను అభ్యసించే హక్కుందని గుర్తించడం
2) శిశువుల మూర్తిమత్వ అభివృద్ధి, సర్వాంగీణ వికాసం విద్యాగమ్యమని గుర్తించడం
3) ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదం మన ప్రజల మార్గదర్శక జీవనసూత్రాలని గ్రహించడం.
4) సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, జాతీయస్పృహ, అంతర్జాతీయ అవగాహన, ప్రపంచశాంతి విద్య ద్వారా అందుతాయని గుర్తించడం.
5) సమాజంలో భాగమైన ఉపాధ్యాయులు ఆ సమాజంలోని ప్రజల అవసరాలను గుర్తించి పంచుకోవడం.
6) ఉపాధ్యాయ వృత్తి నిర్వహణకు జ్ఞానరాశి, ప్రత్యేక నైపుణ్యాలు, అంకితభావం ప్రాథమిక అవసరాలని గుర్తించడం
7) సమాజ సహకారం ఉపాధ్యాయ వృత్తికి అవసరమని గుర్తించాలి. ఈ సహకారం నాణ్యమైన బోధనకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయుల్లో వృత్తిపట్ల సద్వైఖరులను పెంపొందిస్తుంది.
8) స్వీయ నిర్దేశం, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరం అని గుర్తించడం
*   పై పీఠిక ఆధారంగా ఉపాధ్యాయులు తమ ప్రవర్తనా నియమావళిని రూపొందించుకున్నారు.
*   1997లో NCERT ఉపాధ్యాయ ప్రవర్తనా నియమావళిని 30 అంశాలు, ఆరు రంగాల్లో ప్రకటించింది.

ఆరు రంగాలు:
1
) తల్లిదండ్రులు లేదా సంరక్షకులు - ఉపాధ్యాయుల సంబంధాలు
2) సమాజం లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు
3) సహోపాధ్యాయులు, వృత్తి సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధాలు
4) ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధం
5) విద్యార్థులతో ఉపాధ్యాయుల సంబంధాలు
6) యాజమాన్యం లేదా నిర్వహణ అధికారులతో ఉపాధ్యాయుల సంబంధం
*   పై ఆరు రంగాల్లో 30 అంశాలను పేర్కొన్నారు


I. తల్లిదండ్రులు/ సంరక్షకులతో ఉపాధ్యాయుల సంబంధాలు:
1) తల్లిదండ్రులు సంరక్షకులతో స్నేహసంబంధాలను స్థాపించడం.
2) పిల్లల అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించడం.
3) తల్లిదండ్రులు, పరిరక్షకులకు తమ పిల్లలపై ఉన్న విశ్వాసానికి భంగం కలిగించకపోవడం.


II. సమాజం లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు:
4) సమాజం, మానవ వనరుల కేంద్రాలుగా పాఠశాలలను రూపొందించడం. దీనికి అవసరమైన సమాచారం, జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులను అభివృద్ధిచేయడం.
5) సమాజానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించగల భాగస్వామ్యాన్ని ప్రదర్శించడం.
6) వివిధ జాతులు, కులాలు, భాషావర్గాలు, మతాల మధ్య వైరుధ్యం అసహ్య భావాలను రగిల్చే చర్చలకు పాల్పడకుండా ఉండటం, వాటికి దూరంగా ఉండటం.
7) జాతీయ సమైక్యతను, సమాజ ఐక్యతను, మనమంతా ఒకటే అనే భావనను వ్యాప్తి చేయడం, సమర్థించడం.
8) భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ, ఆ సంస్కృతిపట్ల విద్యార్థుల్లో మంచి వైఖరిని పెంపొందించడం.
9) పాఠశాలకు, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి విధేయత చూపడం, గౌరవం ఇవ్వడం.

 

III. సహోపాధ్యాయులు, వృత్తి సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధాలు:
10) ఇతరులు తమతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో అదేవిధంగా సహ ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తించడం.
11) పై అధికారులు, సహ ఉపాధ్యాయులపై నిరాధారమైన నిందలు మోపకుండా ఉండటం.
12) వృత్యంతర శిక్షణ, సెమినార్లు, సింపోజియమ్స్, కార్యశిబిరాలు, కాన్ఫరెన్సులు, అధ్యయనాల్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం
13) విద్యార్థులు అధికారులు, తల్లిదండ్రులు ఇతర/సహ ఉపాధ్యాయుల గౌరవానికి భంగకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండటం.
14) పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాల అమలుకు పాఠశాలల్లో, పాఠశాల బయట సహ ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సహకరించడం.
15) విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలను సరైన పద్ధతిలో సంబంధిత అధికారులకు నివేదించే వైయుక్తిక, వృత్తిపర బాధ్యతను స్వీకరించడం.

 

IV. ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధం:
16) ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులుగా చేరడాన్ని వృత్తి బాధ్యతగా గుర్తించడం.
17) ఉపాధ్యాయ సంఘాల నియమావళి రచనలో పాల్గొని, సంఘ ఐక్యతకు పాటుపడటం.


V. విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉన్న సంబంధాలు:
18) పాఠశాల విధులకు నిర్ణీత సమయానికి హాజరవడం.
19) బోధనకు పూర్వసంసిద్ధులై పాఠం బోధించడం.
20) అందరు విద్యార్థులను ప్రేమానురాగాలతో చూడటం, కుల, మత, వర్గ, లింగ, అంతస్తు, జన్మస్థల, భాషా వివక్షతలను పాటించకపోవడం.
21) విద్యార్థుల సాంఘిక, ఉద్వేగపరమైన, నైతిక, ఆధ్యాత్మిక, ప్రతిభాపాటవాల అభివృద్ధికి కృషిచేయడం.
22) విద్యార్థుల వైయుక్తిక భేదాలు, అవసరాలు, వారి సాంఘిక, సాంస్కృతిక నేపథ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా విద్యను బోధించడం.
23) తమ విద్యార్థులకు లేదా ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పి గౌరవ భృతిని ఆశించకపోవడం.
24) విద్యార్థుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని అవసరమైన సంబంధితులకు తప్ప ఇతరులకు వెల్లడించకపోవడం
25) ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులను ప్రోత్సహించకపోవడం.
26) విద్యార్థులకు ఆదర్శవంతమైన ప్రామాణిక గణవేషం (Dress), మాటలు, ప్రవర్తనను రూపొందించుకోవడం.
27) బాలబాలికల వ్యక్తిత్వానికి, వారి వైయక్తిక గౌరవానికి భంగం కలిగించకుండా పాఠశాల క్రమశిక్షణను కాపాడటం.
28) ఉపాధ్యాయ సంఘ నియమావళి పరిధిలో తమ విధులను నిర్వర్తించడం

 

VI. యాజమాన్యం లేదా నిర్వహణాధికారులతో ఉపాధ్యాయుల సంబంధం:
29) క్రమానుగత అభివృద్ధికి యాజమాన్యమే అతిపెద్ద వనరు (Resource) అని గుర్తించడం
30) వృత్తిపరమైన కార్యకలాపాలు, వాటి ఫలితాలపట్ల పరస్పర గౌరవం, విశ్వాసం చూపించడం.
*   ఈ ప్రవర్తనా నియమావళిని అనుసరించడం, గౌరవించడం ఉపాధ్యాయుల విధి.
*   ఉపాధ్యాయులను గౌరవించడం సమాజం విధి.
*   వెలుపలి నియంత్రణకు లోబడకుండా ఆత్మ నియంత్రణతో కూడిన ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలను సమాజం పరిరక్షిస్తుంది.

Posted Date : 30-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు