• facebook
  • whatsapp
  • telegram

గాలికాలుష్యం

గాలికాలుష్యం: మనచుట్టూ ఉన్న పరిసరాల్లో స్థాయికి మించిన హానికర పదార్థాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. ఒక ప్రదేశంలో హానికర పదార్థాలు, ఉండ కూడని పాళ్లలో, సమయంలో ఉంటే ఆ కారకాలను కాలుష్య పదార్థాలంటారు. అధిక మోతాదులో ఘన, ద్రవ, వాయు పదార్ధాలు గాల్లో కలిసి గాలిని హాని కరంగా మార్చడాన్ని గాలి కాలుష్యం అంటారు.
 

కాలుష్యం-కారణాలు: గాలి కాలుష్యానికి స్థూలంగా కింది కారణాలను చెప్పుకోవచ్చు.
 

ఇంధనాలు మండటం: ఇంటిలోని వంట చెరకు, కర్రబొగ్గులతోపాటు కిరోసిన్, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాలు మండటం వల్ల గాలి కలుషితమవుతుంది. దీనిలో కార్బన్‌డైసల్ఫైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్ వంటి వాయువులు విడుదల అవుతాయి. ఇవి విషపూరితాలు, మరణ కారకాలు. వీటివల్ల బద్దకం, తలనొప్పి, మానసిక బాధలు కలుగుతాయి. గాల్లో CO2 పెరిగినప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల భూమి ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది.
 

మోటారు వాహనాలు: వీటి ఇంధనాలు మండినప్పుడు కార్బన్‌మోనాక్సైడ్, నైట్రిక్ఆక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్, సీసం లాంటి కాలుష్య పదార్థాలు వెలువడతాయి. వీటిలో సల్ఫర్‌డైఆక్సడ్ వల్ల మానవులకు, జంతువులకు ఊపిరి ఆడటంలో తీవ్రఇబ్బందులు తలెత్తుతాయి. ఆకుల్లో పత్రహరితం నాశనమై వాటి పెరుగుదల ఆగిపోతుంది.
 

అడవుల నరికివేత: దీనివల్ల గాల్లో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది.
 

పారిశ్రామికీకరణ: పారిశ్రామికీకరణ వల్ల గాల్లో సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, దివీ2 వెలువడతాయి. పరిశ్రమల నుంచి వచ్చే జింక్, క్రోమియం, సీసపు అణువుల పొగ వల్ల చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఎలర్జీలు కలుగుతాయి.

వ్యవసాయ పద్ధతులు: కృత్రిమ క్రిమిసంహారక మందులు, ఎరువులను మోతాదుకు మించి వాడినపుడు కాలుష్యం ఏర్పడుతుంది.

అణు పరీక్షలు: వీటి నుంచి స్ట్రాన్షియం 90 అనే కాలుష్యం వెలువడుతుంది. దీంతో మానవులకు క్యాన్సర్ వస్తుంది. జంతువులు, వృక్షాలకు కూడా హాని కలుగుతుంది.

శబ్ద కాలుష్యం: శ్రవణ అవధికి మించిన ధ్వనులు వాతావరణ కాలుష్యానికి కారణాలు. వీటివల్ల చెవుడు, కేంద్రనాడీమండల వైఫల్యం, తద్వారా మానసిక వైకల్యం కలుగుతాయి.

విమానాలు: ఇవి కర్బన సంయోగ పదార్థాలు, ఫ్లోరో కార్బన్‌లను విడుదల చేస్తాయి. ఇవి ఓజోన్ పొరను నష్ట పరుస్తాయి. శ్వాసకోశ బాధలు, కంటి, చర్మ, జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి.

కాలుష్య నివారణ: గాలికాలుష్యాన్ని నివారించడానికి మోటారు వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి పొగ వెలువడకుండా చూడాలి. అడవులను ఎక్కువగా పెంచాలి. ఎరువుల వాడకాన్ని తగ్గించి దుమ్ము వ్యాపించే పనులను నియంత్రించాలి.
నీరు-పరిచయం: మానవులకు నీరు జీవనాధారం. మన శరీరం బరువులో 70 శాతం నీరు ఉంటుంది. భూఉపరితలంపై 70 శాతం నీరు ఆవరించి ఉంది. సముద్రాలు, నదులు, చెరువులు, ఊటనీరు మనకున్న ముఖ్యమైన నీటివనరులు. సముద్రపు నీరు మనకు, వర్షాలకు ముఖ్య ఆధారం. కానీ ఇది మన ప్రాథమిక నీటి అవసరాలకు ఉపయోగపడదు. నదీజలం మనకు ముఖ్యమైన నీటి వనరు. అనేక ముఖ్య పట్టణాలు నదీతీరాల్లో ఉన్నాయి. ఢిల్లీ (యమున), కోల్‌కతా (హుగ్లీ), హైదరాబాద్ (మూసీ), విజయవాడ(కృష్ణా), రాజమండ్రి (గోదావరి). 

గుంటూరు, వరంగల్, కంభంవంటి పట్టణాలు చెరువుల ఒడ్డున ఉన్నాయి. నేల పొరల్లో దాగిఉన్న నీటిని ఊటనీరు అంటారు. దీనికి ఆధారం వర్షపునీరే. బోరు పంపుల ద్వారా బావులు తవ్వకుండా నేలలోని నీటిని బయటికి తీయవచ్చు. కొన్నిసార్లు బావులు తవ్వకుండానే ఊటనీరు నేలపొరల్లో దారి చేసుకొని పైకి చిమ్ముతుంది. వీటిని బుగ్గలు లేక స్ప్రింగ్‌లు అంటారు. ఎడారుల్లో ఒయాసిస్సులు అనే జలాశయాలు ఉంటాయి. వీటివద్ద ఖర్జూరం చెట్లు పెరుగుతాయి.  
జొన్న, వేరుసెనగ లాంటివి వర్షాధారపు పంటలు. నీరు సరిగా లభించక పంటలు పండని పరిస్థితిని కరవు అంటారు. కరవు రావడానికి కారణం మనం విచకణరహితంగా అడవులను నరికివేయడమే.

 

తాగునీటిని శుద్ధిచేయడం: మన నీటి వనరులకు ప్రధాన ఆధారం వర్షంనీరు. వర్షం అంటే చల్లారిన నీటి ఆవిరి. వర్షపు నీరు స్వచ్చంగా, తేటగా, చప్పగా ఉంటుంది. కలుషితమైన నీటి ద్వారా కలరా, టైఫాయిడ్, అతిసారవ్యాధి, రక్తవిరేచనాలు, కామెర్లు మొదలైనవి వ్యాపిస్తాయి. నీళ్లవిరోచనాలు, వాంతులు అయి శరీరంలోని నీరు బయటికి పోయే రోగికి పానీయ పద్ధతిలో చికిత్స చేస్తారు. దీనిలో రోగికి పానీయద్రావణం ఇస్తారు. దీంట్లో ఉప్పు, చక్కెర, నీరు ఉంటాయి. నీటిలో కరగని మట్టికణాలు, ఆకులు, అలమలు, సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని తేర్చడం, వడగట్టడం అనే పద్ధతుల ద్వారా తొలగిస్తారు. నీటిని కదలకుండా ఉంచి దాంట్లో మట్టికణాలను వేరుచేయడాన్ని 'తేర్చడం' అంటారు. నీరు త్వరగా తేరుకునేందుకు గంధంలాంటి పటిక పొడి లేదా చిల్లగింజల పొడి కలుపుతారు. చివరిగా రోగజీవులను తొలగించిన నిరపాయకరమైన నీటిని సురక్షిత జలం అంటారు.
 

మూడు కుండల పద్ధతి:
గ్రామాల్లో నీటిని శుభ్రపరచడానికి ఖర్చులేని మూడు కుండల పద్ధతిని ఉపయోగిస్తారు. ఒకే పరిమాణం ఉన్న మూడు కుండలను తీసు కుంటారు. వీటిని ఒక దానిపై ఒకటిగా అమరుస్తారు. పై రెండు కుండలకూకింద రంధ్రాలుంటాయి. మొదటి కుండలో గులకరాళ్లు, కర్రబొగ్గుపొడి ఉంటాయి. గులకరాళ్లు నీటిలోని మట్టికణాలను, ఆకులను ఆపుతాయి.
బొగ్గుపొడి నీటిలో ఉప్పులాంటి పదార్థాలను పీల్చుకొంటుంది. రెండో కుండలో సన్నని ఇసుక ఉంటుంది. ఇది నీటిలోని సూక్ష్మజీవులను ఆపేస్తుంది. మూడో కుండలో ఏ విధమైన పదార్థం ఉండదు. మలిన జలాన్ని మొదటి కుండలో పోసినపుడు అది శుభ్రపడి మూడో కుండలో చేరుతుంది.


రక్షిత మంచినీటి పథకం: పట్టణాల్లో నీటి కాలుష్యాన్ని తొలగించి శభ్రమైన నీటిని ప్రజలకు సరఫరా చేసేందుకు రక్షిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ఆరు దశలు ఉంటాయి. 
1. నీటి సేకరణ
2 .తేర్చడం
3. వడగట్టడం
4. క్లోరినేషన్ 
5. పంప్ చేయడం 
6. పంపిణీ చేయడం.

నీటిని మొదట సెటిలింగ్ ట్యాంక్‌లోకి తీసుకుంటారు. దీనిలో మట్టికణాలు, ఇసుకలాంటి కరగని మలినాలు నీటి అడుగుభాగాన చేరతాయి. రెండో దశలో వడపోత ట్యాంక్ (చెరువు)లోని మందమైన ఇసుకపొర నీటిని వడకట్టి, సూక్ష్మజీవులు, ఇసుక రేణువులను వేరుచేస్తుంది. తర్వాత దశలో రోగకారక సూక్ష్మజీవులను చంపడానికి బ్లీచింగ్ పౌడరును కలుపుతారు. దీనిలోని క్లోరిన్ బ్యాక్టీరియాను చంపుతుంది. క్లోరిన్‌ను ఉపయోగించి సూక్ష్మక్రిములను చంపడాన్ని క్లోరినేషన్ అంటారు. ఈ నీటిని ఓవర్‌హెడ్ ట్యాంక్‌లోకి చేర్చి పంపింగ్ స్టేషన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు.
నీటిలో కరగని పదార్థాలను, సూక్ష్మక్రిములను కేవలం వడపోయడం ద్వారా తొలగించలేం. నీటిని మరగకాచి చల్లార్చడంవల్ల అది సురక్షిత జలమవుతంది. మనకు కుళాయి, బోరుపంపు, బావి, చెరువు, కాలువ, నదులనీరు అందుబాటులో ఉంటుంది. వీటిలో చెరువు, కాలువ నీళ్లు బాగా అపరిశుభ్రమైనవి. వీటిలో అన్నిటికంటే శుభ్రమైనది కుళాయి నీరు.
వాటర్ ఫిల్టరులో రెండు స్టెయిన్‌లెస్ స్టీలు డబ్బాలు ఉంటాయి. ఫిల్టర్ కేండిల్‌ను పింగాణిమట్టితో తయారు చేస్తారు. ఈ కేండిల్ నీటిలో కరగని మలినాలను, సూక్ష్మజీవులను తొలగిస్తుంది.
హానికరమైన పదార్థాలు నీటిలో చేరడాన్ని నీటి కాలుష్యం అంటారు. మధురానగరం చుట్టూ నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వాటినుంచి యమునా నదిలోకి విషపదార్థాలు విడుదల అవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్ యమునా నది ఒడ్డునే ఉంది.

నీటి బాష్పీభవనం: నీటిని వేడి చేసినపుడు అది ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మార్పు చెందడాన్ని బాష్పీభవనం అంటారు. నీరు 1000ది వద్ద బాష్పీభవనం చెందుతుంది.
నీటి బాష్పీభవనాన్ని 1) వేడి 2) తడి 3) గాలి 4) ఉపరితలం 5) పరిసరాల పీడనం అనే అంశాలు ప్రభావితం చేస్తాయి. 1) ఎక్కువ వేడి 2)ఎక్కువ ఉపరితలం 3) తక్కువ తేమ బాష్పీభవనాన్ని వేగవంతం చేస్తాయి. డిష్‌లోని నీరు పరీక్షనాళికలోని నీటికంటే త్వరగా బాష్పీభవనం చెందుతుంది.కారణం డిష్‌లో నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువ. తడిగా ఉన్న ప్రదేశం కంటే పొడిగా ఉన్న చోట బాష్పీభవనం రేటు ఎక్కువగా ఉంటుంది.


నీటి సాంద్రీకరణం: నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు.
నీటిఆవిరి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారుతుంది. వేడి, గాలి, ఉపరితలం తగ్గితే వేగంగా సాంద్రీకరణం చెందుతుంది.
నీటి ఘనీభవనం: నీరు చల్లబడి మంచుగా మారడాన్ని ఘనీభవనం అంటారు. ఈ ప్రక్రియలో హిమమిశ్రమం నీరు మంచుగా మారడానికి సహకరిస్తుంది.
 హిమ మిశ్రమాన్ని మంచుముక్కలు, ఉప్పు మిశ్రమాన్ని కలిపి తయారు చేస్తారు. నీటి ఉష్ణోగ్రతను సున్నా డిగ్రీల కంటే తగ్గించినప్పుడు నీరు ఘనీభవనం చెందుతుంది.
ఘనీభవనాన్ని 1) ఎక్కువ చల్లదనం 2) తక్కువ ఉపరితలం 3) ఎక్కువతేమ వేగవంతం చేస్తాయి.      
నీటిచక్రం: ప్రకృతిలో నీటి బాష్పీభవనం, ద్రవీభవనం ఏటా జరుగుతూ ఉంటాయి. దీన్నే నీటిచక్రం అంటారు.

Posted Date : 28-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌